Telangana | Police | Weapons | Nalgonda

Telangana govt move to supply weapons to the police on nalgonda incident

nalgonda, police, innovas, telangana, kcr, suryapet, encounter, simi, terrorist, attacks,

telangana govt move to supply weapons to the police on nalgonda incident. telanagana cm kcr already distributed innovas and new vehicles to police. On the nalgonda oncident govt propose to supply latest wapons to the police.

తెలంగాణ పోలీసులకు అప్పుడు ఇన్నోవాలు.. ఇప్పుడిక ఆయుధాలు..!

Posted: 04/07/2015 08:48 AM IST
Telangana govt move to supply weapons to the police on nalgonda incident

నల్లగొండ జిల్లా ఎన్‌కౌంటర్ ఘటనలో పోలీసుల వద్దనున్న తుపాకులు రెండుసార్లు మోరాయించాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనికితోడూ జిల్లాలో చాలా ఠాణాల్లో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐల వద్ద షార్ట్ గన్, గన్‌మెన్‌ల వద్ద కార్బైన్‌లు వినా ఆయుధాలు లేవని తేలింది. దీనిపైనా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు కొత్త వాహనాలు అందించినా, ఆయుధాలు మాత్రం పాతకాలం నాటివే ఉన్నాయి. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉండటం, పోలీసుల వద్ద పాతకాలం నాటి తుపాకులు ఉండటంతో నల్లగొండ జిల్లాలో ముష్కరుల చేతిలో ముగ్గురు పోలీసులు బలయ్యారని ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరపాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అందులో పోలీస్ వ్యవస్థ, శిక్షణలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడంతోపాటు అత్యాధునిక ఆయుధాలు అందించాలనే అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఈ సమీక్ష అనంతరం ప్రధానంగా పోలీస్ శాఖకు ఆధునిక ఆయుధాలు అందించే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

నల్లగొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల హల్‌చల్, ఎన్‌కౌంటర్ ఘటనలు రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై చర్చకు దారి తీస్తున్నాయి. మరోపక్క పోలీసుల వద్ద అత్యాధునిక ఆయుధాలు లేకపోవడం వల్లే ముగ్గురు కానిస్టేబుళ్లు ఉగ్రవాదుల చేతిలో బలయ్యారన్న వాదనకూ బలం చేకూరుతోంది. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాలు, పెట్టుబడులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న వాదనా వినిపిస్తోంది. ఈ పరిణామాలను కెసిఆర్ సర్కారు సీరియస్‌గా తీసుకుంటోంది. ముఖ్యంగా పోలీస్ సంస్కరణలపై సిఎం కెసిఆర్ దృష్టి కేంద్రీకరించారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నల్లగొండ ఘటనతో ఉలిక్కిపడింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటన , రాష్ట్రావిర్భావం తర్వాత ఉగ్రవాద కదలికలు పెద్దగా బయటకు రాలేదు. కొద్దిరోజుల క్రితం ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ముందుగానే అరెస్ట్ చేయడం, తర్వాత మరో ఇద్దరు సిమీ సభ్యులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలు వినా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రవాద కదిలికలు కనిపించలేదు. రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండటం, శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించింది. హైదరాబాద్‌ను ‘సేఫ్ అండ్ స్మార్ట్’ విశ్వ నగరంగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ గతంలో ఎన్నడూలేని విధంగా పోలీస్ శాఖకు రూ.300 కోట్లు కేటాయించి కొత్త వాహనాలు కూడా అందించింది. ఇంతవరకు అంతా సజావుగానే సాగింది. ఇక పెట్టుబడులే తరువాయి అనుకున్న సమయంలో నల్లగొండ జిల్లాలో ఉగ్ర కదలికలు ప్రకంపనం సృష్టించాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా చెప్పుకున్న తరుణంలో జరిగిన ఈ సంఘటనలు ప్రభుత్వ ఆలోచనలు, పెట్టుబడులపై నీలినీడలు అలుముకునేలా చేశాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఉగ్రదాడులను కూడా తట్టుకునేలా పోలీసులకు అన్ని ఆయుధాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, కావాల్సిన ఆయుధాలను సమకూరుస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalgonda  police  innovas  telangana  kcr  suryapet  encounter  simi  terrorist  attacks  

Other Articles