Mangalampalli balamuralikrishna special article

mangalampalli balamuralikrishna special article, m balamuralikrishna songs, m balamuralikrishna hit songs, mangalampalli balamuralikrishna birthday special, breaking news, ap politics, political news, andhra news

mangalampalli balamuralikrishna special article, Mangalampalli Balamuralikrishna Birthday Special,

సంగీత శిఖరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ

Posted: 07/16/2013 03:27 PM IST
Mangalampalli balamuralikrishna special article

ఆంధ్రప్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు సమీపం లోని శంకరగుప్తం అనే చిన్న కుగ్రామం ఈనాడు ప్రపంచ సంగీత చిత్రపటంలో ప్రముఖ స్థానం పొందింది. ఫ్రాన్సులో చెవలియార్‌ సత్కారం, యునెస్కో వారి 'గాంధీ మెడల్‌' పద్మశ్రీ (1971), పద్మవిభూషణ్‌ (1991), సెంట్రల్‌ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌, న్యూయార్క్‌ మేయర్‌ నుండి లెజెండ్‌ (2007) వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక బహుమతులను పొందిన డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరులోనే 'నారద స్వర్ణార్ణవ' గ్రంథసారమంతా ఒదిగిపోయింది. 1930 సంవత్సరంలో జులై 6వ తేదీన పట్టాభి రామయ్య సూర్యకాంతం దంపతులకు బాలమురళి జన్మించారు. పుట్టిన 14వ రోజున తల్లిని కోల్పోయినా, పెద్దమ్మ సుబ్బమ్మ ఒడిలో మాతృప్రేమను పుష్కలంగా పొందారు. తొలి సంగీత పాఠాలు తండ్రి పట్టాభిరామయ్య వద్దే అభ్యసించినా బాలమురళి మేధా సంపత్తి పురస్కరించుకుని సంగీతాభ్యాసానికి శ్రీపారుపల్లి రామ కృష్ణయ్య పంతులుకు అప్పగించారు. ఆ అడుగులు బాలమురళిని త్యాగరాజ శిష్యపరంపరలోనికి చేర్చాయి.

బాలమురళి బాలగాయకునిగా, తరువాత కాలంలో విజయవాడ కేంద్రంలో భక్తిరంజని నిర్మాతగా అశేష అభిమానం పొందారు. బాలమురళి వింజమూరి విజయలక్ష్మితో గానం చేసిన భద్రాద్రి శ్రీరామచంద్రుని సుభప్రభాతం విన్న ఆనాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆ పాట రికార్డులు తెచ్చి ఇవ్వవలసిందిగా, ఆ నాటి కేంద్ర ప్రసార మంత్రి ఎస్‌.బి.పి.కె. పట్టాభిరామారావుని కోరారట. ఈ విధంగా బాలమురళి గానం ఎన్నో ఎల్లలను దాటి అశేష భారత ప్రజలకు సన్నిహితమైంది. ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో 'సద్గురు దక్షిణామూర్తి ఆరాధనా' ఉత్సవాల్లో మొదటిసారి గురువుల ఎదుట విజయవాడలో సంప్రదాయ బద్ధమైన పూర్తిస్థాయి కచేరీ చేసి సంగీత ప్రియులను తన్మయులను చేసారు. ఆనాటి నుండి సంగీతలోకంలో ఓ నూతన శకం ఆరంభమౌతోందని గుర్తించిన ముసు నూరి సూర్యనారాయణ మూర్తి అప్పటి వరకు 'మురళీకృష్ణా' అని పిలుస్తున్న వాని పేరుకు ముందు 'బాల' అని చేర్చి హృదయానికి హత్తుకుని ఆశీర్వదించా రట. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన ఆ శుభ ఘడియలను ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో శాశ్వతం చేసికున్నారు. ఆనాటి నుండి బాలమురళికృష్ణ చేసిన కచేరీలు సంగీత చరిత్రను తిరగవ్రాసేవి. రేడియోలో సంగీత కచ్చేరీలు వస్తాయని వాటిని వినాలనే ఊహే తెలియని పదకొండు సంవత్సరాల పసివయసులో 'బాలమురళి' మద్రాసు కేంద్రం నుండి మొదటి సంగీత కచేరీ చేసారు. ఆకాశవాణి కేంద్రం ప్రచురించే 'వాణి' పుస్తకం ఆ నెల 'బాలమురళి' ముఖచిత్రంతో అందరినీ అబ్బుపరచింది.

గాత్ర విద్వాంసులు తమ సాహిత్యాన్ని స్పష్టంగా పాడుతూ సహకార వాద్యాలు లేకుండా కూడా కచేరీలు రక్తి కట్టించ టానికి ప్రయత్నం చేయాలి. సహకార వాద్యాలు సహితం గాత్రం పాడేవారికి సహకరించాలే తప్ప పరిమితిని దాటి ప్రయోగాలు చేస్తూ సభామర్యాదను ఉల్లంఘించకూడదు అంటారు బాలమురళి. ఆ బాటలోనే తను స్వయంగా నడిచి ముందుగా ప్రయోగాత్మకంగా 1975లో మద్రాసు శ్రీకృష్ణగానసభలో కేవలం డి.టి.హెచ్‌.వినాయకరాం ఘటవాద్య సహాయంతో పూర్తినిడివిగల గాత్ర కచేరీ చేసారు. వయోలిన్‌ సహకారం ప్రక్కన పెట్టి తంజావూరు జి. లక్ష్మణన్‌ వీణ సహకారంతో ఒక సంవత్సరంపాటు బాలమురళి అనేక కచేరీలు చేసారు. 1977-79లో కేవలం ఎన్‌. రమణ వేణువాద సహకారంతో ఎన్నో గాత్రకచేరీలు నిర్వహించారు. ప్రజలు తన్మయులై వీరిరువురికీ బ్రహ్మరథం పట్టారు. ఏ ఆటంకం లేకుండా మీ అసలు సంగీతాన్ని వినే అదృష్టం మాకు కలిగిందని పులకితులయ్యారు. పొగడ్తలను, విమర్శలను బాలమురళి సమానంగానే స్వీకరించారు.

అంతమాత్రాన బాలమురళికి వయోలిన్‌, మృదంగ కళా కారులపట్ల చులకనభావం ఉందని భావించకూడదు. అహం కారం, గర్వం మూర్తీభవించిన వయోలిన్‌, మృదంగ విద్వాంసుల పట్ల మాత్రమే బాలమురళి ఉదాసీనతను ప్రదర్శించారు. ''కళాకారుడు తన స్వీయ ప్రజ్ఞను పెంచుకోవాలి''. ''ఏ ప్రక్క వాద్యం లేకపోయినా కళాకారుని ప్రజ్ఞ ద్విగుణీకృత మయ్యే విధంగా ఎదగాలి'' అంటారు బాలమురళి. భారతీయ సంగీతంలో ఉన్న రెండు భిన్న సంప్రదాయాలను ఒక వేదికపై పరిచయం చేయాలనే సంకల్పం మహా రాష్ట్ర గవర్నర్‌ కోన ప్రభాకరరావుకి కలిగింది. తత్ఫలితంగా 1977లో బొంబాయిలోని షణ్ముఖానంద హాలులో బాలమురళి, పండిట్‌ భీమ్‌సేన్‌ జోషిల జుగల్‌బంది మూడువేలమంది ప్రేక్షకుల మన్ననలను పొందింది. హిందూస్థానీ కళాకారులు చాలామంది జుగల్‌బందీ కార్య క్రమంలో పాల్గొన్నా, కర్నాటక సంగీత విద్వాంసునిగా బాలమురళి ఒక్కరే ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించారు'సతీ సావిత్రి' సినిమాలో అక్కినేని నటిస్తున్న పాత్రకు కేవలం ఒక శ్లోకం గానం చేయటానికి బాలమురళిని ఆహ్వానించారు. బాల మురళి గానానికి, స్వచ్ఛమైన తెలుగుదనానికి సంతోషించి ఆ చిత్రంలోని ఎనిమిది పాటలను ఈయనచేతే పాడించటంతో చిత్రరంగంలో నేపథ్యగాయకునిగా రంగ ప్రవేశం జరిగింది. 'హంసగీత', 'సంధ్యారాగం' అనే కన్నడ చిత్రాలకు, జి.వి. అయ్యర్‌ నిర్మించిన 'ఆదిశంకరాచార్య', 'మధ్వాచార్య' సంస్కృత చిత్రాలకు జాతీయస్థాయిలో బాలమురళి ఉత్తమ సంగీత దర్శకునిగా బహుమతులు పొందారు.

అనేక చిత్రాలలో బాలమురళి అతిథి పాత్రలలో దర్శనమిచ్చినా 'భక్త ప్రహ్లాద' చిత్రంలో 'నారదుని'గా తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించారు. 'సంధ్య కెందిన సింధూరం' అనే మళయాళ చిత్రం ఒక సంగీతజ్ఞాని గాథ. ముందుగా ఈ చిత్రానికి నేపథ్యగానం చేయవలసిందిగా బాలమురళిని ఆహ్వానించినా, అతని కంఠం లోని ఒడుపుల్ని గమనించి సినిమా నాయకుని పాత్రపోషించమని అభ్యర్థించారు. ఈఅవకాశాన్ని స్వీకరించి తన నటనా ప్రతిభను ఈ చిత్రంలో పూర్తిగా ఆవిష్కరించారు. శాస్త్రీయ సంగీమంటే 'ఏ కొద్దిమందికి మాత్రమే' కాదని నిరూపిస్తూ లక్షలాది మంది శ్రోతల్ని తన అభిమానులుగా తీర్చిదిద్దుకున్న ఘనత ఒక్క బాలమురళికే దక్కుతుంది. పదిమందిలో ఒకడిగా కాక ప్రత్యేకతను పొందిన 'సంగీత కళానిధి' 72 మేళకర్తరాగాల్లోను కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. 28,000 కచేరీలు చేసి దేశవిదేశాల్లో కర్ణాటక సంగీతానికి అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టారు.

వీరి స్వదస్తూరి గ్రంథం 'సూర్యక్రాంతి' భవిష్యత్తరాలకు చక్కని రాజమార్గం.

సంగీత జగత్తులో ఆయన అధిరోహించని శిఖరాలు లేవు. అందు కోని అవార్డులు లేవు. బాలమురళిలోని నారదాంశకు మరొక్కసారి పాదాభివందనం. వృద్ధులైన శ్రీ చెంబై వైద్యనాథ భాగవార్‌ రాజమండ్రిలో జరిగిన మహాసభలో యువకుడైన బాల మురళికి స్వయంగా కాలికి గండపెండేరాన్ని తొడిగి ఘనంగా సన్మా నించారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ అది 'వారి సహృ దయత' అంటారు బాల మురళి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles