Ramayanam-Thirtythree-Story | రామాయణం - 33వ భాగం

Ramayanam thirtythree part story

Ramayana, Ramayana Thirtythree, Ramayana Story, Ramayana Epic Story, Ramayana Parts, Ramayanam 33th Part

The Ramayana is an ancient Sanskrit epic about Rama. It is one of the two most important ancient epics of India, the first one being the ancient Ramayana. The epic was originally written by sage (rishi) Valmiki of Ancient India. The book has about 96,000 verses and is divided into seven parts.

రామాయణం - ౩౩ వ భాగం

Posted: 07/16/2018 03:03 PM IST
Ramayanam thirtythree part story

సుమంత్రుడు అయోధ్యకి తిరిగివచ్చి, రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు, రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు " రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయల యందు తనకెటువంటి బేధభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు " అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు......

" లక్ష్మణుడు పడవెక్కుతూ, మా తండ్రి కామమునకు లొంగిపోయి, సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని, ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు " అన్నాడు. మరి సీతమ్మ ఎమనిందని దశరథుడు అడుగగా " సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది " అన్నాడు.

అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు " ఏమిలేదయ్య, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ, ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచివెళుతుంటే, హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి (ఎందుకంటే, అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి, కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట). అలా నడిచిందయ్యా సీతమ్మ " అని సుమంత్రుడు అన్నాడు.

అప్పుడు కౌసల్య " ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల(బంధువులు) చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దెగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దెగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దెగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను. నీ దెగ్గర ఉండను " అని అనింది.

కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు " నేను దౌర్భాగ్యుడనే కౌసల్యా, నేను ఎందుకూ పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు. ఓదారుస్తావని కదా నీ దెగ్గరికి వచ్చాను, పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడిచేస్తే, నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటాను " అని రెండు చేతులతో నమస్కారం చేశాడు.

న ఏషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |

ఉభయోః లోకయోః వీర పత్యా యా సంప్రసాద్యతే ||

కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని " మహా ధర్మాత్ముడైన భర్త, భార్య దెగ్గర ఇలా రెండు చేతులు పెట్టి, నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే, ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. నన్ను క్షమించు " అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది.

తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు " నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దెగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను.

అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు.

తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దెగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జెరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి 'హా! కుమారా, హా! కుమారా' అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ 'హా! కుమారా' అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు.

ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలొ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, 'హా! కుమారా' అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా......రామా........." అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.

అక్కడే కూర్చున్న కౌసల్యా సుమిత్ర, దశరథుడు మూర్చపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు, కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు.

దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీఅంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలొ(రాసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జెరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు.

మార్కణ్డేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః |

కాత్యయనో గౌతమః చ జాబాలిః చ మహా యశాః ||

ఏతే ద్విజాః సహ అమాత్యైః పృథగ్ వాచం ఉదీరయన్ |

వశిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజ పురోహితం ||

ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యయనుడు, గౌతముడు, జాబాలిమొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు " మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలొ కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జెరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి.

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం |

రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం ||

రాజె సత్యం, రాజె ధర్మం, రాజె తల్లి, రాజె తండ్రి, రాజె దైవం, రాజె సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది " అని ఆ మహర్షులు అన్నారు.

అప్పుడు వశిష్ఠుడు " ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దెగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము " అని అన్నడు.

తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచిపాంచాల రాజ్యాన్ని చేరి, శరదండము అనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి,నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలముఅనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షముఅనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు.

Source: fb.com/LordSriRamaOfficalPage

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana  Parts  రామాయణం  భాగాలు  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more