Internationally growing demand raises gold prices

international, demand, gold prices, world gold counsil, Rs.590, raises high

internationally growing demand raises gold prices

పసిడి ధరలకు మళ్లీ రెక్కలు..

Posted: 09/27/2014 12:00 PM IST
Internationally growing demand raises gold prices

భారత్‌లో మళ్లీ పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతేడాది తొలి అర్ధభాగంలో అమ్మకాలు నిస్తేజంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో పండుగ సీజన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కానుండటంతో అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ జ్యువెల్లరీ విభాగ డైరెక్టర్ విపిన్ శర్మ తెలిపారు. జనవరి-జూన్ మధ్యకాలంలో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 14 శాతం క్షీణించాయి. పసిడిపై దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని ఇన్వెస్టర్లు భావించడం అమ్మకాలు పుంజుకోవడానికి కారణమవుతుందన్నారు.

పండుగలకు తోడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుండటంతో ఈ ఏడాది భారత్‌లో 850 నుంచి 950 టన్నుల మేర బంగారం విక్రయాలు జరగనున్నాయని ఆయన అంచనావేస్తున్నారు. గడిచిన త్రైమాసికంలో అమ్మకాలు స్వల్ప వృద్ధి నమోదుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న బంగారం అమ్మకాల్లో సగభాగం పెండ్లిళ్ల సీజన్‌లోనే జరుగుతున్నాయని, ప్రతియేటా లక్షల్లో వివాహాలు జరుగుతుండటంతో పసిడికి డిమాండ్ అధికంగా ఉండనున్నదన్నారు.

ప్రతియేటా ధరలు తగ్గడం మాములు విషయమేనని, స్వల్పకాలికంగా తగ్గుతూ ఉంటాయని, ఆ తర్వాత పుంజుకుంటాయని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా భారత్‌లో పసిడి డిమాండ్ ఊపందుకున్నదని, వచ్చే రెండేళ్ల వరకు మరింత పుంజుకునే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ వర్గాలు పేర్కొన్నాయి.

గడిచిన కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. పండుగ సీజన్ కావడంతో ఆభరణాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి కనబర్చడంతో దేశీయ బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి ధర ఒక్క రోజులో 590 రూపాయలు ఎగబాకి రూ.27,550కి చేరుకుంది. జూన్ 20 తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.

పసిడితోపాటు వెండి ధర కూడా పుంజుకుంది. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో ధర రూ.550 పెరిగి రూ.39,900 పలికింది. దసరా, దీపావళి పండుగలతోపాటు పెండ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభంకానుండటంతో ధరల్లో పెరుగుదల కనిపించిందని వ్యాపారులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 0.6 శాతం పెరిగి 1,228.51 డాలర్లు పలికింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : international  demand  gold prices  world gold counsil  Rs.590  raises high  

Other Articles