Andhra pradesh capital on the banks of krishna river in guntur

andhra pradesh, capital, banks of krishna river, guntur, government, 200 sqare kilometers land, cm chandra babu

andhra pradesh capital on the banks of krishna river in guntur, government decides to collect 200 sqare kilometers land

గుంటూరు కేంద్రంగా కృష్ణా తీరానికి వెలుగులు

Posted: 10/09/2014 08:20 AM IST
Andhra pradesh capital on the banks of krishna river in guntur

కృష్ణా నది తీరంలోనే వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కృష్ణా నది పైనున్న ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ వాటర్‌ని ఆనుకుని గుంటూరు జిల్లా పరిధిలో 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవు, 8-10 కిలోమీటర్ల వెడల్పున ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కానుంది. ముందుగా కృష్ణా జిల్లా విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని నిర్మాణం జరుగుతుందని భావించినా.. ఇప్పుడది పూర్తిగా గుంటూరు జిల్లా పరిధిలోనే ఉంటుంది. దీనికోసం 50వేల ఎకరాల భూమిని సమీకరించాల్సి వస్తుందని అంచనా.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు స్పష్టతను ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే రాజధాని ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. ప్రజా రాజధాని నిర్మాణానికి 4.93 కోట్ల మంది తెలుగువారు ఒక ఇటుక లేదా అంత ఖరీదయ్యే సాయం చేయాలని కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని అభివృద్ధి చేస్తామని, ఇందుకు ప్రజల సహకారం కోసం మరోసారి జిల్లాకు వస్తానని... గుంటూరు జిల్లా శ్యావల్యాపురంలో నిర్వహించిన గ్రామసభలో పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం కోసం మొత్తం 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూసమీకరణ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ చేపట్టాలని ఇందుకు మూడు హద్దలను కూడా నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. భూ సమీకరణకు ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్ నుంచి గుంటూరు జిల్లా వైపు ఒక హద్దుగా భావిస్తున్నారు. అక్కడి నుంచి దక్షిణం వైపు గుంటూరు జిల్లాలోకి 8-10 కిలోమీటర్ల దూరం వరకు భూమిని సమీకరిస్తారు. ఇది సుమారుగా మంగళగిరి ఆటోనగర్‌కి వెనకవైపు రావచ్చు. ఇది రెండో హద్దుగా ఉంటుంది. ఈ రెండో హద్దు నుంచి గుంటూరు జిల్లాలో పడమర దిక్కుగా 20-25 కిలోమీటర్ల దూరం వరకు భూమిని సమీకరిస్తారు. అంటే సుమారుగా దొండపాడు గ్రామం పరిసరాల్లో ఉంటుంది. ఇది ఒక చివర మూడో హద్దుగా ఉంటుంది. తిరిగి ఇక్కడి నుంచి కృష్ణా నది ఒడ్డు వరకు అంటే ఉత్తర దిక్కుగా 8-10 కిలోమీటర్ల దూరం వరకు భూమిని సమీకరిస్తారు.

ప్రకాశం బ్యారేజ్ దక్షిణ వైపు అంచున సీతానగరం అనుకుని భూమిని సమీకరించటం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం మినహాయించి అక్కడి నుంచి భూ సమీకరణ ప్రారంభించే అవకాశముంది. ఇలాంటప్పుడు రెండో హద్దు మంగళగిరి వెనకవైపు మరికాస్త దూరంగా ఉంటుంది. ఎలా సమీకరించినా 20-25 కిలోమీటర్ల పొడవున నదీతీరం వెంబడి, 8-10 కిలోమీటర్ల వెడల్పున రాజధాని ఉంటుంది. కృష్ణాజిల్లా పరిధిలోకొచ్చే బ్యారేజ్‌కి రెండోవైపునున్న ప్రాంతం కూడా రాజధానికి అనుసంధానమయ్యేలా రెండు, మూడుచోట్ల నాలుగు, ఆరు వరసల వంతెనలు నిర్మిస్తారు.

అదే సమయంలో కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం, ఇతర ద్వీపాలను ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తారు. మొత్తంగా నూతన రాజధాని అత్యంత సుందరమైనదిగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వాస్తుపరంగా కూడా అన్ని అనుకూలతలు చూసి రాజధాని ప్రాంతంపై చిన్న చిన్న మార్పులు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. రాజధాని లోపల ఒక ఇన్నర్‌రింగ్‌రోడ్డు సుమారు 75కిలోమీటర్ల పొడవున, రాజధాని చుట్టూ సుదీర్ఘమైన ఔటర్ రింగ్‌రోడ్డు రెండింటినీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మాణం నవ్వంగా సాగడంతో పాటు పర్యాటకంగా కూడా ఉండాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

 రాజధాని కోసం భూములిచ్చే రైతులకు ఒకపక్క అభివృద్ధి చేసిన భూమిలో వాటా ఇవ్వడంతో పాటు... మరోవైపు అక్కడ ఉన్న మార్కెట్ విలువ(రిజిస్ట్రేషన్ విలువ)ను కూడా చెల్లించాలని భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చే రైతులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదననూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. చదువుకున్నవారికి, చదువుకోకున్నా నైపుణ్యాలను మెరుగుపర్చే శిక్షణ ఇచ్చి ప్రతి ఇంటికి రాజధాని ప్రాంతంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని భావిస్తోంది. మొత్తంమీద రాజధాని నిర్మాణం కోసం సేకరించే భూ సమీకరణలో భాగస్వాములయ్యే రైతులందరికీ సంతృప్తికర ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

రాజధాని కోసం సమీకరించిన భూములను అభివృద్ధి చేసేందుకు ఏపీ రాజధాని అభివృద్ది అథారిటీని ఏర్పాటుచేయబోతోంది. ఈ అథారిటీ భూములను అభివృద్ధి చేయడానికి అయ్యే వ్యయాన్ని ప్రజలు, సంస్థల నుంచి సేకరిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా సేకరించిన నిధులతోనే భూములను అభివృద్ధి చేయించి... ప్రతిగా అభివృద్ధి చేసిన భూమిలో కొంత వాటాను ఇస్తే బాగుంటుందనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles