Actress shanti priya interview

Actress Shanti Priya.GIF

Posted: 04/30/2012 03:19 PM IST
Actress shanti priya interview

shanti_priya
Shanti-priyaరాజమండ్రి సమీపంలో ఉన్న రంగంపేట గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు... సినిమా పరిశ్రమలోకి వరుసగా ఒకరి తర్వాత ఒకరు రావడం విశేషం (ఈ సోదరిత్రయంలో ఒకరైన జ్యోతిప్రియ సైతం 2002లో సినిమాల్లోకి వచ్చింది). అక్కతో పోల్చదగినంత అందం, నృత్యాభినయ ప్రతిభ లేకపోయినా... విశాలమైన కనులతో, ఛామన ఛాయలోని వింతైన ఆకర్షణతో తనకంటూ కొందరు అభిమానుల్ని సృష్టించుకుందీ అభి‘నేత్రి’.

‘మహర్షి’నాయికగా...

‘నిశాంతి’ని శాంతిప్రియగా మారుస్తూ తమిళ చిత్రంతో ఆమె సినిమా అరంగేట్రం జరిగింది. 1988లో ‘మహర్షి’తో సూపర్ హిట్ కొట్టింది. హీరోయి

న్స్ ఎంపిక విషయంలో రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరించక విభిన్నమైన రూపాలను తనదైన శైలిలో ఆవిష్కరించే కవి, దర్శక శ్రేష్టుడు ‘వంశీ’ ఆమెను ‘మహర్షి’ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించడంతో... శాంతిప్రియ సక్సెస్ క్లాప్ కొట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జునతో ‘అగ్ని’లో, ‘నీకూ నాకూ పెళ్లంట’ వంటి కమర్షియల్ చిత్రాలలో అందాలారబోసినా అవేవీ ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. విచిత్రమేమిటంటే వరస ఫ్లాపులతో వెనుకడుగు వేయాల్సిన ఆమె ఏకంగా బాలీవుడ్‌కు ఎదిగిపోవడం. అప్పట్లో సూపర్‌స్టార్ హోదాలో ఉన్న అక్షయ్‌కుమార్‌తో ‘సౌగంధ్’, దక్షిణాది వలస తారలను ఆఫర్లతో ఆదుకునే ఆపద్బాంధవుడు మిథున్‌చక్రవర్తితో ‘ఫూల్ ఔర్ అంగార్’ వంటి చిత్రాల్లో నటించింది. దర్శకరత్న దాసరి ఆవిష్కరించిన ‘విశ్వామిత్ర’తో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆర్యమాన్, దుర్గామా వంటి సీరియల్స్ లోనూ దర్శనమిచ్చింది. దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఏదో ఒక మీడియా ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్న ఆ ‘ప్రియ’మైన వినోదం ఇప్పుడేది?
వైవాహిక జీవితం నుంచి... విషాదపు ఒడిలోకి...

‘‘నేను కోరుకున్నదే చేశాను. జీవితంలో ప్రతీదీ మనసుకు నచ్చిందే చేశాను. ఆఖరికి సినిమాలకు గుడ్‌బై చెప్పడం కూడా’’ అన్నారు శాంతిప్రియ. మనస్ఫూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పాక, వి.శాంతారాం మనవడైన సిద్ధాంత్‌రాయ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు... శుభమ్, శిష్య. హాయిగా ఆనందంగా వీరి సంసారనావ సాగిపోతుండగా... హఠాత్తుగా అనూహ్యమైన విషాదం. గుండెపోటుతో చిన్న వయసులోనే సిద్ధాంత్ మరణించారు. విషాదం అభినయించడం వేరు... అనుభవించడం వేరు. ‘‘మేమిద్దరం ఎంతో సంతోషంగా గడిపాం. అనుకోకుండా ఆయన దూరమయ్యాక నా జీవితం చాలా మారింది. నా ఇద్దరు పిల్లలకూ సింగిల్ పేరెంట్‌ని అయ్యాను. అయినా ఎవరి సహాయాన్నీ అర్థించలేదు. మరింత స్ట్రాంగ్‌గా మారాను. ఆయన లేని లోటు పిల్లలకు తెలీకుండా ఉండేందుకు వారికి మరింత దగ్గరయ్యాను’’ అని వివరించారు.

పిల్లలు నటించమన్నారని...

ఎంతో కాలంగా తిరిగి తనను నటించమని పిల్లలు అడుగుతున్నా... చేద్దాం, చూద్దాం అంటూ గడిపేస్తున్న తరుణంలో అనుకోకుండా శాంతిప్రియకు ఓ ఆఫర్ వచ్చింది. అది కూడా ఆమెకు సౌగంధ్ ద్వారా హిందీకి పరిచయం చేసిన సంస్థ నుంచే. ‘‘ఓ రకంగా ఆ సంస్థ నన్ను రీలాంచ్ చేసింది’’ అన్నారామె. రాజ్.ఎన్. సిప్పీ తీసిన ‘హామిల్టన్ ప్యాలెస్’లో శాంతి నటించారు.దాని గురించి చెబుతూ ‘‘ఈ వయసులో ఆఫర్ అనగానే వదినో, తల్లి పాత్రో అనుకున్నా. థ్యాంక్ గాడ్, అలాంటి పాత్ర రాలేదు’’అంటూ నవ్వేశారు. 2008లో గ్లాడ్‌రాగ్స్ మిసెస్ ఇండియా కాంటెస్ట్‌లో కూడా ఆమె తళుక్కుమన్నారు. తర్వాత తప్ప మళ్లీ అలికిడి లేదు.

సినిమాలకైనా సీరియల్స్‌కైనా సై...

‘పునరాగమనం’ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు- ‘‘నా పిల్లలు నన్ను మళ్లీ మళ్లీ సినిమాల్లో చూడాలనుకుంటు న్నారు’’ అన్నారామె. మొత్తానికి వాళ్ల పట్టుదల ఫలించినట్టే ఉంది. ప్రస్తుతం సినిమా/ సీరియల్స్ దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానని శాంతి చెప్పారు. మీ అక్కాచెల్లెళ్ల బాటలోనే... ‘‘మీ పిల్లల్ని కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చే ఆలోచనేమైనా ఉందా?’’ అని అడిగితే... ‘‘వాళ్లింకా స్కూల్ స్టడీస్ దశలోనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు చదువు మీద మాత్రమే కాన్సన్‌ట్రేట్ చేయాలి. ఆ తర్వాత అంటారా... అది వారి వ్యక్తిగత నిర్ణయానికి వదిలేస్తా’’ అన్నారు. ‘‘సుమం ప్రతి సుమం సుమం... వనం ప్రతి వనం వనం...’’ అంటూ వదలని నీడైన ప్రేమికుడి ప్రణయ గాఢతకు బెదిరి, వణికిపోయిన నాటి యువ ప్రేక్షక‘ప్రియ’... మళ్లీ తెరపై దర్శనమిచ్చే తరుణం కోసం... వేచి చూద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Smita patil life history
Super athlete ashwini nachappa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles