ఈమె గొంతుతో వెన్నెల్ని మన నట్టింట్లోనే విరగగాయించగలదు. వైజయంతిమాల నుంచి జీనత్ అమన్ మీదుగా ఊర్మిళా మటోండ్కర్‌ను దాటుకొని కరీనా కపూర్ దాకా ఎన్ని తరాలు మారినా కౌమారం దాటని గళం. ఫిలిం, పాప్, గజల్, ఖవ్వాలి, భజన, జానపదం, శాస్త్రీయ గీతాలు; సాంఘిక, పౌరాణిక, యాక్షన్, రొమాంటిక్, కుటుంబగాథ చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజీషోలతో ఆరు దశాబ్దాలుగా ప్రవహిస్తున్న స్వర నది. ఎనిమిది పదుల వయస్సులోకి అడుగుపెడుతున్న ‘పద్మవిభూషణ్ ’ ‘‘ఆశాభోంస్లే విషయాలు... విశేషాలు.
ప్రొఫైల్
పేరు : ఆశా భోంస్లే
జన్మదినం : సెప్టెంబర్ 8, 1933
జన్మస్థలం : సంగ్లీ (మహారాష్ట్ర)
తల్లిదండ్రులు : దీన్‌నాథ్ మంగేష్కర్,
విశిష్టత : 20 భాషల్లో 12,000 పైచిలుకు పాటలు పాడిన గాయని.
తొలి భర్త : గణపత్‌రావ్ భోంస్లే (భోంస్లేతో 1960లో విడిపోయాక,
సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ (1939-94)ను 1980లో వివాహమాడారు.
పురస్కారాలు : దాదాసాహెబ్ ఫాల్కే (2000), పద్మవిభూషణ్ (2008)నేను అందంగా ఉండను, కాబట్టి నటిని కాలేను. చదువుకోలేదు, కాబట్టి రచయిత్రిని కాలేను. నాకు తెలిసిందల్లా పాట. అదే నా బతుకుదెరువు. దాంతోనే నా జీవితాన్ని ఆరంభించాను.
మా రక్తంలోనే సంగీతం ఉంది :
మా నాన్న(దీన్‌నాథ్ మంగేష్కర్) సంగీతం కోసమే పుట్టిన మనిషి. చిన్నవయసులోనే సంగీతాన్ని అభ్యసించడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. సినిమా సంగీత దర్శకుడు కాకముందు, డ్రామా కంపెనీ నెలకొల్పారు. రెండు వందల మంది అందులో పనిచేసేవారు. అలా సంగీతం అనేది మా రక్తంలోనే ఉంది. అక్కలు లత, ఉష, చెల్లి మీనా, తమ్ముడు హృదయనాథ్; అందరం పాడేవాళ్లం. నాన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. నా తొమ్మిదేళ్లప్పుడే అకస్మాత్తుగా చనిపోయారు. దాంతో ఇంటిని నిలబెట్టుకోవడం కోసం అందరమూ పనిచేయాల్సి వచ్చింది. లత(మంగేష్కర్) దీదీ గాయని అయ్యింది.
లతక్క ఆటబొమ్మను...
అక్క నాకంటే నాలుగేళ్లు పెద్దది. నాకు మరో అమ్మవంటిది. ఎక్కడికైనా నన్ను వెంటపెట్టుకునే వెళ్లేది. ఆటబొమ్మలా ఎప్పుడూ తనకు అతుక్కునే ఉండేదాన్ని. ఒకసారి నన్ను ఎత్తుకొని మెట్లెక్కుతూ పడిపోయింది. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. తను స్కూలుకు వెళ్లినా నేను వెంట ఉండాల్సిందే. ఒకసారి టీచర్, ‘ఒక ఫీజు మీద ఇద్దరు రావడం కుదరదు,’ అన్నారు. అంతే, అక్క మళ్లీ జన్మలో స్కూలు ముఖం చూడలేదు. నేనూ పది పన్నెండేళ్ల వయసులోనే మరాఠీ సినిమాల్లో పాడటం మొదలుపెట్టాను. ఇంటిని ఎలాగోలా నిలబెట్టగలుగుతున్నాం. అయితే, చాలా చిన్నవయసులోనే నా స్వభావానికి అనుగుణంగా నేను ప్రేమలో పడ్డాను. నాకంటే 15 ఏళ్లు పెద్దాయన్ని (గణపత్‌రావు భోంస్లే; లతా మంగేష్కర్ సెక్రటరీ) నేను పెళ్లి చేసుకున్నాను. నాకు 16, ఆయనకు 31. మా ప్రేమ అక్కకు ఇష్టం లేదు. దాంతో ఇంట్లోంచి పారిపోయాను. నా దారి నేను చూసుకున్నానని అక్కకు అప్పట్నుంచీ కోపం. అది అలాగే కొనసాగింది. మా అత్తగారువాళ్లు ఛాందసులు. నేను సినిమాల్లో పాడటాన్ని ఇష్టపడలేదు. అలాగని ఆయన సంపాదన అంతంతమాత్రమే. వరుసగా పిల్లలు కలిగారు. వాళ్ల కోసమే ఛీత్కారాలు, నిరసనలు భరించాను. పైగా ఆయనకు అనుమానం ఎక్కువ. చిట్టచివరికి (1960 ప్రాంతంలో), మా చిన్నోడు ఆనంద్ కడుపులో ఉన్నప్పుడు ఇంట్లోంచి గెంటేసినంత పనిచేశారు. నేను మళ్లీ అమ్మ దగ్గరికో, అక్కచెల్లెళ్లు, తమ్ముడి దగ్గరకో వెళ్లొచ్చు. కానీ వాళ్లకు భారం కాకూడదు. అందుకే పాటే నాకు ప్రాణం అయ్యింది. ఒక్కసారి మైక్‌ముందు నిలబడితే అన్ని బాధలూ మరిచిపోయేదాన్ని.
