Anger makes one mad

anger makes one mad, angry man, Sri Krishna, Maha Bharat, Bhagavadgita, angry young man

anger makes one mad

కోపం వలన నష్టమే తప్ప మరేమీ ఉండదు

Posted: 01/24/2014 12:44 PM IST
Anger makes one mad

ఒక మనిషి ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవాడట.  ఏమండీ మీరెప్పుడూ నవ్వతూనేవుంటారు మీకు కోపం కాని బాధ కానీ రావా అని అడిగితే, నాకు చాలా బద్దకం సుమండీ అని జవాబిచ్చాడట ఆ నవ్వుతూ వుండే మనిషి.  అదేమిటి అని ఆశ్చర్యపోయాడట రెండవ మనిషి.  నవ్వినప్పుడు ముఖంలో నాలుగు కండరాలనే ఉపయోగిస్తాం, కానీ కోపంలోను దుఖ్ఖంలోను 16 కండరాలను ఉపయోగించవలసి వస్తుంది తెలుసా అని వివరణిచ్చాడట ఆనందాన్నే ఎల్లప్పుడే చిందించే మనిషి.

హాస్యరసంతో చెప్పిన విషయం బాగా గుర్తుంటుంది కనుక ఇలా అప్పుడప్పుడూ కొన్ని విషయాలను జోక్ లా తీసుకోవటం కూడా మంచిదే.  అయితే క్రోధం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునిడికి చాలా బాగా చెప్పాడు.  ఏదైనా ఆశించటమే క్రోధానికి మూలం.  ఆశించనిది జరగనప్పుడు క్రోధం వస్తుంది.  ఆ ఆశించింది ధన వస్తు లాభాలే కాకుండా ఇతరుల దగ్గర్నుంచి ఆశించే దాని వలన కూడా జరుగుతుంది. 

నిజం చెప్పాలంటే కోపం వచ్చేది మన మీద మనకే.  ఇతరుల మీద కాదు.  పొందవలసినది పొందలేదన్న మనస్తాపం క్రోధంలోకి మారుతుంది.  అందుకు కారణాలను బయట వెతుక్కుంటుంది మనసు.  కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపం వచ్చింది మనమీద మనకేనన్న సత్యాన్ని గుర్తు తెచ్చుకుంటే బయటివాళ్ళ మీదకు ఆ కోపం మళ్ళదు. 

అయితే కోపం వచ్చినప్పుడు మన మనసు మన నియంత్రణలో ఉండదు.  ఒకే విషయంలో పట్టుదలతో ఉంటుంది కానీ పూర్వాపరాలు, సత్యాసత్యాల ఆలోచన ఉండదు.  ఆడపిల్లల మీద యాసిడ్ మరి ఇతర దాడులు జరిగిన సంఘటనలు చూస్తే, తాను ఆ అమ్మాయి పొందు కోరుతూ అందుకు ఆ అమ్మాయి ఇష్టపడటం లేదని తెలిసినప్పుడు కలిగిన మనస్తాపం కోపం లోకి మారి, ఆసమయంలో విచక్షణా జ్ఞానం నశించటంతో మనసులో మెదిలే ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో, పర్యవసానం గురించి ఆలోచించకుండా హింసకు పాల్పడటమే మానసిక దౌర్బల్యం.

తాను ప్రేమించిన అమ్మాయి మీద కోపం ఎందుకు అని ఆలోచిస్తే తేలేది ఒక్కటే, తాను ప్రేమిస్తున్నాడు కనుక అని వస్తుంది.  తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకు ప్రతిగా ఆ అమ్మాయి కూడా తనను ప్రేమించాలనుకోవటం ఎంత అసమంజసమైనదో ఆ క్షణంలో దుర్బలమైన, నియంత్రణలేని మనసుకి తట్టకపోవటం వలనే ప్రతీకార చర్యకు పురిగొలపటం జరుగుతుంది.  ప్రేమాభిమానాలు, గౌరవ భావం అనేవి బలవంతంగా తీసుకునేవి కావు వాటిని సంపాదించుకోవాలన్న చిన్న సూత్రం కూడా ఆ సందర్భంలో గుర్తుకు రాకపోవటానికి కారణం, చెలరేగే క్రోధమే. 

ఉవ్వెత్తున లేచిన క్రోధం వలన ఇతరులకే కాదు తనకీ నష్టం జరుగుతుందన్న విషయం మనసుకి తట్టినట్లయితే అటువంటి ఘోరం జరుగదు కదా.  యాసిడ్ దాడిలో జీవితం కోల్పోవచ్చు, లేదా ఆ అమ్మాయి జీవితాంతం కురూపిగా బ్రతకాల్సిరావొచ్చు.  దానితో పాటు దాడికి పాల్పడ్డవాని జీవితం మాత్రం సుఖంగా సాగుతుందా. 

అన్నిటికన్నా మించి, తాను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ప్రేమ పక్కన ద్వేషానికి చోటే లేదే.  ఇంత చిన్న సూక్ష్మం కూడా ఆ సమయంలో గుర్తుకి రాదు.  అందుకే తన కోపమే తనకు శత్రువు అన్నారు నీతి సూత్రాలలో- నిజానికి కోపం వచ్చింది తనమీద తనకే కాబట్టి.

మన సినిమాలలో కోపం గొప్ప గుణంగా చూపిస్తూ, యాంగ్రీ యంగ్ మాన్ లాంటి మాటలతో క్రోధిని హీరో చేసిపెడుతున్నారు.  రాఖీ సినిమాలో, దయచేసి నన్ను హీరోని చెయ్యకండి అని ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది.  కానీ సినిమా అంతా కోపంతో ఊగిపోయే హీరో చివర్లో చెప్పిన ఆ మాటలను ఎవరూ పట్టించుకోరు.  ఎందుకంటే సినిమా అయిపోయింది కాబట్టి ఇంటికి పోవాలనే తొందరలో ఉంటారంతా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles