
హీరోయిన్ తల్లి అనగానే ఒక భిన్నమైన చిత్రం కళ్లకు కట్టినట్టు కనపడుతుంది. అహంకారులు, పనికి అడ్డు తగులుతారు, చీటికీ మాటికీ విసిగిస్తారు, సవాలక్ష ఆంక్షలు విధిస్తారు... ఈ ప్రశ్నలు సహా ఒక హీరోయిన్ తల్లి అంతరంగాన్ని అగ్రహీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్న త్రిష తల్లి ఉమా కృష్ణన్ కూతురు త్రిష గురించీ, హీరోయిన్ తల్లిగా తన పాత్ర గురించీ ఉమా కృష్ణన్ పంచుకున్న మాటలు... ఎక్స్ క్లూజివ్ స్టోరీ ఆన్ ఆంధ్ర విశేష్.....
చెట్టుకు వేలాడుతోంది నాకు త్రిష ఓన్లీ చైల్డ్. ఒక్కతే కావడం వల్ల కాస్త గారాబంగానే పెరిగింది. మహా అల్లరిది. చెన్నై చర్చ్ పార్కు స్కూల్‌లో చదువుకుంది. అక్కడినుంచి నాకు చాలా ఫిర్యాదులు వచ్చేవి. ఓరోజు స్కూలు ప్రిన్సిపాల్ నన్ను అర్జెంటుగా రమ్మని కబురు పంపారు. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆఫీసులో ఉండగా ఫోన్. ‘ఏమైందా’ అనుకుంటూ వెళ్లేసరికి పైన చెట్టు కొమ్మను చూపించారు. అక్కడ త్రిష తలకిందులుగా వేలాడుతోంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమైనా జరిగితే తాను బాధ్యత వహించనని చెప్పారాయన. ఇలాంటి అల్లరిపనులు చాలానే చేసేది. అయినా చదువులో వెనకబడేది కాదు. మంచి మార్కులే సంపాదించుకునేది.నటి కావాలన్నది త్రిష కోరికే మా అమ్మాయిని హీరోయిన్‌ని చేయాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. తనకూ అలాంటి కోరిక ఉందని కూడా తెలియదు. ఎక్కడా శిక్షణ కూడా ఇప్పించలేదు. కానీ తన ఇష్టాయిష్టాలను ఎప్పుడూ కాదనలేదు. ఒకసారి మిస్ చెన్నై(1999) పోటీల్లో పాల్గొంటానంటే సరే అన్నాను. అందులో కిరీటం తననే వరించింది. దీంతో చాలా మంది తనను సినిమాల్లో నటించమని అడిగారు. ‘తనింకా స్కూల్ ఫైనల్‌లో ఉంది... ఏదో బ్యూటీ కంటెస్ట్ కు వెళతానంటే పంపించానే తప్ప సినిమాల్లో చేయించే ఉద్దేశంతో కాద’న్నాను.అయితే దర్శకుడు ప్రియదర్శన్ పట్టుబట్టారు. ఒకవేళ సినిమాల్లో నటించాలని ఉంటేగనక ఇదే మంచి అవకాశమని చెప్పారు. తాను మలయాళ చిత్రాన్ని, తమిళంలో చేస్తున్నాననీ, కథ నచ్చితేనే నటించమనీ అడిగారు. సరే, ఒకసారి ప్రయత్నిద్దాం. నచ్చితే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానిపించేద్దాం అనుకుని ఒప్పుకున్నాను. కానీ తనకు ఇండస్ట్రీ నచ్చడంతోపాటు పేరు కూడా వచ్చింది. అలాగే కంటిన్యూ అయ్యింది.
తెలుగు చిత్రాల ‘వర్షం’లో... ప్రియదర్శన్ తమిళ చిత్రం ‘లేసా లేసా’ షూటింగ్ జరుగుతుండగానే, ‘మౌనం పేసియదు’ ఆఫర్ వచ్చింది. అదే ముందుగా విడుదలయ్యింది కూడా. మౌనం పేపియదు చూసిన నిర్మాత ఎం.ఎస్.రాజు తమ ‘వర్షం’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. మంచి కథ. పాత్ర హోమ్లీగా ఉంటుంది. రాజు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది మంచి బ్రేక్‌నిస్తుందని చెప్పారు. నిజంగానే ఆయన అన్నట్టుగా ఆ సినిమా త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది.మేము మొదటిసారి హైదరాబాద్ వచ్చింది ఈ సినిమా ఫొటో సెషన్ కోసమే. ప్రభాస్‌తో కొన్ని షాట్స్ తీశారు. ఎం.ఎస్.రాజు మంచి నిర్మాత. తర్వాత ఆయన నిర్మాతగా, ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో నటించింది. తర్వాత, ‘అతడు’, ‘స్టాలిన్’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘కింగ్’, తాజాగా ‘బాడీగార్డ్’... ఇలా బిజీ అయిపోయింది. నేననుకోవడం తమిళంకంటే తెలుగులోనే తనకు మంచి పేరు వచ్చింది.
పొగడకూడదు కానీ... త్రిష నటించిన సినిమాలు అన్నీ నాకు ఇష్టమే. అయితే ఏ ఒక్కటో అడిగితే మాత్రం చెప్పలేను. కాకపోతే తను చేసిన చిత్రాల్లో కొన్ని హృదయానికి హత్తుకునే సన్నివేశాలున్నాయి. ఉదాహరణకు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో సిద్ధార్థ తల్లిగా నటించిన గీత... త్రిషను బాగా తిడుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. ఆమె వెళ్లిపోతుండగా అన్నగా నటించిన శ్రీహరి వస్తారు. ఆయనను చూసి, ఒకింత దుఃఖం, ఒకింత సంతోషాన్ని కలగలిపి త్రిష నటించిన తీరు నాకు బాగా నచ్చింది. ఈ సీన్ పండటానికి దర్శకుడు ప్రభుదేవా మంచి శిక్షణ ఇచ్చారు. అలాగే ‘వర్షం’లో తను హీరో ప్రభాస్‌తో మాట్లాడాల్సిన విషయాలను వర్షంతో చెబుతుంటుంది. ఆ సీన్ కూడా నాకు ఎంతో నచ్చింది. ఇంకా తమిళ చిత్రం ‘సామి’లో చేసిన భువన పాత్ర క్యూట్‌గా ఉంటుంది. ఇంకా ‘విన్నైతాండి వరువాయా’ (తెలుగులో ‘ఏం మాయ చేసావె’గా రీమేక్ అయింది)లోని జెస్సీ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంటుంది. అన్ని చిత్రాల్లోనూ త్రిష చాలా బాగా చేసింది. కూతురిని ఎక్కువ పొగడకూడదు. అయినా తన నటనకు నూటికి నూరు మార్కులు వేస్తా!
నా పాత్ర పరిమితం... త్రిష నటించబోయే చిత్రాల కథలు మేము ఇద్దరం వింటాము. కథ సినాప్సిస్ ఇస్తారు. నా అభిప్రాయం చెబుతాను. సలహాలిస్తాను. కానీ నిర్ణయం మాత్రం త్రిషే తీసుకుంటుంది. కథలో మార్పులు ఇలా చెయ్యాలనో, అలా మార్చమనో కూడా నేనెప్పుడూ అడగను. పారితోషికం కూడా ఇంత డిమాండ్ చెయ్యాలి అని నేను పట్టించుకోను. ఆ వ్యవహారాలు తనే చూసుకోగలదు. త్రిష ఎదుగుదలలో నా ప్రోత్సాహం ఎంత ఉన్నప్పటికీ అది పరిమితమే. తల్లిగా నేను ఇవ్వాల్సిన సహకారం ఇస్తానుతప్ప, కృషి మొత్తం తనదే. తనకు పేరొచ్చిందంటే తన ప్రతిభ, పట్టుదల వల్లే.అంతెందుకు, నేను షూటింగ్ స్పాట్స్‌కు కూడా అస్తమానం వెళ్లను. అప్పుడప్పుడూ వెళ్తాను. వెళ్లినప్పుడు మాత్రం అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. దాదాపు అందరూ డెరైక్టర్లు, నిర్మాతలకు నేను తెలుసు. ‘త్రిష మదర్’ వచ్చారని మర్యాదగా పలకరిస్తారు. అంతేతప్ప హీరోయిన్ తల్లి అనగానే నెగెటివ్‌గా ఎవరూ భావించరు. అందరూ పాజిటివ్‌గానే స్పందిస్తారు.గ్లామర్ గ్లామర్‌లానే ఉండాలి... సినిమాల్లో నటించే అమ్మాయి అందంగా కనపడాలి. కొంతమేరకు ఎక్స్ పోజింగ్‌కు అనుమతి ఇవ్వవచ్చు. అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే గ్లామర్ గ్లామర్ గానే ఉండాలి కాని, ఎబ్బెట్టు కాకూడదు. అవసరమైతే మోడరన్ కాస్ట్యూమ్స్ కూడా వేసుకోవాలి. త్రిషకు ఆ స్వేచ్ఛను ఇచ్చాము. ఇంట్లో కూడా తనకు నచ్చిన డ్రెస్సులే వేసుకుంటుంది. ఫలానాది వద్దు, ఫలానాది వేసుకొమ్మని నేనైతే బలవంతం చేయను.
అది బాధించిన వీడియో... తన కెరీర్ ఊపందుకుంటున్న దశలో జరిగిన బాత్‌రూమ్ వీడియో వ్యవహారం (2004లో త్రిష స్నానం చేస్తున్నప్పుడు తీసినట్టుగా ఇంటర్నెట్లో చలామణీ అయిన ఒక వీడియో) మమ్మల్ని చాలా బాధించింది. త్రిషలాగే మరో అమ్మాయి ఉన్నట్టు అప్పుడే నాకు తెలిసింది. అందరూ మంచి వాళ్లు ఉండరనే విషయం కూడా అదే రోజు నాకు అర్థమైంది. కొంత పేరువచ్చాక ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తనకు ధైర్యం చెప్పాను.తినడం మరిచిపోతుంది మా అమ్మాయి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా విషయాల్లో ఇద్దరమూ ఒకేలా ఆలోచిస్తాం. పనుల్లో పడి ఒక్కోసారి తినడం మరిచిపోతుంటుంది. నేనే గుర్తు చేస్తుంటాను. తన మెనూలో పళ్లు, కూరగాయలు ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. దీనికి ఒక్కోసారి కోప్పడుతుంది. అయినా చెబుతూనే ఉంటాను. రెండు రోజులు ఎక్కువగా తింటే, తనే మరుసటి రోజు ఆహారం మానేసి, సూప్స్ తాగుతుంది. తనకు బ్రౌన్ వీట్ శాండ్‌విచ్ అంటే మహాయిష్టం. అయితే, తన డైట్ మీద ఎంత శ్రద్ధ ఉన్నప్పటికీ, తనకు ఇష్టమైనవి వడ్డించడంలో అశ్రద్ధ చేయను.
ఫ్రెండ్స్... అడ్వెంచర్స్.. త్రిషకు స్నేహితులంటే ప్రాణం. తను ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు. తనతో నర్సరీ చదువుకున్న వాళ్లు కూడా ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. అంత స్నేహశీలి. స్నేహితులను అస్సలు వ దులుకోదు. అలాగే తనకు డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకునేది. స్కై డైవ్, బంగీ జంప్ లాంటి సాహసాలు కూడా చేస్తుంది. రెండు రోజుల క్రితమే ‘ఆస్ట్రేలియాలో స్కైడైవ్ చేశా’నని ఫోన్ చేసి చెప్పింది. 14,000 అడుగుల ఎత్తున ఉన్న విమానంలో నుంచి కిందికి జంప్ చేసిందట. ఎంతైనా తనకు ధైర్యం ఎక్కువ!
