Lord Hanuman always stays alive at Gandi kshetram సజీవ ఆంజనేయస్వామి క్షే్త్రం.. శ్రీరాముడే స్వహస్తాలతో చెక్కిన విగ్రహం..

Lord srirama sculputered lord hanuman idol at gandi kshetram

Gandi Abhayahasta Anjaneya Temple, Gandi Sri Veeranjaneya Temple, Gandi Kshetram, Lord Rama drawn the picture of Lord Hanuman, Lord Sri Rama's Victory, Lord Rama, Lord Hanuman, Lord Vayu, spiritual, devotional, Kadapa, Andhra Pradesh

Sri Veeranjaneya Temple or Gandi Kshetram is a Hindu temple situated at Gandi in the bank of River papagni, in Kadapa District of Andhra pradesh. The temple is dedicated to Lord Anjaneya(Hanuman) who is referred to as Veeranjaneya in this temple. The history of Kshetram dates back to the period of the Ramayana, Treta Yuga. According to the legend, Lord Rama himself had drawn the picture of Lord Hanuman on the rock with his arrow while resting at this place, and was receiving the hospitality of Lord Vayu (God of Air and Father of Lord Hanuman).

సజీవ ఆంజనేయస్వామి క్షే్త్రం.. శ్రీరాముడే స్వహస్తాలతో చెక్కిన విగ్రహం..

Posted: 03/09/2022 10:04 PM IST
Lord srirama sculputered lord hanuman idol at gandi kshetram

యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌!
భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్‌!!
శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి. అంతటి స్వామిభక్తి పరాయణుడైన అంజనీసుతుడు కాలిడిన చోట మహాలక్ష్మి స్థిరనివాసినియై ఉంటుంది. ఈ కారణంగానే హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా హిందువులు భావించి పూజలు చేస్తారు. అందునా శ్రావణమాసం నెలరోజులూ విశేషంగా అర్చిస్తారు. వీటిలో శనివారాలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవని భక్తుల విశ్వాసం.

మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో 107 ఆలయాలలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు. అయితే, కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం... తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే కడప జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం. అత్యంత మహిమాన్వితమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో స్వామికి విశేష పూజలు జరుగుతాయి.

ఈ సందర్భంగా ఈ స్వామికి సంబంధించిన సజీవ చిత్రణ.  వేంపల్లె సమీపాన పాల కొండల కనుమ గుండా పోవు పాపాఘ్ని నది తోవ (గండి) మిక్కిలి ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ పర్వత పంక్తుల ఎత్తు దాదాపు రెండు వేల అడుగులు.. పాపాఘ్ని నది ఎత్తైన కొండ, లోయల మధ్య మలుపులు తిరిగి ప్రవహించి కడప వైపు మైదానంలో ప్రవేశిస్తుంది. పాలకొండలకు చొచ్చుకొని పోవు చోట కుడి వైపు ఒడ్డున గండి ఆంజనేయస్వామి ఆలయం ఉంది.

స్థలపురాణం

త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని లంకాధిపతియైన రావణాసురుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో భాగంగా గండి ఆలయానికి చేరుకుంటారు. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సోదరులిద్దరినీ సాదరంగా ఆహ్వానించి, ఇక్కడే కొంతకాలం ఉండి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకుంటాడు. ‘రావణ వధ అనంతరం నీ కోరిక తీరుస్తాన’ని రాముడు వాగ్దానం చేస్తాడు. ఇచ్చిన మాట మేరకు రావణ సంహారం అనంతరం పుష్పక విమానంలో సీతారామలక్ష్మణులు వాయుదేవుడి దగ్గరకు బయల్దేరుతారు.

ఈ వార్త తెలుసుకున్న వాయుదేవుడు క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తాడు. పాపఘ్ని నదిని వేరుచేసే రెండు కొండల కొనలనూ కలుపుతూ బంగారు స్వాగత తోరణాన్ని కట్టిస్తాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సీతారాములు మంత్రముగ్ధులైవుతారు. ఆ సమయంలోనే రామచంద్ర ప్రభువు అక్కడి బండమీద కూర్చొని యుద్ధ సమయంలో తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ తన వద్ద ఉన్న బాణంతో ఆంజనేయస్వామి చిత్రాన్ని గీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అయోధ్యకు వెళ్లే శుభ గడియలు దాటిపోతుండటంతో దాన్ని పూర్తిచేయకుండానే అయోధ్యకు బయల్దేరతాడు. దీనికి ప్రతీకగానే ఇప్పటికీ గండి క్షేత్రంలోని హనుమ చిత్రానికి ఎడమకాలి చిటికెనవేలు ఉండదు.

ఆ తర్వాతి కాలంలో ఎంతో మంది శిల్పులు దీన్ని పూర్తిచేయాలని చూసినా వీలుకాలేదట. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం. శ్రీరాముడు గండి క్షేత్రానికి చేరుకున్నదీ, హనుమంతుని చిత్రాన్ని రూపొందించిందీ శ్రావణమాసంలో అంటారు. అందుకే ఇక్కడ శ్రావణమాసమంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణంలో వచ్చే నాలుగు శనివారాలు అంజన్నను నాలుగు రకాలుగా అలంకరిస్తారు. చివరి శనివారం వీరాంజనేయస్వామిని ఒంటె వాహనంమీద మాడవీధుల్లో ఊరేగించి, పాపఘ్ని నదీతీరానికి తీసుకువచ్చి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు.

తోరణం కనిపిస్తే...

వాయుదేవుడు కట్టిన బంగారు మామిడాకుల తోరణం అదృశ్యరూపంలో శాశ్వతంగా నిలిచి ఉందని.. అయిదే అది దేవతానుగ్రహం వల్ల పుణ్యాత్ములకు అవసాన దశలో ఆ బంగారు తోరణం కనిపిస్తుందని విశ్వాసం. దీనికి ఉదాహరణగా... 18వ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్తమండలాలకు కలెక్టరుగా పనిచేసిన సర్‌ థామస్‌ మన్రోకు ఈ బంగారు తోరణం కనిపించినట్లు కడప గెజిట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ తోరణాన్ని చూసిన వారు త్వరలో మరణిస్తారని తెలుసుకోవడంతో ఆయన అనుచరులు ఎంతో ఆందోళన పడ్డారట. చివరికి అదే నిజమని తేలింది. కడప బ్రౌన్‌ గ్రంథాలయంలోని ఒక పుస్తకంలో ఈ వివరణ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని థామస్‌ తన డైరీలో కూడా రాసుకున్నాడని చెబుతారు.


పవిత్ర పాపాఘ్ని నది

పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది. కోలార్‌ జిల్లాలోని నందికొండే నంది పాదమని చెబుతారు.  పాపాఘ్ని అంతటా పవిత్రమే అయినా ఐదు స్థలాలలో మరింత పవిత్రతను పంచుకుంది. దీని ఉత్పత్తి స్థానం నంది కొండ ఒకటి, వాయు క్షేత్రంగా గండి రెండవది.. కేశవ తీర్థం మూడవది.. భాస్కర క్షేత్రంగా ఉన్న వేంపల్లె నాల్గవది, పాపాఘ్ని నది పినాకిని (పెన్నా) నదిలో కలిసే చోటు ఐదవది. ఈ ఐదు స్థానాలలో పాపాఘ్ని నది మహా పవిత్రంగా పరిగణింపబడుతోంది. పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

గండిలో ఉన్న దర్శనీయ స్థలాలు

గండి పుణ్యక్షేత్రంలో పలు దర్శనీయస్థలాలు ఉన్నాయి. భూమానంద ఆశ్రమం.. నామాలగుండు, దాసరయ్య కోన, మాతంగ గుహ, జీకొండ్రాయుని మేరు పర్వత శిఖరం, శ్రీచౌడేశ్వరి ఆలయం, ఉమామహేశ్వరాలయం, పావురాల గుట్ట, ఏకదంతపు నాయుని కోట, గవి మల్లేశ్వరస్వామి ఆలయం, కోదండ రామాలయం, శనేశ్వరాలయాలు ఉన్నాయి. గండికి సమీపంలో 8కి.మీ దూరంలో పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. గండి వీరన్నగట్టుపల్లె సర్కిల్‌ వద్ద నుండి తూర్పు వైపు వెళితే వైఎస్‌ఆర్‌ ఘాట్, ఎకో పార్కు, ట్రిపుల్‌ ఐటీ, నెమళ్ల పార్కు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. గండికి వచ్చిన భక్తులందరూ ఈ ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles