ఒలంపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు ప్రత్యేక స్టోరీ | Special Story on Rio Olympics silver medalist PV Sindhu

Pv sindhu special story

PV Sindhu life, facts about PV Sindhu, Unknown facts about PV Sindhu, silver medalist PV Sindhu, PV Sindhu parents, PV Sindhu life, PV Sindhu Hyderabadi, Telugu Girl PV Sindhu, PV Sindhu Rio olympics

PV Sindhu becomes first Indian woman to win an Olympic silver medal.

అలుపెరగని పోరాటంతో విజయ తీరాలకు

Posted: 08/20/2016 11:18 AM IST
Pv sindhu special story

సింధు ఈ హైదరాబాదీ పేరు ఇప్పుడు యావత్ భారతం మారుమోగిపోతుంది. మూడు రోజుల క్రితం దాకా ఈ పేరుపై ఎలాంటి ఆశలు లేవు. ఒక్క పతకమైనా గెలిచి భారత పరువును నిలబెట్టాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకున్న వేళ అద్భుత ఆటతీరుతో ఫైనల్లోకి ప్రవేశించి ఈ తెలుగమ్మాయి రజతం అందించింది. ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయం పాలైనా భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో ఒక్కసారైనా దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కలను నిజం చేసుకోవడమే కాదు.. కోట్లాదిమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్...
పీవీ సింధు... పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు(21) క్రీడాకారుల కుటుంబంలో జన్మించింది. ఆమె కుటుంబం కూడా క్రీడా నేపథ్యం ఉన్నదే. తండ్రి రమణ, తల్లి విజయ ఇద్దరు మాజీ జాతీయ స్థాయి వాలీబాల్ ఆటగాళ్లే. రమణ 2000 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా అందుకున్నారు. సింధు తండ్రి 39 ఏళ్ల వయసులో అర్జున అవార్డు అందుకోగా సింధు 18 ఏళ్లకే దానిని అందుకుని తానేంటో నిరూపించింది.

స్వతహాగా క్రీడాకారుల కుటుంబ నుంచి వచ్చిన సింధుకు చిన్నప్పటి నుంచే క్రీడలపై మనసు మళ్లింది. ఐదేళ్ల వయసులో చిట్టి చేతులో రాకెట్ పట్టి ఇరుగు పొరుగు పిల్లలతో బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెట్టింది. దీంతో ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమె శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. అలా మొదటిసారి ఓ వ్యక్తి వద్ద శిక్షణ తీసుకున్న సింధు తర్వాత గోపీచంద్ అకాడమీకి చేరింది.

ఓ పక్క చదువు.. మరో పక్క శిక్షణ.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు సింధు చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడింది. కోడి కూయకముందే రాకెట్ పట్టుకుని అకాడమీలో వాలిపోయింది. రెండు గంటల ప్రాక్టీస్ తర్వాత తిరిగి ఇంటికొచ్చి బ్యాగు సర్దుకుని స్కూలు బాట పట్టేది. మళ్లీ సాయంత్రం స్కూలు నుంచి రాగానే మళ్లీ శిక్షణ. అయితే ఆట ప్రభావం చదువుపై పడకుండా అంత చిన్నవయసులోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఓవైపు బ్యాడ్మింటన్‌లో రాటు దేలుతూనే మరోవైపు చదువులోనూ రాణించింది. టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది.

ఫెవరెట్స్
నోరూరించే హైదరాబాద్ బిర్యానీ అంటే సింధుకి చాలా ఇష్టం. ఎంతలా అంటే కోచ్ వారిస్తున్నా ఫిట్‌నెస్‌ పక్కనపెట్టి మరీ బిర్యానీని లాగించేసిన సందర్భాలు అనేకం. ఇక తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు వస్తే చాలూ సింధు తెగ సంబరపడిపోతుందట. ఎంత బిజీగా ఉన్నా లంగావోణీ వేసుకుని నెత్తిపై బోనంతో అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేస్తుంటుంది. మహేష్ బాబు, అనుష్క ఫెవరెట్ స్టార్లు అని చెబుతున్న సింధు షెడ్యూల్ తో వారి సినిమాలు చూడలేకపోతున్నానని తెగ ఫీలయిపోతుంది. పుస్తకాలంటే చిరాకు పడే సింధు, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

ద్రోణాచార్యుడి అండతో..
ఒలింపిక్స్‌లో రజతం సింధుకు అయాచితంగా ఏమీ రాలేదు. ఎన్నో త్యాగాలు చేసింది. గంటలు గంటలు ప్రాక్టీస్ లు చేసింది. రోజుకు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది. కానీ, ఆమె వెనుక ఉన్న ఒకే ఒక్క వ్యక్తి కోచ్ పుల్లెల గోపీచంద్ ఉన్నాడు. సింధులో గెలవాలన్న తపన, కసి పెంచింది ఆయనే. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టించిన గోపీ అక్కడితో సరిపెట్టుకుండా తన లాంటి ఎందరో బ్యాడ్మింటన్ క్రీడాకారులను దేశానికి అందించే పనిలో పడ్డాడు. బ్యాడ్మింటన్‌లో డ్రాగన్ కంట్రీ చైనాకు ఎదురొడ్డి నిలవాలన్న ఒకే ఒక్క ఆశయం, మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పాలన్న కసితో అకాడమీ స్థాపించాడు. ‘ద్రోణుడి’గానూ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్, సింధు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన శిష్యుల లిస్టు చాంతాడంత. ఈ క్రమంలో సింధు అందించిన విజయం ఆయనకు చాలా చాలా ప్రత్యేకం

అపజయాలే ఆయుధంగా...
కోర్టులో బెబ్బులిలా కనిపించే సింధు నిజానికి చాలా సున్నిత మనస్కురాలు. ఓడిపోతే కన్నీటి పర్యంతమయ్యేది. ఆ సమయంలో తండ్రి ఆమెను దగ్గరకు తీసుకుని అనునయించేవాడు. ప్రతీ అపజయాన్ని లెక్కపెట్టుకోమని బోధించేవాడు. అప్పుడే అంతకుమించిన విజయాలు సొంతమవుతాయని చెప్పేవాడు. తండ్రి మాటలు ఆమెలో స్ఫూర్తి నింపేవి. దీంతో మరోసారి బరిలోకి దిగినప్పుడు కసిగా ఆడేది అనడం కంటే పతకం కోసమే ఆడేది అంటే బాగుంటుందేమో. ఆమె ఆటతీరుకు ప్రముఖ ప్లేయర్లు అందరూ ముగ్ధులైపోయేవారు. తనకంటే బలమైన ప్రత్యర్థులను సైతం మట్టి కరిపించి తానేంటో నిరూపించిన సందర్భాలు అనేకం. ఆమె వ్యూహం.. ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదన్న వెనకడుగు వేయకూడదన్న పట్టుదల ఆమె ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించేలా చేసింది.

రికార్డుల పరంపర...
మైమరపించే ఆటతీరుతో అగ్ర క్రీడాకారిణిగా ఎదిగిన సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో స్థానం దక్కించుకుంది. 2013లో సింగిల్స్ వరల్డ్ చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్న సింధు ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2009లో కొలంబోలో జరిగిన సబ్ జూనియర్ ఆసియన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించింది. 2010లో జరిగిన ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్‌లో రజత పతకం అందుకుంది. 2012లో అండర్-19 చాంపియన్‌షిప్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరను చిత్తుచేసి ఆసియా యూత్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. అదే ఏడాది చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్‌లో 2012 లండన్ ఒలింపిక్ విజేత, చైనాకు చెందిన లీని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2013లో మలేసియా ఓపెన్ టైటిల్ సాధించింది. 2014లో జరిగిన గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. అలాగే డెన్మార్క్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె విజయాలు అపురూపం. ఆమె విజయాలకు పులకరించిన దేశం 2015లో నాలుగో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

రజతంతో కీర్తి పతాకం...
ఇక ఒలింపిక్స్‌లో తాజా విజయంతో దేశం గర్వపడేలా చేసింది. 125 కోట్ల జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశానికి ఒక్కటంటే ఒక్క పతకమూ రాని వేళ.. దిగ్గజ క్రీడాకారులందరూ ఒకరి తర్వాత ఒకరుగా చేతులెత్తేస్తున్న వేళ అత్యద్భుత పోరాట పటిమతో సాక్షి ఓ పతకంతో ఊరటనిస్తే... సింధు ఏకంగా దేశం తలెత్తుకునేలా చేసింది. ఫైనల్లో పోరాడి ఓడినా రజతం సాధించి పతకాల పట్టికలో దేశానికి స్థానం కల్పించింది. మువ్వన్నెల జెండాను విశ్వ వీధుల్లో రెపరెపలాడించింది. దేశానికి తొలి రజత పతకం అందించిన మహిళగా చరిత్ర సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  first Indian  woman  Olympic  silver medal  

Other Articles