పెళ్లి చేయాలి... త్రిషకు తన అభిమానుల నుంచి ఎన్నో ప్రేమలేఖలు వచ్చేమాట నిజమే. కానీ వాటిని ఈజీగా తీసుకుంటాం. పెద్దగా చర్చించుకోం. నవ్వుకుని అక్కడితో వదిలేస్తాం. అయితే తనకు పెళ్లి చేయాలి. ఎప్పుడనేది చెప్పలేనుగానీ తగిన వాడు దొరికినప్పుడు, అని మాత్రం చెప్పగలను. అయితే అదీ ఆమె ఇష్టమే. ఆమె ఎవరిని ఇష్టపడితే వారితోనే పెళ్లి జరుగుతుంది. వరుడి ఎంపిక విషయం ఆమెకే ఇస్తున్నాను. ఇందులో నా ప్రమేయం ఉండదు, తల్లిగా ఆశీర్వదించడం మినహా.అనాథ పిల్లలను దత్తత తీసుకుంది త్రిషకు జంతువులంటే ప్రాణం. వాటికోసం ‘పెటా’ సంస్థ తరఫున ప్రచారం చేస్తోంది. బోలెడంత డబ్బు పెట్టి ఖరీదైన కుక్కలను కొనడం కన్నా, వీధి కుక్కలను ఆదరించి, వాటికి మంచి ఆహారం పెట్టాలనే మనస్తత్వం ఆమెది. అలాగే, చెన్నైలోని ఉదవుం కరంగల్ అనే సంస్థలో ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. వారితో అప్పుడప్పుడు వెళ్లి గడిపి వస్తుంటుంది. వాళ్లకు నిండు మనసుతో తన ప్రేమను పంచుతుంది. నటిగా పైకి ఎదగడంలోనే కాదు, సమాజ సేవ చేయాలని తపన ఉన్నందువల్ల నా కూతురంటే నాకు మరింత ప్రేమ కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది.
చిన్నారి త్రిష... కేరళ టు తమిళనాడు టు ఆంధ్రప్రదేశ్ త్రిష పుట్టినరోజు 4 మే 1983. మాతృభాష తమిళం. అయితే వాళ్ల పూర్వీకులు కేరళలోని పాలక్కాడ్ ప్రాంతం నుంచి వచ్చి తమిళనాట స్థిరపడ్డారు. మిస్ ఇండియా 2001లో పాల్గొని, ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ అవార్డు గెలుచుకుంది. జోడీ చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగానూ, ఫల్గుణీ పాఠక్ గానం చేసిన ‘మేరీ చునర్...’ వీడియోలో ఆయేషా టకియా స్నేహితురాలిగానూ త్రిష కనిపిస్తుంది.
తెలుగులో నటించిన మొదటి చిత్రం ‘వర్షం’(2004).ఉమకూ ఆఫర్లు వచ్చాయి!త్రిష కన్నా మీరే అందంగా ఉంటారని ఉమా కృష్ణన్‌తో అంటే హాయిగా నవ్వేస్తారామె. అందుకే ఆమెను తమ సినిమాల్లో ఏదో పాత్రలో నటించమని చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే, కూతురి కెరీర్ మీద శ్రద్ధ పెట్టలేనేమోనని ఆమె వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. అయితే మొన్నీమధ్యే కూతురితో కలిసి ఒక యాడ్‌లో నటించారు ఉమ. బాసుమతి బియ్యానికి సంబంధించిన ఈ వాణిజ్య ప్రకటనలో ఉమ, త్రిష తల్లీకూతుళ్లుగానే కనిపిస్తారు. నిజ జీవిత తల్లీకూతుళ్లయితే బాగుంటుందని అడగడంతో ఒప్పుకున్నారు. ‘కెమెరా ముందు నటించడం ఇబ్బందిగానే అనిపించింది. కానీ డెరైక్టర్ (ఎ.ఎల్.) విజయ్ నా బెరుకు పోగొట్టి, షూటింగ్ సాఫీగా అయ్యేలా చేశారు’ అని చెప్పారు ఉమ.
|