భారతంలో దుర్యోధనుడు పెద్ద విలన్. కాని కేరళలోని మలనాడకు వెళితే, అతనే అక్కడి ప్రజలకు పెద్ద హీరో. తరతరాలుగా తమ ఆయురారోగ్యాల్నీ, పంటపొలాల్నీ కాపాడే కురుసార్వభౌముడినే వారు నిత్యపూజలతో కొలుస్తున్నారు. ఆ ఊరిపక్కనే శకునికి కూడా ఒక ఆలయం ఉంది. కురువ వంశీయుల చిత్రమైన ఆచారాలు, విశ్వాసాలను గురించి తెలుసుకుందాం.
కేరళలోని కొల్లం (క్విలన్) జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భరణిక్కావు. దుర్యోధనుడు, శకుని ఆలయాలకు ఆ ఊరి నుంచే ప్రయాణం మొదలవుతుంది. ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వస్తున్నా, భరణిక్కావులో మాత్రం వసతులేవీ ఉండవు. భరణిక్కావు, చెక్కొళి మీదుగా దుర్యోధనుడు కొలువైన పొరువళి పెరువిరుత్తి మలనాడకు చేరుకోవాలి. దుర్యోధనుడంటే మనకు దుర్మార్గుడిగానే తెలుసు. అలాంటి రాజుకు కూడా ఒక ఆలయం నిర్మించి, ప్రత్యేక పూజలు చేస్తుండటం కొంత వింతగానే అనిపిస్తుంది.
గద్దె మీదే కొలువైనాడు..
మలయాళంలో 'మల' అంటే చిన్న కొండ. 'నాడ' అంటే దేవాలయం. మల మీద నాడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి మలనాడ అనే పేరొచ్చింది. కేరళ కళా సంస్కృతి, నిర్మాణ శైలిలో ఆలయ ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. ఆకాశమే పైకప్పుగా సప్తవర్ణ రంజిత పుష్పాలు, తళుకులీనే గొడుగులతో అందంగా అలంకరించిన నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది.. దాని మీద ఎలాంటి అర్చనామూర్తి లేదు. ఆ గద్దే దుర్యోధనుని సింహాసనంగా.. దాని మీద ఆయన ఆసీనులై ఉన్నారన్న భావనతో భక్తులు కొలుస్తారట! ఆలయ ఊరళి (అర్చకులు) శశిధరన్, దేవాలయ నిర్వహణాధికారి సురేష్‌లిద్దరూ.. మలనాడ పౌరాణికగాథలు, అక్కడ జరుగుతున్న పూజలు, ఉత్సవ విశేషాలను చెప్పుకొచ్చారు.
దుర్యోధనుని పేరిట శిస్తులు..
పన్నెండేళ్ల అరణ్యవాసం తర్వాత పాండవులు చేసిన ఏడాది అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు, శకుడు వేయని ఎత్తులు లేవు. "మలనాడ ప్రాంతంలో నివసిస్తున్న సిద్ధులకు ఏవో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆ రహస్యాలు తెలుసుకుంటే కురుక్షేత్రంలో విజయం సాధించవచ్చు'' అని కురుసార్వభౌమునికి ఎవరో సలహా ఇచ్చారట. ఆయన వెంటనే జిత్తులమారి మామ శకుడ్ని వెంటబెట్టుకుని సిద్ధుల్ని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు పౌరాణిక కథ ఒకటి ప్రచారంలో ఉంది. సుదీర్ఘప్రయాణంలో అలసిపోయిన వారిద్దరికీ స్థానికులైన 'కురువలు' స్వాగతం పలికారట. చల్లటి కొబ్బరి కల్లుతో దాహం తీర్చారు. వారు అంటరానివారైనా సహృదయంతో అందించిన గౌరవమర్యాదలకు పొంగిపోయిన దుర్యోధనుడు.. ఆ ప్రాంతానికి వారినే పాలకులుగా నియమించాడట. రాజ్యపాలనకు తోడు వందలాది ఎకరాల సారవంతమైన భూముల్ని సైతం కట్టబెట్టాడట. కథలో ఎంత నిజముందో ఏమో కాని, చిత్రమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ ఆ భూములకు దుర్యోధనుడి పేరిటే శిస్తు వస్తోంది.
మళ్లీ మనం పాత కథలోకి వెళితే- పాండవుల్ని జయించడానికి శివుడి కోసం తపస్సు చేయమని దుర్యోధనునికి సిద్ధులు సలహా ఇచ్చారట. ప్రస్తుతం ఆలయ గద్దె ఉన్న ప్రాంతంలోనే దుర్యోధనుడు తపస్సు చేశాడని కురువవంశస్తుల విశ్వాసం. ఇక్కడి నుంచి వెడలిన తర్వాతే.. కురుక్షేత్రంలో కురురాజు వీరమరణం పొందాడని స్థానిక కథల్లో ఉంది. అందుకే, ఆయనను ఇప్పటికీ తమ కులదైవంగా భావించి.. తామే పూజారులుగా ఉంటూ.. కొలుస్తున్నట్లు కురువ వంశస్తులు చెప్పారు.దక్షిణ భారతదేశంలో ఏకైక దుర్యోధనుని ఆలయం (ఉత్తరాఖండ్‌లో రెండు ఆలయాలు ఉన్నాయట..)గా మలనాడ దేవాలయం విరాజిల్లుతోంది.
కొల్లం, పట్టనంతిట్ట జిల్లాల్లోని నూటికి పైగా కొండల మీదున్న ఆలయాలన్నిటికీ దుర్యోధనుడే అధిపతి. కేరళవాసులందరూ ఈయన్ను ప్రేమతో 'అప్పూపన్' అని పిలుచుకుంటారు. అవడానికి ప్రతినాయకుని ఆలయమైనా.. 'అడవి, ముహుర్తి, పుళుక్కు అవల్' అంటూ నెలకొకసారి ప్రత్యేక పూజలు జరపడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు, నలభై ఏడు రకాల ఆర్జిత సేవల్ని కూడా చేస్తారు. ఇవన్నీ స్థానికుల జీవనాధారమైన వ్యవసాయాభివృద్ధిని కాంక్షించి చేసేవే! వీటన్నిట్లోనూ ముఖ్యమైనది 'పల్లిప్పన్' పూజ.
పుష్కరానికొకసారి..
వేలన్ వంశస్తుల ఆధ్వర్యంలో పన్నెండేళ్లకు ఒకసారి పన్నెండు రోజులపాటు పల్లిప్పన్ పూజలు చేస్తారు. ఈ పూజల్ని చేయడం వల్లే.. ప్రజలకు, పంటపొలాలకు సోకిన నరదృష్టి, గ్రహదృష్టి, రాక్షసదృష్టి తొలగిపోతాయన్నది వారి విశ్వాసం. అతి ఖరీదైన పల్లిప్పన్ పూజ ఈ ఏడాది మే నెల పది నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు జరిగింది. మళ్లీ ఇలాంటి పూజ జరిగేది 2023లోనే..!మలనాడలో నిర్వహించే ఉత్సవాల్లోకెల్లా ప్రత్యేకమైనది మలయాళ కేలండరులోని మీనం (మార్చి-ఏప్రిల్)నెలలోని రెండవ శుక్రవారం జరిగే మలనాడ మలక్కూడ మహోత్సవం. వేలాది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. రంగురంగుల వస్త్రాలు, గడ్డి, కర్రలు పట్టుకుని.. అందంగా అలంకరించిన ఎద్దు, గుర్రపు బొమ్మలతో ఊరేగింపు చేస్తారు. మన దగ్గర శివరాత్రికి ప్రభలను ఊరేగించినట్లే ఇక్కడ కూడా ఊరేగిస్తారు. ఇవన్నీ దుర్యోధనునికి కెట్టుకలశ (కానుక)గా సమర్పించుకునేందుకేనట. అదే రోజు సాయంత్రం మలనాడకి గర్వకారణమైన స్వర్ణకోడి (బంగారు ధ్వజం)ని ఏనుగుమీద తీసుకెళతారు. రాత్రి కథాకళి నృత్యంలో ప్రత్యేక విధానమైన 'నిళహళ్‌కూత్తు' రూపంలో మహాభారతాన్ని ప్రదర్శిస్తారు. మలక్కూడ ఉత్సవం జరిగిన వారానికి 'ఊరళి' ఆధ్వర్యంలో రారాజుకు ఆబ్ది పెడతారట. ఈ ఎనిమిది రోజులు ప్రత్యేక పూజలతో పండుగ వాతావరణం ఉంటుందని ఆలయ నిర్వాహకులు చెబుతారు.
కొబ్బరి కల్లే తీర్థం..
ఆలయంలో భక్తులు సమర్పించుకునే నివేదనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు భక్తులు పొగాకు కాడలు, ఉడికించిన దుంపలు, పూలు, వక్కకాయలు, కొబ్బరికల్లు తెచ్చి భక్తితో సమర్పించుకున్నారు. భక్తులు కానుకలుగా ఇచ్చిన కోడిపుంజుల్ని ఆలయం నిండా కట్టేశారు. ఎలాంటి పైకప్పు లేని ఆలయానికి అవే కాపలాదారులట. తమ కోరికలు తీరితే.. మేకలు, సారాయి, కూరగాయల్ని కూడా ఇస్తారట. కానుకల్ని తూచేందుకు అక్కడ ప్రత్యేక త్రాసు ఉంటుంది. ఇవన్నీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలని అక్కడున్న పెద్దలు చెప్పారు.
శకుని మామ ఆలయం..
పవిత్రేశ్వరంలో శకుని ఆలయం ఉంది. దుర్యోధనుడితోపాటు శకుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చాడని అంటారు, ఆ సందర్భంలోనే శకుడు పవిత్రేశ్వరంలో తపస్సు చేశాడట. కురుక్షేత్రంలో అనుసరించాల్సిన యుద్ధవ్యూహాలన్నింటినీ ఇక్కడే రూపొందించినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. చిన్నగుట్ట మీద ఏపుగా పెరిగిన వృక్షాలు ఉన్నాయి. చెట్ల కింద నల్లరాతి గద్దె మీద శకుడు, ఆయనకు వింజామరలు వీస్తున్న ఇద్దరు సేవకుల ఫలకాలను ప్రతిష్టించారు. దుర్యోధనుడి ఆలయంలో మాదిరే ఇక్కడా పూజలు చేస్తున్నారు. అక్కడ ఉత్సవాలు జరిగే సమయానికే ఇక్కడ కూడా జరుపుతున్నట్లు ఊరి ప్రజలు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more