Pushpa Movie Review Rating Story Cast and Crew 'పుష్ప - ది రైజ్' మూవీ రివ్యూ

Teluguwishesh 'పుష్ప - ది రైజ్' 'పుష్ప - ది రైజ్' Get information about Pushpa Telugu Movie Review, Allu Arjun Pushpa Movie Review, Pushpa Movie Review and Rating, Pushpa Review, Pushpa Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 96730 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    'పుష్ప - ది రైజ్'

  • బ్యానర్  :

    మైత్రి మూవీ మేకర్స్, ముట్టంశెట్టి మీడియా

  • దర్శకుడు  :

    సుకుమార్

  • నిర్మాత  :

    నవీన్ యెర్నేని, వై. రవి శంకర్

  • సంగీతం  :

    దేవిశ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    మిరోస్లా కుబా బ్రొజెక్

  • ఎడిటర్  :

    కార్తీక్ శ్రీనివాసన్, రుబెన్

  • నటినటులు  :

    అల్లు అర్జున్, రష్మికమందన, పహాద్ ఫాసిల్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, హరీశ్ ఉత్తమన్, ధనుంజయ్, అజయ్‌ ఘోష్, బాబీ సింహా, రావు రమేశ్, వెన్నల కిషోర్ తదితరలు

Pushpa Movie Review Allu Arjun Shines In This Sprawling Battle Of Egos

విడుదల తేది :

2021-12-17

Cinema Story

ఆర్య, ఆర్య-2 చిత్రాల తరువాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో దాదాపు పన్నేండేళ్ల తరువాత వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ఫ’ ది-రైజ్. ఈ ప్రాజెక్టు ప్రకటించడంతోనే అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతోనే.. రంగస్థలం తరువాత మరో ఎపిక్ తీస్తున్నాడని అనుకున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక రంగస్థలం ఎంతటి హిట్ అయ్యిందో అంతకు రెట్టింపు హిట్ గ్యారంటీ అనుకున్నారు కూడా. బన్నీ మాస్‌ లుక్ తోనే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక మందన డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటం అంచనాలకు మరింత బలాన్నిచ్చాయి. ఇక చిత్రంలోని లిరికల్ సాంగ్స్ విడుదల కావడం.. అన్ని అభిమానులను ఎంతగానో అలరించడంతో.. మ్యూజికల్ హిట్ కూడా అయ్యింది. దీంతో భారీ అంచనాలు చిత్రంపై నెలకొన్నాయి. ఇక చిత్ర ట్రైలర్ విడుదలతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అల వైకుంఠపురంలో చిత్రాన్ని మించిన హిట్ గ్యారంటీ అన్న టాక్ కూడా వినిపించింది. ఇక బన్ని నటిస్తోన్న తొలి ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచానాలు అనుకున్న స్థాయిని మించిపోయాయి. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి? ‘తగ్గేదే లే’అంటూ జానాల్లోకి దూసుకొచ్చిన ‘పుష్ప’మూవీ ఎలా ఉంది.?

పుష్ప అలియాస్‌ పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) ఒక కూలీ. చెప్పుకోవడానికి ఇంటి పేరు కూడా లేకపోవడంతో చిన్నప్పుడే చదువు స్వస్తి చెప్పి ఊరమాస్‌గా పెరుగుతాడు. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా  జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అతి తక్కువ సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకమైన వ్యక్తిగా ఉండే కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌)కు దగ్గరవుతాడు. సరుకును రోడ్డు దాటించడానికి మంచి ఉపాయాలు చెబుతూ.. ఎర్రచందనం స్మగ్లర్‌ల సిండికేట్‌లో భాగస్వామి అవుతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ  అప్పటికే సిండికేట్‌కు లీడర్‌గా ఉన్న మంగళ శ్రీను(సునీల్‌)కు పక్కలో బల్లెంలా తయారవుతాడు.

ఈ క్రమంలో కొండారెడ్డి బ్రదర్స్‌తో పాటు మంగళం శ్రీనుతో శత్రుత్వం పెరుగుతుంది. మరి వారిని పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు? ఎర్రచందనం సిండికేట్ లీడర్‌గా పుష్ప కు ఎదురైన సవాళ్లు ఏంటి? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను.. ఆ కారణంగా అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? పాలు అమ్ముకునే అమ్మాయి శ్రీవల్లితో ప్రేమలో పడిన పుష్ప.. ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా? ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌ లీడర్‌గా ఉన్న పుష్పకు.. కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహాద్‌ ఫాజిల్‌)తో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ‘పుష్ప.. దిరైజ్‌’ చిత్రంలో చూడాల్సిందే.

cinima-reviews
'పుష్ప - ది రైజ్'

విశ్లేషణ

తెలుగు సినిమాల్లో ఎప్పుడూ చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథాకథనాల్ని ఎంచుకుని వాటిని వెండితెరపై అవిష్కరించిన దర్శకుడు సుకుమార్. అయితే ఈ కథతోనే చిత్రం పూర్తికాదు. ఈ పాత్రను అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగే హీరో కూడా కావాలి. మాస్ ఎలిమెంట్స్ ను జోడించడం కాదు.. మాస్ హీరోయిజంలోనే ఉండాలి. అలాంటి హీరో అల్లు అర్జున్ ను కథానాయకుడిగా ఎంచుకోవడంతోనే చిత్రంపై అంచనాలు నెలకొన్నాలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ సఫలమయ్యాడు. ఒక దశ వరకు రసవత్తరంగా నడపడం ద్వారా సుకుమార్ ప్రేక్షకుడి డబ్బులకు బాగానే గిట్టుబాటు చేస్తాడు. ఇక మాస్ మెచ్చే ఎలివేషన్ సీన్లకు ఇందులో లోటే లేదు. హీరో క్యారెక్టర్.. అందులో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అదిరిపోవడంతో ‘పుష్ఫ’ ఈ రకంగానూ పైసా వసూల్ అనిపిస్తుంది.

కానీ లెక్కపెట్టుకోవడానికి చాలామంది విలన్లున్నప్పటికీ హీరో స్థాయికి తగ్గట్లుగా అతణ్ని బలంగా ఢీకొట్టే.. అతడికి సవాలు విసిరే బలమైన ప్రతినాయకుడు లేకపోవడం ‘పుష్ప: ది రైజ్’లో పెద్ద మైనస్. విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుందని.. హీరో గట్టి సవాళ్లను దాటి ముందుకెళ్తేనే అతడి పాత్ర ప్రభావం ప్రేక్షకులపై అంత బలంగా పడుతుందనేది సినిమాల్లోని ప్రాథమిక సూత్రం. ఎప్పుడూ విలన్ పాత్రల్ని హీరోకు దీటుగా తీర్చిదిద్దే సుకుమార్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కథను మలిచాడు. తన ప్రేమనంతా బన్నీకే పంచేసి విలన్ల మీదే శీతకన్నేశాడు.  

ఎర్ర‌చంద‌నం ఎంత విలువైందో, అది ఇక్కడి నుంచి జ‌పాన్ వ‌ర‌కు ఎలా ప్ర‌యాణం చేస్తుందో చెబుతూ ఆరంభ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు సుకుమార్‌. ఆ ఎపిసోడ్ ప‌క్కాగా ఆయ‌న మార్క్‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఆ త‌ర్వాత పుష్ప ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ప్ర‌థ‌మార్ధంలో  హీరో నేప‌థ్యాన్ని, త‌న తండ్రి చ‌నిపోయాక ప‌రిస్థితులు మాత్రం కొంచెం భావోద్వేగాలు పంచుతాయి. ఆ తర్వాత ఎర్రచందనం రవాణా, సిండికేట్‌ తదితర వ్యవహారాలతో కథను ముందుకు నడిపిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్‌ లుక్‌తో తెరపై చూపించాడు.

ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండుగగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్‌ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్‌ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. పుష్పరాజ్‌ కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది.

ద్వితీయార్ధం ప్రథమార్థం కన్నా బాగుంటుందని ఆశించి చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. ముందుకుసాగని కథ.. శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, కథను సైడ్ ట్రాక్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్‌- భన్వర్‌ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్‌ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి తృప్తి చెందడు. ఇక పుష్స ది రూల్.. రెండో భాగంపై ఆసక్తిని కూడా కలిగించకపోవడం గమనార్హం.

నటీనటుల విషాయానికి వస్తే..

అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. సరికొత్త బాడీ లాంగ్వేజ్ చూపించడమే కాదు.. చిత్తూరు యాసలో అథెంటిగ్గా డైలాగులు చెప్పడం ద్వారా బన్నీ తన కమిట్మెంట్ ను చాటి చెప్పాడు. పుష్ప పాత్రలో అతడి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ కొన్ని రోజుల పాటు ప్రేక్షకులను వెంటాడుతుందనడంలో సందేహం లేదు. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది.

కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్‌ మారిన తీరు, ఆయన డిక్షన్‌ బాగున్నాయి. ప్రీరిలీజ్‌ వేడుకలో చెప్పినట్లు ఈ సినిమాలో కొత్త సునీల్‌ను ప్రేక్షకులు చూస్తారు. అనసూయ, అజయ్‌ ఘోష్‌, రావు రమేశ్‌, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర ద్వితీయార్ధంలోనే వస్తుంది. ఈ భాగంలో బలమైన సన్నివేశాలు పడలేదు. బహుశా పార్ట్‌-2 ‘పుష్ప: ది రూల్‌’లో ఈ పాత్రతోనే పుష్పరాజ్‌ ఢీకొట్టాల్సి ఉంటుందని హింట్‌ మాత్రం ఇచ్చారు. సమంత ఐటమ్‌ సాంగ్‌ మాస్ ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తుంది.



టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా ‘పుష్ప’ మరో లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రాఫర్‌ కూబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌ లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ఇద్దరు ఎడిటర్లు పనిచేశారు. అయితే నిడివి మాత్రం పెరిగిందేమోననిపిస్తుంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే ఇంకాస్త బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు బాగున్నాయి. అయితే బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చిత్రబృందం ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. అడవి వాతావరణం చూపించడానికి ప్రొడక్షన్‌ డిజైనర్లు, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. రామకృష్ణ, మౌనిక ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్న స్థాయిలో సినిమా కోసం ఖర్చు పెట్టారు. తనదైన మార్క్‌ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్‌ కథను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. పుష్పరాజ్‌ పాత్రతో సహా మిగిలిన పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం, అందుకు తగిన సన్నివేశాలు మెప్పిస్తాయి. నిడివి విషయంలో సుకుమార్‌ ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రథమార్ధం పరుగులు పెట్టగా, ద్వితీయార్ధం నెమ్మదిగా సాగుతుంది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌కు ఇంకాస్త సమయం తీసుకొని ఉంటే... ‘పుష్ప: ది రైజ్‌’ మరో స్థాయిలో ఉండేదేమో!

తీర్పు:  యాక్షన్ సీన్లు ఎక్కువైనా.. ఓవరాల్ గా అల్లు అర్జున్-సుకుమార్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ ‘పుష్ప ది-రైజ్’ తగ్గేదేలే.!

చివరగా.. అల్లు అర్జున్  వన్ మ్యాన్ షో.. పరకాయ ప్రవేశం.. ‘పుష్ప’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh