another RTC driver dies of cardiac arrest గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కిం కర్తవ్యంపై సీఎం సమీక్ష..

Another rtc driver dies of cardiac arrest in telangana

TSRTC Workers, High Court, RTC MD Sunil sharma, kareem khan, karimnagar, TRS, rtc mechanic, heart stroke, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Telangana TSRTC mechanic Kareem Khan, from Karimnagar bus depo of Nalgonda district, had died due to cardiac arrest, the fellow RTC employees are protesting his in front of the depo demanding justice to his family.

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కిం కర్తవ్యంపై సీఎం సమీక్ష..

Posted: 11/06/2019 03:29 PM IST
Another rtc driver dies of cardiac arrest in telangana

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ ఆర్టీసీ డిపో-2లో మెకానిక్‌గా పనిచేస్తున్న కరీం ఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అతను.. చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు. ఆర్టీసీ కార్మికుడి మృతి పట్ల కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె నేడు 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రితో ప్రభుత్వం విధించిన డెడ్‌ లైన్ పూర్తయింది. కడుపులు మాడ్చుకుని అందోళనలు చేయడం కన్నా.. కలిగిన దానితో సంతోషంగా వుండాలని తెలంగాణ ప్రభుత్వం, రవాణా శాఖకు చెందిన ప్రముఖులు కార్మికులకు సూచిస్తున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కార్మికులకు విధించిన డెడ్ లైన్ నిన్నటి అర్థరాత్రితో ముగిసింది. కార్మికుల కడుపులు మాడ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న ఆయన ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆర్టీసీకి నిధులు ఇవ్వడంతో పాటు కార్మికులకు కూడా 67శాతం వేతనాలు పెంచానని చెప్పుకోచ్చారు. అయినా ఆయన పిలుపును ఆర్టీసీ కార్మికులు విస్మరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో వుంటున్న 48వేల మంది కార్మికులలో కేవలం 300 పైచిలుకు కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. దీంతో.. తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికులు నేడు దాదాపుగా 97 డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్నారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో పాటు వారి కుటుంబాలు,ప్రతిపక్ష పార్టీలు సమ్మెలో పాల్గొంటున్నారు.ముఖ్యమంత్రి ఇటువంటి డెడ్ లైన్లు ఎన్ని విధించినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. కేవలం 300 మంది కార్మికులే విధుల్లో చేరారంటే సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల ఎవరూ సానుకూలంగా లేరన్నది అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా సమస్యను మరింత జటిలం చేయకుండా డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకోవాలన్నారు.

ఆర్టీసీ సమ్మెపై సీఎం సమీక్ష: కీలక నిర్ణయం వెలువడేనా.?

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. క్రితం రోజు అర్థరాత్రితో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధించిన డెడ్ లైన్ ముగిసిపోవడంతో ఈ సమీక్షలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆర్టీసిని ప్రైవేటు పరం చేయడంలో తొలి అడుగుగా అద్దె బస్సులకు అనుమతులు జారీ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అద్దె బస్సుల కోసం పలు పర్యాయాలు నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మరిన్ని అద్దె బస్సులను కూడా తీసుకొని పూర్తిస్థాయిలో అద్దె బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోనుందా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రూట్ మ్యాప్‌ను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. టికెటింగ్, టైమింగ్స్, రూట్స్ సహా అన్ని వివరాలతో ఇవాళ జరిగే సమీక్ష అనంతరం మార్గదర్శకాలు వెలువడనున్నాయని సమాచారం. ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చినా సరే.. అవన్నీ ఆర్టీసీ కార్పోరేషన్ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. హైకోర్టులో కార్మికుల సమ్మెపై విచారణ సాగుతున్నందున ఈ కేసుపై తీర్పు వచ్చిన తరువాత ఆర్టీసీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. న్యాయ నిపుణులతో తాము సంప్రదింపులు జరిపామని.. ఆర్టీసీలో 31శాతం కేంద్రం వాటా ఉందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి కేంద్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరించడం సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ గుండె ధైర్యం కోల్పోకుండా మనో నిబ్బరంగా ఉండాలని సూచిస్తున్నారు. రేపు హైకోర్టు విచారణ నేపథ్యంలో తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశిస్తుందన్న నమ్మకం ఉందంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles