United arab emirates tourism

United Arab Emirates Tourism.png

Posted: 02/11/2013 03:04 PM IST
United arab emirates tourism

Emirates_Palace

ఎమిరేట్స్ అంటే అరబ్బులు గుర్తొస్తారు... అరేబియన్ నైట్స్ కథలు గుర్తొస్తాయి... ఇసుక ఎడారులు తలంపుకొస్తాయి... షార్జా క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది... ప్రపంచంలో ఎత్తై భవనాన్ని...నన్ను తలుచుకోండి... అంటుంది బుర్జ్ ఖలీఫా ఐకమత్యమే మహాబలం అని సంఘటితమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ విశేషాలు.

అరబ్బు దేశాలంటే మనకు థోబ్, దిశ్‌దాషా, కాందురా, ఇజార్ ధరించిన ఎత్తై మనుషులు కళ్ల ముందు మెదలుతారు. వారి పక్కనే బురఖా చాటున నీటిలో చేపపిల్లల్లా కదులుతున్న కళ్లు కనిపిస్తాయి. చమురుని నీళ్లలా ఖర్చు చేస్తున్న వీళ్ల విలాసవంతమైన జీవనశైలి గుర్తొస్తుంది. రాణి కనిపించని రాజరిక వ్యవస్థ వీరిది. మత విశ్వాసాన్ని యథాతథంగా స్వీకరించే ఈ దేశంలో స్త్రీ తనకు ఇష్టమైన కోర్సు చదువుకోవచ్చు, నచ్చిన ఉద్యోగం చేయవచ్చు. ముత్యాలు, పగడాలు, జలచరాలను వేటాడడం ఒకప్పటి సంప్రదాయ ఉపాధి మార్గం అయితే ఇప్పుడు ఇది అత్యంత ఖరీదైన సంపన్నదేశం. ప్రభుత్వ ఆదేశం అంటే రాజు ఆదేశంతో సమానం. రెండో మాటకు అవకాశం ఉండదు. అందుకేనేమో ఇక్కడ ప్రతిదీ కచ్చితంగా అమలవుతుంటుంది. మౌలిక వసతుల విషయంలో మనకంటే చాలా ముందుంది ఎమిరేట్స్.

ఇక అక్కడ రోడ్డు రూల్స్ కచ్చితంగా పాటించాలి, వీడియో మానిటరింగ్ ఉంటుంది. పోలీస్ పనితీరు చాలా సమర్థంగా ఉందనే చెప్పాలి. పగలు, రాత్రి పెట్రోలింగ్ చేస్తుంటారు. రాత్రి ఒంటి గంటకు కూడా క్షేమంగా ప్రయాణించవచ్చు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే వెంటనే జైలుకు పంపిస్తారు. మత్తులో వాహనం నడిపి యాక్సిడెంట్ చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్‌లో రిటన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇంత కచ్చితంగా ఉండడంతోనో ఏమో ఇక్కడ ఎన్ని వాహనాలు తిరుగుతున్నప్పటికీ మనలాగ రోడ్డు ప్రమాదాలు ఉండవు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు అరబిక్ చదవడం, రాయడం వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం. ఉద్యోగం చేసే మహిళల్లో ఎక్కువమంది భారతీయులే. ప్రభుత్వ ఉద్యోగాల్లో అరబిక్ మహిళలు ఎక్కువ. ఇక్కడ మహిళల పట్ల వివక్ష లేదు. రాజరిక వ్యవస్థ కాబట్టి పాలనరంగంలో మహిళలు కనిపించరు. కానీ చదువు, ఉద్యోగాల్లో పరిమితులు లేవు. బురఖా ధరించాలన్న నిబంధన మాత్రం ఉంది. ఎమిరేట్స్ ప్రజలు ముభావంగా ఉంటారు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు. ఇస్లామీయులు అని తెలిస్తే కాస్తంత చొరవగా కలుస్తారు.

gold_palaceయునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఏడు వేర్వేరు రాజ్యాలు. రాచరిక వ్యవస్థలో రాజు ఏలుబడిలో ఉన్న ఈ ఏడు అరబ్బు పాలన విభాగాలు సంఘటితమై యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌గా రూపొందాయి. అబుదబి అన్నింటిలోకి పెద్ద ఎమిరేట్. తర్వాత స్థానం దుబాయ్‌ది. ఒక్కొక్క ఎమిరేట్ ఒక్కొక్క ఎమిర్(రాజు) పాలనలో ఉంటుంది. ఇవన్నీ కలిసి బయటి ప్రపంచంతో ఏకీకృతంగా విధులు నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఎమిరేట్స్ ప్రెసిడెంట్ అబుదబి ఎమిర్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్. దేశానికి ప్రధాన ఆదాయ వనరు పెట్రోలు, పర్యాటకరంగం. ఇక్కడ అమెరికన్, లండన్ యూనవర్శిటీల్లో పెట్రోలియం కోర్సులు ప్రధానమైనవి. ప్రభుత్వం... పాలన నిర్వహణకు పన్నుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ వస్తువులు కొన్నా టాక్స్ ఫ్రీ. సోనీ టీవీ ఇండియాలో అన్ని పన్నులతో కలిపి 68 వేలయితే, అబుదబిలో 30 వేలరూపాయలకే వస్తుంది. బంగారు కూడా ధర తక్కువ. పది గ్రాములకు రెండు - మూడు వేల రూపాయలు తేడా ఉంటుంది. స్వచ్ఛత విషయంలో రాజీ ఉండదు. బంగారే కాదు ఏ వస్తువూ కల్తీ ఉండదు. ఎక్స్‌పైరీ డేట్ దాటితే షాపులో ఉంచకూడదు. చట్టాలు కఠినంగా ఉండడంతోపాటు కూడా అంత కచ్చితంగానూ అమలవుతాయి. ఇక్కడ పెట్రోల్ లీటరు 22 రూపాయలు. డీజిల్ 27 రూపాయలు ఉంటుంది.

అబుదాబిలో షేక్ రాయద్ మసీదు చాలా పెద్దది, పది-పదిహేనేళ్ల కిత్రం కట్టినది. ఆర్కిటెక్చర్ పరంగా అద్భుతమైన కట్టడం. యుఎఇలో పురాతన కట్టడాలు లేవు. ఓల్డ్‌ఫోర్ట్ అని చెబితే మనం ఎంత పురాతనమైనదో అనుకుంటాం, ఇక్కడ ఓల్డ్‌ఫోర్ట్ ఖసర్ అల్ హోసన్ 17వ శతాబ్దానిది. దేశంలో అద్భుతమైన నిర్మాణాలంటే అధునాతనమైన భవనాలే. దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ అలాంటిదే. సముద్రంలో కృత్రిమ దీవిని నిర్మించి, తెరచాప ఆకారంలో భవనాన్ని కట్టారు. ఇక్కడ రోజూ సాయంత్రం జరిగే ఫౌంటెయిన్ షో బాగుంటుంది. జుమేరా బీచ్‌లో సముద్రం మధ్యలో ఇళ్లు కట్టారు.ఏరియల్ వ్యూ కర్జూర చెట్లు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ పార్కులుండవు, కానీ రోడ్డు మధ్యలో కర్జూర చెట్లు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం తమ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు చేయడానికీ వెనుకాడదు. చారిత్రక- సాంస్కృతిక సమ్మేళనంగా అభివృద్ధి చేస్తుంది. హెరిటేజ్ విలేజ్, ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ అలాంటివే. ఇది ప్రపంచస్థాయి సాంస్కృతిక ప్రదర్శనలకు వేదిక. అరబ్ హస్తకళలను చూడాలంటే ఉమెన్స్ హ్యాండీక్రాఫ్ట్ సెంటర్‌కెళ్లాలి. మన డ్వాక్రా మహిళల లాగా స్థానిక మహిళలు సంఘటితైంగా నిర్వహిస్తున్నారు. మనవాళ్లు యుఎఇ పర్యటనకు గుర్తుగా ఇక్కడి పింగాణి వస్తువులు, పరిమళద్రవ్యాలు తెచ్చుకుంటారు.

బంగారు విలాసం !

ఎమిరేట్స్ ప్యాలెస్ ప్రపంచంలో ఖరీదైన భవనాల్లో రెండవది. దీని నిర్మాణానికి 11 బిలియన్ల ఎమిరేట్స్ దిర్హామ్‌లు ఖర్చయ్యాయి. ఇందులో రెండువేల ఐదొందల వాహనాలు పార్కు చేయవచ్చు. హోటల్ పైన హెలీపాడ్ కూడా ఉంది. ఇందులో అద్దె పన్నెండువేల డాలర్ల వరకు ఉంటుంది. ఎంత విలాసవంతమైన హోటల్ అయినా మరీ ఇంత ఖరీదా! బంగారపు ఇటుకలతో కట్టారా? అనిపిస్తోంది కదా! బంగారు ఇటుకలు కాదు కానీ గోడలకు బంగారాన్ని తాపడం చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అబుదాబి వచ్చినప్పుడు ఇందులోనే బస చేశాడు.ఎమిరేట్స్

tourismపర్యాటకం !

బర్డ్ వాచింగ్ జోన్... ఉమ్ అల్ క్యువైన్‌లో పక్షుల విడిది కేంద్రాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశం రాస్ అల్ ఖైమాహ్- అజ్మన్ మధ్యలో ఉంది. చలికాలంలో ఇక్కడ గుల్, ఫ్లెమింగోలు కనిపిస్తాయి. బుర్జ్ అల్ అరబ్... తెరచాప ఆకారపు హోటల్. సముద్రం మీద షిప్ ప్రయాణిస్తుందేమో అనిపిస్తుంది. అరేబియా ఎడారి... బంగారు రజను పరిచినట్లు ఎటు చూసినా ఇసుకే. ప్రకృతి సౌందర్యాలలో ఎడారి కూడా భాగమేననిపిస్తుంది. అల్ ఫాహిదీ ఫోర్ట్... 18వ శతాబ్దానికి చెందిన ఈ కోటలో దుబాయ్ మ్యూజియం ఉంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం డ్రీమ్‌ల్యాండ్. ఇది యుఎఇలో పెద్ద వాటర్ పార్కు. అన్ని వాటర్‌గేమ్స్ ఆడుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The magnificence of the mughal gardens
England tourism and information  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles