ప్రపంచానికి వారధి మధ్యధరా సముద్రానికి తీరాన ఉన్న దేశం ఇది. జుడియాన్ ఎడారి... కార్మెల్ కొండలు... డెడ్‌సీ... వెస్ట్‌బ్యాంక్... దేనికదే వైవిధ్యభరితమైన నేపథ్యం ఈ నేలది. బహాయీ తోటలు... ఓట్టోమన్ కోటలు... కెరటాలు తొలిచిన గుహలు... నీటి చుక్కల శిల్పాలు... ఎంత చూసినా ఇంక చాలనిపించని దేశం ఇజ్రాయెల్... విశేషాలు.
ఇజ్రాయెల్ వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడి ప్రజలు తెలివైన వారు, మృదుస్వభావం కలిగిన వారు కూడ. కొత్తవారిని ఆదరంగా పలకరిస్తారు. పరిచయం లేకపోయినా నవ్వుతూ పలకరించి గుడ్మాణింగ్ చెప్తారు. మన భారతీయ కట్టుబొట్టు వీళ్లకు బాగా తెలుసు. చూడగానే పలకరింపుగా నవ్వి మీరు ఇండియన్సా అని అడుగుతారు. ఇక్కడ మహిళలు, మగవాళ్లు అందరూ ఉద్యోగం చేస్తారు. ఇక్కడ ఐటి రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడి వాళ్లకు ఆయుర్దాయం ఎక్కువ. 80-90 ఏళ్లకు పైగా జీవిస్తారు. ఇంతకాలం ఆరోగ్యంగా జీవించడానికి కారణం వీళ్ల ఆహారపు అలవాట్లే. వార్ధక్యంలో కూడా స్వతంత్రంగా జీవిస్తూ మోడరన్ డ్రస్‌లు వేసుకుని హుషారుగా కనిపిస్తారు. ఇక్కడ కుటుంబ నియంత్రణ ఉన్నప్పటికీ మన లాగ ఒకరు - ఇద్దరు పిల్లలు కాదు, ముగ్గురు పిల్లలు ఉంటారు. పెట్‌ను పిల్లలను ప్రేమించినంతగా ప్రేమిస్తారు. ప్రతి ఇంట్లో కుక్క కానీ పిల్లి కానీ ఉంటుంది.
నగర నిర్మాణం భేష్!
దేశంలో నగరాల నిర్మాణం ప్రణాళికబద్ధంగా ఉంటుంది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థతో పరిశుభ్రంగా ఉంటాయి నగరాలు. ఇజ్రాయెల్‌కు ఒక వైపు జుడియాన్ ఎడారి ఉన్నప్పటికీ దేశంలో డ్రిప్ ఇరిగేషన్‌తో వ్యవసాయం చేసి చక్కగా పంటలు పండిస్తారు. ఇక్కడ నగరాలు అంటే మనకున్నట్లు జనారణ్యాలు కాదు, నిండా చెట్లతో చల్లగా ఉంటాయి. ఇక్కడ కనిపించే రకరకాల గులాబీలను చూస్తుంటే ఇది చల్లని దేశమా ఎడారి నేపథ్యమా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ప్రకృతి వైవిధ్యత ప్రత్యేకం అనే చెప్పాలి. ఒక వైపు సముద్రం, ఒక వైపు ఎడారి, మరో పక్కన దేనినీ మునగనివ్వని ఉప్పునీటి సరస్సు, సముద్ర తీరాన సున్నపురాతి గుహలు, చారిత్రక- ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకున్న కొండలు ఉంటాయి. నివాస ప్రదేశాలు, ప్రముఖ నగరాలు ఎక్కువగా మధ్యధరా సముద్రం తీరంలోనే విస్తరించాయి.
ప్రకృతి శిల్పాలు !
హైఫాకు 140 కి.మీ.ల దూరంలో స్టాలగ్మైట్ కేవ్స్ ఉన్నాయి. ఇవి సున్నపురాయి గనులను తవ్వుతున్నప్పుడు బయటపడ్డాయి. గుహలో రాతి పగుళ్ల మధ్య నుంచి కారిన వర్షపు నీరు సున్నంతో కలిసి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు మూడు లక్షల ఏళ్ల నాటివి. మబ్బుల్లో ఆకారాలను వెతుక్కున్నట్లు వీటిలో మనం ఊహాశక్తిని బట్టి రకరకాలుగా అన్వయించుకోవచ్చు. ప్రకృతి చెక్కిన అద్భుతమైన శిల్పాలివి. గుహ లోపల తిరిగి చూడడానికి మెట్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలియచేసే టెలిఫిల్మ్ ప్రదర్శిస్తారు.రోష్హానిక్రా నగరంలో ఉన్న గ్రోటెస్ కేవ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ కేవ్స్ దగ్గరకు వెళ్లడానికి కేబుల్‌కార్లు ఉంటాయి. ఈ గుహలు మెడిటెరేనియన్ సముద్రానికి ఆనుకుని ఉంటాయి. ఈ గుహలు ఏర్పడడానికి కారణం కూడా సముద్రపు కెరటాలే. సముద్రం ఒడ్డునే సున్నపురాయి కొండలు ఉంటాయి. వందలు వేల ఏళ్లుగా సముద్ర కెరటాలు వచ్చి కొండలను ఢీకొడుతూ ఉండడంతో క్రమంగా సున్నపురాయి కరిగి గుహలుగా మారాయి. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.
రాజు రాజే... కోట కోటే!
ఇజ్రాయెల్‌లో హైఫా- రోష్హానిక్రా నగరాల మధ్య ఒట్టోమన్ రాజవంశానికి చెందిన కోట ఉంది. ఈ కోటను చూస్తే రాజులు ఎవరైనా, ప్రాంతాలు ఏవైనా కోటలు కోటలే... వర్ణించడానికి మాటలు చాలవు అనిపిస్తుంది. బయటకు పాతబడిన గోడలే కనిపిస్తుంటాయి కానీ లోపలికి వెళ్తే వ్యూహాత్మకంగా నిర్మించిన రక్షణ సొరంగాలు, అందమైన రాణివాసపు చిహ్నాలు ఇవీ అన్నట్లు ప్యాలెస్‌లు ఉంటాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే... ఒట్టోమన్ల కోటలోపల పురావస్తు శాఖ చేసిన తవ్వకాలలో రోమనులు నిర్మించిన కోట, కోట లోపల సొరంగం బయటపడడం. కోటలోపల ఉన్న భారీ కట్టడాలు, మ్యూజియాలను చూడడానికి మన సమయం చాలదు. దీని కోసమే రెండు-మూడు రోజులు కేటాయిస్తే తప్ప మొత్తం చూడలేం.
హోలీ కాపిటల్!
ఇజ్రాయెల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నగరం జెరూసలెం. ఇది ముస్లింలకు, క్రైస్తవులకు, యూదులకు కూడా పవిత్రస్థలం. ఓల్డ్ జెరూసలెం చుట్టూ గోడ ఉంటుంది. ఈ నగరంలో రోమన్సైనికులు ఏసుక్రీస్తుని బంధించిన స్థలం, శిలువ వేసిన తర్వాత క్రీస్తు ఆగిన స్థలాలనూ చూడవచ్చు. ఏసుని శిలువ వేసి పడుకోబెట్టిన రాయి వద్ద పర్యాటకులు ప్రార్థనలు చేస్తారు. ఈ నగరంలో ఆలివ్తోట చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకున్న ప్రదేశం.టాప్ టెన్ రోజ్ గార్డెన్ !జెరూసలెంలో బొటానికల్ గార్డెన్ విశాలమైనది. దీనినంతటినీ తిరిగి చూడడానికి టాయ్ ట్రైన్ ఉంటుంది. టెల్అవైవ్లోని యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్ కూడా ప్రాధాన్యం కలిగినదే. కిబ్బట్జ్ ఈన్ జేడీ బొటానికల్ గార్డెన్లో తొమ్మిది వందల రకాల మొక్కలు ఉంటాయి. దాదాపుగా ప్రపంచం నలుమూలలా పెరిగే చెట్లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.
ప్రత్యేకంగా ఐదు ఖండాలలో పెరిగే వృక్షజాతులను చూడవచ్చు. జెరూసలెంలోని వోల్ రోజ్ గార్డెన్ అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో గొప్ప రోజ్ గార్డెన్లలో ఇదొకటి. కచ్చితంగా చెప్పాలంటే తొలి పదిలో ఒకటి. ఉటోపియా ఆర్జిడ్ పార్కుని బటర్‌ఫ్లై హౌస్‌గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇరవై వేల రకాలకు పైగా పూలమొక్కలు ఉంటాయి. వాటి మీద ఎవరూ పిలవకనే వచ్చి చేరే సీతాకోక చిలుకలు బోనస్ అట్రాక్షన్. నీరు లేని చోట పెరిగే బ్రహ్మజెముడు చెట్లను మనం పీకేస్తాం. ఇక్కడ మాత్రం కాక్టస్ పార్కు పేరుతో అభివృద్ధి చేస్తారు.
నేషనల్ మ్యూజియం
హైఫా కూడా సముద్రతీర నగరమే. ఇక్కడ నేషనల్ మ్యూజియం ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ స్పేస్ ఉంది. దీనిని పర్యాటక ఆకర్షణ కలిగిన విజ్ఞాన కేంద్రం అనాలి. ఇక్కడ యంత్రాల విడిభాగాలు, వాటి పనితీరు, విద్యుత్ స్వభావం, వస్తువులో అయస్కాంత లక్షణాలు, రోబోటిక్, ఏరోనాటిక్ ప్రక్రియలు మొదలైనవన్నీ ప్రదర్శనలో ఉంటాయి. ఇక్కడ కొద్దిసేపు తిరిగితే ఈ అంశాల మీద పూర్తి అవగాహన వస్తుందని కాదు, కానీ కొంత ఆసక్తి, ప్రాథమిక పరిజ్ఞానం కలుగుతాయనడంలో సందేహం లేదు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more