ఎంత మంచి విధానాన్నైనా అమలు పరచటానికి పూనుకున్నప్పడు అంతవరకు అలవాటైన విధానం నుంచి తేరుకుని కొత్త విధానానికి అలవాటుపడటానికి, అందులోని ప్రయోజనాలను గుర్తించటానికి సమయం పడుతుంది!
దేశ చరిత్రలోనే ప్రభుత్వం విధించే పన్నులలో అతి పెద్ద సంస్కరణగా పేరుగాంచిన జి ఎస్ టి ద్వారా దేశమంతా ఒకే పన్ను విధానాన్ని తీసుకునిరావటం కోసం, రాష్ట్రాలలోని పన్ను విధానాన్ని ఒక త్రాటి మీదకు తీసుకునివచ్చి ఆర్థికంగా సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే జాతీయ పన్ను విధానమిది. ఒకే పన్ను, ఒకే విధానంతో జాతీయ స్థాయిలో వ్యాపార రంగంలో ఆర్థికంగా ఎదుగుదలకు దోహదం చేసేది- ఇవి జిఎస్టి గురించి దాని సృష్టికర్తలు చెప్పిన మాటలు.
జిఎస్ టి అంటే ఏమిటి?
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. ఈ పన్ను సరుకులు లేక సేవల మీద విధించబడుతుంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని పన్నులను- ఆక్ట్రోయ్, సెంట్రల్ సేల్స్ టాక్స్ (సిఎస్టి), రాష్ట్ర స్థాయి పన్నులు, ఎంట్రీ టాక్స్, స్టాంప్ డ్యూటీ, టెలికాం లైసెన్స్ ఫీజ్, టర్నోవర్ టాక్స్, విద్యుత్ వినియోగం మీద పన్ను, విద్యత్ సప్లై మీద పన్ను, రవాణా చేసిన సరుకులు, సేవల మీద పన్ను- ఇలా ప్రస్తుతం ఉన్న వివిధ స్థాయిలలోని పన్నులను తీసివేయటమే జిఎస్ టి ఉద్దేశ్యం అని చెప్పబడింది.
జాతీయ స్థాయిలో సమగ్రంగా విధించే ఈ పన్ను సరుకులు, సేవల ఉత్పాదన, అమ్మకం, వినియోగాల మీద వుంటుంది. వ్యాపారంలో అంచెలంచెలుగా చేతులు మారే ప్రతిచోటా విధించబడే పన్ను ఇది. అమ్మకం జరుగుతున్న సమయంలోని పన్నులో ఆ సరుకు కొన్నప్పుడు చెల్లించిన పన్నుని మినహాయించుకునే వెసులుబాటుగల విధానమిది. అయితే ఈ గొలుసులో ఎక్కడికక్కడ చెల్లించిన పన్నును మినహాయించటం జరగ్గా చివరకు వినియోగదారుడు మాత్రం దీన్నుంచి తప్పించుకోలేడు. అక్కడ పన్ను కట్టవలసివస్తుంది. ఆ సరుకు కాని, సేవలు ఇంకా ముందుకి పోవు కాబట్టి అందులో మినహాయింపు ఉండదు.
దీనిలో ప్రత్యేకత?
ఈ పన్ను విధానం ద్వారా, పన్ను విధించే క్షేత్రం (టాక్స్ బేస్) ఎక్కువగాను, పన్ను రేటు తక్కువగానూ ఉండి, పన్ను రాయితీలు తగ్గిపోవటం వలన ఉత్పాదన చేసిన వారికి, దాని పంపిణీ, అమ్మకం లాంటి సేవలందించినవారికి మధ్య పన్ను భారం సమానంగా భట్వారా జరుగుతుంది.
దీని వలన పన్నులో పారదర్శకత, నిర్వహణలో అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది. జిఎస్ టి ఎప్పుడైనా అంతిమ స్థానంలో విధించటం జరుగుతుంది. అంతేకానీ ఉత్పాదన జరిగిన దగ్గర్నుంచి రిటైల్ అమ్మకం వరకు మధ్యలో అన్ని చోట్లా విధించటం ఉండదు.
ఈ విధానం రాకముందు- అంటే ప్రస్తుతం ఉత్పాదన చేసే సంస్థ సరుకును ఉత్పాదన చేసి కర్మాగారం నుంచి బయటకు తీసుకుని వస్తూనే దాని మీద పన్ను చెల్లించటం, రిటైల్ లో అమ్మకం జరిగినప్పుడూ పన్ను చెల్లించటం జరుగుతోంది.
ఈ విధానం ఎగుమతిని పెంచుతుందని, తద్వారా దేశంలో ఉపాధి పెరుగుతుందని, పన్ను భారాన్ని ఉత్పాదకులు, వ్యాపారుల మధ్య సమానంగా పంపకం చేస్తుందని, దానితో దేశంలో ఆర్థికంగా 15 మిలియన్ డాలర్ల లాభం చేకూరుతుందని అంచనా.
జిఎస్ టి విధానంలో కేంద్రంలో రాష్ట్రంలో కూడా అమ్మకం జరిగిన చోటనే పన్ను విధించటం జరుగుతుంది. ఈ పన్ను కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కూడా గిట్టుబాటు (కొనుగోలు) ధర మీదనే పన్ను విధించబడుతుంది. దీని వలన ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గటంతో వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగటంతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇవి వ్యాపార సంస్థలకు, వ్యక్తిగతంగా వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు.
పంపిణీదారులు తమకు కలిగిన పన్ను రాయితీని వినియోగదారులకు పంచుతారని, దాని వలన దీర్ఘకాలిక ప్రయోజనంగా, ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.
జిఎస్ టి పరిధిలోకి రానివి
మద్యం, పొగాకు, పెట్రోలియం ఉత్పాదనలు. ఎగుమతుల మీద జి ఎస్ టి రాయితీ ఉంది.
అమలు చెయ్యటం ఎలా?
జి ఎస్ టి కేంద్రం, రాష్ట్రాల మధ్య జరిగే ఒడంబడిక కాబట్టి, రాష్ట్రాలన్నీ అసెంబ్లీలలో దీన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదింపజేసుకోవలసివస్తుంది. ఇందుకు కావలసిన రాజకీయ మద్దతు లభిస్తుందని, జిఎస్ టి ని తీసుకుని వచ్చే విజ్ఞత పెరుగుతుందని రాష్ట్ర స్థాయి ఆర్థిక మంత్రి జెడి శీలం ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నిర్వహించిన ఒక సభలో అన్నారు. తమిళనాడు, మధ్య ప్రదేశ్. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 2013 కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం, ఈ జిఎసి టి పన్ను విధానంలో రాష్ట్రాలు నష్టపోతున్న టాక్స్ ప్రయోజనాన్ని పూరించటానికి కేంద్రం రూ.9000 కోట్లను కేటాయిస్తోందని ప్రకటించారు. అందువలన అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ చిదంబరం, జాతీయ స్థాయిలో జరిగే ఈ పన్ను విధానంలో అర్థం చేసుకుని సహకరించమనికోరారు.
ఎప్పటి నుంచి నలుగుతోంది?
జిఎస్ టిని ముందుగా 2000 లో వాజ్ పాయ్ ప్రభుత్వం తీసుకుని దీని మీద అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. దానికి ఆనాటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసిమ్ దాస్ గుప్తా నేతృత్వం వహించారు. ఆ కమిటీ ఈ విధానానికి సమ్మతిస్తూ జనవరి 21, 2009 నాడు నివేదికను ఇచ్చేటప్పటికి ఆర్థిక మంత్రిగా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా వచ్చిన పళనియప్పన్ చిదంబరం ఏప్రిల్ 1, 2010 దీన్ని తీసుకుని వస్తామని, దీన్ని అమలు పరచటానికి రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయన కమిటీతో కలిసి మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు.
కొత్తగా ఆర్థిక మంత్రిగా పదవీ స్వీకారం చేసిన అరుణ్ జైట్లీకి గురువారం నాడు రెవిన్యూ శాఖ జిఎస్ టి గురించి వివరిస్తూ, పరోక్ష పన్నుల సంస్కరణకు పట్టం కట్టటం ఎంత అవసరమో వివరించింది. దీన్ని ఆయన ప్రధాన మంత్రి దగ్గరకు తీసుకుని వెళ్ళఇ, దీన్ని అమలు పరచటంలో గల సాధకబాధకాలను చర్చిస్తారు. లోగడ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు- ముఖ్యంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాలు కారణం చెప్పలేదు కానీ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
ప్రత్యక్షపన్నుల మాటేమిటి?
ఈ పన్ను విధానం ప్రత్యక్ష పన్నులైన ఆదాయపన్ను, కార్పొరేట్ టాక్స్, కాపిటల్ గైన్ టాక్స్ లకు అంతరాయం కలిగించదు.
జిఎస్ టి వలన ప్రయోజనం ఏమిటి?
ఈ విధానం అమలు జరిగినట్లయితే పన్నుల విషయంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా విధిస్తూ అందరినీ సందిగ్ధావస్థలో పడేయటానికి చరమగీతం పాడటం జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో ఎన్నో రకాల పన్నులున్నాయి, వాటి అవగాహన చాలామందికి లేకపోవటం వలన వ్యాపారస్తులు దాన్ని అడ్డుగా పెట్టుకుని వినియోగదారులను మోసం చేసే అవకాశం కూడ చాలా చోట్ల కనిపిస్తోంది. దేశం మొత్తంలో ఒకే పన్ను విధానం వచ్చి అందులోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సముచిత వాటాలు వెళ్ళటమనేది పన్ను విషయంలో నెలకొన్న సందిగ్ధావస్థలను ఛిన్నం చేసి స్పష్టతను తీసుకొని వస్తుంది. దానివలన పారదర్శకత పెరిగి అవినీతి, మోసాలకు కళ్ళెం పడుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more