who will be appointed as new APCC president.? ‘చే’పగ్గాలు ఎవరికో..? హస్త రేఖలు మార్చేనా.?

Who will be andhra pradesh new pcc president

All India Congress committee, Andhra Pradesh congress committee, Apcc president Raghuveera Reddy, APCC, MM Pallam Raju, JD Seelam, Chinta Mohan, congress, Andhra Pradesh, Politics

All India Congress committee to appoint new Pradesh congress committee president soon. After Raghuveera Reddy resignation senior leaders of the state are in race to take as new charge and bring the party into limeliht again.

రాష్ట్ర ‘చే’పగ్గాలు.. కాపునేతకా.. దళిత నేతకా..?

Posted: 10/25/2019 03:55 PM IST
Who will be andhra pradesh new pcc president

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తమతోనే సాధ్యమైందని టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలు ఇప్పటికీ కాలర్ ఎగురవేస్తుంటాయి. అందుకు అన్ని పార్టీలు కారణమైనా అధికారంలో వుంటూ ఆ దిశగా చర్యలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీలో జవసత్వాలు కోల్పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన రాష్ట్ర ఇంచార్జ్ ఉమెన్ చాంధీ.. కాసింత చురుగ్గా పావులు కదిపే సమయంలో ఆయనకు పీసీసీ మాజీ ఛీఫ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. పిసీసీ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు.

అయితే జులైలో పదవి నుంచి ఆయన వైదొలగిన తర్వాత ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరినీ నియమించలేదు అధిష్టానం. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టసారించిన నేపథ్యంలో జాప్యం జరిగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు ఏపీపై దృష్టిసారించారు. కాగా, పీసీసీ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ నేతల మధ్య రసవత్తర పోటీ నెలకొందని తెలుస్తోంది. ఈ రేసులో పలువురు వున్నా.. మాజీ కేంద్రమంత్రులుగా కొనసాగిన ముగ్గురు నేతల మధ్య మాత్రం పోటీ వుందని తెలుస్తోంది.

తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, కాకినాడ మాజీ ఎంపీ ఎం.ఎం.పళ్లంరాజు, బాపట్ల మాజీ ఎంపీ జేడీ శీలంలో ఒకరిని పీసీసీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పేర్లు కూడా వినపడుతున్నాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై క్షేత్రస్ధాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఏపీ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్ చాందీని అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు.

సోనియా ఆదేశాల మేరకు నవంబర్ 1న విజయవాడ రానున్న ఊమెన్ చాందీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని స్ధాయిల నేతలతో రెండు రోజుల పాటు సమావేశమై.. పార్టీ నేతల అభిప్రాయాల నివేదికను సోనియాగాంధీకి సమర్పించనున్నారు. అనంతరం అధిష్టానం ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే గతంలో మాదిరిగా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు పార్టీలో కనరాకపోవడం.. ఈ సారి అధ్యక్షపదవిని దళితలకు కట్టబెట్టనున్నారా.? లేక కాపు సామాజిక వర్గ నేతలకు అందించనున్నారా.? అన్నది సందిగ్ధంగా మారింది.

రాష్ట్ర విభజన పాపం తలపై మోస్తున్న కాంగ్రెస్.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఇక దీనికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్న నేతల్లో పలువురు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నేతలుగా కొనసాగుతున్నా.. వారికి అదే రేంజ్ లో జనాకర్షణ మాత్రం లేదు. దీంతో ప్రజలను అకర్షించే నేతల కోసం అన్వేషించడం కన్నా.. ముందుగా పీసీసీ అధ్యక్ష పగ్గాలను అందించి.. ఆ తరువాత జనాకర్షణ కోసం ఏం చేయాలి, ఎలా చేయాలన్న కార్యచరణను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అయితే గతంలో 2004, 2009లలో రెండు పర్యాయాలు రాష్ట్రం నుంచి లభ్యమైన ఎంపీ స్థానాలే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధికార పగ్గాలు చేపట్టేందుకు దోహదం చేశాయన్నది కాదనలేని సత్యం. ఈ క్రమంలో మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటి కేంద్రంలో అధికార పగ్గాలను అందుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తు వేస్తున్న బీజేపి తెలుగు రాష్ట్రాలలో కూడా తమ పార్టీ పాగా వేసే దిశగా పావులు కదుపుతొంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మరోసారి తనకు గతంలో అండగా నిలిచిన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా నూతన పిసిసి అధ్యక్ష పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంఎం పల్లం రాజుకు కట్టబెడుతోందా.? లేక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పగ్గాలను అందిస్తోందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చివరి నిమిషంలో అద్భుతాలేవీ జరగకపోతే చింతామోహన్, జేడీ శీలంలో ఒకరికి పగ్గాలు లభించే అవకాశముంది. అలా కాదని ఒకప్పటి తమ బలమైన కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలంటే మాత్రం పళ్లంరాజుకు అవకాశం లభించవచ్చు. అయితే బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కానీ, లేక కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కానీ పార్టీలో పీసీసీ పగ్గాలను అందుకునే స్థాయిలో లేకపోవడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuveera Reddy  APCC  MM Pallam Raju  JD Seelam  Chinta Mohan  congress  Andhra Pradesh  Politics  

Other Articles