ఆమెను చూస్తే... చలాకీతనానికి మారుపేరులా కనిపిస్తుంది. మాటకారితనం ఆమె ఇంటి పేరేమో అనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే హాసిని సుమ. ఆమె కనిపించిందంటే.. ప్రేక్షకులకు ఉత్సాహం రావాల్సిందే. నటిగా, యాంకర్ గా సుమారు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటి ‘సుమ’. ‘నాకు అందంగా ఉండటం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం అంటూ తనదైన శైలిలో సుమ మనకు చెప్పిన స్పెషల్ విషయాలు.ఎప్పుడూ అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా అందంగా ఎలా ఉంటావు అని చాలా మంది అడుగుతుంటారు...
ఇంతకీ సుమ రహస్యం ఏమిటంటే.. రోజూ ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేస్తాను. ముందు రోజు అలసిపోయిన నాకు ఇవే రీఛార్జిలా పనిచేస్తాయి. మనసులో ఏదీ దాచుకోను. నా కుటుంబం, నా కెరీర్... ఇవే నాకు ముఖ్యం. మరొకర్ని ఎత్తేయాలనో, పడేయాలనో ఆలోచించను. నా పర్సనాల్టీకి అవి సూటవ్వవని నాకు తెలుసు...
నా కుటుంబం విషయానికి వస్తే... మా మామగారు అందరికీ సుపరిచితులైన దేవదాసు కనకాల. ఆయన గొప్ప నటుడూ, దర్శకుడూ. మన సీరియళ్ళ ద్వారా ఎందరో నటీనటులు పరిచయమయ్యారు. నా తొలి పరిచయం గురించి చెప్పాలంటే...
ఇంటర్ లోనే పెళ్లి చూపులు...
1991... నేను ఇంటర్ చదువుతున్న రోజులవి. ప్రదీప్ గారని అప్పటి దూరదర్శన్ లో సీనియర్ నటుడు. ఓ సారి నేను సాంస్కతిక కార్యక్రమాల్లో భాగంగా వేదిక పై నాట్యం చేస్తుంటే.. ప్రదీప్, దూరదర్శన్ కార్యక్రమాల ప్రొడ్యూసర్ ఉమామహేశ్వరరావు చూశారు. మా ఇంటి కొచ్చారు. ‘ మీ అమ్మాయి నాట్యం బాగా చేసింది అన్నారు. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు గారిని ఎవరైనా పొగిడితే ప్రక్కనే డప్పు వాయిస్తుంటాడు ఒకడు.. అలా వాళ్ళు పొగుడుతుంటే నా గుండెల్లో డప్పులు మోగాయి.
‘మా సీరియల్ లో నటిస్తే బాగుంటుంది’ అని అడిగారు. అప్పుడు అమ్మానాన్నలకు ఏం చెప్పాలో తెలియలేదు. నలుగురి మధ్యా చాలా సేపు చర్చలు జరిగాయి. అమ్మానాన్న సరే అన్నారు. ఆ సీరియల్ పేరు ‘పెళ్లి చూపులు’ అలా బుల్లితెర ప్రవేశం జరిగింది.
అప్పట్లో ప్రజలకు ఉన్న అధ్బుతమైన వినోద సాధనం.. బుల్లితెర. అందులో నటించడమంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మేకప్ వేసుకుంటే చాలా గర్వంగా ఉండేది. తీసేస్తే నీరసంగా ఉండేది... సెట్ లో ఉన్నంత సేపు ఎంతో ఉత్సాహంగా ఉండేదాన్ని. బుల్లి తెరను ఇంత ఇష్టపడినా చదువును మాత్రం ఏ నాడు నిర్లక్ష్యం చేయలేదు. రోజులు గడిచే కొద్దీ అవకాశాలు పెరిగాయి. అప్పట్లో తక్కువ నిడివి ఉన్న ధారావాహికలే వచ్చేవి. అలా 15 20 25 ఎపిసోడ్ల ధారావాహికలు చాలా వాటిలో నటించాను. ఓ దశలో నా పేరు మారుమోగి పోయింది. దాంతో వెండితెరకు ప్రమోషన్ ఇస్తామంటూ అవకాశాలొచ్చాయి.
తొంభైలలో ఈటీవీ, జెమినీ టీవీ ఛానళ్ళ రాక.. ఓ సంచలనం... దూరదర్శన్ ఒక్కటే చూసే తెలుగు ప్రేక్షకులకు వాటి రాకతో... పంచభక్ష్య పరమన్నాలు రోజూ తింటున్నట్లు అనిపించింది. అటు దూరదర్శన్ లోనూ, ఇటు ఈ ఛానళ్ళలోనూ జీవన రాగం, స్వయం వరం, మేఘమాల, సమత, ఆరాధన, వెలుగు నీడలు, అన్వేషిత లాంటి ఎన్నో సీరియళ్ళలో నటించాను. తరువాత యాంకర్ గా అవకాశమొచ్చింది. యాంకర్ గా నా మొదటి కార్యక్రమం వన్స్ మోర్. అది సూపర్ హిట్ అయ్యింది. దాంతో యాంకర్ సుమా హవా మొదలైంది. ప్రియరాగాలు, కోకాకోలా హంగామా, అంత్యాక్షరి, పట్టకుంటే పట్టుచీర, అవాక్కయ్యారా, పంచావతారం, భలే ఛాన్సులే, జీన్స్... ఇలా ఎన్నో షోలూ, లైవ్ షోల్లో యాంకరింగ్ చేశాను.
ఇక మా అత్తయ్య గారి విషయానికొస్తే... పేరు లక్ష్మీదేవి. ఆమె కూడా మా మామయ్యలా గొప్ప నటి. నన్ను సొంత కూతురిలా చూసుకునే వారు. ఆమె దగ్గర ఉంటే... మా అమ్మ దగ్గర ఉన్నట్లే ఉంటుంది నాకు. అమ్మ గురించి చెప్పాలంటే... నేను పుట్టింది కేరళలోని పాలక్కడ్ లో. అమ్మ విమల. నాన్న పి.ఎన్. కుట్టి. రైల్వే ఉద్యోగి. నేను పెట్టిన ఏడాదికే నాన్నకు హైదరాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయింది. దాంతో మా కుటుంబం ఇక్కడికే వచ్చేసింది. అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే కాబట్టి చాలా గారాబంగా పెరిగారు.
తొలి చూపులోనే....
అమ్మానాన్నలూ, అత్తయ్యా మామయ్యలు అయిపోయారు. ఇక మా వారి గురించి చెప్పాలంటే... రాజీవ్. మీ అందరికీ తెలిసిన సుపరిచితుడే... మా ఇద్దరినీ కలిపింది బుల్లితెరే. ‘మాధురి’ సీరియల్ ప్రారంభమైంది. అందులో నేను రాజీవ్ కలిసి నటించాం. రాజీవ్ పరియచం అయింది ఆ షూటింగ్ లోనే. ఓ అబ్బాయి వచ్చి సెట్ లో కూర్చున్నాడు. ఎవరా అని ఆరా తీస్తే... దేవదాసు గారి అబ్బాయి రాజీవ్ అని తెలిసింది. తొలిచూపులోనే నాకు నచ్చాడు. నేను కూడా తనకు నచ్చానని తన చూపుల ద్వారా అర్థమయింది. తరువాత ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం. ఇద్దరమూ బయటపడగానే ప్రేమించుకోవడం మొదలు పెట్టాం. ఏడాదిన్నర పాటు ప్రేమ నడిచింది. తరువాత రాజీవ్ తన ప్రేమ గురించి చెప్పాడు. ఇంత లేటుగా చెప్పాడంటీ ఈ మహానుభావుడు అనుకున్నాను. కొన్నాళ్ళ తరువాత పెళ్లి ప్రసావన తీసుకొచ్చాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో 1999లో మా పెళ్లి జరిగింది.
పెళ్ళికి ముందు ఇంత స్వేఛ్చగా ఉన్నానో పెళ్లి తరువాత కూడా అంతే స్వేఛ్చగా ఉన్నాను. వాళ్ళింట్లో అందరూ నటులే కావడంతో నన్నూ చక్కగా అర్థం చేసుకున్నారు. యాంకరింగ్ ని వైవిధ్యంగా చేయడానికి ప్రయత్నించమని రాజీవ్ సూచనలిస్తాడు. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి రోషన్, అమ్మాయి మనస్విని. ఇద్దరూ చదువుకుంటున్నారు. సాయంత్రం ఇంటికెళ్తే వాళ్ళ హోం వర్కులు చూస్తాను అందరికీ భోజనం పెడతాను. మరుసటి రోజు స్కూలు బ్యాగులు సర్దుతాను.
ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. సినిమాలు, సమాచారమూ, పాటలు అన్నీ తెలుసుకుంటాను. యాంకర్ గా రాణించాలంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పటికీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. లేకపోతే... అహంకారం వచ్చేస్తుంది. ఒకసారి అది మనలోకి వచ్చిందంటే... మన ఎదుగుదల ఆగిపోయినట్లే.
సుమా ఇష్టా ఇష్టాలు...
నాకు యాంకర్ కొత్త గుర్తింపును తెచ్చిన కార్యక్రమం ఈటీవీ స్టార్ మహిళ. ఇప్పటి వరకూ 1100లకు పైగా ఎపిసోడ్ లు చేశాను. మహిళల కోసం ఉద్దేశించిన డైలీ షో... ‘ఇన్ని ఎపిసోడ్స్ చేయడం ప్రపంచంలోనే ఇదే ప్రథమం.
ఉత్తమ నటిగా, ఉత్తమ యాంకర్ గా నంది అవార్డులు అందుకున్నాను. ఉత్తమ యాంకర్ గా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాను.
నాకు మంచి స్నేహితులంటే... ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, సుచరిత, శివానీ.
ఇష్టమైన నటులు కమల్ హాసన్, సావిత్రి.
నా జీవితంలో చాలా సంతోషించిన సందర్భాలు రెండు... ఒకటి నా పెళ్ళి, రెండు పిల్లలు పుట్టినప్పుడు.
యాంకరింగ్ లో నాకు స్ఫూర్తి శేఖర్ సుమన్. ఆయన టీవీ షోలు చూస్తే ఆశ్చర్యమేసేది. ఆయన యాంకర్ గానే కాకుండా వివిధ పాత్రల్లో ఒదిగిపోయేవారు.
నేను సాంబారు , అవియల్, కాకరకాయ పులుసు బాగా చేస్తాను.
ఖాళీ దొరికితే పుస్తకాలు చదవాలనీ, సినిమాలు చూడాలనీ అనిపిస్తుంది. సిడ్నీ షెల్డన్ పుస్తకం చదివిశాను అని తన గురించి చెప్పుకొచ్చింది. మరి ‘సుమ’ ఇంకా పది కాలల పాటు తన సుస్వరమైన గొంతుతో యాంకరింగ్ చేయాలని ఆకాంక్షిద్దాం.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more