Modi | Anniversary | Prime minister

Narendra modi completed one year as the prime minister of india on today

Narendra modi, Modi, Anniversary, Prime minister

Narendra modi completed one year as the prime minister of india on today. In this year perod modi govt took some good policies but he didnt reach the expectations of the ordinary people.

ప్రత్యేకం: ఉగాది పచ్చడిలా మోదీ విధానాలు.. అప్పుడే ఏడాది పూర్తి

Posted: 05/16/2015 01:20 PM IST
Narendra modi completed one year as the prime minister of india on today

60 సంవత్సరాలు ఆ పార్టీలకు అధికారం ఇచ్చారు కానీ ఒక్క 60 నెలలు నాకు అధికారం ఇవ్వండి తర్వాత మార్పును చూడండి అన్న నరేంద్ర మోదీ మాటలకు యావత్ భారత్ స్పందించింది. తమ ఓటుతో నరేంద్ర మోదీకి జై కొట్టింది. కేంద్రంలో తిరుగులేని విధంగా పూర్తి మెజారిటీతో మోదీకి అధికారాన్ని కట్టబెట్టారు జనం. మరి "అచ్చే దిన్ ఆనే వాలే హై.. మోదీజీ ఆనేవాలేహై" అంటూ తెగ ప్రచారం చేసిన మోదీ అండ్ కో నిజంగా ప్రజలకు మంచి రోజులను తీసుకువచ్చిందా..? కేవలం గత ప్రభుత్వాల మాదిరిగా అర చేతిలో అద్భుతాలు చూపి తర్వాత చేతులు దులుపుకుందా..? మోదీ పై  ప్రజలు పెట్టుకున్న ఆశలు ఎంత వరకు నిజమయ్యాయి..? అన్న ప్రశ్నలకు ఈ వ్యాసమే సమాధానం. మోదీ పాలనకు ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం మీ కోసం..

గత లోక్ సభ ఉన్నికల్లో మోదీ ని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీ స్వరూపమే మారిపోయింది. దేశ చరిత్రలో కాంగ్రెసేతర పార్టీ లోక్ సభలో మెజారిటీ సంపాదించడం మన పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటి సారి. ఆ ఖ్యాతి కచ్చితంగా మోదీ కి దక్కాల్సిందే. మోదీ ప్రభంజనం కాంగ్రెస్ ను కనీవినని రీతిలో 44 స్థానాలకు పరిమితం చేసింది. మోదీ గత చరిత్రను పట్టించుకోకుండా “సుపరిపాలన”, “అభివృద్ధి”, “సబ్కే సాథ్ బీజేపీకా హాథ్”, “అచ్చే దిన్” అన్న మోదీ నినాదాలకు ఆకర్షితులైన ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. మార్పు అనివార్యం అన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకోవడానికి కాంగ్రెస్ దుష్పరిపాలన, అవినీతి బీజేపీ విజయానికి దోహదం చేశాయి.
 
కాంగ్రెస్ అస్తవ్యస్థ పాలన వల్ల ఏర్పడ్డ గందగోళ  పరిస్థితిని మార్చేస్తానన్న మోదీ భరోసా, మోదీ నినాదాలు జనాన్ని విపరీతంగా ఆకర్షించాయి. నరేంద్ర మోదీకి గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్న అనుభవం, అభివృద్ధి ఎజెండా గురించి పదే పదే మాట్లాడడం విజయానికి పనికి వచ్చాయి. అభివృద్ధి గురించి ఆయన నిరంతరం మాట్లాడడం వల్ల ఆశలు బలంగా ఉన్న మధ్య తరగతి జనం, స్వేచ్ఛా వ్యాపారానికి అమోదీ బార్లా తలుపులు తెరుస్తారన్న పెట్టుబడిదారుల విశ్వాసం, ధైర్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకోగలరన్న నమ్మకం మొదలైనవి మోదీకి నిచ్చెన మెట్లుగా పని చేశాయి. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాల మీదకెక్కిస్తానన్న మోదీ హామి అన్ని వర్గాల ప్రజలలో ఆశలు రేకెత్తించింది.అంతర్జాతీయ వేదికలపై భారత్ కు మళ్లీ గౌరవ స్థానం కల్పించడానికి ఆయన విదేశీ పర్యటనలు దోహదం చేసిన మాట నిజమే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రధానమైన పథకాలను ప్రకటించారు. స్వచ్ఛ భారత్, జన ధన్ యోజన, డిజిటల్ భారత్ వంటివి జనాన్ని ఆకర్షించాయి. అయితే ఆయన రేకెత్తించిన ఆశలు గత సంవత్సర కాలంలో ఏ మేరకు నెరవేర్చగలిగారు అని బేరీజు వేస్తే నిరాశే కనిపిస్తుంది.

ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని స్థూల కొలమానాల ప్రకారం వీటిని మదింపు వేయడం అసాధ్యమేమీ కాదు. యూపీఏ హయాంలో 6.9 శాతం దగ్గర సాగిల పడిన జీడీపీ ఇప్పుడు 7.4 శాతానికి చేరడం శుభ సూచకమే. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. 2014 మార్చి నాటికి 8.31 శాతం ఉన్న వినియోగదారుల ధరల సూచీ 2015 మార్చిలో 5.17 శాతానికి తగ్గడమూ సానుకూలాంశమే. టోకు ధరల సూచీ అయితే అద్భుతాలే సాధించింది. 2014 మార్చిలో టోకు ధరల సూచీ 6% ఉంటే ఇప్పుడది మైనస్ 2.06 శాతం ఉంది. యూపీఏ హయాంలో ద్రవ్య లోటు 4.1% ఉంటే అది 3.9 శాతానికి తగ్గుతుందన్న భరోసా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మోదీ సర్కారు పెద్ద విజయమేమీ సాధించలేదు.

అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం ప్రయోగించిన మంత్ర దండం ఏమీ లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందు వల్ల ధరలు సహజంగానే తగ్గాయి. ఇందులో మోదీ సర్కారు పాత్ర దాదాపు పూజ్యం. ధరలు తగ్గించిన ఘనత తమదేనని చెప్పుకోవడానికి అవకాశం వస్తే వచ్చి ఉండవచ్చు గాక! ఇటీవలే పెట్రోల్, డీసెల్ ధరలు విపరీతంగా పెంచిన ఖ్యాతి కూడా మోదీ సర్కారుదే మరి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2014 మే లో 309 బిలియన్ డాలర్లు ఉంటే అవి ఇప్పుడు 340 బిలియన్ డాలర్లకు చేరి స్వల్ప పెరుగుదలను మాత్రమే సూచిస్తున్నాయి. అంటే దిగుమతులు తగ్గడం, ఎగుమతులు అపారంగా పెరగడం లాంటివి ఏమీ లేవన్న మాటే. ఇక ప్రజల దృష్టిలో కూడా ఆర్థిక రంగంలో మోదీ సర్కారు సాధించింది పెద్దగా కనిపించడం లేదు. ఆదాయపు పన్ను పరిమితిని ఇప్పుడున్న్న 2.5 లక్షల రూపాయల నుంచి అయిదు లక్షలకు పెంచుతామన్న హామీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ లో దోష ప్రకరణంగానైనా కనిపించలేదు. కాని కార్పొరేట్ పన్ను మాత్రం గణనీయంగా తగ్గించారు. అంటే మోదీ విజయానికి పల్లకీలు మోసిన మధ్య తరగతి జీవులను ప్రభుత్వం పట్టించుకోలేదు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూత్వ శక్తులలో దూకుడు పెరిగింది. సాక్షీ మహారాజ్, సాధ్వీ నిరంజన, అసీమానంద్ లాంటి వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మోదీ అభివృద్ధి రథాన్ని పట్టాలు తప్పించేట్టుగా తయారు కావడమే కాక సెక్యులర్ విధానాలకు తూట్లు పొడుస్తున్నాయి. రామ మందిరం నిర్మాణం గురించి ప్రభుత్వ వర్గాల నుంచి ఒక్క మాట కూడా వినిపించలేదు. రాజ్య సభలో తమకు మెజారిటీ లేనందువల్ల ఈ విషయంలో చట్టం చేయలేమన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ వ్యక్తం చేసిన నిస్సహాయత తప్ప. అనేక వివాదాస్పదమైన బిల్లులను గట్టెక్కించడానికి నానా తంటాలు పడుతున్నప్పటికీ రామ మందిరం విషయంలో మాత్రం రాజ్య సభలో బలం లేక పోవడం ఎందుకు అడ్డంకి అయిందో తెలియదు.

రైతులకు కనీస మద్దతు ధర పెంచుతామని బీజేపీ చేసిన వాగ్దానం ఇంకా అమలులోకి రావాల్సే ఉంది. రైతుల ఆత్మ హత్యలు యూపీఏ హయాంలో జరిగిన సంఘటనలను తలదన్నేట్టు ఉన్నాయి. అనేక ఐఐటీలకు, ఐఐఎం లకు అధిపతులను నియమించనే లేదు. లోక పాల్, సీవీసి, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవులూ చాలా కాలంగా ఖాళీగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పార్లమెంటులో నేర చరిత్ర ఉన్న వాళ్లు లేకుండా చేస్తానని మోదీ ఇచ్చిన హామీ అటకెక్కినట్టే ఉంది. విదేశాల్లో దాచిన నల్ల డబ్బు వెనక్కు రప్పించడం పై ప్రభుత్వం ఇంకా కాళ్లీడుస్తూనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చేసింది పూజ్యమని బీజేపీ విధానాలకు విరోధి కాని రాం జెత్మలానీ సుప్రీం కోర్టులోనే కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. నల్ల ధనాన్ని విదేశాల్లో దాచకుండా నివారించడానికి చేసిన చట్టం దానికి కట్టుబడి ఉండే వారికే ఎక్కువ ఇబ్బందులు కలిగించేలా ఉంది. భూ సేకరణ బిల్లు వ్యవ‌హారమైతే పెద్ద దుమారమే రేపింది. అది మోదీ ప్రతిష్ఠనే పరిక్షిస్తోంది.

అన్ని ముఖ్యమైన ఫైళ్లకూ ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి తప్పని సరి కావడంతో పరిపాలన వికేంద్రీకరణ అన్న హామీ అపహాస్యం పాలవుతోంది. అయితే మోది మీద ప్రజలకు ఇప్పటికీ ఆశలున్నాయి. మోదీ ప్రకటించిన అనేకానేక పథకాల ఫలితాలు ఇంకా ప్రజలకు అందనే లేదు. ప్రతి సభలో మోదీ ఏదో ఓ కొత్త పథకం ప్రకటిస్తూనే ఉన్నారు. కాని వాటికి కావాల్సిన నిధులు ఆర్థిక మంత్రి కేటాయించ లేక పోతున్నారు. అవినీతికర ప్రభుత్వంతో, అధికార వర్గాల సాచివేత ధోరణితో, అరకొర మౌలిక సదుపాయాలతో వేగలేని పట్టణ ప్రాంత మధ్యతరగతి జీవులు; గిట్టుబాటు ధరలకోసం ఎదురు చూసే గ్రామీణులు, ఉద్యోగాల కోసం వేచి ఉన్న నిరుద్యోగులు, తమను పీల్చి పిప్పి చేయని పన్నుల విధానం వస్తుందని ఆశించిన వ్యాపార వర్గాల వారు ఏడాదిగా మోదీ పాలన వల్ల లభ్ది పొందింది ఏమీ లేదు. దీనికి కారణమేమిటో అంతుపట్టాలంటే మోదీ విధానలను, ప్రాధన్యాలను లోతుగా పరిశీలించాల్సిందే. అయినా దేశ ప్రజలు మాత్రం ఇప్పటికీ మోదీ జీ కే జై కొడుతున్నారు. ఖచ్చితంగా చేస్తారన్న ఆశ కాస్త సన్నగిల్లినా.. కనీసం చేస్తారోమో అన్న ధోరణిలోకి మారారు. Be positive అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన భారత ప్రజలకు నరేంద్ర మోదీ సగం మోదం.. సగం ఖేదం అన్నట్లుగా చేశారు. మరి రానున్న నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి పాలన అందిస్తారో చూడాలి.
(Source:  rediff.com & wikipedia )

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  Modi  Anniversary  Prime minister  

Other Articles