Jai Simha Movie Review and Rating | జై సింహా మూవీ రివ్యూ

Teluguwishesh జై సింహా జై సింహా Jai Simha Movie Review and Rating. Bala Krishna Nayanatara Starrer Directed by KS Ravikumar. Product #: 86446 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జై సింహా

  • బ్యానర్  :

    సీకే ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

  • దర్శకుడు  :

    కె.ఎస్.రవికుమార్

  • నిర్మాత  :

    సి.కళ్యాణ్

  • సంగీతం  :

    చిరంతన్ భట్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    సి.రామ్ ప్రసాద్

  • నటినటులు  :

    నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, మురళీ మోహన్, శివాజీ రాజా తదితరులు

Jai Simha Movie Review

విడుదల తేది :

2018-01-12

Cinema Story

వైజాగ్ కు చెందిన నరసింహ (బాలకృష్ణ) తన కొడుకుతో కుంభకోణానికి వలస వెళ్తాడు. అక్కడ ఓ ఆలయ ధర్మకర్త వద్ద పనిలో కుదురుతాడు. అనుకోని పరిస్థితుల నడుమ ఆ ఊరికే పెద్ద రౌడీ అయిన కన్నియప్పన్ తో వైరం పెంచుకుంటాడు. మరోవైపు ఆ ఊరి పోలీస్ అధికారితోనూ అతడికి గొడవ మొదలవుతుంది.

 

కానీ గౌరీ(నయనతార) మూలంగా అదే అధికారి కుటుంబాన్నే ఆ రౌడీ బారి నుంచి కాపాడే బాధ్యత తీసుకుంటాడు నరసింహ. అందుకు కారణమేంటి.. అసలు నరసింహ గతమేంటి? గౌరీ ఎవరు? అతను పెంచుతున్న పసిబిడ్డ అతని కొడుకు కాదా?
అన్నదే కథ.

cinima-reviews
జై సింహా

నందమూరి హీరో బాలకృష్ణ గత చిత్రం పైసా వసూల్ నిరాశపరచటంతో అభిమానులు తర్వాతి చిత్రం జై సింహా మీద ఆశలు పెట్టుకున్నారు. నయనతార, హరిప్రియ హీరోయిన్లుగా.. కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంక్రాంతి పండుగను సెంటిమెంటుగా భావించే బాలయ్య హిట్ అందుకున్నాడా? చూద్దాం.

విశ్లేషణ:

కథలో కానీ.. కథను చెప్పే తీరులో కానీ కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే అలాంటివేం ఆశించొద్దని ప్రోమోలతోనే చెప్పేశాడు దర్శకుడు రవికుమార్. మంచి కోసం ఉళ్లో ఉన్న చెడ్డవాళ్లతో పోరాడే హీరో.. హీరోయిన్ తో పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవటం.. విలన్ల చేతిలో హీరో నష్టపోవటం... అజ్నాతవాస జీవితం.. హీరోయిజం ఎలివేషన్ కోసం ఫ్లాష్ బ్యాక్ రివీల్... ఇవి సమరసింహారెడ్డి టైం నుంచి మొదలైనవే. అయితే కనీసం ఎంటర్ టైన్ మెంట్ అందిస్తాడేమోనని ఆశించే వారికి నిరాశే ఎదురవ్వక మానదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తదనం మచ్చుకైనా లేని పాత స్టయిల్లో సాగే సగటు కమర్షియల్ సినిమా. ఐతే రొటీన్ అయినా పర్వాలేదు.. పంచ్ డైలాగులు.. ఫైట్లు.. డ్యాన్సుల్లాంటి మసాలాలుంటే చాలనుకుంటే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మొదటి భాగంలో హీరో ఎవరో తెలీకుండా ఆయన నోటి నుంచి వచ్చే పవర్ ఫుల్ డైలాగులతోనే(అవసరం లేకపోయినా) సరిపోతుంది. ఇక సెకండాఫ్ లో అసలు కథలోకి ఎంటర్ అయ్యాక నయనతార ఎపిసోడ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అయితే మధ్యలో కామెడీ కోసం ప్రయత్నం దారుణంగా వికటించింది. ఇక చివర్లో అయితే భారీ యాక్షన్స్ సీన్లతో ముగింపు పెట్టేశాడు. రెగ్యులర్ తరహా కథనం కావటంతో కొత్తదనం కోరుకునే వాళ్లకు జై సింహా అంతగా రుచించకపోయినా.. అభిమానులకు, మాస్ ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది.

నటీనటులు:

బాలయ్య తన అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని అలరించే రీతిలో కనిపించాడు. పంచ్ డైలాగులు పేల్చాడు. ఫైట్లు చేశాడు. డ్యాన్సులు చేశాడు. అమ్మకుట్టి పాటలో బాలయ్య వేసిన స్టెప్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. అభిమానులకు వారు కోరుకున్నవన్నీ అందించాడు. ఐతే టుక్ పరంగా బాలయ్య శ్రద్ధ తీసుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఓకే కానీ.. ఫస్టాఫ్ లుక్ దారుణంగా ఉంది. హీరోయిన్లలో నయనతార మాత్రమే ప్రత్యేకత చాటుకుంటుంది. చేసింది కాసేపే అయినా.. ఆమెకూ పెద్ద పాత్ర లేకపోయినా ఆకట్టుకుంటుంది. హరిప్రియ.. నటాషా పాత్రలు తేలిపోయాయి. ముఖ్యంగా హరిప్రియకు ఛాన్స్ దొరికినప్పటికీ సరిగ్గా వినియోగించుకోలేదు.

విలన్లుగా అశుతోష్ రాణా.. కాలకేయ ప్రభాకర్ మామూలే. ప్రకాష్ రాజ్ ఓవర్ ద బోర్డ్ యాక్టింగ్ తో విసిగిస్తాడు. బ్రహ్మానందం ఔట్ డేటెడ్ అనిపిస్తుంది. మిగతా నటీనటుల గురించి చెప్పడానికేమీ లేదు.

 

టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

రంతన్ భట్.. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ప్రియం జగమే ఆనందమయం పాట మాత్రమే ప్రత్యేకంగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్ నెస్ ఎక్కువైంది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. రత్నం కథ.. మాటలు అన్నీ పాత తరహాలో సాగాయి. పంచ్ డైలాగుల కుప్ప పోసేశాడాయన. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

తీర్పు:

కె.ఎస్.రవికుమార్ దర్శకుడిగా తన ముద్ర ఏమీ చూపించలేదు. రత్నం రాసింది అలా తీసిపెట్టారనిపిస్తుంది. రొటీన్ హీరో ఎలివేషన్ సీన్లు.. లెక్కకు మిక్కిలి పంచ్ డైలాగులు.. చూస్తుంటే రవికుమార్ దర్శకుడిగా టచ్ ని కోల్పోయిన ఫీలింగ్ కలగక మానదు. అయితే కొంచెం బలంగా.. ప్రభావవంతంగా చూపించింది పసిబిడ్డతో ముడిపడ్డ సెంటిమెంట్ ఎపిసోడ్నే. కానీ, దాని కూడా సాగదీయటంతో పాత సినిమాలు గుర్తొస్తాయి. బాలయ్య నుంచి అభిమానులు ఆశించే అంశాలున్నాయి కాబట్టి వాళ్లు.. కొంత మేర మాస్ ప్రేక్షకులు సంతృప్తి చెందొచ్చేమో. కానీ క్లాస్ ప్రేక్షకులు.. కొత్తదనం కోరుకునే వాళ్లకు మాత్రం ‘జై సింహా’ కష్టమే.

చివరగా.. జై సింహా.. ఆన్ ఆర్టినరీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా