ఇది ప్రపంచానికి వజ్రాలను ఇస్తున్న దేశం ఫ్రాన్స్‌కు చాక్లెట్ రుచి తెలిపిన దేశం భారీగా చాక్లెట్లను అమ్మే దేశం కూడ. నాటో... ఐరోపా కూటమి కేంద్రం బెల్జియం... నగర విశేషాలు. బెల్జియం మనకు వందేళ్ల ముందే పరిచయమున్న దేశం. రెండు తరాల ముందు మన పెద్దవాళ్లు బెల్జియం గ్లాస్ వాడారు. ఈ గ్లాస్ వాడకం సంపన్నతకు చిహ్నంగా ఉండేది. అలాగే బెల్జియం డైమండ్ కూడ. ప్రపంచంలో బెస్ట్ క్వాలిటీ డైమండ్ అంటే బెల్జియం వజ్రమే. ఇక ఈ దేశానికి ఉన్న గొప్పదనాల్లో మూడో స్థానం బీర్‌ది. ఇక ప్రపంచం దృష్టిని ఆకర్షించే మరో అంశం నాటో, ఐరోపా కూటమికి కేంద్రస్థానం కావడం. బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో నాటో కేంద్ర కార్యాలయం ఉంది. ఇది చాలా చిన్నదేశం. జనాభా కోటి మాత్రమే, కానీ పోరాట యోధులు. యూరప్ ఖండంలో జరిగిన యుద్ధాలకు వేదిక ఈ ప్రదేశమే. అందుకే దీనిని బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరప్ అంటారు.
ఆహారం... ఆహార్యం !!
బెల్జియం ప్రజలు చాక్‌లెట్లు, ఫ్రెంచ్‌ఫ్రైస్, వాఫిల్స్ ఎక్కువగా తింటారు. మనం ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని స్నాక్‌గా తింటాం, ఇక్కడ ప్రధాన ఆహారంగా తింటారు. పాకెట్ పట్టుకుని బజార్లో తింటూ పోతుంటారు. బీర్ ఇష్టంగా తాగుతారు. ఇది వీరి ఆహారంలో భాగమే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రాపిస్ట్ బీర్ ఇక్కడే తయారవుతోంది. దాదాపుగా వెయ్యి రకాల బీర్లు తయారు చేస్తారు. సగటున ఒక బెల్జియమ్ వాసి ఏడాదికి 150 లీటర్ల బీరు తాగుతాడని అనధికారిక అంచనా. చాక్లెట్లకు ప్రసిద్ధి చెందిన దేశంగా ఫ్రాన్స్‌ను చెబుతారు కానీ చాక్లెట్ పుట్టిల్లు బెల్జియమే అంటారు ఇక్కడి వాళ్లు. ఇక్కడ తయారైన రుచికరమైన చాక్లెట్ రెసిపీని స్విస్ చాక్లెట్ మేకర్స్ తీసుకుని డెవలప్ చేసుకున్నారని చెప్తారు. ఇక్కడ వేసవిలో రాత్రి తొమ్మిది గంటలకు కూడా సూర్యాస్తమయం కాదు. డిన్నర్ కూడా లంచ్ తీసుకుంటున్నట్లే ఉంటుంది. వింటర్‌లో ఎనిమిదన్నరకు కూడా ఉదయించని సూర్యుడు సాయంత్రం నాలుగున్నరకే ముఖం చాటేస్తాడు.మాతృభాషాప్రియులు!
పాశ్చాత్య దేశాలంటే అందరూ ఇంగ్లిష్ మాట్లాడతారు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవరికి వారు తమ సొంత భాషలోనే మాట్లాడతారు. గైడ్‌లు కూడా ఫ్రెంచ్, డచ్, జర్మన్ భాషల్లో వివరిస్తారు, మనం కోరితే ఇంగ్లిష్‌లో చెప్తారు. ఇక్కడ టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకున్నారు. ప్రతిదీ మెకనైజ్‌డ్ సిస్టమ్‌లోనే నడుస్తుందా అనిపిస్తుంది. కారు పార్క్ చేయాలన్నా టికెట్ తీసుకోవాలి, అలాగే వచ్చేటప్పుడు టైమ్ ప్రకారం ఎంత చెల్లించాలో అంత చెల్లించి రసీదు ఇన్‌సర్ట్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది. ఆఖరుకు వాష్‌రూమ్ వాడాలన్నా అంతే. ఇక్కడ ప్రభుత్వం పదేళ్ల క్రితమే ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ ఐడి కార్డు ఇచ్చింది.
తప్పక చదవాలి... అందరూ ఓటెయ్యాలి!!
ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్లే. ఉన్నత చదువులు లేకపోయినా సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉంటారు. ఇందుకు ప్రజల్లో చైతన్యంతోపాటు ప్రభుత్వ నిబంధన కూడా కారణమే. పద్దెనిమిదేళ్ల వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్తున్న ప్రభుత్వం ఇదొక్కటే. యునిసెఫ్ ‘చైల్డ్ వెల్ బీయింగ్ ఇన్ రిచ్ కంట్రీస్’ అంశం మీద ఇచ్చిన రిపోర్టులో బెల్జియంను పిల్లల చదువుకు, ఉన్నతికి కృషి చేస్తున్న చక్కటి దేశంగా సూచించింది. ఇక్కడ కంపల్సరీ ఓటింగ్ విధానం కూడా ఉంది. ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించితీరాలి. బెల్జియం ప్రభుత్వం స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని నివ్వెరపోయేట్టు చేసింది, కానీ బలవంతపు వివాహాలను నిషేధించడాన్ని అన్ని దేశాలూ స్వాగతించాయి.
క్రీడాప్రియులు !
బెల్జియం వాసులు ఫుట్‌బాల్ బాగా ఆడతారు. దేశం చిన్నదైనా రెండుసార్లు యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. గొప్ప గోల్‌కీపర్ మ్యారీ పాఫ్, గ్రేట్ సైక్లిస్ట్ ఎడ్డీమెర్క్ బెల్జియం వాసులే. మనకు స్పోర్ట్స్ కాలమ్‌లో పరిచయమైన టెన్నిస్ ప్లేయర్లు జస్టిస్ హెనిన్, కిమ్‌క్లిస్టర్స్ ఇక్కడి వాళ్లే.వజ్రానికి మెరుగులు దిద్దే నగరం !
ఆంట్‌వెర్ప్ నగరాన్ని డైమండ్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇది వజ్రాల కర్మాగారాలతో పాటు వ్యాపార లావాదేవీల కేంద్రం కూడ. కర్మాగారాల్లో వజ్రాల గ్రేడింగ్, కటింగ్, సానపెట్టడం వంటి పనులు జరుగుతుంటాయి. ఈ ప్రదేశం చదరపు మైలుకు మించదు. అందుకే దీనిని స్క్వేర్ మైల్, అంట్‌వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ అంటారు. ఇది ప్రపంచంలో పెద్ద డైమండ్ కటింగ్ సెంటర్. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో 90 శాతం ఇక్కడే జరుగుతుంది. ఈ దేశం పెట్రోకెమికల్ సెంటర్ కూడ. ప్రధాన ఆదాయ వనరుల్లో పెట్రో ఉత్పత్తులూ ఉంటున్నాయి.
చూడాల్సినవి ఇవీ!
హాన్ సుర్ లెస్సె... ఇవి సున్నపురాతి కొండల్లో ఏర్పడిన గుహలు. లెస్సె నది ప్రవాహ వేగంతో సున్నపురాయి కరిగి రెండు కిలోమీటర్ల మేర గుహలుగా ఏర్పడ్డాయి. కొండల నుంచి కరిగి కిందకు జారిన క్యాల్షియం, లవణాల మిశ్రమం రకరకాల ఆకారాల్లో ఉంటుంది. నేలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్న మర్రిచెట్టు ఊడల్లాగ ఉంటాయి. స్టాలగ్‌మైట్, స్టాలక్‌టైట్ ఒకచోట దట్టంగా పిల్లర్‌లాగ ఉంటుంది. దీనిని పిసా టవర్ అంటారు. ప్రకృతి వింతలు ఇన్ని రకాలా! అని ఆశ్చర్యం వేస్తుంది వీటిని చూస్తే. ఇంతటి వైవిధ్యం ఎలా సాధ్యం? అని ఎంతగా ప్రశ్నించుకున్నా మనకు సమాధానం దొరకదు, చూసి ఆనందించడమే మనం చేయగలిగింది. ఈ గుహల మధ్య విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంది. పర్యాటకులు కూర్చుని సౌండ్ అండ్ లైట్ షో చూడవచ్చు. గుహ లోపల నది, ఆ నదిని దాటడానికి గుహలోపలే వంతెనలు... మనం ఊహించం ఇంతటి క్రియేటివిటీని. వర్షాకాలంలో నది ప్రవాహం ఉధృతమవుతుంది. వంతెనలు మునిగిపోతాయి. అప్పుడు గుహల్లోకి ఎవరినీ అనుమతించరు. ఈ గుహలు దాదాపుగా 14 కి.మీలు ఉంటాయని పరిశోధకుల అంచనా. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. రాజధాని బ్రసెల్స్‌లో ట్రింఫల్ ఆర్చ్ గుర్రపునాడా ఆకారంలో ఉన్న పెద్ద కట్టడం. 75 ఎకరాల అర్బన్ పార్కులో ఉంది. స్కూబా డైవింగ్‌కి రైట్ ప్లేస్ బ్రసెల్స్ దగ్గరున్న నెమో33 స్విమ్మింగ్ పూల్. ఇది ప్రపంచంలోకి లోతైన పూల్.
ఈ అర్బన్ పార్కులో రాయల్ మ్యూజియం, సింక్వాంటెనైర్ ఆర్ట్ మ్యూజియం, ఆటోవరల్డ్ మ్యూజియం, గ్రేట్ మాస్క్ ఆఫ్ బ్రసెల్స్ వంటి ప్రముఖ నిర్మాణాలు ఉన్నాయి.ఫ్రెంచ్... డచ్... సమ్మేళనం...బెల్జియంలో ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు నివసించే ప్రదేశం, డచ్ మాట్లాడే ప్రజలు నివసించే ప్రదేశం స్పష్టంగా విభజించినట్లు ఉంటాయి. ఉత్తరాన ఉన్న ప్రావిన్సులు ఆంట్‌వెర్ప్, లింబర్గ్, ఈస్ట్ ఫ్లాండర్స్, వెస్ట్ ఫ్లాండర్స్‌లలో డచ్ భాష మాట్లాడతారు. దక్షిణాన హైనాట్, నమూర్, లక్సెంబర్గ్, లీగ్ వంటి చోట్ల ఫ్రెంచ్ మాట్లాడతారు. దేశంలో ఈ రెండూ అధికార భాషలే. రాజధాని బ్రసెల్స్‌లో మాత్రం దాదాపుగా అందరికీ రెండు భాషలు వచ్చి ఉంటాయి. జర్మన్ మాట్లాడే వాళ్లు కూడా ఉంటారు కానీ చాలా తక్కువ. వ్యవహారికంలో ఉత్తరాది వారిని ఫ్లాండర్స్, దక్షిణాది వారిని వాలూనియన్స్ అని వేరుగానే సూచిస్తారు. రాజధాని బ్రసెల్స్ లోని ఫ్రీమాసన్ టెంపుల్ యూరప్ ఖండంలో పెద్దది. 1920లో ఆంట్‌వెర్ప్ నగరంలో ఒలింపిక్స్ జరిగాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more