Telangana event by arizona telangana association

Telangana event by Arizona Telangana Association, Telangana formation celebrations at Arizona, AZTGA President Sridhar Serineni

Telangana event by Arizona Telangana Association

ఆరిజోనాలో తెలంగాణా దినోత్సవం

Posted: 06/12/2014 05:51 PM IST
Telangana event by arizona telangana association

ఆరు దశాబ్దాల తెలంగాణా ప్రజల ఆకాంక్ష నెరవేరి, జూన్ 2, 2014 న భారతదేశంలో 29 వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణా దినోత్సవాన్ని దేశంలోనే కాక విదేశాలలో ఉన్న తెలంగాణా ప్రేమికులంతా ఘనంగా జరుపుకున్నారు.  

అమెరికాలో కొత్తగా ఆవిర్భవించిన ఆరిజోనా తెలంగాణా అసోసియేషన్ కూడా ఈ వేడుకను జూన్ 8, 2014 న ఘనంగా జరుపుకుంది.  అరిజోనా లోని తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకున్నవారంతా ఈ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  

ఆరిజోనాలోని ఇండో అమెరికన్ కల్చరల్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణా ఆవిర్భావ సంబరాలలో మంత్రులవంటి మాన్యుల నుంచి సామాన్యుల వరకు అందరూ పాలుపంచుకున్నారు.  ముఖ్య ఆకర్షణగా నిలిచినవారిలో తెలంగాణా ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలి, నీటి పారుదల శాఖామాత్యులు హరీశ్ రావు, ఐటి మంత్రి కెటిఆర్, కవి గాయకుడు అధ్యాపకుడైన దేశపతి శ్రీనివాస్ ఆవిర్భవించిన నవ్య తెలంగాణా రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ, రాష్ట్ర సాధనకోసం అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు.  ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కె చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న ఆశాభావాన్ని అందరూ వ్యక్తపరచారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసి నయనానందం చేసిన ప్రజా కవి గోరేటి వెంకన్న, తెలుగు సంగీత దర్శకుడు గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ లను చూసి ఆరిజోనా తెలుగువారు పరవశించిపోయారు.  

అరిజోనా తెలంగాణా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ శేరినేని ఈ సందర్భంగా ఆరిజోనా తెలంగాణా ప్రజలను అభినందించి ముఖ్య అతిథులను వేదిక మీదకు ఆహ్వానించటంతో వేడుక ప్రారంభమైంది.  శేరినేని మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం, విద్యార్థుల బలిదానాల ప్రస్తావన తెచ్చి, సమైక్యాంధ్ర రాష్ట్రంలోని సమస్యలకు ఒక్క విడిపోవటం తప్ప వేరే మార్గాంతరం లేదని అన్నారు.   సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలుగు సంస్కృతి క్షీణ దశకి వచ్చిందని, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడటంతో ఈ కాలం నవతరం తెలంగాణా సంస్కృతిని పునరుద్ధరిస్తారని  శేరినేని ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.  తెలంగాణా చరిత్రను, సంస్కృతిని, సాంప్రదాయాలను యువతలో కాపాడటం కోసమే జన్మభూమికి సుదూరంలో ఉన్న ఆరిజోనాలో ఆరిజోనా తెలంగాణా అసోసియేషన్ ని స్థాపించటం జరిగిందని ఆయన అన్నారు.  

సభికులను ఉద్దేశిస్తూ ఔత్సాహికులు అసోసియేషన్ లో సభ్యులుగా చేరవలసిందిగా శేరినేని కోరారు.  ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలను ఆరిజోనా తెలంగాణా అసోసియేషన్ నిర్వహిస్తుందని ఆయన మాటిస్తూ అందుకు ప్రవాసతెలంగాణా ప్రజల ప్రోత్సాహాన్ని, మద్దతుని అభిలషించారు.  అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముఖ్య అతిథులకు కృతజ్ఞతలను తెలియజేసిన శేరినేని, గోరంటి వెంకన్న గారి సంగీతం వలనే కాంగ్రెస్ పార్టీ కేవలం 20 శాతం వోట్లకు పరిమితమైందని అన్నారు.  

ఈ సందర్భంగా గోరేటి వెంకన్న ఫినిక్స్ పక్షి మీద తనకున్న ప్రేమను సభికుల హృదయానికి హత్తుకుపోయేలా గానం రూపంలో వ్యక్తం చేసారు.  అమెరికాలో హౌస్టన్, న్యూజెర్సీ లాంటి పలు ప్రాంతాలను సందర్శించినా ఫినిక్స్ లా ఏప్రాంతం తనను అలరించలేకపోయిందని వెంకన్న అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles