గురువింద గింజ కిందో నల్లని మచ్చ ఉంటుంది. అది దానికి తప్ప అందరికీ కనపడుతుంది. అది దానికి కనపడదు కాబట్టి ఆ గురువింద తనలో ఎటువంటి మచ్చా లేదనుకుంటుంది. అందువలన అందరినీ తప్పుపడుతుంటుంది.
నిజంగా గురువింద గింజ అలా చేస్తుందని కాదు కానీ ఉదాహరణగా, తన తప్పులెరుగక, ఇతరులను తప్పుపట్టేవారి విషయంలో అలా గురువిందతో పోల్చి చెప్తుంటారు. మిగతా రంగాలలో కూడా కొద్దో గొప్పో కనిపించినా, రాజకీయ రంగంలో మాత్రం ఈ వైఖరి బాగా కనిపిస్తుంది.
డబ్బు లేనివారు రాజకీయాలలోకి రాలేరన్న విషయం చెప్పటానికి రాజకీయాలలో పెద్ద అనుభవం అవసరం లేదు. "ఔను!" అంటారు ఎవరికైనా చెప్తే- ఇందులో ప్రత్యేకంగా చెప్పటానికి ఏముందన్నట్లుగా! మన దేశంలో అతి పెద్ద వ్యాపారం రాజకీయమే. చెప్పుకోవటానికి ప్రజాస్వామ్యమే కాని, వాస్తవానికి మన దేశంలో నడుస్తున్నది రాజకీయ వ్యాపారమే!
వ్యాపారంలో సిండికేట్లు ఉన్నట్లుగా రాజకీయ పార్టీలున్నాయి. ఏ పార్టీకి ప్రాబల్యం ఎక్కువగా ఉంటే ఆ పార్టీ తరఫున పోటీ చెయ్యాలంటే ఆ పార్టీ టికెట్ ని కొనుక్కోవలసిందే కానీ, అది ఫ్రీ పాస్ మాత్రం కాదు.
రాజకీయ అనుభవం లేకుండా కేవలం సిద్ధాంతాలను నమ్ముకుని ప్రజలకు ఏదో చేసేద్దామని వచ్చిన పార్టీలు కాస్త జనాదరణ పొందుతున్నాయని తెలిస్తే చాలు వాటి మీద బురద చల్లటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు అంతకు ముందునుంచే రాజకీయ బరిలో ఉన్న పార్టీలు.
ఉదాహరణకు ప్రజారాజ్యం పార్టీ రాగానే పార్టీ టికెట్ ఇవ్వటానికి కోట్లలో వసూలు చేస్తోందనే ప్రచారం సాగింది. ఆ పార్టీ డబ్బు తీసుకుందా లేదా అన్నది తెలిసింది ఇద్దరికే- ఆ పార్టీకి, దేవుడికి. దేవుడా చెప్పలేడు, పార్టీ చెప్పదు. కానీ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళను పంపించి ప్రజారాజ్యం పార్టీ డబ్బులు వసూలు చేస్తోందన్న మాటను ప్రచారం చెయ్యటం వలన ఆ పార్టీ మీద మచ్చ పడుతుందని తెలుసు. అదే మచ్చను అలా ప్రచారం చేసిన పార్టీ ఎన్నో సంవత్సరాలుగా మోసుకుంటూ తిరుగుతున్నా, గురువింద మాదిరిగానే తన మచ్చను విస్మరించి ఇతరులలో మచ్చలను వెదికి, లేకపోతే ఒక పచ్చబొట్టు వేసి మరీ మచ్చగా చూపించటం జరుగుతుంది.
పార్టీ టికెట్ ఇవ్వటానికి పార్టీలు డబ్బులు తీసుకుంటున్నాయా లేదా అన్నది చూస్తే డబ్బులున్న వ్యాపారస్తులకే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించటమన్నది మనం చూస్తూనేవున్నాం. ఎన్నికలలో పోటీకి నిజానికి ఎవరు నిలబడాలి? ప్రజా సేవచేసే దృక్పథం, అందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలు, అవగాహన, ప్రతిభ, ఓపిక, సమయం, మొక్కవోని పట్టుదల ఉన్నవాళ్ళు. అంతేకానీ, ఆ ప్రదేశానికే చెందనివారు, విదేశాలలో ఉన్నవారు, దేశపటంలో కూడా ఆ ప్రదేశాన్ని ఎన్నడూ చూడనివారు, ప్రజాసేవంటే ఏమిటో తెలియనివారు కాదు!
ఎక్కడో కాలిఫోర్నియాలో రెస్టారెంట్ నడుపుతున్న వ్యాపారిని పిలిచి విజయవాడ టికెట్ ఇవ్వటానికి సిద్ధపడ్డ పార్టీని ఏమనాలి? ఆ వ్యాపారికి తెలిసింది ఒకటే- వ్యాపారం చెయ్యటం. అందుకు ఒక ఎంపి సీటు కోసం 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టగలగటం ఆయనకున్న అర్హత! గుంటూరు వ్యాపారికి పోనీ నర్సారావు పేట టికెట్ ఇచ్చినా కాస్త అర్థముంది కానీ మరీ దేశంలోనే లేని మనిషి తనకిచ్చిన నియోజకవర్గానికి ఏం చెయ్యగలుగుతాడు? చిత్తూరులోని వాళ్ళకి గుంటూరులో టికెట్ ఇస్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? టెక్సాస్ లో ఉన్న డాక్టర్ ని టికెట్ ఇస్తానని పిలవటం ఏమిటి, అసలెందుకు అంటే పార్టీకి కావలసింది పెట్టుబడి పెట్టగల స్తోమతుగలవాడాయన.
ఎన్నికల సందర్బంగా నిఘాలో రవాణా చేస్తూ దేశం మొత్తంలో పట్టుబడ్డ డబ్బులో అధిక భాగం మన రాష్ట్రంలోనే అంటే మరీ మనవాళ్ళు తెలివితక్కువ వాళ్ళని, అందుకే పట్టుబడ్డారని కాదు! పట్టుబడ్డ 150 కోట్లకు ఎన్నో రెట్లు పట్టుబడకుండా తరలించి వుంటారు! ఒక్కోసారి డబ్బుని ఒకదారిలో తరలించాలంటే కావాలని తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరోదారిలో తక్కువ డబ్బుని పట్టుకునేట్టుగా కూడా చెయ్యగల సమర్థులు! అందుకు ఆధారం లేకపోయినా పోనీ 150 కోట్లే రవాణా అయ్యాయి, అవే పట్టుబడ్డాయని అనుకున్నా, అంత డబ్బు పంపిణీ చెయ్యవలసిన అవసరం ఏమొచ్చింది? ఏం చేసుకుంటారా డబ్బంతా? పార్టీ పటిష్టమౌతుంది. పార్టీ ప్రచార ఖర్చులకు పనికివస్తుంది. ఒకవేళ అధికారంలోకి రాకపోతే మరో ఒకటో రెండో టెన్యూర్లు అంటే 10 సంవత్సరాల కాలం సరిపడా డబ్బు ఉంటే, అవకాశం కోసం ఎదురు చూసి మళ్ళీ అధికారంలోకి రావొచ్చు! లేదంటే, డబ్బు లేకపోతే, పార్టీ కుదేలైపోతుంది మరి!
అన్ని కోట్ల డబ్బుతో ఎంతో ప్రజాసేవ చెయ్యవచ్చు. ఆంబులెన్స సర్వీస్ లాంటిది ఐదు సంవత్సరాలు నడపవచ్చు. కానీ అలా చెయ్యకుండా ఎన్నికల కోసమే ఖర్చుపెడుతున్నారంటే అందుకు ఎన్నో రెట్లు వసూలు చేసుకోవటం కోసమే కదా! అదే కదా వ్యాపారి లక్షణం! అప్పుడే కదా అది పెట్టుబడి అనిపించుకునేది!
అంటే, వ్యాపారస్తులే రాజకీయాలలో ఎదగగలరు, అధికారాన్ని సంపాదించుకోగలరు. అది ఎందుకంటే తమ తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవటానికే! పార్టీ టికెట్ ఇవ్వనందుకు పార్టీ కార్యాలయం ముందు, అధినాయకుల ఇళ్ళ ముందు రాద్ధాంతం చేస్తున్నారంటే అదంతా ప్రజాసేవ చెయ్యటానికి అవకాశం ఇవ్వనందుకని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత అమాయకులు భూప్రపంచంలో ఎవరూ ఉండరు!
సరే, డబ్బులు తీసుకుంటున్నారు. అయితే వాటి వినియోగం మాటేమిటి? వాటిలో కొంతభాగం వోటర్లను ప్రలోభ పెట్టటానికి, డబ్బుల రూపంలో కానీ, లేదూ అది చాలా లేకిగా ఉంటుందనుకుంటే బహుమానాల రూపంలో, ఎక్కువగా మహిళలను ఆకర్షించే చీరెలు, గాజులు, బొట్టు బిళ్ళలు, మిక్సీలు, కుక్కర్లు ఇలాంటివి ఇవ్వటానికి పనికి వస్తుంది. అందులో ఒకరిద్దరు తీసుకోవటానికి ఇష్టపడకపోయినా తేడా ఏమీ రాదు కనుక, తీసుకోకుండా ఇతరుల దృష్టిలో పిచ్చివాళ్ళుగా కనపడకుండా ఉండటం కోసమైనా ఆ వస్తువులను తీసుకెళ్తారు. అమ్మ అని అక్క అని బాబాయి అని పిలుస్తూ వాళ్ళకి బహుమానాల రూపంలో ఇచ్చిన తర్వాత భారతీయులకు చాలా సెంటిమెంట్లు ఎక్కువ కదా, ఉప్పు తిన్న విశ్వాసమంటే నిజంగా ఉప్పు తినటమే కాదు డబ్బు పుచ్చుకున్నా, వాళ్ళ దగ్గర మందు పుచ్చుకున్నా, గృహోపకరణాలను పొందినా ఆ విశ్వాసాన్ని వోట్ల రూపంలో తప్పక చూపిస్తారని రాజకీయ వేత్తలకు బాగా తెలుసు.
ఇంత వరకు అర్థమౌతూనేవుంది. "మరి అలా పెట్టుబడిగా పెట్టిన డబ్బుని మళ్ళీ ఎలా వసూలు చేస్తారు?" అని ఎవరూ అడగరు. ఎందుకంటే, ఇంత వరకు అర్థమైనవాళ్ళకి ఆ డబ్బుని రాజకీయవేత్త ఎలా తిరిగి సంపాదించుకుంటాడన్నది అర్థం చేసుకోవటానికి పెద్ద విశ్లేషకులవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి పథకాలెందుకుంటాయి, నియోజకవర్గాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు ఎందుకు చేపడతారు?
అసలు ఇదేమీ చెయ్యకుండానే బ్యాంక్ లో వేసుకున్నా ఐదు సంవత్సారాలలో ఆ డబ్బు ఎంత పెరుగుతుంది? అయినా అది కాదని రాజకీయాలలో పెట్టుబడి పెడుతున్నారంటే ఆ వ్యాపారస్తులు తమ పెట్టుబడికి కనీసం రెట్టింపైనా ఆశిస్తున్నట్లే కదా!
తామెంతో నిజాయితీ పరుడిగా పనిచేసే నాయకుడిగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కూడా డబ్బు పెట్టగలిగే వాళ్ళకే అవకాశం ఇవ్వటం, మిస్టర్ క్లీన్, మిస్టర్ స్కాలర్ గా పేరు తెచ్చుకున్న లోక్ సత్తా పార్టీలో నాయకుడు ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్ లో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ పట్టుబడటం, ప్రజాహితంలో ఉద్యమం చేస్తున్న నాయకుడు పార్టీలో సంపాదించిన డబ్బును వ్యవసాయంలో వచ్చినట్లుగా చూపించటం ఇవన్నీ చూస్తుంటే రాజకీయాలు ఆకర్షణీయమైన, అత్యంత లాభసాటైన, వ్యాపారాలని, అంతేకాకుండా అధికారం కూడా చేతిలో ఉంటే వారి ఇతర వ్యాపారాలకు కూడా ఢోకా ఉండదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రైల్లో రిజర్వేషన్ దొరక్కపోతే ప్రయాణం సౌకర్యంగా ఉండదనే కాదు, వినోదం కోసం చూడదలచుకున్న సినిమా టికెట్ దొరక్కపోయినా సరే, బ్లాక్ లో కొని చూసే అలవాటున్న మన దేశంలో పార్టీ టికెట్ కి బారులు తీరివున్నారని తెలిస్తే "అతని కంటే నేను ఎక్కువిస్తాను" అని వందకోట్ల వరకు ఇవ్వటానికి సిద్ధపడ్డవారున్నారని వార్తలలోనే, ఎన్నికల కమిషన్ నుంచే వచ్చిన సమాచారం!
ఇక్కడ తీసుకున్న దృష్టాంతరాలు కొన్నే కానీ, ఇలాంటివి ప్రతిరోజూ ఎన్నో వార్తల్లో చూస్తుంటాం కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమీ లేదు, కేవలం డబ్బే అంతా నడిపిస్తుంది.
లక్ష్మీ కటాక్షమే లక్ష్యంగా ప్రజాసేవ అనే మడిపంచె కట్టుకుని, చిన్న చిన్న పూజాద్రవ్యాలతో పెద్ద పెద్ద కోరికలను తీర్చుకునే దిశగా చేసే రాజకీయ అర్చనే ఈ ప్రజాస్వామ్యమని చెప్పుకునే పూజా కార్యక్రమంలో జరుగుతున్న తంతు.
ఇక్కడ చెయ్యగలిగినవి రెండే. ఒకటి దీనికి ప్రజాస్వామ్యం అనే పేరు మార్చి మరో పేరేదైనా పెట్టుకోవటం, లేదా రెండవది ప్రజాస్వామ్య పద్ధతిలో నడపగల నాయకుడు రావటం. అలాంటి నాయకుడు వచ్చినా రాజకీయ వ్యాపారస్తులు అలాంటివారిని రానిస్తారా? తమ ఆదాయానికి గండికొట్టటానికి వస్తున్నానని ప్రకటించుకుంటూ వస్తున్నతన్ని గెలవనిస్తారా? ఎంతమాత్రం చెయ్యరు సరికదా తమకున్న బురదని అతనికీ కొంత రాసి అతని బురదనే ఎత్తి చూపిస్తారు బాహాటంగా.
చెయ్యి అటు చూపించేసరికి, టివి కేమెరాలు కూడా అటే తిరుగుతాయి, లైటింగ్ కూడా వాళ్ళ మీదనే పడుతుంది కాబట్టి వేలెత్తి చూపించినవారి కింద ఉన్న గురివిందకుండే చిన్న మచ్చలాంటిది కాదు పెద్ద బురద, రొచ్చు, ఊబిలాంటి అంతు తెలియని లోతున్నవి కూడా కనపడవు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more