Jagan Asks Chandrababu to Support No-Confidence Motion | చరిత్ర హీనుడిగా మిగిలిపోకూడదంటే.. మద్ధతు ఇవ్వు : చంద్రబాబుకు జగన్ సూచన

Ys jagan advice to chandrababu

YS Jagan Mohan Reddy, Press Meet, Chandrababu Naidu, No Confidence Motion, Central Government, TDP Ministers Resign, BJP Government, BJP, Chandrababu Naidu,

YS Jagan Mohan Reddy Press Meet after TDP Ministers Resign from Central. Says Support No Confidence Motion otherwise People will not leave you, Jagan Added.

చంద్రబాబుకు జగన్ ఇస్తున్న సలహా!

Posted: 03/08/2018 09:50 AM IST
Ys jagan advice to chandrababu

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా సంతరావూరులో ఉన్న ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో కేంద్రం నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, ప్రజాగ్రహాన్ని చూసి తలొగ్గారని, ఆ విషయం సంతోషకరమే అయినప్పటికీ, తనకు ఇంకో విషయం ఆశ్చర్యాన్ని కలిగించిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాజీనామాలకు ముందు ఆ విషయాన్ని తాను కేంద్ర పెద్దలకు వెల్లడించనున్నట్టు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు.

అవిశ్వాసానికి సహకరించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం పెట్టడానికి తాము నిర్ణయించామని, అవిశ్వాసానికి చంద్రబాబునాయుడు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబుకు ఆలోచించుకునే సమయం ఇవ్వడానికే 21 వరకూ సమయం ఇస్తున్నామని, రాష్ట్రం మొత్తం ఒకతాటిపై నిలబడి 25 మంది ఎంపీలూ అవిశ్వాసానికి మద్దతుగా నిలిస్తే, కేంద్రానికి ఓ సంకేతం వెళుతుందని, మరింత ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. చంద్రబాబు ఓకే అంటే, అంతకన్నా ముందైనా అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు.

"నువ్వు పెట్టమంటే నే పెడతా. 25కి 25 మంది ఎంపీలూ ఒకతాటిపై నిలబడదాం. అవిశ్వాసం పెడదాం. మేం అవిశ్వాసం పెడతాం నువ్వు మద్దతివ్వు. లేదంటే నువ్వు పెట్టు మేం ఇస్తాం. దాని తరువాత 25 మంది ఎంపీలతోనూ మూకుమ్మడిగా రాజీనామా చేయిద్దాం. అప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది. ఎందుకు ఆంధ్రరాష్ట్రం ఇలా చేస్తోందని ఆలోచిస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు. చంద్రబాబుకు నా సలహా ఇదొక్కటే" అని అన్నారు. తన సలహాను ఆయన వినాలని కోరారు.

పూటకో మాట...
"రాజీనామాలు చేద్దామని అనుకున్నప్పుడు... మళ్లీ ఫోన్ లో మాట్లాడటం ఎందుకండీ? ఢిల్లీ పెద్దలతో ఫోన్ లో మాట్లాడాను అని ఆయనంతట ఆయనే ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ ఉంటే అర్థమేంటి? ఎన్డీయే కన్వీనర్ గా ఆయన ఇంకా కొనసాగుతున్నాడంటే ఆర్థమేంటి? ఇంకా ఎన్డీయేలో ఉంటానని చెప్పడంలో అర్థమేంటి? దేనికైనా చిత్తశుద్ధి... రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ, నిజాయతీ చాలా ఇంపార్టెంట్. చంద్రబాబునాయుడికి ఇవేమీ లేవు కాబట్టి, పూటకో మాట, రోజుకో పాట పాడుతూ ఉన్నారు. తాను ఏం చేసినాగానీ ప్రజలు పడుంటారన్న చంద్రబాబు థింకింగ్ కు చరమగీతం పాడే రోజులు కూడా త్వరలోనే వస్తాయి" అని అన్నారు.

అసలు చంద్రబాబు ముఖ్యమంత్రేనా?
14వ ఆర్థిక సంఘం అసలు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వద్దని ఎన్నడూ చెప్పలేదని, అయినప్పటికీ దాని పేరును చెబుతూ కేంద్రం మభ్యపెడుతుంటే, నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగి, ఎన్నికల సంవత్సరంలో ప్రజలను మోసం చేసేందుకు కేంద్రం నుంచి మంత్రులు తప్పుకుంటారని, తమ పార్టీ మాత్రం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందని చెప్పే చంద్రబాబునాయుడు అసలు ముఖ్యమంత్రేనా? అని వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎవరైనా బాధ్యతగల స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం న్యాయమేనా? చంద్రబాబునాయుడు ఇప్పుడు చేసిన పనిని, అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ ఇచ్చిన అదే రోజు చేసుంటే ప్రత్యేక హోదా ఈ పాటికి వచ్చుండేదని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని ఎద్దేవా చేశారు. కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి, అక్కడి నుంచి కూడా పలు రకాల డిమాండ్లు వస్తాయన్న ఆలోచనతో కేంద్రం ఇప్పుడు హోదాపై తాత్సారం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం చేస్తున్న పద్దతి సరైనది కాదని, రాష్ట్రాన్ని విడగొట్టే వేళ వీరంతా అక్కడే ఉన్నారని, హోదాను ఇస్తామని చెప్పి విడగొట్టారని గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల ఎంపీల ముందు హోదా ఇస్తామని చెప్పి విడగొట్టిన రెండు ప్రధాన పార్టీల్లో ఒకటి ఇప్పుడు అధికారంలో ఉందని, తామిచ్చిన హామీనే నెరవేర్చలేకుంటే ప్రజల్లో విశ్వసనీయతను ఎలా పెంచుకోగలరని ప్రశ్నించారు.

ఆ మీడియా ప్రతినిధులకు చురకలు
తన మీడియా సమావేశాలకు రారాదని ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు తాను ఎన్నడో స్పష్టం చేశానని, అయినా ఆ పత్రికల ప్రతినిధులు వచ్చారని, ఇలా రావడం సరికాదని, ఇప్పటికి ఓకే, ఇకపై రావద్దని జగన్ వ్యాఖ్యానించారు. అంతకుముందు అక్కడి స్థానిక విలేకరులను పేర్లు అడిగి తెలుసుకుని పలకరించారు. ఆంధ్రజ్యోతి నుంచి ప్రసాద్, ఏబీఎన్ చానల్ నుంచి సురేష్ ఈ సమావేశానికి వచ్చారు. వారిని 'అన్నా అన్నా' అని పలకరించిన జగన్, "మీ ఇద్దరూ రావడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ, లెట్స్ గో దిస్ మూమెంట్. నెక్ట్స్ టైమ్... మనం వద్దని చెప్పినప్పుడు... ఆ పేపర్ ను, ఆ టీవీని పబ్లిక్ గా కోర్టులో కేసు వేశాం. మీరు రాసిన రాతలు, సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా, ఇన్టెన్షనల్ గా... కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ ను, ఏబీఎన్ అనే చానల్ ను వైఎస్ఆర్ సీపీ బాయ్ కాట్ చేసింది. రావద్దని వారి పేపర్ లో రాసే రాతలు, టీవీలో చూపే వార్తలను నమ్మవద్దని ఎన్నోసార్లు చెప్పాను. మీరు వచ్చారు కాబట్టి కేక్ తిని పొండి" అని జగన్ చురకలు అంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles