Information about assam tourism

assam, tourism, guwahati, kamakhya, kaziranga, kaziranga safari, rhino, one horned rhino, majuli, bihu, river cruise, brahmaputra, kalakshetra, tea, tea garden, shillong

Tourism in Assam, Information of Assam, Introduction of Assam, Assam Land, Assam Tourism, How to reach Assam, about Assam,

ఈశాన్య పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం

Posted: 04/16/2013 03:13 PM IST
Information about assam tourism

పట్టణానికి పూల దండ వేసినట్లు హిమాలయ శ్రేణులు... ఆత్మీయులను పలకరిద్దామని వచ్చే అతిథుల్లా వలస పక్షులు... ప్రకృతి తివాచీ మీద అలంకరించిన రంగురంగుల పూలు... ఈ నేలకే పరిమితమైన రకరకాల పండ్లు...హఫ్లాంగ్ లేక్‌లో బోట్ షికారు... ఒకింత సాహసంతో ట్రెకింగ్... రెట్టించిన ఉత్సాహంతో హ్యాంగ్ గ్లైడింగ్... పారాగ్లైడింగ్... ఈ ఈశాన్య విహారంలో పర్యాటకులను అలరించే సొగసులు... ఇలా ఎన్నో విశేషాలు కలగలిసిన హప్లాంగ్ విశేషాలు.

దూరంగా నీలిపూలు పరుచుకున్న కొండలు ఊటీని గుర్తు చేస్తాయి. చెయ్యెత్తితే తగిలే మబ్బు తునకలు, ఆకుపచ్చటి నదుల మధ్య ప్రయాణం... ఆరెంజ్ తోటలు, పైనాపిల్ చెట్లు, అరుదైన పక్షులు కనువిందు చేస్తున్నాయి. మంచు దుప్పట్లో దాక్కున్న పర్వతాలు తెల్లచీమల బారుల్లా ఉన్నాయి. హఫ్లాంగ్ అనే దిమాషీ పదానికి అర్థం కూడా అదే, తెల్లచీమలగుట్ట అని. ఈ పర్వతాలు, గుట్టల మధ్య ఇరుకు దారులు... మలుపులు తిరుగుతూ సాగే ప్రయాణం... ఇక్కడి రైలు మార్గాలు బ్రిటిషు పాలన కాలాన్ని గుర్తుచేస్తున్నాయి, ఆ తర్వాత అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదు. అక్కడక్కడా కనిపించే మనుషులు జానపద సినిమాల్లో పాత్రలను తలపిస్తున్నారు. దిమాసా, హమారా, నాగు, కర్బి, ఖేల్మ, మిజో గిరిజనుల వైవిధ్య జీవనం మనకు కొంత కొత్త, మరికొంత వింత కూడ. భుజాలను కప్పకుండా ఒంటిని చుడుతూన్న చీరతో కేరళీయులను తలపించే వస్త్రధారణ, ఎరుపు- తెలుపు కాంబినేషన్‌లో సాంస్కృతిక వారధుల్లాంటి మనుషులు. చెట్లకు గాటు పెట్టి రబ్బరు పాలు పడుతున్న శ్రామికులు... గెడకర్రల పునాదుల మీద లేచిన రెల్లుగడ్డి కప్పుతో అస్సామీ సంప్రదాయ నివాసాలు, అరటి ఆకులో వడ్డించిన అరటిదూట వంటకాలు, రాగి పాత్రల్లో వడ్డించిన వంటకాల థాలి. ముందుకెళ్లేకొద్దీ అస్సాం టీ లేబుల్‌తో మన దగ్గర కనిపించే అందమైన ప్యాకింగ్‌కి తొలిరూపంగా ఈ తేయాకు తోటలు. అస్సాం అంటే మనకు బోడో తీవ్రవాదం గుర్తుకొస్తుంది, కానీ ఆస్సామీయుల సంస్కృతి, జీవనశైలిని కళ్లారా చూడడంలో తెలియని థ్రిల్ ఉంది.

ఆకాశంలో పరుగులు తీసే రంగురంగుల పక్షులు... ఇంటికి వస్తున్న ఆత్మీయులను అల్లంత దూరాన చూసి ఉన్న చోట ఉండలేక ఇంట్లోకి బయటికి తిరిగే పిల్లల్లా ఉన్నాయి. ఇన్ని పక్షులు ఒకేసారి ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయంటే దగ్గరలో సరస్సు ఉండే ఉంటుంది. మన రాష్ట్రంలో పులికాట్‌కి ఏటా ఖండాలు దాటి వచ్చే పక్షులు గూడబాతు, పొడుగు కాళ్ల కొంగ, పొట్టి కాళ్లు పొడుగు ముక్కు కొంగలు, గులాబీ- తెలుపు కాంబినేషన్‌లో తాకితే మాసిపోతాయేమో అన్నట్లుంటాయి. ఈ పక్షులు చిత్రకారుడి చేతిలో కలర్ ప్యాలెట్‌ను తలపిస్తున్నాయి. అవి భూమ్మీద వాలుతున్న దిశగా చూస్తే... హఫ్లాంగ్ నాచురల్ లేక్.

హఫ్లాంగ్ లేక్‌లో పడవ ప్రయాణం... పట్టణం నడిబొడ్డున మంచినీటి సరస్సు. మన శ్రీకృష్ణదేవరాయల్లాగ ఈ ప్రాంతాన్నేలిన ఏ మహారాజు తవ్వించాడో!? గైడ్ ఏదో చెప్తున్నాడు... ‘రాష్ట్రంలో ఉన్న సహజమైన మంచినీటి వనరుల్లో ఇదే పెద్దది, ఈ సరస్సును స్కాట్‌ల్యాండ్ ఆఫ్ అస్సాం అంటారు’ అవునా! మరి ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అన్నదెవరు? పాశ్చాత్య మోజు మనల్ని వదలదేమో! ఏ విదేశీ యాత్రికుడో భారత్‌లో పర్యటించి ఈ ప్రదేశాలను వాళ్ల దేశాలతో పోల్చి పుస్తకాలు రాసేస్తారు. మనం ఆ విశేషణాన్ని ట్యాగ్‌లైన్ చేసుకుని టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటాం. అప్పటి వరకు ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూనే ఉంటాం... కానీ ప్రత్యేకంగా గుర్తించం. కనుచూపు మేర కనిపించేది నీరు, ఆకాశం, పర్వతాలు... అవును. ఎటుచూసినా హిమాలయాలే.

అస్సాం సంప్రదాయ జానపద నృత్యం బిహు. ఏప్రిల్‌లో జరిగే ఈ ఉత్సవాన్ని బిహు ఫెస్టివల్ అంటారు. మనకు ఉగాదిలాగ ఇక్కడ ఏడాది మొదలయ్యే కాలం ఇది. మొదటి నెల బోహాగ్. ఈ సందర్భంగా యువతీయువకులు సంప్రదాయ వస్త్రాలు ధరించి నృత్యం చేస్తారు. ఈ సందర్భంగా పోటీలు కూడా ఉంటాయి. బాగా నృత్యం చేసిన అమ్మాయికి ‘బిహు కున్వోరీ ’ అంటారు. అంటే బిహు యువరాణి అని అర్థం.

హఫ్లాంగ్ ట్రిప్‌లో జతింగ దాటి మహుర్ నది తీరం వెంటే వెళ్తుంటే మైబాంగ్ పలకరిస్తుంది. 12వ శతాబ్దంలో కచ్చార్ రాజవంశ రాజధాని నగరం ఇది. ఈ వీధుల్లో తిరుగుతుంటే రాజభవనాలు స్వాగతిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన ఈ రాతి కట్టడాల నిర్మాణశైలి అంతుపట్టడం లేదు. నిర్మాణశైలి ఏదయినా రాజభవనం రాజభవనమే. ప్రాంతం ఏదయినా రాజు రాజే ! నాటి రాజరికానికి ఆనవాలుగా ఉంది రామ్‌చండి ఆలయం. పక్షులు పర్యటనకు వచ్చే ప్రదేశం ఏదయినా సరే మంచుకొండల సాక్షిగా పర్యాటకులను నిత్యం అలరిస్తూనే ఉంటుంది. అలాగే హఫ్లాంగ్ కూడ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles