Dream new hope on new year

Dream new hope on new year

New year, New year eve, Hope, Hope new morings

Every body hopes that new year will brings lot of smiles and lot of money in their lives. Every body need to hope better and excellent begining on new year eve.

"ఆశ"కు దగ్గరిగా... నిరాశకు దూరంగా

Posted: 01/04/2016 01:04 PM IST
Dream new hope on new year

హ్యాపీ న్యూ ఇయర్... కొత్త సంవత్సరం, వేసుకునే బట్టల దగ్గరినుంచీ, మాటలు కలిపే విధానం వరకు... ఫుడ్ లో వెరైటీ దగ్గరి నుంచీ, లైఫ్ స్టయిల్లో వెరైటీ వరకు... అంతా కొత్తగా ఉండాలని గత సంవత్సరం చివరి నెల మొదటి రోజు నుంచే ప్రతీదీ ప్లాన్ చేసుకుని, తుచ తప్పకుండా ప్రతీ ఆశనీ నిజం చేసుకుంటున్నా... ఏదో కొత్త ఉత్సాహం, ఆనందం వైపుకు తరుముతున్నట్టుగా ఉంది... సైకాలజీ లో పీ.జీ., ఆ వెంటనే ఫలానా కౌన్సిలింగ్ సెంటర్లో ప్రాక్టీస్, అందరి సమస్యలకీ సమాధానాలు ఇస్తూ, వీటిని గుణపాఠంగా పరిగణించి, నేను ఏ సమస్యా తెచ్చుకోకుండా, ఆనందంగా ప్రతీ రోజు గడపాలని ఆశ... ప్రతీ క్షణంతో ఎన్నో జ్ఞ్యాపకాలని ముడి వేసుకోవాలని ఆశ... నా చేతిలో ఉన్న నా జీవితపు భవిష్యత్తుని, వర్తమానం కన్నామెరుగ్గా దిద్దుకోవాలని ఆశ... ముందే వేసుకున్న ప్రణాళిక, పోయిన సంవత్సరం చివరి నెలలో చేసుకున్న రీ ప్లానింగ్, నా ప్రతీ ఆశనూ తీర్చుకునే దిశగానే నాకు హెల్ప్ చేస్తున్నాయి...

కొత్త సంవత్సరం, అన్నీ కొత్తగా మార్చేసుకున్నా, కొన్ని బంధాలను, వారితో మనకున్న అనుబంధాన్నీ మార్చుకోలేం కదా? అందుకే నా పాత ఫ్రెండ్ ని కొత్త సంవత్సరంలో కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లాను... ఇల్లు పాతది, ఆంటీ - అంకుల్ పాతవారు, నా ఫ్రెండ్ ఆశ పాతదే, దాని వేదన కూడా పాతదే... క్యాలెండర్ లో గడిచిపోయిన గత సంవత్సరం, ఒచ్చిన కొత్త సంవత్సరం, దానిలోని సంఘర్షణని మరిపించి, ముందుకు నడిపించలేకపోయాయి... దాని పేరులో ఉన్న ఆశ, రావ్వంతైనా దాని జీవితంలో, కాదు కాదు, దాని ఆలోచనలో లేకపోయింది...

"దీని మొహం... ఇదెప్పుడూ ఇంతేగా... ఎలా బతకాలో తెలీదు, అలా బేలవంగా ఉంది టైం వేస్ట్ చేసుకోవడం తప్ప...", దాన్ని కలిసిన ప్రతీసారి, నాలో దాన్ని గురించి ఇదే ఫీలింగ్...

కానీ ఈసారి, నేను మారాలనుకున్నా... "ఛి... ఇదింతే" అని కాక, "ఎందుకు ఇది ఇంతే?" అని తెలుసుకోవాలనుకున్నా... సైకాలజీ చదువు ప్రభావమో, కొత్త సంవత్సరం మార్పు మహిమో కానీ, ఆశ గురించి మరో కోణంలో ఆలోచించి, దాన్ని బాధ లోంచి బయటపడేయ్యాలి అన్న ఆశ నాలో మొదలయ్యింది... వరుసగా వారం రోజులు దాటితో ఎయిట్ అవర్స్ షిఫ్ట్ చేసి, షిఫ్ట్ టైమింగ్స్ అయిపోయినా స్ట్రెచ్ చేసి మరీ, అదెప్పుడూ నిరాశగా ఉండటం వెనుక, సీక్రెట్ కీ ఏంటో కనుక్కున్నా... నేను చదివిన సైకాలజీ పుస్తకాల్లో ఎవ్వరూ రాయని సిచువేషన్స్, ముందు నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసాయి, తరువాత ఆశకి హెల్ప్ చెయ్యాలి అన్న దృడ సంకల్పానికీ తీసుకొచ్చాయి...

ఆశ ఒక్కత్తే అమ్మాయి... "ఆడపిల్ల" అని ఆంటీ - అంకుల్, చిన్నప్పటినుంచీ కట్టడిగానే పెంచారు ఆశని... యెంత "కట్టడి" అంటే, దాని బెస్ట్ ఫ్రెండ్ ని, మా ఇంటికి కూడా దాన్ని పంపనంతగా... అదేం చదువుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఎవరితో ఎంతవరకూ మాట్లాడాలి, ఇరుగు పరుగుతో యెంత వరకూ మాట కలపాలి, ఎక్కడ ఆపెయ్యాలి, ఏం తినాలి, యెంత వరకు తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోయినా, ఎప్పటికల్లా నిద్ర లేవాలి... ఇలా ప్రతీది టైం టేబుల్ ప్రకారం, రూల్ ప్రకారం నడుస్తుంది వాళ్ళింట్లో...
మరి రిజల్ట్?
బ్రహ్మానందం జోక్ కి, ఆశ నవ్వలేదు, అసలీయన కామెడీ ఎలా ఉంటుందో దానికి తెలీదు... టీవీకి స్టార్ కనెక్షన్ లేదు సరికదా, వెచ్చే ఒక్క ఛానెల్ ని కూడా న్యూస్ టైం లోనే ఆన్ చేస్తారు... అసలు ఇదంతా కాదు కానీ, నవ్వడమే దానికి తెలీదు... అమ్మతో నవ్వుని, నాన్నతో చనువునీ అది పంచుకున్నదే లేదు... కారణం? క్రమశిక్షణ... "పిల్లకి చనువిచ్చి దానితో నవ్వుతూ ముచ్చట్లు పెడితే, ఇక అది మన మాటేం వింటుంది?" ఇది ఆంటీ - అంకుల్ తత్త్వం... అందుకే వాళ్ళింట్లో అందరూ "స్మయిల్" ఇస్తారు... ఎనీ సిచువేషన్, "ఓన్లీ స్మయిల్"... ఆశ, ఎక్కువ సందర్భాలలో "స్మయిల్" కూడా ఇవ్వదు... మనిషి ఇక్కడ ఉంటుంది కానీ, ఆలోచన, ఎప్పుడూ సూన్యం వైపే...

ఆశ ఏం ఆలోచిస్తుంటుంది? ఎందుకు సూన్యం లోకి చూస్తూ ఉంటుంది? ఏమో ఆ సూన్యానికే తెలియాలి", అనుకునే దాన్ని... కానీ, నేను ఎంతో ప్రయత్నిస్తే, అది నోరు, కాదు కాదు, దాని మనసు విప్పి మాట్లాడిన తరువాత తెలిసింది, అది ఆలోచించే ఆలోచన కూడా సూన్యం అని... ఇన్నేళ్ళ దాని జీవితంలో, ఒంటరితనం, దాని ఆలోచనల్లో కూడా నిండిపోయింది... ఫలితం సూన్యం... ఏదో, తింటుంది, ఉంటుంది, చదువుకోవాలి కాబట్టి, చదువుకుంటుంది... ఎవ్వరితో కలవాలని, తన జీవితాన్ని మార్చుకోవాలనీ, ఫలానా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనీ, కాలీజీకెళ్ళిన కాసేపైనా, ఆంక్షలన్నీ తెంచుకుని, తనకు నచ్చినట్టు ఉండాలని, హాయిగా నవ్వాలనీ... ఇలా ఏదీ దానికి తెలీదు... ఎవరైనా చెప్తే వినే ఆసక్తి కూడా లేదు... ఎందుకంటే, దానికి దాని జీవితం మీదే ఆసక్తి లేదు... ఆసక్తి ఎలా ఉంటుందో తెలీదు... నవ్వితే యెంత హాయిగా ఉంటుందో తెలీదు... అల్లరి చేస్తే యెంత ఉత్సాహంగా ఉంటుందో తెలీదు... పానీ పూరి రుచి, ప్రేమను పంచుకోవడంలో మాధుర్యం, ప్రేమించడంలో ఉన్న అనుభూతి, స్నేహం తీపి, కన్నీటి బాధ, అనుకున్నది సాధించినప్పుడు కలిగే తృప్తి, కోరుకున్నది పొందినప్పుడు కలిగే ఆనందం, ఇలా ఏదీ దానికి తెలీదు... దాని తత్త్వం ఏంటో, దానికి ఏం కావాలో కూడా దానికి తెలీదు... దానికి తెలిసిందల్లా ఒక్కటే, "ఒంటరితనం"... ఇదే అలవాటయ్యింది కూడా... మొత్తానికి ఆంటీ - అంకుల్ సక్సెస్... అన్ని వేళలా వాళ్ళ అబ్సర్వేషన్ లో అమ్మాయి లేకపోయినా, వారి "క్రమశిక్షణ" అనబడే "కట్టడి" కి, ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది వారి ఆశలేని "ఆశ"...

అన్నీ ఎమోషన్స్ ఉన్న నాకే, అప్పుడప్పుడూ నాకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నవారితో పోల్చుకున్నా, లేక అపజయం చవి చూడాల్సి ఒచ్చినా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒస్తూ ఉంటుంది... వెంటనే రియలైజ్ అయ్యి, ఈ ప్రతికూల ఆలోచనని అణచివేసేందుకు ఆయుధాలు సమకూర్చుకుని, పోరాడి, జయం పొందుతూ ఉంటాను... కానీ ఆశకి ఎమోషన్స్ అంటే ఏంటో కూడా తెలీదు... అందుకే తాను యెంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో కూరుకుపోయిందో దానికి తెలీదు... "నాకీ సమస్య ఉంది" అని తెలుసుకున్న వారికి అందులోంచి బయటపడటానికి హెల్ప్ చెయ్యచ్చు కానీ... అసలు "సమస్య" అంటే ఏంటో తెలీని ఆశకి ఎలా హెల్ప్ చేసేదీ?

ఇన్ని ఆలోచనల మధ్య సతమతమవుతున్న నాకు, ఇంకో భయంకరమైన ఆలోచన కూడా ఒచ్చింది... ఆశ ఇలాగే ఉంటే? అయితే దానికి లేదా ఎన్నో ఆశలతో దాన్ని పెళ్లి చేసుకున్నవాడికీ, జీవితం మీద ఆశ కోల్పోతుంది... ఇన్నేళ్ళ వంటరితనం - సూన్యం తరువాత, "ఆశిం"చిన జీవితం "సూన్యం" అని తెలుసుకున్న తరువాత, వచ్చే మొట్ట మొదటి ఆలోచనే కదా ఇది...

ఈ ఆలోచన నన్ను కలచివేసింది...
సైకాలజిస్ట్ గా ఇంకో ఆరు నెలల తరువాత మొదలెట్టే నా ప్రాక్టీస్, కాస్త ప్రీపోండ్ చేసుకుందాం అని నిర్ణయించుకున్నాను... నా మొదటి ట్రీట్మెంట్ "ఆశ"తోనే మొదలు... ఆశలో భావోద్వేగాలు కలిగించడం, అన్నీ భావోద్వేకాలు ఒకేసారి చవి చూసిన ఆశ కుప్ప కూలకుండా, దాన్ని మామూలు మనిషిని చెయ్యడం, దానికేం కావాలో, అదెలా ఉండాలో, స్వంతంగా నిర్ణయించుకుని, ఆచరించేలా దానికి సపోర్ట్ ఇవ్వడం, నా ట్రీట్మెంట్ లో మొదటి దశ...

మరి రెండవది?
దానికి సపోర్ట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు... బట్, అదీ మనిషే అని రియలైజ్ అయ్యేందుకు, దానికి హర్డిల్ గా మారకుండా ఉండేందుకు, ఆంటీ - అంకుల్ కి ట్రీట్మెంట్... పిల్లల గురించి అస్సలు ఆలోచించకపోవడం కన్నా, అతిగా ఆలోచించి వారి శ్వాసను కూడా నిర్దేసించాలనుకోవడం, పాము తన పిల్లలని తానే తినడం కన్నా ఘోరం అని అంటీ - అంకుల్ కి అర్ధం అయ్యేలా చెయ్యడం... వీరి "కట్టడి" ఆశ కి ఉరి అని తెలుసుకున్న తరువాత, తల్లి - తండ్రులు గా, వ్యక్తులుగా నీరుకారిపోకుండా, వీరి ఆలోచనల్ని పునర్నిర్మించుకునేలా అండగా ఉందామనీ నిర్ణయించుకున్నాను...

చివరి దశ?
ఆశ జీవితంలో అన్ని భావోద్వేగాలు అనుభవించడం, దానికొచ్చే సమస్యలని సాల్వ్ చేసుకోవడం, నేను చూడాలి... "శూన్యం" వదిలిన ఆశ, భవిష్యత్తులో నాకు రాబొయ్యే "శూన్యాన్ని" కూడా సమాధానపరచగలగాలి...

"ఇదంతా జరిగేపనేనా? నా అడుగు ఎక్కడి నుంచి, ఎలా మొదలెట్టాలి?" అన్న ఆలోచన కంటే, "మంచి జరగాలనే తాపత్రయానికి ప్రతీ సంఘటనా అనుకూలంగా మారుతుంద"నే నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది...

నా తొలి అడుగు, ఆశ వైపు...
మీరూ మీ జీవితంలో ఉన్న "నిరాశలని" తొలగించుకుని, మీకు తెలిసిన, ఇటువంటి "ఆశ" ల జీవితం అర్ధంతరంగా ఆగిపోకుండా, అర్ధవంతంగా మారేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నా!

 

By: Sunayana

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New year  New year eve  Hope  Hope new morings  

Other Articles