Information about arvind kejriwal

Arvind Kejriwal News, Arvind Kejriwal Breaking News, Blogs on Arvind Kejriwal, Arvind Kejriwal,.Arvind Kejriwal,IAC member, Family members of Arvind Kejriwal, Kejriwals, Pulkit Kejriwal, Harshita Kejriwal, Sunita Kejriwal, Geeta Devi

General Information Arvind Kejriwal

information about arvind kejriwal.png

Posted: 01/03/2013 12:21 PM IST
Information about arvind kejriwal

arvind_kejriwal

ఇద్దరు నీతిమంతులు ఒకే దారిన ప్రయాణించాలని లేదు; ఒకే భావాన్ని మోసుకు తిరగాలని లేదు, పేదరికంలో పుట్టిన అన్నా హజారే, అన్ని కలిగిన ఇంట్లోంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఉమ్మడిగా ఈ రెండేళ్లలో చాలా తేదీలను ఆక్రమించారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ‘‘నేను ‘అన్నా ’ను,’’ అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేట్టుగా చేసింది. దానికి ‘అనంగీకార’ కొనసాగింపుగా ఆ ఉద్యమంలోని కీలక భాగస్వామి అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ స్థాపించారు.

హజారే 1975లో రాలేగావ్‌సిద్ధికి వచ్చేనాటికి, హర్యానాలో జన్మించిన అరవింద్ కేజ్రీవాల్ ఏడేళ్ల పిల్లాడు. వాళ్ల నాన్న ఇంజినీర్. అరవింద్ కూడా ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ప్లాంట్‌లో పనిచేశారు. ఉద్వేగపూరిత కారణాలు లేకపోయినా, ఏదో ఒకటి సమాజానికి చేయాలనే తపన ఆయనలో ఉండేది. అది ఉన్నతోద్యోగంలో ఉంటే సాధ్యపడుతుందేమో ! అది మానేసి, సివిల్ సర్వీస్ పరీక్షకు కూర్చున్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈ మానేయడం, చేరడం మధ్యలో ఈశాన్య రాష్ట్రాలు తిరిగారు. మదర్ థెరిసాను కలిశారు. ‘‘మదర్, నాకు సేవ చేయాలనుంది,’’ అని అడిగారు. కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీలోనూ, రామకృష్ణ మిషన్‌లోనూ సేవలందించారు. అప్పుడే తాను సెలక్ట్ అయినట్టుగా వార్త తెలిసింది. 1992లో ఉద్యోగంలో చేరిపోయారు.

Family_membersసర్వీసులో ఉన్నప్పుడే సునీతతో కేజ్రీవాల్‌కు పరిచయమైంది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడంతో లవ్ మ్యారేజ్ కాస్తా అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. పాప హర్షిత, బాబు పులకిత్ పుట్టారు. భార్యనూ పిల్లల్నీ ఆమిర్‌ఖాన్ సినిమాలకు తీసుకెళ్తూ ‘బిందాస్ ’గా గడుపుతూనే వ్యవస్థలోని లొసుగుల గురించి మథనపడేవారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్టుమెంటు అనగానే చేతులు బాగా తడుపుకోవచ్చనే భావన ఉన్న సమాజంలో, ‘లంచం తీసుకోక చెడిపోయాడు,’ లాంటి మాటలు తన గురించి విన్నారు.

‘పరివర్తన్ ’ సమయం

సహచరుల అవినీతిని కళ్లారా చూస్తూ ఎలా మిన్నకుండటం ? అందుకే 1999లో ఉద్యోగంలో ఉంటూనే మిత్రులతో కలిసి ‘పరివర్తన్ ’ ఎన్జీఓను తెరవెనక ఉండి స్థాపించారు. పాలనలో పరివర్తన తేవాలన్నది దీని సంకల్పం. ఢిల్లీ అంతటా బ్యానర్లు కట్టారు. ‘ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే, పరివర్తన్‌ను సంప్రదించండి. మేము ఉచితంగా మీ పని చేసిపెడతాం,’ అని అందులో రాశారు. ఇన్‌కమ్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, రేషన్ షాపులు; వాటర్ వర్క్స్; ఇలా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరివర్తన్ కార్యకర్తలు ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా నిలిచేవారు. కానీ ఎంతకాలం ! జనమే తమకోసం తాము పోరాడుకోవాలి. దానికి తగిన ఆయుధం ఏది?

అరుణారాయ్ లాంటివాళ్ల కృషి ఫలితంగా సమాచార హక్కు చట్టం మొదట ఢిల్లీలో రూపుదిద్దుకుంది. పరివర్తన్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింది. 2005లో పార్లమెంట్ అంగీకారం పొంది జాతీయస్థాయిలో చట్టంగా రూపుదాల్చింది ఆర్టీఐ. ప్రభుత్వ యంత్రాంగంలోని ఉదాసీనతను, అవినీతిని ప్రశ్నించడానికి ఇదొక అస్త్రంగా తయారైంది. భారతదేశంలో నిశ్శబ్దంగా జరిగిన గొప్ప మార్పుల్లో ఇది ఒకటి!అయితే, తాను సరైన వ్యవస్థలోనే ఉన్నానా అనే శంక మాత్రం ఆయన్ని వీడలేదు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు,’ లాంటి సలహాలు పక్కనపెట్టి జాయింట్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అవినీతి మీద పూర్తిస్థాయిలో పోరాడా లంటే, అందులో ఉంటూ పోరాడలేం. కానీ ఉద్యోగం మానేయడం సులభమైన విషయమా? తల్లి భయపడింది. భార్య ఉద్యోగం ఆయనకు ధైర్యాన్ని ఇచ్చివుంటుంది. సామాజిక నాయకత్వానికి గానూ 2006లో రామన్ మెగసెసె అవార్డు అందుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. ‘వీడు చదివీ చదివీ చెడిపోయాడు అనుకున్నా. అవార్డు వచ్చిందంటే ఏదో పనికొచ్చేదే చేసివుంటాడు,’ అన్నారట ఓ బంధువు.

Anna_hazare_Kejriwal‘ఆమ్ ఆద్మీ పార్టీ ‘

టీమ్ అన్నా ’ నుంచి విడిపోయి, ‘సున్నా’  నుంచి తన సొంత అంకెల్ని నిర్మించుకునే పనిలో పడ్డారు కేజ్రీవాల్. మద్దతుదారులతో కలిసి ‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ స్థాపించారు. సామాన్యుడిని తన పేరుగా వాడుకున్న ఈ పార్టీ స్థాపన ద్వారా కేజ్రీవాల్ యాక్టివిస్టు నుంచి రాజకీయనాయకుడిగా రూపాంతరం చెందారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైన రక్షణ అక్కర్లేదు, వాహనాల మీద ఎర్ర రంగు లైట్లు, సైరన్లు వాడం, విలాసవంతమైన ప్రభుత్వ భవంతులను ఉపయోగించం, లాంటి తమ మౌలిక లక్ష్యాలను ప్రకటించారు.

రాబర్ట్ వాద్రా, సల్మాన్ ఖుర్షీద్, శరద్ పవార్, నితిన్ గడ్కారీ, నరేంద్ర మోడీ, ఇలా ఒక్కొక్కరి మీద అవినీతి ఆరోపణలు చేశారు. కొందరు రాజకీయ విశ్లేషకులు భావించినట్టుగా, బాణం వేయడం నేర్చుకున్న విలుకాడు ఉత్సాహంగా అమ్ములపొదిని ఖాళీ చేసుకుంటూ వెళ్లినట్టుగా వెళ్లిపోయాడా?ఒక నాయకుడికి సంబంధించిన ఆరోపణను ఒక కొలిక్కి తేకుండానే మరో నాయకుడిని వార్తల్లోకి తెచ్చాడు. ఈ లౌక్యం తెలియడమే రాజకీయం అయితే కేజ్రీవాల్ ఏ మేరకు ఇందులో పాస్ అవుతాడో తెలియదు. కులం, మతం, తీవ్రవాదం లాంటి ఎన్నో అంశాలు ఉద్వేగం కలిగించే ఈ నేల మీద అవినీతి ఏ మేరకు ఉద్వేగ స్థిరాంకంగా ఉండగలదో తెలియదు. మొత్తానికి అన్నా హజారే పోయినేడాది తెచ్చిన ఉద్యమానికి 2012లో తార్కిక ముగింపు(!) ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్.ఒకప్పుడు ‘కొలతలు ’ చాలని  ‘పొట్టి ’ అన్నా హజారే దేశంలోనే ఎంతో పొడవైన మనిషిగా ఎదిగారు. ఇప్పుడు కొత్త కార్యక్షేత్రాన్ని కేజ్రీవాల్ తీసుకున్నారు. ఆయన ఎత్తు సరిపోతుందా? అన్నా హజారే స్థానంలో ఆయన అన్నా కేజ్రీవాల్‌గా నిలవగలరా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  30 years of telugu desam party
Director bapu special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles