తాను తప్పు చేసుంటే ఎప్పుడో జైల్లో పెట్టేవారు అని కెసిఆర్, సిబిఐ దర్యాప్తుకు స్వాగతిస్తున్నామని హరీష్ రావు, సిబిఐ దర్యాప్తుకు సహకరిస్తామని విజయశాంతి అంటున్నా, సిబిఐ దర్యాప్తు వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగిస్తుందన్నది వాస్తవం. అడిగేవాళ్ళకి చెప్పేవాళ్ళు లోకువని, తరచి తరచి అడిగి మూలాలలోకి పోవాలనుకునే సిబిఐ విచారణ నిత్యకృత్యాలలో బాధ కలిగిస్తాయన్నది మాత్రం సత్యం.
ఉద్యమం పేరుతో అక్రమంగా ధనార్జన చేసారని, విజయశాంతి నివాసంలోనే 100 కోట్ల రూపాయలకు పైగా ఆర్ధిక లావాదేవీలు, సొమ్ము ఇచ్చి పుచ్చుకోవటాలు జరిగాయని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు రఘునందన్ ఆరోపణ చెయ్యటమే కాకుండా తన దగ్గరున్న సాక్ష్యాధారాలను సిబిఐ కి అప్పగించటంతో వాటి మీద దర్యాప్తు చేపట్టమని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది.
రాజకీయరంగంలో నిజంగా అంత ధనార్జన జరుగుతోందా? రాజకీయం లాభసాటి వ్యాపారంగా తయారైందా? తవ్వుకున్నవాళ్ళకు తవ్వుకున్నంత అన్నట్లుగా అంతులేని నిధులతో కూడిన గనిగా మారాయా మన దేశ రాజకీయాలు? అన్న ఈ ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానమే టక్ మని వస్తుంది.
అసలీ ఎన్నికలేమిటి, వోట్లేమిటి, అధికారం చేపట్టటమేమిటి, అధికారపక్షం ప్రతిపక్షాల మధ్య వైరమేమిటి అన్నవి ఆలోచిస్తే, మనం మన వ్యవస్థలో మౌలికమైన విషయం నుంచి ఎంత దూరం వెళ్ళిపోయామో అర్థమౌతుంది. ప్రజలకోసం, ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఆ విషయం మర్చిపోయి తమ స్వప్రయోజనం కోసమే రాజకీయమనే ఈ ఆటంతా అని అనుకుంటున్నారా అంటే అంతే కాదు, ప్రజలు కూడా అసలు విషయాన్ని మర్చిపోయి రాజకీయ చదరంగానికి అలవాటుపడిపోయి రాజకీయ నాయకులకు అనుగుణంగానే మసలుకుంటూ అదే సత్యమని తమకు తాము అర్థం చెప్పుకునే స్థితికి వచ్చారని అర్థమౌతోంది.
ఇంతింత డబ్బుని రాజకీయ నాయకులు వెదజల్లుతున్నారంటే అదంతా ప్రజాసేవ చెయ్యటానికి వాళ్ళు పడుతున్న తపన, అందుకు చేస్తున్న పోటీ అని చెప్తే నమ్మేవారెవరూ లేరీ కాలంలో.
డబ్బుని పెట్టుబడిగా పెట్టి దాన్ని లాభంతో సహా మళ్ళీ తిరిగి సంపాదించటానికి ఒక వ్యాపకాన్ని ఎన్నుకుని దానిలో పనిచెయ్యటమే వ్యాపారమంటే. ఒకప్పుడు కళాకారులు కళలను బ్రతికించటం కోసం బ్రతికేవారు. విద్యార్జనను ధనార్జన కోసం చేసేవారు కాదు. వైద్యం కూడా లాభాపేక్షతో చేసేవారు కాదు. న్యాయవాదులు కేవలం న్యాయాన్ని పరిరక్షించటం కోసం, నాయకులు కేవలం ప్రజలకు నాయకత్వం వహించి ముందుకు నడిపించటానికే చేసేవారు.
కానీ వాటన్నిటిలోనూ తేడాలు వచ్చాయి. ఏ వ్యాపకాన్ని తీసుకున్నా దానిలో లాభం ఉంటుందా లేదా అన్నదానికే ప్రాముఖ్యమిస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన దినసరి ఖర్చులు, ఎంత కొన్నా ఇంకా కొనాల్సినవి మిగిలిపోయినవే ఎక్కువగా ఉండే ఆకర్షణీయమైన అంగడి సరుకులు, సౌకర్యాలు, విలాసవస్తువులు మనిషిని ఏ పనిలో ఉన్నా లాభపేక్షతో పనిచెయ్యటానికే మనిషిని పురిగొల్పుతున్నాయి. అందులో తప్పు కూడా లేదు. అందుకే రాజకీయం కూడా లాభసాటి వ్యాపారంగా తీసుకుని కోట్లలో పెట్టుబడి గుమ్మరించి ప్రజాప్రాతినిధ్యం అనే పేరు గల హోదాను సంపాదిద్దామనుకునే రాజకీయరంగ వ్యాపారుల ప్రయాసలు ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు. అంతంత డబ్బుని పందెంలో కాసేవారు గెలవటం కోసం తప్పక పాటుపడతారన్నది అందరూ నమ్ముతున్న, జీవితంలో భాగంగా తీసుకున్న విషయం.
ప్రభుత్వంలో పాలు పంచుకున్నవారు ప్రజా సంక్షేమంలో పని చెయ్యాలని ఆశిస్తాం. ముందు చూపుతో రాబోయే తరం వారు కూడా ఆ ఫలాలను అందుకోవాలనే తపనతో వ్యూహరచన చేసేవారే కానీ తమ లాభం కోసం అధికారం చేపట్టటానికి కాదని అనుకుంటాం. అందువలన మేధావులు, కార్యదీక్ష కలవారు నాయకత్వాన్ని వహించాలని కోరుకుంటాం.
ఈ ఆలోచన ఇప్పుడేదో కెసిఆర్, హరీష్ రావు, విజయశాంతి మీద దర్యాప్తుకి రావటం వలన కలిగింది కాదు. ఆ వార్త ఈ విషయాన్ని తరచి చూసేట్టుగా చేసింది.
ప్రభుత్వాధికారాలను చేపట్టటం వలన వ్యాపార ప్రయోజనం ఎలా కలుగుతుంది అని ఎవరూ అమాయకంగా ప్రశ్నించరు. పూర్తి వివరాలతో తెలియకపోయినా ఎన్నికలకూ ఎన్నికలకూ పెరిగిపోతున్న వ్యక్తిగత ఆస్తులను పరిశీలిస్తే ప్రకటించని ఆస్తులు, బినామీలు, లెక్కలేని రికార్డ్ లోకి రాని ఖర్చులు గురించి అంచనాలు వెయ్యటం కష్టమేమీ కాదు. వ్యాపార లక్షణంగలవాళ్ళే వ్యాపారంలో రాణించగలరు కాబట్టి వ్యాపారస్తులే పెట్టుబడిగా డబ్బు వెదజల్లుతూ రాజకీయరంగంలో రాణిస్తున్నారు, కొత్తవారు ప్రవేశిస్తున్నారు.
ఆదాయ వనరుల ఎక్కడున్నాయంటే అది రాజకీయాన్ని నడిపించేవారికే పూర్తిగా తెలుసు కానీ కొంత మనం సామాన్యమైన అవగాహనతో ఊహాత్మకంగా తెలుసుకోవచ్చు.
పార్టీని స్థాపించిన దగ్గర్నుంచే ఆదాయం మొదలవుతుంది. కాకపోతే దాన్ని ప్రజాదరణ కలిగే విధంగా ముందుకు తీసుకెళ్ళవలసి వుంటుంది. పార్టీకి అభిమానులు తయారవుతున్నారూ అంటే వ్యాపారంలో వినియోగదారులు (కస్టమర్లు) పెరిగిపోతున్నట్లే. కస్టమర్ల సౌకర్యం కోసం వ్యాపారం నడుపుతున్నట్లే మాట్లాడుతారు, వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయని పైకి చెప్తారు, ఒక టైమంటూ లేకుండా ప్రతి క్షణం వ్యాపారంలో నిమగ్నమైవుంటారు, వినియోగదార్ల సంక్షేమమే వారి ఆశయం, జీవిత లక్ష్యమన్నట్లుగా మాట్లాడుతారు. ఏదో కొంత అవసరమైన లాభశాతం కంటే ఎక్కువగా వారిమీద రుద్దటం లేదన్నట్లుగానూ, నిజాయితీగా పనిచేస్తున్నట్లుగానూ నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. రాజకీయంలోకి వచ్చినవారు కూడా అంతే. ప్రజల కోసమే తాము బ్రతుకుతున్నట్లుగానూ, ప్రజాసంక్షేమమే వారి ప్రధాన లక్ష్యంగానూ చెప్పుకొస్తారు.
అప్పుడప్పుడూ వేరే దుకాణంలోకి పోవటం చూసినప్పుడు వినియోగదారులను హెచ్చరించే వ్యాపారులు, అవతలి వాళ్ళ దగ్గర సరుకు నాణ్యమైనది కాదనో, దొంగ సరుకనో, తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ లాభాలను సంపాదిస్తున్నారనో చెప్తుంటారు. అలాగే రాజకీయ పార్టీలలో కూడా ఇతర పార్టీల వాళ్ళని విమర్శించటంతో ప్రజలు అటువంటి వారి బారిన పడి మోసపోకుండా వాళ్ళను రక్షిస్తున్నట్లుగా మాట్లాడుతారు. అందువలన తమ గురించి చెప్పటమే కాకుండా అవతలి పార్టీవాళ్ళని విమర్శించటానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు.
మనదేశంలో రాజకీయాన్ని వ్యాపారంగా తీసుకుంటున్నారన్నది తేటతెల్లంగా తెలుస్తూనేవుంది కాబట్టి ఇంకా ఎక్కువగా దీన్ని విశదీకరించటం కూడా అనవసరమైన శ్రమేమో. ఎందరో వ్యాపారవేత్తలు, అందరికీ వందనములు అని త్యాగరాజ కృతిగా పాడుకుంటున్నారు మన ప్రజానీకం.
కాస్త జనాదరణ పెరగగానే పార్టీ టికెట్ ఇవ్వటంతో మొదలవుతుంది రాజకీయ వ్యాపారం. ఎమ్మెల్సీలకు, ఉద్యోగాలలో భర్తీలు, బదలాయింపులు, ఆదాయ వనరులున్న ప్రభుత్వ రంగ సంస్థల మీద అధికారాన్ని అప్పగించటానికి, ప్రభుత్వం తరఫునుంచి చేసే ప్రతి పనికి అవసరమైన కాంట్రాక్ట్ లలో తమ వంతు వాటాలకు, ప్రభుత్వ పథకాల అమలులోను, ఇలా ప్రతి పనిలోనూ చేతివాటం చూపించగలిగినవారికి చూపించినంత. ఏపిఐఐసి అధికారం చిక్కినవాళ్ళు జాగాలను సంపాదించుకున్నట్లుగానే ఆయా అధికారాలను సంపాదించటానికి ముందు డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ తర్వాత వివిధ రూపాలలో పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించటానికి ప్రయత్నం చేస్తున్నారూ అంటే అది సహజమే అనిపిస్తుంది. కాబట్టి అసలు ముందు వాళ్ళ దగ్గర్నుంచి అంతంత డబ్బు వసూలు చేయటమే ఆ నేరాలకు మూలమౌతోంది, కారణమోతోంది.
ఇలా విషవలయంలో డబ్బు కుమ్మరించటం, ఆదాయ వనరులను చేపట్టటం, అందులోంచి డబ్బుని తిరిగి సంపాదించటం ఇలా రాజకీయ రంగంలో డబ్బు పాత్ర ఎక్కువవటం వలనే వ్యాపార ధోరణి ఇందులో ఎక్కువైపోయింది. కోన్ బనేగా కరోడ్ పతి లాంటి టివి కార్యక్రమాలను వదిలిపెడ్తే, ఒక వ్యక్తి నిజాయితీగా ఒక కోటి రూపాయలను సంపాదించాలంటే, ఎంత శ్రమ పడాల్సి వస్తుంది, ఎంత సమయం పడుతుంది. కానీ రాజకీయ రంగంలో ఇట్టే ఎదిగిపోతుంటారు. వాళ్ళ చుట్టూ వుండి వాళ్ళ వలన లబ్ధి పొందినవారు, ఆ కృతజ్ఞతను చూపించటం కోసం కానీ లేదా ఇంకా లబ్ధి పొందవచ్చనే ఆశవలన కానీ వాళ్ళకి మద్దతునిస్తుంటారు.
ఈవిధంగా ఆర్థిక విషవలయం దేశ ఆర్థిక వ్యవస్తను కఠినంగా కాలరాస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం కాని, అంతర్జాతీయంగా రూపాయి విలువ పడిపోవటం కానీ, లేదా విదేశీ పెట్టుబడి దారులు వెనకాడటం కాని చూస్తుంటే ఇదంతా పైన చెప్పుకున్న విషవలయం ప్రభావం వలనేనని తెలుస్తోంది. సమాజంలో ఇది పూర్తిగా వ్యాపించి ఎక్కడికక్కడ వేళ్లూనటంతో దీన్ని ఎక్కడ ఆపాలన్నది ఎవరికీ తెలియకుండా ఉంది.
ప్రజా సేవ అంటూ ఎంత పెద్ద పెద్ద పదాలతో వర్ణించినా కానీ ధనం లేకపోతే చెయ్యగలిగే వ్యాపకం కాదీ రాజకీయ వ్యాపారం. దీనికి మరి మార్గాంతరమే లేదా అంటే అది ప్రజా చైతన్యంతో వస్తుంది. పోనీలే ఎవరు నాయకులైతే మనకేమిటి అనే ధోరణి మారిపోయినప్పుడు వస్తుంది. పార్టీ వ్యవస్ధలో కాకుండా సేవ చేసే ధోరణిగల వ్యక్తులను గుర్తించి వారికి అధికారాన్ని కట్టబెట్టటం ద్వారా క్రమక్రమంగా ఈ ధోరణి మారిపోవలసిందే కానీ ఒక్కసారిగా ఒక్క మనిషి వలన ఈ అవినీతంతా అంతరించి పోదు.
ఇందులో ఇంత లాభం ఉండబట్టే కోట్లల్లో డబ్బుని గుమ్మరించటానికి కానీ, హింసాత్మక చర్యలకు పాల్పడటానికి కానీ, ప్రత్యర్థుల మీద విమర్శలను గుప్పించటానికి కానీ వెనకాడటం లేదు పెట్టుబడి పెట్టి పోటీలో పాల్గొంటున్న రాజకీయవేత్తలు.
పాద యాత్రలు, దీక్షలు, ర్యాలీలు అన్నవి పూర్వకాలంలో లాగా గాంధీ యుగంలో లాగా ఎవరికివారు స్వచ్ఛందంగా పాల్గొనేవి కావు. జనసమీకరణ చెయ్యాలి, వారి మీద ఖర్చు పెట్టాలి, వేదికలను అలంకరించాలి, ఇలా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదంతా తిరిగి వసూలు చేసుకోవాలి కదా. అందుకు మార్గం దేన్ని ఎంచుకున్నా అది అవినీతి మార్గం కాకుండా అయితే పోదు. దీని వలన ప్రజానీకానికేదో చిన్న చిన్న పథకాలు లాభాలు, తాత్కాలిక ఉపశమనాలు కనిపించినా ఈ రాజకీయ వ్యాపార సరళి దేశ ఆర్థిక వ్యవస్థను కర్కశంగా ఛిద్రం చేస్తోంది.
ఎవరు ఎంత సంపాదించారన్నది నిక్కచ్చిగా తెలియకపోయినా, వాళ్ళకే లెక్క తెలియనంత ఎడాపెడా సంపాదిస్తారు మన రాజకీయ నాయకులు అనే అభిప్రాయం బలంగా ఉండబట్టే, ఎన్నికల సమయంలో డబ్బు, వస్తువులను పంపిణీ చేసేటప్పడు వాటిని తీసుకోవటానికి ఎవరూ సంశయించటం లేదు.
అలా అందరూ వారి వారి స్థాయిల్లో రాజకీయ విషవలయంలో చిక్కుకుని అవినీతికి యధోచితంగా పాలుపంచుకుంటున్నారన్నది ఆలోచిస్తే ఈ ఊబిలోంచి ఎప్పుడు బయటపడతామా అనిపిస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more