రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ చేయడం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. తమ భూములను ఇవ్వమంటూ రైతులు తెగేసి చెబుతుండడంతో.. భూముల్ని ఎలా సేకరించాలో తెలియక ఆంధ్రప్రదేశ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాలోని కృష్ణా తీరానికి ఇరువైపులా రాజధాని నిర్మాణం చేపడతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కృష్ణా నదీ తీరం కొత్త వెలుగులు సంతరిచుకుంటుందని అందరు ఎదురుచూస్తున్నారు. మరికొద్ది కాలంలో విజయవాడ, గుంటూరు జిల్లాలల రూపు రేఖలు పూర్తిగా మారుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తొలి విడతలో 30 వేల ఎకరాలను సమీకరించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం.. ఈ నెలాఖరులో రెండో విడత కోసం గ్రామాలను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లోని 20కి పైగా గ్రామాల్లో 14 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రాజధాని సలహా కమిటీ హైదరాబాద్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో భూ సమీకరణకు ఆయా గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. అలాగే తుళ్లూరు, మంగళగిరి మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తమ కమిటీలో చోటు కల్పించే అంశం పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
రాజధాని నిర్మాణానికి రైతుల భూములను బలవంతంగా లాక్కోవటాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఒప్పించే అవసరమైన భూములను తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, రాజధాని నిర్మాణానికి సహకారంపై కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. రాజధాని నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూములు అవసరమవుతాయో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పారు
కృష్ణా నదిని ఆనుకుని పచ్చటి పొలాలతో, ప్రశాంత వాతావరణంలో వున్న వెంకటపాలెంలో సుమారు 4వేల జనాభా ఉంది. వీరందరికీ కలిపి దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి వుంది. 30 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరుపడుతుంది. దొండ, అరటి, పత్తి, మొక్కజొన్న, బెండ పంటలు ఏడాదిలో మూడుసార్లు పండించే బంగరు భూములు అవి. ఇతర ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే.. సంవత్సరం పొడువునా పొలం పనులు ఉండే ఈ గ్రామానికి కూలీలు వలస వచ్చి కడుపు నింపుకుంటుంటారు.
ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి వరసగా తొమ్మిదేళ్లు కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో కూడా ఈ గ్రామంలో కరువన్నది కనిపించలేదు. విశేషమేమిటంటే.. వెంకటపాలెంలో ఏ ఇంట్లో కూడా కొళాయి కనిపించదు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 అడుగుల లోతులోనే నీళ్లు పడుతున్నందువల్ల ప్రతి ఒక్కరూ బోరు వేసుకుని ఆ నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి విలువైన భూములు కావడం వల్లే గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మొత్తం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘మేం భూములివ్వం. రాజధాని కడితే మా బతుకులేం కావాలి. ఉన్నోళ్లంతా కలసి మా పొట్టకొడతారా? కాదూ కూడదు కడతామంటే మమ్మల్ని చంపి మా శవాలపై కట్టుకోవాల్సిందే..’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వెంకటపాలెం గ్రమాస్థులే కాదు.. రమారమి అన్ని గ్రామాల్లోనూ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
అయితే ముందుగా సేకరించాలని ప్రతిపాదించన 30 వేల ఎకరాల భూమిని రైతులు ఇవ్వడానికి సిద్దంగా లేరని సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటైన సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదే విషయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిహారం ఇస్తామన్న, 10 ఏళ్ల తరువాత భూములో కొంతభాగం తిరిగి చెల్లిస్తామని చెప్పినా.. రైతులు భూములివ్వడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. సభ్ కమిటీ కూడా ఇదే నిర్ణయాన్ని వెలువరిచడంతో సబ్ కమిటీ తీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజధాని నిర్మాణం కోసం సమీకరించాల్సిన భూమి విషయంలో రైతులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి చేరుకుందని సమాచారం.
ఈ నేపథ్యంలో మంగళగిరి తలపెట్టిన భూ సమీకరణ అంకంలో రైతులపై ఆంక్షల పర్వం మొదలు కానుంది. ఆంక్షల చట్రంలో ఇరికించైనా సరే ఆందోళన బాట పడుతున్న రైతులు సంఘటితం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తుల్ని మొదలుపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రాంతాలకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు ఒకరకంగా ప్రజాస్వామ్య విలువలకే తిలోదకాలివ్వబోతోంది. రైతులు భూ సమీకరణకు సహకరిస్తే సరే.. లేకుంటే బలవంతంగా భూములు లాక్కుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలైన గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో రైతులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించనుంది. రైతులు ఒకచోట సమావేశమవ్వాలన్నా, సభలు నిర్వహించుకోవాలన్నా.. ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, సంబంధిత తహశీల్దారు నుంచి తగిన అనుమతి పొందాలని పేర్కొంటూ రెవెన్యూ శాఖ ఒకటీ రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాజధాని నిర్మాణం సంకల్పించిన ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కల్పించడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమన్న అంశాల సాకుగా రైతులెవరూ బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేకుండా ఆదేశాలు ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తేసుకువచ్చైనా సరే భూములను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో రైతులు సమావేశాలు నిర్వహించుకుని తమ భూములు ఇచ్చేది లేదని తీర్మానాలు చేశారు. మందడం, మల్కాపురం, వెలగపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. కార్యాచరణ కోసం సన్నద్ధమవుతున్నారు. మందడం, ఉద్దండ్రాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాలలో రైతులు ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని భూములు ఇవ్వరాదని తీర్మానాలు చేసుకున్నారు. భూ సమీకరణపై గ్రామాల్లో అధికారుల సమావేశాల సందర్భంగా కొన్నిచోట్ల రైతులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భూముల్ని ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు. ఇదే క్రమంలో మహిళలు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఉద్యమం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో భూ సమీకరణకు ప్రతిపాదించగా.. ఇప్పటికే నిడమర్రు పంచాయతీ భూ సమీకరణకు వ్యతిరేకమని తీర్మానం చేసింది.
కురగల్లులో రైతుల్ని చైతన్య పరిచేందుకు రైతు సంఘాలు మూడుసార్లు సమావేశాలు నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాల్లోనూ రైతులు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని మరీ తమ నిరసన తెలుపుతున్నారు. భూ సమీకరణకు ప్రతిపాదించిన 17 గ్రామాల్లో ఇకపై ఎలాంటి పంటలు ఉండవని కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల చేసిన ప్రకటన రైతుల్లో మరింత గుబులు రేకెత్తించింది. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. టీడీపీ వైపు నుంచి ప్రభుత్వానికి ఒత్తిళ్ళు అధికమవుతున్నాయి. మిత్రపక్షమైన బీజేపీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దృష్య్టా రైతులపై నిషేధాజ్ఞలు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more