మానవుడు తొలిసారి నిప్పు రాజేసినప్పుడు ఎవరూ చూడలేదు. దాన్నెవరూ రికార్డ్ కూడా చేయలేదు. రైట్ సోదరులు మానవుడు ఎగరగలడు అని నిరూపించినప్పుడు కూడా పదుల సంఖ్యలో జనం మాత్రమే వీక్షించారు. కానీ 1969, జూలై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేసినప్పుడు మాత్రం ప్రపంచమంతా ఊపిరి బిగపట్టుకుని.. కళ్లింత చేసుకుని వీక్షించింది... ఆనందంతో కేరింతలు కొట్టింది. ఎందుకంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వేసిన ఆ చిన్న అడుగు మానవాళి చరిత్రనే మార్చేసిన ఓ ముందడుగు. రాత్రి ఓసారి చందమామను చూడండి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను తలుచుకోండి. ఎందుకంటే.. ఆయన చెరిగిపోని ముద్రను వేసింది ఒక్క చంద్రుడిపైనే కాదు.. మానవజాతి చరిత్రపైన కూడా..
చంద్రునిపై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కిన అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (82) ఇక లేరు. దీర్ఘకాలిక అస్వస్థతతో శనివారం ఆయన కన్నుమూసినట్టు నీల్ కుటుం బీకులు ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం వపకోనెటాలో 1930 ఆగస్టు 5న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జన్మించారు. ఆయన పూర్తి పేరు నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్. వ్యోమగామి, టెస్ట్ పైలట్, ఏరోస్పేస్ ఇంజనీర్, ప్రొఫెసర్, నేవీ ఏవియేటర్.. ఇలా రకరకాల ఉద్యోగాలు చేశారాయన. నీల్ రెండేళ్ల వయసులోనే వైమానిక విన్యాసాలు చూశాడు!! ఆరేళ్లున్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి విమానమెక్కాడు! 15 ఏళ్ల వయసులోనే విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుని, లెసైన్స్ కూడా పొందాడు! పర్డ్యూ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు నీల్. దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు.1962లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’లోని వ్యోమగాముల విభాగంలో చేరారు. 1966లో తొలి మానవ సహిత అంతరిక్ష నౌక ‘జెమిని 8’లో నీల్ మొదటిసారి అంతరిక్షానికి వెళ్లారు. తద్వారా అంతరిక్షయానం చేసిన మొదటి అమెరికన్లలో ఒకడిగా నిలిచారు. అపోలో 11లో రెండో, ఆఖరి అంతరిక్ష ప్రయాణం చేసి... 1969 జూలై 20న చంద్రుడిపై కాలు మోపారు.
నాసా విమాన పరిశోధన కేంద్రంలో రీసర్చ్ పైలట్‌గా పనిచేస్తున్నప్పుడు జెట్‌లు, రాకెట్లు, హెలికాప్టర్లు, గ్లైడర్ల వంటి 200 రకాల లోహ విహంగాలు నడిపారాయన. 1971లో నాసాకు గుడ్‌బై చెప్పి, సిన్సినాటీ యూనివర్సిటీ విద్యార్థులకు చాలా ఏళ్లపాటు ఇంజనీరింగ్ పాఠాలు బోధించారు.వ్యోమగామి కాకముందు నీల్ అమెరికా నౌకాదళంలోనూ పనిచేశారు. కొరియా యుద్ధంలో పాల్గొన్నారు. నీల్‌ను చాలా పార్టీలు రాజకీయాల్లోకి ఆహ్వానించాయి. అయితే, మీడియాకు దూరంగా ప్రైవేటు జీవితం గడపడానికే ఇష్టపడ్డ నీల్ అందుకు తిరస్కరించారు. 1994 తర్వాత నీల్ ఆటోగ్రాఫ్‌లివ్వడం మానేశారు. తన సంతకాలను భారీ మొత్తాలకు అమ్ముకుంటున్నారని, నకిలీ ఆటోగ్రాఫ్‌లూ చలామణిలో ఉన్నాయని గ్రహించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. తొలి చంద్రయానానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి సహచర వ్యోమగాములతో కలిసి నీల్ ఓ కార్యక్రమంలో పాల్గొనడం.. ఆయన ప్రజల ముందుకు వచ్చిన అరుదైన సందర్భాల్లో ఒకటి. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన సొంతం చేసు కున్నారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఇద్దరు భార్యలు. 38 ఏళ్లు కాపురం చేశాక 1994లో మొదటి భార్య జానెట్ ఆయనకు విడాకులిచ్చారు. అనంతరం కరోల్ హెల్డ్ నైట్‌ను నీల్ రెండో పెళ్లి చేసుకున్నారు.
ఎందుకింత క్రేజ్..
చంద్రుడిపై నడిచిన తొలి మానవుడిగా తనకు లభించిన విపరీతమైన ఖ్యాతి పట్ల ఒక్కోసారి ఆర్మ్‌స్ట్రాంగ్ అసహనం వ్యక్తం చేసేశారు. కేవలం ఆ ఒక్క ఘనత ద్వారా కాకుండా.. జీవిత కాలంలో తాను చేసిన పనుల ద్వారా గుర్తింపు రావడాన్ని తాను ఇష్టపడ తానని అనేవారు. పైగా.. చంద్రుడిపై తన పాదముద్రలు వేల ఏళ్ల పాటు అలాగే ఉంటాయన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ.. ఎవరైనా అక్కడికి వెళ్లి.. వాటిని క్లీన్ చేసి వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించేవారు. పైగా.. చంద్రుడిపై తొలి అడుగు ఘటనకు అం త క్రేజ్ ఎందుకన్న విషయం ఆయనకు ఓ పట్టాన అర్థమయ్యేది కాదట. అయితే, నీల్ గొప్పతనమేంటో ఆయన సహచరులకు తెలుసు. అందుకే.. ‘‘ఆయన సమర్ధుడైన కెప్టెన్. ఆయన సాధించిన ఘనత చిరకాలం నిలిచిపోతుంది. ఎంతవరకూ ఉంటే.. మానవుడు మార్స్‌పై అడుగుపెట్టేంతవరకూ’’ అని వారు వేనోళ్ల పొగిడేవారు.కోనార్డ్‌కు దక్కాల్సిన అదృష్టం..మీకో విషయం తెలుసా? వాస్తవంగా చంద్రుడిపై తొలి అడుగు వేయాల్సింది నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కాదు.. పీట్ కోనార్డ్. నేవీలో అధికారి అయిన కోనార్డే అపోలో 11కు కమాండర్‌గా వ్యవహరించాల్సింది. వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఇతడు తన తిరుగుబాటు వైఖరితో నాసా ఉన్నతాధికారులను మూడు చెరువుల నీళ్లు తాగించడంతో ఈ చాన్స్ మిస్సయ్యాడు. వ్యోమగామి శిక్షణలో భాగంగా వారు ఎదుర్కొవాల్సిన పరీక్షలను కోనార్డ్ అర్ధరహితమైనవని వ్యాఖ్యానించాడు. ఓ పరీక్షనైతే.. అతడు ఇది శృంగారంతో సమానం అని అనడం ద్వారా వారికి మరింత మంటెక్కించాడు. దీంతో అపోలో మిషన్ చివరి దశలో కోనార్డ్ అంటే పడని కొందరు ఉన్నతాధికారులు అతడి పేరును తప్పించడం ద్వారా కసి తీర్చుకున్నారని చెబుతారు.
తద్వారా ఆర్మ్‌స్ట్రాంగ్‌కు చరిత్రకెక్కే అవకాశం దక్కిందని అంటారు. అయితే, కోనార్డ్ అపోలో 12 మిషన్ ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టిన మూడో వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఎంతైనా కోనార్డ్ కదా మారడు.. అందుకే తాను చంద్రుడిపై అడుగు పెట్టగానే.. ‘‘ఆహా.. అది నీల్‌కు చాలా ‘చిన్న’ అడుగు అయిండొచ్చు. నాకు మాత్రం ఇది చాలా ‘సుదీర్ఘమైన’ అడుగు’’ అని అనడం ద్వారా తన కసి తీర్చుకున్నాడు.ప్రతి ఐదుగురిలో ఒకరు..నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది వీక్షించారు. అంటే అప్పటి జనాభా ప్రకారం ప్రతీ ఐదుగురిలో ఒకరన్నమాట! అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలే ఉండేవి. జనం ఇళ్లలోనూ వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ తెరల ముందు అతుక్కుపోయారు.
ఫస్ట్ వర్డ్స్..
‘‘ఓ మనిషిగా ఇది చాలా చిన్న అడుగే.. కానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు..’’
- చంద్రుడిపై అడుగు పెట్టిన తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్న మాటలివీ..చందమామ గురించి నీల్..‘‘
చందమామ చాలా ఆసక్తికరమైన ప్రదేశం. అక్కడికి వెళ్లాలని నేను సలహా ఇస్తాను. అంటార్కిటికాతో పోలిస్తే.. ఇక్కడి పరిస్థితులే ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. భూమ్యాకర్షణ శక్తితో పోలిస్తే.. ఇక్కడ ఆకర్షణ శక్తి చాలా అహ్లాదంగా ఉంటుంది. శాస్త్రీయపరమైన పనికి ఈ ప్రదేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది’’.చరిత్రకెక్కిన చిత్రాలు ఈ కెమెరాతోనే..చంద్రుడిపైన మానవుడు నడిచిన ఫొటోలు మనం చూశాం. చరిత్రలోకెక్కిన ఈ చిత్రాలను ఇంతకీ ఏ కెమెరాతో తీశారు. ఇదిగో ఈ హేసిల్‌బ్లాడ్ 500 ఈఎల్ కెమెరాలతోనే. నీల్ నడిచినప్పుడు ఆయన ఫొటోలను ఆల్డ్రిన్ తీస్తే.. ఆల్డ్రిన్ ఫొటోలను నీల్ తీశారు. ఈ కెమెరాలను అపోలో 8 మిషన్ నుంచి ఉపయోగిస్తున్నారు. విక్టర్ హేసిల్ బ్లాడ్ ఏబీ అనే స్వీడిష్ కంపెనీ వీటిని తయారుచేసింది.అపోలో- 111969 జూలై 16, ఉదయం 9.32 గంటలు: అపోలో-11 వ్యోమనౌకను తీసుకుని శాటర్న్-ఫైవ్ లాంచర్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ 39ఏ లాంచ్ కాంప్లెక్స్ నుంచి నింగికెగిసింది. దాదాపు మూడువేల మంది జర్నలిస్టులు, ఏడువేల మంది అతిథులు, ఐదు లక్షల మంది పర్యాటకులు ఈ అపురూప ఘట్టాన్ని అబ్బురంగా తిలకించారు.
1969 జూలై 19, మధ్యాహ్నం 1.28 గంటలు: అపోలో-11 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఒక రోజంతా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించిన తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్‌డ్రిన్‌లు లూనార్ మాడ్యూల్ ‘ఈగల్’లోకి ప్రవేశించి, చంద్రుని దిశగా ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి మైకేల్ కోలిన్స్ సర్వీస్ మాడ్యూల్ ‘కొలంబియా’లోనే ఉండిపోయారు.1969 జూలై 20, సాయంత్రం 4.18 గంటలు: ల్యాండింగ్ మాడ్యూల్‌లో కొద్ది సెకండ్లకు సరిపడేంత ఇంధనం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో చంద్రుడి ఉపరితలంపై వాలింది. ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్‌డ్రిన్‌లు ఆరున్నర గంటలు విశ్రాంతి తీసుకుని, ‘మూన్ వాక్’కు సన్నాహాలు చేసుకున్నారు.
1969 జూలై 20 రాత్రి 10.56 గంటలు: ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపై తొలి అడుగు మోపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆల్‌డ్రిన్ కూడా చంద్రుడిపై అడుగు మోపారు. వారిద్దరూ కలసి చంద్రుడిపై అమెరికా జెండాను నాటారు. చంద్రుడి వెలుపల చంద్రుని కక్ష్యలో గడిపిన 2.31 గంటలతో కలుపుకొని వారిద్దరూ 21.36 గంటలు గడిపారు. తిరుగు ప్రయాణమయ్యే ముందు వారివద్దనున్న అదనపు అనవసర సామగ్రిని చంద్రుడిపైనే వదిలేశారు.
1969 జూలై 21 మధ్యాహ్నం 1.54 గంటలు: చంద్రుడి ఉపరితలం నుంచి లూనార్ మాడ్యూల్ ‘ఈగల్’ పెకైగసింది. సురక్షితంగా సర్వీస్ మాడ్యూల్ ‘కొలంబియా’ను చేరుకుంది. ముగ్గురు వ్యోమగాములూ భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించారు.1969 జూలై 24 మధ్యాహ్నం 12.51 గంటలు: ‘కొలంబియా’ సురక్షితంగా హవాయి దీవులకు నైరుతి దిశగా పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయింది. వారిని అక్కడి నుంచి ఒడ్డుకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్న యూఎస్‌ఎస్ హార్నెట్‌కు 13 నాటికల్ మైళ్ల దూరంలో ముగ్గురు వ్యోమగాములూ ల్యాండ్ అయ్యారు. 1969 ఆగస్టు 10: 17 రోజుల ఏకాంతవాసం తర్వాత ముగ్గురు వ్యోమగాములూ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ వారికి ఘనస్వాగతం పలికారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more