చిత్రం పేరు : ‘దేనికైనా రెడీ’
విడుదల తేదీ : 24. 10. 2012
మాటలు : మరుధూరి రాజా
సంగీతం : యువన్ శంకర్‌రాజా, చక్రి
నిర్మాత : యం. మోహన్‌బాబు
దర్శకత్వం : నాగేశ్వర రెడ్డి
తారాగణం: : విష్ణు, హన్సిక, ప్రభు, బ్రహ్మానందం, సుమన్, సీత, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిషోర్, ధర్మవరపు తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.5
పరిచయం :
కొంతకాలంగా, కొందరు హీరోల చిత్రాల్ని చూస్తూంటే - కథ కోసం పాకులాడాల్సింది పోయి.. మిగతా శాఖలన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉండాలన్న తాపత్రయం మాత్రం కనిపిస్తోంది. అదీ వారసుల సినిమా అయితే మరీనూ. వంశచరిత్రలూ - ఆ స్థాయి పవర్‌ఫుల్ డైలాగులూ.. వెరసి పాటలూ ప్రేక్షకుల్ని ఇబ్బందుల పాల్జేసి నరక యాతన పెడుతున్నాయి. కానీ - మంచు విష్ణు మాత్రం ఆ దోవన పోకుండా, తనకు గతంలో అచ్చివచ్చిన రెడీ దారినే పయనించాడు. దానివల్ల ప్రేక్షకుల్ని భయపెట్టలేదు సరికదా, కాస్తంత నవ్వించాడు. కొన్ని దసరా కబుర్లు చెప్పాడు. మాస్ ఇమేజ్ కోసమో – కమర్షియల్ హంగుల కోసం చూసుకోకుండా, పాత చింతకాయ పచ్చడి కథయనా, ఆ కథ బోలెడు పాత సినిమాలను గుర్తుకు తెచ్చినా.. ఏమైందో చూద్దాం...
చిత్ర కథ :
కోర్టు నేపథ్యంతో సినిమా స్టార్ట్ అవుతుంది. బాషా (సుమన్) తన ప్రత్యర్థి వీరనరసింహ నాయుడు (ప్రభు)పై కోర్టులో 20 ఏళ్ల తర్వాత కేసు గెలుస్తాడు. దీని వెనుక కథలోకి వెళ్తే - సరస్వతి (సీత), బాషా(సుమన్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి వీర నరసింహ నాయుడుకి ఇష్టంఉండదు. తన కూతురు కులాంతరవివాహం చేసుకుందన్న బాధతో సరస్వతి తండ్రి (నాగిరెడ్డి) గుండె పోటుతో మరణిస్తాడు. దీంతో నరసింహ నాయుడు కోపంతో బాషా కాలు నరికేస్తాడు. అప్పట్నుంచీ రెండు కుటుంబాలమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీర నరసింహ నాయుడుకీ బాషా కీ మధ్య ఆస్తి గొడవల్లో కోర్టు కెక్కుతారు. ఆవైరం చిలికి చిలికి తుపానుగామారుతుంది. ఇంత జరుగుతున్నా సరస్వతికి మాత్రం పుట్టిలంటే ప్రాణం. ఈ నేపథ్యంలో బాషా - సరస్వతి పుత్రరత్నం సులేమాన్ (విష్ణు)కి అమ్మ సంతోషంగా ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ఇక దేన్నీ కోరడు. అందుకోసం దేనికైనా రెడీ అంటాడు. తన తల్లికి ఆమె అన్నయ్య అంటే ఉన్న ప్రేమని గ్రహిస్తాడు.
కానీ ఎలా? రెండు కుటుంబాలకూ గొడవలు. మార్గం కోసం అన్వేషిస్తూంటే బంగార్రాజురూపంలో ఆలోచనకు తొలి మెట్టు పడుతుంది. వీర నరసింహనాయుడు ఇంట్లో బంగార్రాజు గుమాస్తా. నాయుడు ఇంట్లో చండీ యాగం జరిపించాల్సి వస్తుంది. పురోహితుడు కృష్ణశాస్ర్తీ దానికి సరైన ఘటికుడని.అతనితోమాట్లాడతాడు బంగార్రాజు. కొన్నికారణాంతరాల వల్ల కృష్ణ శాస్ర్తీస్థానంలో సులేమాన్ వెళతాడు. మేనమామ ఇంట్లో అడుగు పెట్టిన సులేమాన్ చండీయాగం జరిపించాడా? విడిపోయిన రెండు కుటుంబాలు కలిశాయా? మధ్యలో షర్మిల (హన్సిక)తో ప్రేమ యాగం ఎంతవరకూ వచ్చిందీ అన్నది క్లైమాక్స్.
విశ్లేషణ :
కథని కామెడీ ట్రాక్‌లో నడిపించాలనుకుంటే - అంతకంటే సౌలభ్యం మరొకటి ఉండదు. లాజిక్‌కు దొరకాల్సిన అవసరం ఉండదు. ప్రేక్షకులూ అంతగా పట్టించుకోరు. శ్రీను వైట్ల ఇదే టెక్నిక్‌ని ప్రయోగిస్తాడు. నాగేశ్వరరెడ్డి కూడా అదే బాట పట్టాడు. మరో విశేషం ఏమిటంటే శ్రీను వైట్ల చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించే గోపీ మోహన్, కోన వెంకట్ ఈ చిత్రానికీ పని చేయటం. ఇక ‘ఢీ’ తర్వాత విష్ణు మళ్లీ కొత్తగా కనిపించటం ఈ చిత్రంతోనే. అతణ్ణి చూస్తూంటే కొన్నికొన్ని సందర్భాల్లో ‘మోహన్‌బాబు’ జ్ఞప్తికి వస్తాడు. బహుశా అందుకేనేమో -ఓ సన్నివేశంలో ఎం.యస్ చేత అదే డైలాగ్ అనిపించారు. ‘ఈ బాబెవరూ.. అచ్చం మోహన్‌బాబులా వున్నాడు’ అని. అతడి డైలాగ్ డెలివరీ.. నటన అచ్చు గుద్దినట్లు తండ్రిని పోలి ఉండటం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కావొచ్చు కూడా.
కథలోసొబగు... బిగి ఉంటే ‘హిట్’ వైపు అడుగులు పడినట్టే. దానికి ఈచిత్రం ఒక ఉదాహరణ. గతంలో తాను చేసిన కొన్ని పొరపాట్లను ఈ చిత్రం ద్వారా సరిదిద్దుకొని ఇటు స్టెప్పుల విషయంలోనూ.. పాటల విషయంలోనూ మరింత జాగ్రత్త తీసుకున్నాడు విష్ణు. దాంతో మరో సగం విజయం సాధించినట్టే. విష్ణు - బ్రహ్మానందం కాంబినేషన్ స్క్రీన్‌పై నవ్వుల జల్లు కురిపించింది. కథానాయిక హన్సిక గురించి ప్రత్యేకించి చెప్పుకోటానికేం లేదు. ఎందుకంటే - మళ్లీ ఇటీవలికాలంలోకి వెళితే - సగటు హీరోయిన్ ఎలా ఉంటుందో అలాంటిపరిస్థితే. ఈ అమ్మడు ‘బాడీ లాంగ్వేజ్’ సంగతి పట్టించుకోకపోతే - మరింత కష్టం. ప్రేక్షకులకు భారం. మిగతా వారంతా నటనలోఆరితేరిన వారు కాబట్టి ప్రతి సన్నివేశాన్నీ పండించారు. వీరిలో బంగార్రాజు బ్రహ్మానందంకే ఎక్కువ మార్కులు పడతాయి. ఒకానొక సినిమాలోని బ్రాహ్మి సాఫ్ట్ వేర్ ని గుర్తు చేసినా.. నవ్వు తెప్పిస్తుంది. మొదట్లోనే చెప్పుకున్నట్టుగా కథకి కామెడీని జోడించాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా హాయిగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌లో కథ బోర్ కొడుతోంది అనుకుంటున్న తరుణంలో నేపాల్ నుంచీ ఎం.ఎస్ దిగటంతో మళ్లీ కథ సరైన ట్రాక్‌లో పడుతుంది. ‘ఇక్కడ.. అక్కడ’ అన్న మేనరిజంతో నవ్వించాడు ఎం.ఎస్. ఒక్క సన్నివేశంలోనూ ఏవీఎస్ మొహంలో నవ్వు కనిపించకపోయినా.. ఆ పాత్ర ప్రవేశించినప్పుడల్లా ప్రేక్షకుల మొహాల్లో నవ్వు కనిపించింది.
అనుకూల ప్రతికూలాంశాలు :
స్క్రీన్ ప్లే బోర్ లేకుండా సాగింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బావుంది. పాటల్లో ‘పిల్లందం కేకా..’ ‘నిన్ను చూడకుండా’ పాటలు బాగున్నాయి. సంగీతం ఓకే. చక్రి - యువన్ శంకర్‌రాజా సంగీతం బాగుంది. కొన్ని పాటలు సందర్భోచితంగా అనిపించలేదు. మరోసారి నవ్వుల సినిమా తీసి,కామెడీ సినిమాలకు తనూ రెడీ అనిపించుకున్నాడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. సీమ శాస్ర్తీ - సీమ టపాకాయ్ లాంటి చిత్రాలను అందించిన నాగేశ్వరరెడ్డి తనఖాతాలో మరో కామెడీనివేసుకున్నాడు. అయితే కథను కూడా కాస్త పట్టించుకుంటూ వుండాలి. అన్నిసార్లూ పాతబంగారానికి సరియైన వెల దక్కదు కదా...
ఉపసంహారం :
ప్రేక్షకుల ఆలోచనా మారింది. వీళ్లూ కథ కోసం వెతుక్కోవటం లేదు. టికెట్ ధరకి కాస్తయినా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడా? లేదా? నవ్వించాడా? లేదా? అన్నది పట్టించుకుంటున్నారు కాబట్టి - హాయిగా నవ్వుకోటానికి వెళ్లొచ్చు.
...avnk