తొలిరోజుల ఇబ్బందులు...
బాలీవుడ్‌ను నూర్జహాన్, షంషాద్ బేగమ్, గీతాదత్ లాంటి గాయనీమణులు ఏలుతున్నారు. అక్క కూడా పైస్థాయికి వెళ్లింది. కానీ నాకోసం ‘ఆ అమ్మాయికి ఈ పాట ఇవ్వండి,’ అని నిలబడగలిగినవాళ్లు ఎవరూ లేరు. పైగా, అక్క బాగా పాడుతుందా, చెల్లా? అని త్రాసులో తూచేవాళ్లు. డ్యూయెట్స్ వచ్చేవి కావు. బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు తప్ప నాకు గత్యంతరం లేదు. లేకపోతే పెద్దవాళ్లు పాడకుండా తిరస్కరించినవో, వ్యాంపు పాటలో నా దరిచేరేవి. అక్క... పాటల్లో శిఖరం. తనలా నేను పాడలేను. అలాగని తను కూడా కొన్ని నాలా పాడలేదు. అక్క లాంటి గొంతు ఒకటి ఉన్నాక, ఎవరూ ప్రత్యామ్నాయం ఆలోచించరు. నా దారి నాదే. నా స్టైల్ నాదే. అది ఏర్పరుచుకోగలిగాను కాబట్టే, నిలబడగలిగాను. దేవుడున్నాడు!చిన్నాచితకా పాడుతున్న దశలో దర్శక నిర్మాత బీఆర్‌చోప్రా నాకు అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో దిలీప్ కుమార్-వైజయంతిమాల కాంబినేషన్లో వచ్చిన ‘నయా దౌర్’(1957; ఓపీ నయ్యర్ సంగీతం)తో నాకు బ్రేక్ వచ్చింది. ‘తీస్రీ మంజిల్ ’ (1966; ఆర్.డి.బర్మన్ సంగీతం)తో కెరీర్ మలుపు తిరిగింది. ‘ఉమ్రావ్ జాన్’(1981; ఖయ్యామ్ సంగీతం)తో ఉచ్ఛ స్థితికి వచ్చింది. లో పిచ్‌లో పాడినప్పుడు నా పాట బాగుంటుందనేవారు నయ్యర్. దాని ప్రకారమే ఆయన కంపోజ్ చేశారు. అయితే, ఆర్.డి.బర్మన్ నేను అన్ని రకాలుగా పాడగలనని నిరూపించాడు.
ఇంకో అదృష్టం ఏమిటంటే, సినిమాలో నాకు ఒకే పాట అవకాశం వస్తే, ఆ పాటే హిట్ అయ్యేది. ‘ఝుంకా గిరా రె ’ (మేరా సాయా-1966) హిట్. ‘పర్దే మే రెహనే దో’ (షికార్-1968) హిట్. ‘దమ్ మారో దమ్’ (హరే రామ హరే కృష్ణ-1971) హిట్. నాకు ఎవరూ సహకరించని సందర్భాల్లో దేవుడు నా వెంబడి ఉన్నాడనుకుంటాను. ఎక్కడైనా స్టేజ్ మీద పాడినప్పుడైతే, ‘పియ తూ అబ్‌తో ఆజా ’ (కార్వాన్- 1971), ‘చురాలియా హై తుమ్నే జో దిల్ కో ’ (యాదోంకి బారాత్-1973), ‘మెహబూబా మెహబూబా ’ (షోలే- 1975) లాంటివి పాడకపోతే ప్రేక్షకులు ఊరుకోరు. అవి పాడకుండా షో పూర్తేకాదు.
ఆర్‌డీ బర్మన్‌తో పెళ్లి...
నేను ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్నప్పుడు ‘పంచమ్’ (బర్మన్ ముద్దుపేరు) టెన్తు తప్పి సంగీత దర్శకుడు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ముందు చదువు పూర్తిచేయమని సలహా ఇస్తే, నా ఇష్టం ఇదైనప్పుడు అక్కడెందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలన్నాడు. ఎస్.డి.బర్మన్ దగ్గర అసిస్టెంటుగా చేశాడు. తర్వాత తనే సంగీత దర్శకుడయ్యాడు. ఇద్దరికీ మంచి ఆహారం ఇష్టం, చిన్నచిన్న విషయాలను ఆనందించేవాళ్లం, ఫుట్‌బాల్ మ్యాచులకు వెళ్లేవాళ్లం, ప్రపంచ పాటలు వినేవాళ్లం. మాకు మేమే గుట్టుగా బతికాం. కాకపోతే తన చివరిరోజుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సక్సెస్ అయిన ఏ కళాకారుడైనా చంచాలు చుట్టూ ఉండటాన్ని ఇష్టపడతాడు. వాళ్లు ఏవేవో చెప్పారు, తన మనసును పాడుచేశారు. మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను తేరుకుని అన్నీ చెప్పాక అర్థం చేసుకోగలిగాడు. ఇప్పటికీ రికార్డింగ్ రూమ్‌కు వెళ్తే తను వెనక ఎక్కడో ఉన్నట్టే ఫీలవుతాను.
ఆశాస్ రెస్టారెంట్లు...
నేను బాగా వాగుతాను, నవ్వుతాను, ఒక దగ్గర కూర్చోలేను. రెండు గంటలు ఏ పనీ లేకుండా ఒక గదిలో పడుండమంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. వంటయితే చెప్పనక్కర్లేదు. చిన్నతనం నుంచీ ఇష్టమే. పిల్లలకు వండిపెట్టడం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. ఒకవేళ నేను గాయని కాకపోయుంటే నాలుగిళ్లకు వండిపెట్టయినా బతికేదాన్ని. రణ్‌ధీర్ కపూర్, రిషి కపూర్ నా వంటను ఎంతో ఇష్టపడతారు. టమోటా చట్నీ బెంగాలీల మాదిరిగా, ఆలూ సబ్జీ హరిద్వార్ స్టైల్లో చేయగలను. నా పిల్లలు నన్ను వంటల పుస్తకం రాయమన్నారు. కానీ రాయలేదు. ఒకసారి మా చిన్నబ్బాయి ఆనంద్ రెస్టారెంట్ తెరుద్దామన్న ఆలోచన తెచ్చాడు. చెఫ్ నాతో ఆరు నెలలపాటు ఉండి, నా పద్ధతి వంటలు నేర్చుకుని వెళ్తాడు. ఇదీ ప్లాన్. మెల్లగా చెయిన్ విస్తరించింది. దుబాయ్‌లో రెండు, అబూదబీ (యూఏఈ)లో ఒకటి, దోహా (ఖతార్)లో ఒకటి, కువైట్లో మూడు, బెహ్రాయిన్, బర్మింగ్‌హామ్ (బ్రిటన్), కైరో(ఈజిప్ట్)ల్లో ఒకటేసి రెస్టారెంట్లు తెరిచాం (ఇందులో ఆశా వాళ్లది 20 శాతం వాటా, మిగతాది ‘వాఫి గ్రూప్ ’ది.).
అద్భుత ప్రయాణం...
నా జీవితాన్ని ఒక అద్భుత ప్రయాణంగా భావిస్తాను. ఇది నా గుండెతో చెబుతున్నాను. నాకంటూ ఒక ఒరవడిని సృష్టించుకోగలిగాను. గొప్ప పాటల రచయితలు, గొప్ప గాయకులు, గొప్ప సంగీతదర్శకులతో కలిసి పని చేశాను. ఒక పాట చూపించి, ‘ఇలాంటి పాట ఆశా పాడలేదు,’ అనిపించుకోకుండా అన్ని రకాలూ పాడాను. ఇంగ్లిష్, స్పానిష్ లాంటి ఎన్నో భాషల్లో పాడాను. శ్రోతలను నా పాటలతో ఆనందంగా ఉంచుతూనే మరణించాలని కోరుకుంటాను. నా లోపలి గొంతు, ‘ఆశా! ఇక నేను నీకు లేను,’ అని చెప్పేదాకా పాడుతూనే ఉంటాను.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more