శివుడ్ని ఎలా అభిషేకించాలి.. ఉపవాసం వెనుక అసలు ఉద్దేశ్యం... | Significance, Celebration & Rituals Maha Shivaratri.

Lord shiva chants shiv bhajans on maha shivratri occasion in telugu states

Maha Shivaratri Significance, Maha Shivaratri 2016, Lord Shiva Fasting, Maha Shivratri in Telugu States, Maha Shivratri Abhishekam, Maha Shivratri Rituals, Maha Shivaratri Telugu Wishesh, Hara Hara Mahadeva sambho shankara

Maha Shivaratri Significance, Importance and History of Shivratri, the festival of Lord Shiva.

హర హర మహాదేవ శంభో శంకర

Posted: 02/24/2017 08:30 AM IST
Lord shiva chants shiv bhajans on maha shivratri occasion in telugu states

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ శివనామ జపంతో మార్మోగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే శివాలయాలకు చేరుకుని స్వామి వారికి పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సందడి చాలా అధికంగా ఉంది. విజయవాడలోని దుర్గాఘాట్, పద్మావతి ఘాట్ ‌లో శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అలాగే మహానంది, ఓంకారం, యాగంటి, కాల్వబుగ్గ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. కర్నూలు సంగమేశ్వర ఆలయాన్ని దర్శిస్తున్న భక్తులు సప్తనదుల కూడలిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం పాదగయలో భక్తులు కుక్కుటేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వరీ ఆలయం భక్తుల శివనామ జపంతో మార్మోగుతోంది. నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్‌లో పాదరస శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజిస్తే అనంతకోటి లింగాలను పూజించిన ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇక వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. నల్లగొండ జిల్లా మేళ్లచెరువులో వద్ద జడల పార్వతీశ ఆలయం వద్ద రద్దీ అధికంగా ఉంది .

అభిషేకం ఎలా చేయాలంటే...

శివుడు అభిషేక ప్రియుడు.. మహాలింగంపై కాసిన్ని నీళ్లు పోసి.. త్రిదళ పత్రిని సమర్పించుకుంటే చాలు.. కరిగి కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడు! శివరాత్రి రోజు అర్చన, అభిషేకంతో సదాశివుడి అనుగ్రహం పొందితే జీవితంలో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సానిధ్యాన్ని చేరుకుంటారట.

అనేక రకాల పుష్పాలతో అభిషేకం చేస్తే రాజభోగాలు, వెండిధూళి లేదా వెండి రజనుతో శివుడిని అభిషేకిస్తే విద్యాప్రాప్తి కలుగుతాయట. నవధాన్యాలతో ఆరాధిస్తే ధనంతోపాటు భార్యాపుత్రలాభం, పటికబెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయట. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదాభిషేకంతో సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి.

ఉపవాసం ఎందుకు..?

ఇక ఈ పవిత్రదినాన భక్తులు శివుణ్ని మూడు పద్ధతుల్లో పూజిస్తారు. అవి.. శివార్చన, ఉపవాసం, జాగారణం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రినాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది శివుడికి మరొకటి లేదట. అలాంటి ఉపవాసం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపవాసం అంటే మనస్సును శివునికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు చెపుతున్నారు. శివున్ని మనస్సుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి.

కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనతో రోజంతా మహాశివుణ్ని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రినాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట. అయితే ప్రస్తుతం చాలా మందిని బీపీ, సుగర్ వంటి వ్యాధులు బాధిస్తుండంతో ఎంతో కొంత అల్పాహారం తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది అపవాదమే అయినప్పటికీ తప్పదు.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి తప్పయిన ఇలాంటి చిన్న చిన్న రోగాలతో బాధపడేవాళ్లు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పళ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెపుతున్నారు.

 

ప్రత్యేక పూజలు చేస్తే...

శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతితో దీపం వెలిగించి పౌరోహితులకు దానం చేస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందట. అంత స్థోమత లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయట.

మహాశివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు పేర్కొంటున్నారు.

ఆ రోజున ఆలయాల్లో నాలుగు యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతోపాటు పారాయణం కొనసాగిస్తారు.

తొలి యామం: పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. రుగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.

రెండో యామం: ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం గంధ లేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

మూడో యామం : ఇందులో తేనెతో అభిషేకం చేసి, కర్పూరం గంధ లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి, సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట.

నాల్గో యామం: చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూరం గంధ లేపనంతో అలకరించాలి. తామర, కలువ, మల్లె పూలతో అర్చనగావించి, వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maha Shivaratri  Significance  Rituals  

Other Articles