గురుపరీక్ష (వ్యంగ్యవ్యాఖ్య)
గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎక్కడో చదివినట్టు గుర్తు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే ఆధ్యాత్మిక జీవన ప్రదాతలు గురువులు. కాబట్టి ఒక గురువు కావాలని, ఆయన మార్గదర్శకంలో తరించాలని గుర్నాధానికి ఒక ఆలోచన వచ్చింది. కానీ దాన్ని అమలులోపెట్టాలంటే ఎవరిని గురువుగా ఎంచుకోవాలన్నది సమస్యగా మారింది. గురువులకు సర్టిఫికేట్లా ఉండవు. మరి వారినెలా గుర్తించటం అని తనకు తెలిసినవాళ్ళనందరినీ అడిగాడు. గురువుల ఆచూకీలైతే తెలియలేదు కానీ, తనలాంటివాళ్ళు చాలామంది ఉన్నారని మాత్రం తెలుసుకున్నాడు. ఒక సంఘాన్ని స్థాపించి, ఆధ్యాత్మిక గురువు కోసం అన్వేషిస్తున్నవారంతా సభ్యత్వం కోసం సంప్రదించమని ఓ ప్రకటన ఇస్తే దానికి మంచి స్పందన వచ్చింది.
అలాగే, ఆధ్యాత్మిక గురువులుగా చెలామణీ అవుతున్నవారందరూ తమ తమ సాధన, అనుభవాల వివరాలను తెలియజేస్తూ తమ సంఘంలో గుర్తింపు కోసం అర్జీలు పెట్టుకోవలసిందిగా కోరుతూ మరో ప్రకటన కూడా ఇచ్చాడు గుర్నాధం. కింద సూచించిన ఆఖరుతేదీలోగా పేరుని నమోదు చేసుకోమని, సొంత చిరునామాతో కూడిన కవర్ ని జతచెయ్యటం మర్చిపోరాదని, ఫోటోలను గడ్డం లేనప్పుడు, ప్రస్తుతం గెటప్లోనూ, సైడ్, ఫ్రంట్ పోజులలో రెండు రెండు కాపీలను కూడా జతపరచమని ఆ ప్రకటనలో ఇవ్వగా, దానికీ బాగానే స్పందన వచ్చింది.
సంఘం రిజిస్టరైంది. సంఘానికి వద్దన్నా గుర్నాధాన్నే ప్రెసిడెంటుని చేసారందరూ. సంఘంలో గురువులను పరీక్షించగలిగి వారికి మార్కులు వెయ్యగలిగేవాళ్ళని గుర్నాధం గురువుల ఎంపిక కమిటీలోకి తీసుకోదలచుకుని, అందుకు ఈ కింది అర్హతలను పెట్టాడు.
1 .ఏ గురువు దగ్గరా ఉపదేశం తీసుకోనివారు, 2. కుటుంబంలోని పెద్దలెవరూ గురుపరంపరలోకో పోనివారు, 3. ఎవరినీ, ఏ విషయాన్నీ త్వరగా నమ్మనివారు, 4. సైన్స్ ప్రమాణాలనే నమ్మేవారు, 5. ఎటువంటి ఆధ్యాత్మిక సాధనా మొదలుపెట్టనివారు, 6. గురువుల ప్రసంగాలను అక్కడక్కడా విని కొన్ని ఆధ్యాత్మిక పర్యాయపదాలను ముక్కున పట్టుకున్నవారు, 7. భాషా పరిఙానం బాగా ఉన్నవారు, 8. ఓ విషయాన్ని పట్టుకుంటే త్వరగా వదిలిపెట్టకుండా రాజీ పడకుండా చర్చించేవారు, 9. దైనినైనా నిశితంగా చూసే అలవాటు, అందుకు కావలసిన సహనం కలిగినవారు, 10. చిన్న చితకా ఆశీర్వాదాలు, వేష భాషల ఆకర్షణలకు లొంగనివారు, 11. ఎదుటివారి లోని లోపాలను సులభంగా పసిగట్టగలిగేవారు.
పై అర్హతలున్నవారు చాలా మంది లభించారు. అందులో తనకి నచ్చినవాళ్ళని మాత్రమే కమిటీలోకి తీసుకున్నాడు గుర్నాధం.
ఇక, గురువులు రాగానే వారిని ఎలా పరీక్షించాలన్నదానిలో కమిటీ సభ్యులకు మార్గదర్శకాలు, కొంత శిక్షణనివ్వడం జరిగింది.
1. గురువులకు గడ్డం ఉంటే, ఎంతకాలంగా పెంచుకుంటున్నదీ, ఏ విధంగా నిర్వహిస్తున్నదీ చూడాలి. ట్రిమ్మింగ్ చేసుకుంటున్నారా, పూర్తిగా వదిలేసారా, దువ్వుకుని రంగువేసుకుని చక్కగా పోషిస్తున్నారా లేక జడలుకట్టనిస్తున్నారా?
2. అసలు పేరుతో వ్యవహరిస్తున్నారా లేక ఆధ్యాత్మిక నామధేయమేమైనా ఉందా?
3. సొంత ఆశ్రమం, కొన్ని కేంద్రాలు ఉన్నాయా లేక ఏమీ లేకుండా గాలికి తిరుగుతున్నారా?
4. ఏ సమయంలో చూసినా సగటున చుట్టూ ఉండే శిష్యులెంత మంది, మొత్తం శిష్యుల సంఖ్య ఎంత?
5. శిష్యుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారెంతమంది?
6. దుస్తుల వివరాలు. కాషాయమా, శ్వేతాంబరమా లేక దిగంబరమా, లేక కౌపీన ధారియా?
7. ట్రస్ట్ ఏర్పాటు చేసివున్నారా?
8. ఆదాయ పట్టిక?
9. విద్యార్హతలు. ఇంగ్లీషు చక్కగా మాట్లాడగలరా?
10. గురువుగారు అవలంబించేదానికీ ఉపదేశించేదానికీ తేడా ఉందా? ఉంటే వాటి వివరాలు.
11. అద్భుతాలు చేసి చమత్కారాలు ప్రదర్శిస్తారా? వివరాలు.
12. పీఠం కానీ గురుపరంపరకానీ ఉన్నాయా లేక స్వయంభూ గురుత్వమా?
13. ఉచిత ఉపదేశాలా, లేక ఫీజులున్నాయా. చందాల రూపంలో అడుగుతారా లేకపోతే హుండీలు పెట్టి ఊరుకుంటారా?
14. పుస్తకాలు, సిడిల విక్రయాలుంటాయా?
15. విదేశయానం చేసివున్నారా?
16. అరణ్యవాసం కానీ హిమాలయ శ్రేణువుల్లో గడపటం కానీ చేసారా, చేస్తే ఎన్ని సంవత్సరాలు?
17. ఎంక్వయిరీలు, కేసులు ఏమైనా ఉన్నాయా, అందులో ఇంకా పెండింగ్ లో ఉన్న కేసులెన్ని? (దీనికి స్థలం చాలకపోతే అదనంగా పేపరు జతపరచవచ్చు)
వారం రోజులపాటు ఎడతెరిపి లేకుండా గురువుల స్క్రీనంగ్ జరిగింది. కంప్యూటర్ లో వివరాలను ఫీడ్ చేసి, గురువులకు దక్షిణ తాంబూలాలిచ్చి త్వరలో ఫలితాలను ప్రకటిస్తామని పంపించేయటం జరిగింది. కానీ సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఏ గురువుని నమ్మాలో ఎవరికి పట్టం కట్టాలో తెలియలేదు. గురువుగా ఎవరిని స్వీకరించాలో తెలియని పరిస్థితి. దీనికోసం పోగుచేసిన సొమ్ము కూడా పూర్తిగా ఖర్చైపోయింది. మళ్ళీ మళ్ళీ సభ్యత్వ రుసుము చెల్లించే ఉద్దేశ్యం ఎవరిలోనూ కనపడలేదు. అందువలన సంఘాన్ని రద్దు చేస్తూ, దానిముందుగా ఈ క్రింది విధంగా గురుపరీక్షలో పోటీదారులందరికీ లేఖలు పంపించారు.
"గురువుగా ఉండదగ్గ అర్హతలు మొదటి రౌండ్ లో ఎవరిలోనూ కనిపించలేదని చెప్పవలసివచ్చినందుకు చింతిస్తున్నాం. అప్లికెంట్సందరూ తమ తమ అర్హతలను పెంచుకుని, ఒక సంవత్సరకాలం తర్వాత విచారించవలసిందిగా కోరుతున్నాం."
నీతి: శిష్యులకు పరీక్షలు పెడుతున్నామని గురువులు అనుకుంటారు కానీ నిజానికి శిష్యులే గురువులకు పరీక్ష పెడతారు. మనోఫలకం మీద గురురూపాన్ని ముద్రించుకుని, దాన్ని చట్రంలో పదిలంగా బిగించి, గురువులను దానితో పోల్చి చూస్తారు. దానికి మ్యాచ్ అయితేనే వారి మీద గురి ఏర్పడుతుంది. లేదా వారే వీరి ఆగ్రహానికి గురౌతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more