ఎనిమిది వందల ఏళ్లు నిండిన నగరం.- ప్రపంచయుద్ధంలో పడిలేచిన ప్రదేశం.- పునర్నిర్మాణాలే ఇక్కడి ఆనవాళ్లు. -
అభివృద్ధి... ఆధిక్య భావనల కలయిక. - పాశ్యాత్య పింగాణీ కేంద్రం ఈ నగరం.- మన గుంటూరు గనిలో పుట్టి... - బ్రిటన్... జర్మనీ... అమెరికాలను చుట్టిన ఆకుపచ్చ వ్రజ్రాన్ని దాచుకున్న నగరం.- అందమైన జర్మన్ నగరం డ్రెస్‌డెన్...
డ్రెస్‌డెన్ నగరం బెర్లిన్ నగరానికి 200 కి.మీల దూరంలో ఉంది. ఎల్బీ నదికి ఒక ఒడ్డున పాత టౌను, మరో వైపు కొత్త టౌన్ వెలిశాయి. నదికి రెండువైపులా ఇళ్లు ఉన్నప్పటికీ నదిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ శుభ్రత ప్రభుత్వం మెయిన్‌టెయిన్ చేయడం వల్ల కాదు, నగరంలో ప్రతి ఒక్కరూ సివిక్‌సెన్సుతో వ్యవహరించడమే. నగరంలో పర్యాటక ఆకర్షణలన్నీ పాత టౌన్‌లోనే ఉన్నాయి. జింగ్వర్ ప్యాలెస్, చర్చ్‌లు ఇక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణలు. జర్మనీలో అందమైన నగరాల లిస్టులో డ్రెస్‌డెన్ ఉంటుంది. నగరానికి అనుబంధంగా డ్రెస్‌డెన్ లోయ ఉంది. యునెస్కో ఈ రెండింటినీ కలిపి హెరిటేజ్ సైట్‌గా ప్రకటించింది. కానీ తర్వాత రద్దు చేసింది. చారిత్రక ప్రదేశంలో హైవే బ్రిడ్జిని నిర్మించడంతో ఈ నిర్ణయం తీసుకుంది యునెస్కో.
రెండవ ప్రపంచ యుద్ధంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం రాత్రికి రాత్రి తుడిచిపెట్టుకు పోయింది. దాదాపు నలభై ఏళ్లపాటు నగరం చారిత్రక భవనాలశిథిలాల నడుమ జీవనం సాగించింది. జర్మనీ ఏకీకరణ తర్వాత నగరంలోని చారిత్రక భవనాల పునర్నిర్మాణం మొదలైంది. ఎల్బీ నదికి 2002లో భారీ వరదలు వచ్చి, తీరప్రాంతం తాకిడికి గురయింది. కానీ ఇప్పుడు ఆ ఆనవాళ్లు ఏవీ కనిపించనంతగా యథాతథ స్థితికి వచ్చింది. ఈ నగరం ప్రకృతి విలయాల నుంచి వేగంగా కోలుకుంది. కానీ మనిషి చేసిన విలయం నుంచి బయటపడడానికి అరవై ఏళ్లు దాటినా ఇంకా కోలుకునే క్రమంలోనే ఉంది.
జింగ్వర్ ప్యాలెస్ !
జింగ్వర్ ప్యాలెస్ 18వ శతాబ్దానికి చెందిన భవనం. దీనిని అగస్టస్ నిర్మించాడు. రాజు వివాహం జరిగిన ప్యాలెస్ ఇది. బరోక్ స్టైల్‌లో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో ఆరు పెవిలియన్లు ఉన్నాయి. ఫ్రెంచ్ పెవిలియన్‌లో ఫ్రెంచ్ పెయింటింగ్స్ మ్యూజియం, జర్మన్ పెవిలియన్‌లో పోర్సెలిన్ మ్యూజియం ఉన్నాయి. ప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు రాఫెల్ గీసిన సిస్టైన్ మడోనా చిత్రంతో పాటు ప్రసిద్ధ చిత్రకారులు వేసిన రెండువేల పెయింటింగులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోర్సెలిన్ మ్యూజియం ప్రపంచంలో రెండవది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రధానమైన పోర్సెలిన్ విగ్రహాలను మరోచోటికి తరలించి భద్రపరిచారు. యుద్ధం చివరి దశలో ఇక్కడికి వచ్చిన రష్యన్ సైనికులు కళాకృతులను దొరికిన వాటిని దొరికినట్లు రష్యాకు తరలించారు. తర్వాత రష్యా అధ్యక్షుడు కృశ్చేవ్ 16 లక్షల కళాకృతులను తిరిగి పంపించాడు. అన్ని కళాకృతులను తిప్పి పంపినా, తిరిగి పంపనివి ఇప్పటికీ రష్యా మ్యూజియాల్లో ఉన్నాయి.
పింగాణీ కేంద్రం !
జింగ్వర్ ప్యాలెస్ క్రౌన్ గేట్‌కి ఉల్లిపాయ ఆకారంలో రాగి రేకు గుమ్మటం ఉంది. దీనికి అక్కడక్కడా బంగారు తాపడం కూడా ఉంటుంది. గుమ్మటం మీద భూగోళాన్ని మోస్తున్న హెర్క్యులస్ బంగారు విగ్రహం ఉంది. దానికి ముందు పింగాణీ గంటలు ఉన్నాయి. ఇవి పావుగంటకోసారి మోగుతాయి. అగస్టస్ రాజు పింగాణీ తయారీ మూలపదార్థాన్ని కనుక్కోవడానికి ప్రయోగాలను ప్రోత్సహించాడు. ఆ ప్రయత్నం ఫలించడంతో చైనా తర్వాత పింగాణీ తయారీ కేంద్రంగా డ్రెస్‌డెన్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్యాలెస్ ప్రాంగణం అందమైన ఫౌంటెయిన్లు, విశాలమైన కారిడార్లు, అద్భుతమైన శిల్పకళ గల భవంతులతో విశాలంగా ఉంటుంది. ఈ ప్యాలెస్‌లో అగస్టస్ రాజు పెళ్లి జరిగింది కానీ రాజవంశీయులు ఎవరూ ఇందులో నివసించలేదు. నగరంలో డచెస్ గార్డెన్ మరో ఆకర్షణ. ఇక్కడ 19వ శతాబ్దంలో ఆరువందల కమలా చెట్లు ఉండేవట. కమలాలను భద్రపరచడానికి ప్రత్యేకమైన భవంతిని నిర్మించారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే... ఇప్పుడు మనం చూస్తున్నది అసలు నిర్మాణాన్ని కాదు. ప్రష్యా- గ్రేట్‌బ్రిటన్, రష్యా- ఆస్ట్రియా- ఫ్రాన్స్‌ల మధ్య దాదాపు ఏడేళ్ల పాటు జరిగిన యుద్ధంలో ఫిరంగుల దాడికి లోనైన భవనాన్ని తిరిగి నిర్మించారు.
సెంపర్ ఒపేరా హౌస్!
ఇందులో ఆధునిక సంగీత కచేరీలు, శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతుంటాయి. ఇది అగ్ని ప్రమాదం, బాంబు దాడులకు ధ్వంసం అవుతూ తిరిగి నిర్మితమవుతూ స్థానికులను, పర్యాటకులను అలరిస్తున్న ప్రదేశం. అగ్ని ప్రమాదానికి గురైన పదేళ్లలో తిరిగి నిర్మించారు, మరో యాభై ఐదేళ్లకు యుద్ధబాంబులతో ధ్వంసమైంది. మరో నలభై ఏళ్లకు తిరిగి అదే ఆకారంలో రూపుదిద్దుకుంది. ఒపేరా హౌస్ ముందు గుర్రం మీద కూర్చుని ఉన్న రాజు జాన్ విగ్రహం ఉంది.
ఫ్రౌవెన్ కిర్షే చర్చ్!
ఫౌవెన్‌కిర్షే చర్చ్ డ్రెస్‌డెన్ నగరానికి చిహ్నం. పదకొండో శతాబ్దంలో ఉన్న చర్చి నగర జనాభాకు సరిపోకపోవడంతో పడగొట్టి పెద్ద చర్చి కట్టారు. అది నగర చిహ్నంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆ నిర్మాణం యుద్ధంలో నేలమట్టం అవడంతో తిరిగి నిర్మించారు. ఈ చర్చ్ కూలడాన్ని వింతగా చెబుతారు ఇక్కడి వాళ్లు. బాంబింగ్ జరిగినప్పుడు బాగానే ఉందట. తర్వాత రెండు రోజులకు కూలిపోయింది. నిర్మాణానికి ఉపయోగించిన సాండ్‌స్టోన్ చల్లబడి కూలిపోయింది. ఆ రాళ్లతోనే ఇప్పుడున్న చర్చిని కట్టారు. ఇక్కడ మ్యూజియంలో కళాకృతులే కాక నిర్మాణాలు కూడా అందంగా కళాత్మకంగా ఉంటాయి.
సమానం కాదు... కొంచెం ఎక్కువ !
డ్రెస్‌డెన్ ప్రజలకు తాము జర్మన్ అని, మిగిలిన వారికంటే అధికులమన్న భావన ఎక్కువ. ఇది పరిమితి దాటి అహంభావం స్థాయికి చేరడంతో ఆ భావాన్ని తొలగించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాము నివసించేది జర్మనీలో కాదు యూరప్‌లో అనే భావం పెంపొందించడం ద్వారా ఈ అహంభావాన్ని పోగొట్టాలని బోర్డర్ కంట్రోల్, వీసా నిబంధనల సడలింపు చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్‌లోని దేశాల్లో ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి వీసా అవసరం లేదు. పైగా అన్ని దేశాలు కామన్ కరెన్సీగా ‘యూరో’ను స్థిరీకరించుకున్నాయి. ఇప్పుడు దేశంలో డాయిష్‌లు చలామణీలో లేవు. ఇన్ని చేసినా ఆధిక్య భావన పూర్తిగా పోలేదని ఇక్కడి గైడ్‌లు చెబుతారు.
మన వజ్రం!
నగరంలో ‘డ్రెస్‌డెన్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్స్’ అనే మ్యూజియం ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే... ఇక్కడ ఆల్బర్టినమ్ విభాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుపచ్చ డైమండ్ ఉంది. ఇది మన గుంటూరు జిల్లా కొల్లూరులో లభ్యమైంది. లండన్ వజ్రాల వ్యాపారి మోసెస్ దీనిని ఇంగ్లండ్ రాజు కింగ్‌జార్జ్‌కి, పోలెండ్ రాజు ఫ్రెడరిక్ అగస్టస్‌కి చూపించాడు కానీ వాళ్లు కొనలేదు. అగస్టస్ కొడుకు రెండవ అగస్టస్ లెపైగ్‌లో వజ్రాల సంతలో దీనిని కొన్నాడు. రష్యా సైనికులతో మాస్కో వెళ్లి, తిరిగి వచ్చిన వాటిలో ఈ వజ్రం కూడా ఉంది. ఆకుపచ్చ వజ్రం ఉన్న గదిలోకి వెళ్లడానికి ఏడు యూరోలు చెల్లించాలి.
రాజరిక గుర్రపు బగ్గీ !
ఇక్కడ నేల మొత్తం బెడ్‌రాక్ కావడంతో అండర్ గ్రౌండ్ రైల్వేలైన్ వేయడం సాధ్యం కాదు. దాంతో ఇక్కడ ట్రామ్‌వేలు నడుస్తుంటాయి. చారిత్రక రవాణా విధానాన్ని ట్రాన్స్‌పోర్టు మ్యూజియంలో చూడవచ్చు. ఇది రాజుల గుర్రపుశాల. రాజు ప్యాలెస్‌లో మొదటి అంతస్థుకు గుర్రం మీద వెళ్లడానికి వీలుగా ర్యాంప్ ఉంది. గుర్రాలకోసం కట్టిన స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నాయి. నగరంలో సిటీస్వ్కేర్‌లో రాజుల కాలాన్ని తలపించే గుర్రపు బగ్గీలు, బలిష్టమైన గుర్రాలు ఉంటాయి. పది యూరోలు చెల్లిస్తే అరగంట సేపు బగ్గీలో తిప్పుతారు. సిటీహాల్ స్క్వేర్‌కు దూరంగా మసీదులాంటి నిర్మాణం ఉంది. నిజానికి అది సిగరెట్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఇందులో ఆఫీసులు నడుస్తున్నాయి. నగరంలో చూడాల్సిన మరికొన్ని ప్రదేశాల్లో సమ్మర్ ప్యాలెస్, ఐదొందల ఎకరాల పార్కు, పదివేల మొక్కలున్న బొటానికల్ గార్డెన్స్, జూ, ఎల్బీ లోయలో పురాతన కోటలు ప్రధానమైనవి. ఇక్కడ మైసెన్ పోర్సలిన్ దుకాణం చాలా ఫేమస్. ఇందులో రెండు కప్పులు పాతికవేల యూరోలు, బుద్ధుడి బొమ్మ ఆరువేల యూరోలు. తక్కువ ధరలో ఏదైనా కొందామంటే ఒక కప్పు 422 యూరోలు. డ్రెస్‌డెన్‌లో మాన్యుమెంట్స్ ఎన్ని ఉండవచ్చో ఊహించండి!! నూటా పది మాన్యుమెంట్స్. అన్నీ సహజమైనవి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే. యూరప్‌లో పచ్చని నగరం ఇది. సగానికి పైగా పార్కులు, గార్డెన్‌లు ఉంటాయి. డ్రెస్‌డెన్ పర్యటనను విజ్ఞానవిహారాల సమ్మేళనం అనాలి.
ట్రాన్స్ పరెంట్ ఫ్యాక్టరీ!
ఇది డ్రెస్‌డెన్ సిటీసెంటర్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కార్ల తయారీ శాఖ. ఈ ఫ్యాక్టరీ పేరుకు తగినట్లే పారదర్శక నిర్మాణం. కారు విడిభాగాలు... కార్గోట్రాములు, ట్రక్కుల్లో ఈ అసెంబ్లింగ్ యూనిట్‌కి వస్తాయి. వాటిని ఇక్కడ కూర్పు చేస్తారు. ఫోక్స్‌వ్యాగన్ హెడ్‌క్వార్టర్ జర్మనీలోని ఉల్ఫ్స్‌బర్గ్ నగరంలో ఉంది. షాపింగ్... హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లాగ డ్రెస్‌డెన్‌లో రోడ్ల మీద టోపీలు, పింగాణీ కప్పులు, సావనీర్లు అమ్ముతారు. నగరంలో ‘ఆగ్రా ఇండియన్ రెస్టారెంట్’, ఫుడ్‌కోర్ట్ వంటి ఇండియన్ రెస్టారెంట్లు, మెక్‌డొనాల్డ్ చైన్ రెస్టారెంట్లు ఉన్నాయి. యూరప్‌లో ప్రతిదీ ఖరీదుగానే అనిపిస్తుంది కానీ మూడు యూరోలతో ఆకలి తీర్చేది మెక్‌డొనాల్డ్ బర్గర్ మాత్రమేనేమో.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more