వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణాంతకమైంది ఏమిటి?
వైయస్ ఆర్ కాంగ్రెస్ కి ఈ గతి పట్టటానికి కారణం ప్రజారాజ్యం పార్టీని వైయస్ ఆర్ కూలదోసిన పాపమే అని నమ్మితే, ఆ సంఘటన జరిగుండకపోతే జగన్ నిస్సందేహంగా ఈ పాటికి ముఖ్యమంత్రయ్యుండేవారు! అంటే అప్పుడు ప్రరాపను అణగదొక్కటం ఇప్పుడు ఈ 2014 ఎన్నికల్లో వైకాపా కి ప్రాణాంతకమైంది.
పవన్ చేసింది సుడిగాలి పర్యటనే అయినా, విస్తృతంగా జరిగిన టివి కవరేజ్ వలన అన్ని ప్రాంతాలకూ ఆయన సందేశం చేరుకుంది. నెలల తరబడి ఊకదంబుడు కాకుండా ఎన్నికలు దగ్గరబడ్డ చివర్లో అందరి దృష్టీ ఎన్నికల మీద పడి, ఉత్కంఠ పెరగిన సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన సుడిగాలి పర్యటనలు ప్రభావాన్ని బాగా చూపించాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండిటికీ జాతీయ రాష్ట్రీయ స్థాయిల్లో మద్దతు తెల్పుతూ తన ఉపన్యాసంలో స్పష్టంగా 'కాంగ్రెస్ హటావో దేశ్ బచావో' అంటూ తెలంగాణా లోను, 'వైయస్ ఆర్ కాంగ్రెస్ హఠావో రాష్ట్ర బచావో' అని సీమాంధ్రలోనూ పవన్ కళ్యాణ్ చేసిన నినాదం, ఉద్వేగభరితమైన ప్రసంగం జగన్ కి తీర్చలేని నష్టాన్ని చేకూర్చిందన్నది అంతకు ముందు సర్వేలతో పోల్చి చూస్తే అర్థమౌతుంది.
నెల్లూరు మొత్తం వైకాప కే అని అనుకున్నది పూర్తిగా మారిపోయింది. అధికార ప్రతినిధిగా అందరి నోళ్ళనూ మూయించే శక్తి సామర్థ్యాలున్న అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఓడిపోయారు. అంతెందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మని విశాఖపట్నంలో చాలా ధీమాగా నిలబెట్టటానికి కారణం అక్కడ పొత్తులో భాజపా కి పార్లమెంటు స్థానం లభించటం. ఇలా ఎన్నో జిల్లాల్లో వైకాపాకి కచ్చితమనుకున్న సీట్లన్నీ తెలుగు దేశం వశమయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద సీమాంధ్ర ప్రజలు కసితో ఉన్నారు కాబట్టి, దానికి తోడు పవన్ కళ్యాణ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించమని పిలుపునివ్వటం వలన కూడా.
నష్టం అంతటితో ఆగిపోనూ లేదు. ఇప్పటికే కొందరు ఆ పార్టీ లోంచి తెదేపా లోకి జంప్ చేసారు, ఇంకా చేస్తున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా కార్పొరేటర్లు కూడా పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ పవన్ కళ్యాణ్ వలనే అయ్యాయని కాదు. కానీ ఒకసారి దారంటూ ఏర్పడితే నీరంతా అటే పోయినట్లుగా రాజకీయ రంగంలో కూడా ఒకరిని చూసి మరొకరు ప్రయాజనం పొందే దిశగా అడుగులు వేస్తుంటారు. వారిని తప్పు పట్టి ప్రయోజనం లేదు. రాజకీయాలంటే ప్రజాసేవకు కాదు స్వయంసేవకు, స్వప్రయోజనానికి అని నాయకుల మెదడులో బాగా ఇంకిపోవటమే అందుకు కారణం.
ప్రతిపక్షంలోనైనా కలిసుందాంరా అంటున్న కాంగ్రెస్?
'నీది తెనాలే నాది తెనాలే' అని తెలుగు సినిమాలో హాస్యనటుడు పాడినట్లుగా, 'నీది కాంగ్రెసే నాది కాంగ్రెసే' అని జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని పిలుస్తోంది. ఉన్నట్టుండి ఎందుకీ ప్రేమ అంటే, 125 సంవత్సరాల చరిత్ర గల పార్టీగా డబ్బా కొట్టుకుంటూ తిరిగిన పార్టీ చివరకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందటానికి కూడా సరిపోను సంఖ్యలో లోక్ సభ సభ్యులను గెలిపించుకోలేకపోయింది.
లోక్ సభలోని 543 ఎంపీ స్థానాల్లో కనీసం 10 శాతం ఎంపీల ప్రాతినిధ్యం ఉన్నట్లయితే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కి వుండేది. కానీ ప్రతిపక్షంలోనైనా ప్రధాన పాత్ర పోషించటానికి అవసరమైన 55 ఎంపీలకు బదులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలు 44 మంది మాత్రమే ఉన్నారు. అందువలన వైకాపా కలిస్తే మరో 9 సీట్లు (తెలంగాణా 1, ఆంధ్ర ప్రదేశ్ 8) కాంగ్రెస్ కి కలుస్తాయి. అలాగే మరో రెండు మూడు అక్కడో ఇక్కడో స్వతంత్రులనో ఎవరినో పిలిస్తే 55 సీట్లు పూర్తై లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుందని ఆశ!
ముఖ్యమంత్రి అవలేని వారి, ప్రధాని అవలేనివారి మేలు కలయిక!
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అవవలసిన అవకాశాలు మెండుగా కనిపించి చివర్లో తెలుగుదేశం పార్టీకి వదులుకున్న వైకాపా నాయకుడు జగన్మోహన రెడ్డి, ప్రధాన మంత్రి తన కుమారుడుకి దక్కుతుందనుకుని ఆశపడి భంగపడిన సోనియా గాంధీ కలిస్తే కాస్తైనా గౌరవంగా లోక్ సభలో కూర్చోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
కేంద్రంలో సోనియా ఆశల మీద నీళ్ళు చల్లినతను నరేంద్ర మోదీ అయితే, రాష్ట్రంలో జగన్ ఆశలను అడియాసలు చేసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే జనసేన అంటూ బరిలోకి రాకపోతే జగన్ కి అడ్డు ఉండేది కాదన్నిది సత్యం. మార్చి నెలలో ఎన్ డి టివి లాంటి వారు నిర్వహించిన సర్వేలు జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని లెక్కలు కట్టి చెప్పాయి. కానీ ఉన్నట్టుండి బోటు బోల్తా కొట్టినట్లయింది జగన్ కి. ఒక్క 5 లక్షల వోట్లతో తేడాతో రెండవ స్థానంలోకి వెళ్ళవలసివచ్చిందని జగన్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ 5 కాదు 15 లక్షల వోటర్లను ఇవ్వగల స్తోమతు కలవాడన్నది అందరికీ తెలుసు.
నిజంగానే వైయస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో విలీనమౌతే
అలా అయినా వచ్చే తేడా ఏమీ ఉండదు. అయినా మునిగే నావలో కాలు పెట్టాలని ఎవరూ అనుకోరు. జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదేనని ఆ రెండు పార్టీలు కలిసిపోయినంత మాత్రాన ఎవరికీ ఏ ప్రయోజనమూ ఉండదు, ఇతర పార్టీలకు నష్టమూ ఉండదు. కనీసం వైయస్ ఆర్ కాంగ్రెస్ కి రాష్ట్రంలో ప్రదాన ప్రతిపక్ష హోదా అయినా ఉంది. కాంగ్రెస్ కి కేంద్రంలో అదీ లేదు.
ప్రజారాజ్యం ఉసురు తగిలిందని కొందరనుకుంటుంటే, ప్రజారాజ్యంలాగానే వైయస్ ఆర్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ లో చేరినా చేరవచ్చు అంటూ రెండు పార్టీలనూ ఒకే దాటకి కట్టేసినవారూ ఉన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ విలీనం ఆ పార్టీ ఓడిపోయినందుకు చేసింది కాదు, లేదా ఏమైనా ఆశించి చేసిందీ కాదు. నిజానికి కాంగ్రెస్ పార్టీనే బ్రతికించింది. లేకపోతే అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే కూలిపోయివుండేది. రాజకీయ పార్టీల్లో అధికారం కోసం వేరు పార్టీలను పెట్టుకుంటారు. తన పార్టీని ఒక జాతీయ పార్టీతో విలీనం చెయ్యటమంటే తన వ్యక్తిగత స్థాయిని పూర్తిగా వదిలిపెట్టటమే అవుతుంది. పదవుల కోసం కొత్త పార్టీ పెట్టటం గొప్పా లేకపోతే అంతా వదులుకుని మరో పార్టీలో విలీనమవటమా అంటే అది ఆలోచించేవారి దృష్టికోణం మీద ఆధారపడివుంటుంది.
తనకి అధికారం రావటం లేదని కాంగ్రెస్ ని వదిలి వైయస్ఆర్ కాంగ్రెస్ అని కొత్త పార్టీని పెట్టుకున్న జగన్ తో, అధికారంలోకి రాలేకపోయినా, తనకి తెలుగు ప్రజలు కొద్దో గొప్పో మద్దతునిచ్చిన తరుణంలో అటువంటి పార్టీ అధ్యక్ష పదవిని వదిలిపెట్టి మరో పార్టీలోకి ఒదిగిపోవటమే కాకుండా చివరివరకూ ఆ పార్టీ కోసం పోరాటం సాగించిన చిరంజీవిని పోల్చటం సరైన పోలిక కాదు.
ఏది ఏమైనా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీతో పంతం పెట్టుకుని కూలదోయటానికి చూసి, కాంగ్రెస్ లో విలీనం అయ్యేంత వరకూ చిరంజీవి వెనకాలపడి, దాని ఫలితంగా అందులో యువనాయకుడిగాను, జనసేన పార్టీ స్థాపించి దానికి అధ్యక్షుడుగానూ పిడుగులా వచ్చిన పవన్ కళ్యాణ్ ధాటికి తట్టుకోలేకపోయారన్నది తేటతెల్లంగా తెలుస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more