ఎర్రచందనం... ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన కలప. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం, వెలుగొండ అడవుల్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, కలువాయి, సోమశిల, పెంచలకోన, మర్రిపాడు, ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో విస్తరించిన పడమటి కనుమల్లో ఈ ఎర్రబంగారం పండుతుంది. ఇక్కడ వేల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు పెరుగుతున్నాయి. లోకల్ మార్కెట్ లోనే కిలో ఎర్రచందనం ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. ఇక ఫారిన్ మార్కెట్ లొ దీని విలువ ఇంతకు పదింతలు ఉంటుంది. దీంతొ నెల్లూరు జిల్లాలోని వెలుగొండ అడవులను టార్గెట్ చేసుకుంటున్నారు స్మగ్లర్ లు. విచ్చలవిడిగా రెడ్ వుడ్ చెట్లు కొట్టి తరలించేస్తున్నారు.
ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాలను కలిపే 5 వ నెంబర్ హైవేపై... నెల్లూరు జిల్లా చెక్ పాయింట్ ల వద్ద ప్రతీరోజు ఏదోచోట లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు పట్టుబడుతున్నాయి. రూరల్ ప్రాంతాల్లొనూ ఇదే పరిస్ధితి. వెంకటగిరి, రాపూరు, సీతారాంపురం, ఆత్మకూరు, మర్రిపాడు ప్రాంతాల్లొ ప్రతీరోజు భారీ మొత్తంలొ స్మగ్లింగ్ వాహనాల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా రోజుకు ఇటు పోలీసులకు, అటవీ అధికారులకు పట్టుబడే ఎర్రచందనం దుంగల విలువ లక్షల్లో ఉంటుంది. ఈ ప్రశ్నలన్నింటికీ అధికారులు చెప్పే సమాధానం ఒక్కటే... సిబ్బంది కొరత, ఆయుధాలు లేవు. అయితే... జనం మాట మాత్రం వేరేలా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు లేనిదే ఇంత రేంజ్లో స్మగ్లింగ్ ఎలా సాగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ చెక్ పోస్టుతొ స్మగ్లర్ లకు సంబంధం ఉందని, ఏ టైమ్‌లో దుంగల్ని తీసుకెళ్లాలో నిర్ణయించేది అధికారులేనని చెప్పుకొస్తున్నారు. స్మగ్లింగ్ జరిగే తీరు పరిశీలిస్తే... జనం అనుమానాలన్నీ నిజమేననిపిస్తుంది. పోలీసులు, అటవీ అధికారులు ఎర్రచందనం తరలించే వాహనాల్ని పట్టుకుంటుంటారు. అయితే స్మగ్లర్లు మాత్రం దొరకడం లేదు. వాళ్లంతా పారిపోయారన్నది పోలీసుల దగ్గరున్న రెడీమేడ్ సమాధానం. ఒకవేళ ఎవరినన్నా పట్టుకుంటే వాళ్లు డ్రైవర్లు లేదా కూలీలే. అసలు నేరస్తులు మాత్రం తెర ముందుకు రావడం లేదు.
వెలుగొండ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆదాయ వనరులా మారిందన్నది పోలీసుల మాట. వెంకగిరి సబ్ డివిజన్ పరిధిలొ గతేడాది మూడువేల కేసులు నమోదయ్యాయని, కొందరు స్మగ్లర్ లు ఇప్పటికీ పరారీలొ ఉన్నాయని చెబుతున్నారు. అధికారులు ఎన్ని మాటలు చెప్పినా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. నెల్లూరుజిల్లా నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు విదేశాలకూ ఎర్రబంగారం తరలిపోతుంది. అధికారులు పట్టుకునేది గోరంత... స్మగ్లర్ లు తరలించేంది కొండంతగా పరిస్థితి మారింది. వేల కోట్లు సంపాదిస్తున్న అక్రమార్కులు... ఆ పాపపు సొమ్ములో కొంతభాగాన్ని అధికారులకు కూడా విసిరేస్తున్నారు. ఎర్రచందనం తరలింపులొ పోలీసు, ఫారెస్ట్ అధికారులతొ పాటు రాజకీయ నాయకులకు, కొంతమంది మీడియా సిబ్బందికీ సంబంధాలున్నాయని గతంలోనే పోలీసులు ఆధారాలు సేకరించారు. కానీ ఎవరి పేర్లు ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. మరోవైపు... వందల కోట్ల ఎర్రచందనం అటవీశాఖ కార్యాలయాల్లొ మూలుగుతోంది. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ నాణ్యత కోల్పోతోంది. ఈ కార్యాలయాల దగ్గర సరైన రక్షణ లేకపోవడంతో... ఈ సరుకును కూడా కొందరు స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు.
తమిళనాడులోని జవ్వాది కొండల ప్రాంతంలో కొన్ని వందల గ్రామాలకు ఎర్రచందనం చెట్లను నరకడమే వృత్తి. దీనికోసం ప్రతి గ్రామంలో దళారీ ఉంటాడు. స్మగ్లర్లు వీరిని సంప్రదించి కూలీలను సేకరిస్తారు. వాళ్ల కుటుంబాలకు అడ్వాన్సు, భత్యా ల చెల్లింపు తదితరాలన్నీ దళారులే పూర్తిచేస్తారు. ఆ కూలీలను ఆటోలు, లారీలు, ట్రాక్టర్లలో దళారులు తరలిస్తారు. పకడ్బందీగా బ్యాచ్‌కి 50మంది వంతున విడతలవారీగా విరామంతో తరలిస్తారు. అనుకున్న స్థలానికి చేరుతుండగా వాహనాలను ఆపుతారు. పరిసరాల్లో సిద్ధంగా ఉన్న గైడ్లకు కూలీలను అప్పగించి వెళ్లిపోతారు. ఇక గైడ్లవెంట అడవిలోకి కూలీలు అడుగుపెడతారు. చెట్లను కొట్టిన తర్వాత బెరడును చెక్కేస్తారు. తర్వాత గైడు సూచన మేరకు వివిధ ఆకారాలు, సైజుల కిందకు కొట్టి, భుజాన పెట్టుకొని అడవి అంచులకు నడుస్తారు. అక్కడ సిద్ధంగా ఉండే వాహనాల్లో జాగ్రత్తగా సర్దుతారు. ఒక అంచనా ప్రకారం, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో రోజుకు రూ.3కోట్లకుపైగా విలువైన ఎర్రచందనం దాటిపోతున్నది. ఓ బ్యాచ్ ఐదు నుంచి పది రోజులవరకూ పనిచేసి వెనుదిరుగుతుంది. తర్వాత రెండో బ్యాచ్ రంగంలో దిగుతుంది. అడవిలో ఉన్నంతకాలమూ కూలీల తిండితిప్పలకు స్మగ్లర్లు లోటు రానీయరు.
చెట్టు వయసు, చుట్టుకొలత, పొడవు ఆధారంగా చేవను నిర్ణయిస్తారు. ఇందుకోసం స్మగ్లర్లు ప్రత్యేక బృందాలను దించుతారు. వీరు అడవులను జల్లెడ పడుతూ మంచి కలప దొరికే ప్రాంతాలను మార్క్’ చేస్తారు. ఇక.. స్మగ్లర్ల దాడి మొదలవుతుం ది. ఏపీలో 5జిల్లాల పరిధిలో దట్టంగా అరణ్యం అల్లుకుపోవడంతో.. ఎటునుంచి దాడి జరుగుతుందో గుర్తించడం కష్టం. పైగా, ఇక్కడి కలపకు మంచి డిమాండ్ ఉంది. చిన్న దుంగను అమ్ముకుంటే రూ.లక్ష జేబులో పడతాయి. దీంతో అడవిలో చెట్లు నరకడం నుంచి అడవి అంచుకు మోసుకొచ్చేవరకూ స్మగ్లర్లు చురుగ్గా వ్యవహరిస్తారు. వేర్వేరు ఆకారాలు, సైజుల్లో కొట్టించిన దుంగలను సందేహా నికి తావులేని రీతిలో కార్లు, సుమోలు, ఆర్టీసీ బస్సులుసహా ప్రతి రవాణా, ప్రయాణ వాహనంలో సరిహద్దులు దాటించేస్తారు. వీటిని కడప మీదుగా కర్ణాటకకు, చిత్తూరు మీదుగా తమిళనాడుకు తరలించడంలో పక్కావ్యూహంతో వ్యవహరిస్తారు. శేషాచలం, పాలకొండ అడవుల్లోకి రాకపోకలకు పదికిపైగా రూట్లున్నాయి. వీటిలో కూలీల తరలిం పునకు కొన్నిటిని, కొట్టిన సరుకు తీసుకెళ్లేందుకు మరికొన్ని దారులను వాడుకుంటారు. ప్రధాన స్మగర్లంతా కర్ణాటక, తమిళనాడుల్లో తిష్టవేసి, సరుకు ను గిడ్డంగులకు తరలిస్తారు. రెండురాష్ర్టాల కన్ను గప్పి విదేశాలకు తరలింపు ఏర్పాట్లు చేస్తారు. నిజానికి, ఎర్రచందనాన్ని రాష్ర్టాలు దాటించడమే కష్టం. విదేశాలకు తరలించడం తేలిక! కర్ణాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ తరలింపుపై చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తారు. దాంతో.. గిడ్డంగుల్లోని ఎర్రచందనం రాజమార్గంలో.. చెన్నై పోర్టుకు చేరుతుంది. చివరకు గూడ్సు రైళ్లలోనూ తరలిస్తున్నారు. ఏపీ ఒత్తిడివల్ల చెన్నై రేవులో తనిఖీ కట్టుదిట్టంచేశారు. దీంతో ముంబై, గుజరాత్, కోల్‌కతాలకు తీసుకెళ్లి ఓడల్లో ఎక్కిస్తున్నారు. కొన్ని సమయాల్లో రోడ్డు మార్గంలో నేపాల్ మీదుగా తరలిస్తున్నారు.
మొత్తానికి ఎర్రచందనం స్మగ్లింగ్ ఇప్పుడు శేషాచలం అడవుల్లో రక్తపుటేరులను పారిస్తోంది. కూలీ కోసం కక్కుర్తి పడుతున్న కూలీల బతుకులను ఇలా స్మగ్లింగ్ లో హారతిచేస్తున్నారు కొందరు బ్రోకర్లు. అయితే స్మగ్లింగ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందీ అంటే దానికి కారణం ప్రభుత్వం అలసత్వమే అన్నది అందరికి తెలిసిన నిజం. అయినా దాన్ని మాత్రం ఓప్పుకోకుండా.. రకరకాల కారణాలు చెబుతుంటారు అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు. అసలు ఎర్రచందనం అనే పాముకు పాలు పోస్తున్నదే ప్రభుత్వం కాబట్టే ఇప్పుడు పోలీసులను, పొట్టకూటి కోసం వచ్చిన కూలీలను బలి తీసుకుంటోంది. ఏది ఏమైనా ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. అందులోనూ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. మరి ప్రభుత్వం ఆ మేరకు చర్యలకు పూనుకుంటుందని ఆశిద్దాం..
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more