Growing Longer Hair Quickly and Natural Home Remedies

Tips for healthy long hair

Healthy Hair Tip, Long Healthy Hair, Healthy Hair, Tip Of The Day, Health Tip Of The Day, Health Tip Teluguwishesh, Daily Hair Tip

Best Way to growth of healthy Hair. Natural Methods with out going saloon and complete History of Human Hair.

జుట్టుకు కూడా ఆరోగ్యం అవసరమే...

Posted: 07/31/2017 03:34 PM IST
Tips for healthy long hair

మనిషి చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అని మూడు పొరలు ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండే హైపో డెర్మిస్ లో కొవ్వు, అనుసంధాన కణజాలం ఉంటాయి. ఇది చర్మానికి ఆధారాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇక మధ్యలో ఉండే పొర డెర్మిస్. దీనిలోనే వెంట్రుకల కుదుళ్లు (ఫాలికల్), స్వేద గ్రంధులు, రక్త నాళాలు, నాడుల చివర్లు ఉంటాయి. వీటన్నింటికీ పైన రక్షణగా ఎపిడెర్మిస్ పొర ఉంటుంది. స్వేద గ్రంథుల నాళాలు, వెంట్రుకలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మం పైకి వస్తాయి.

వెంట్రుకల కుదుళ్లలో ఒక గ్రంథి ఉంటుంది. దానినే ఫాలికల్ గా వ్యవహరిస్తాం. ఇందులో పిగ్మెంట్ కణాలు (వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసేవి) ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే నలుపు రంగు వర్ణ ద్రవ్యాన్నే మెలనిన్ గా వ్యవహరిస్తాం. సన్నని ట్యూబ్ లా ఉండే వెంట్రుకల్లో మెలనిన్ చేరడం కారణంగానే వాటికి నలుపు రంగు వస్తుంది. ఫాలికల్ ఉత్పత్తి చేసే మెలనిన్ స్థాయిని బట్టే మన జుట్టు రంగు నిర్ధారితం అవుతుంది. మెలనిన్ ఎక్కువగా ఉంటే చిక్కటి నలుపు రంగు వెంట్రుకలు ఉంటాయి. మెలనిన్ శాతం తగ్గినకొద్దీ నలుపు తగ్గిపోతూ.. ముదురు గోధుమ రంగు, లేత గోధుమ రంగు, ఎరుపు మిళితమైన రంగు, తెల్లని వెంట్రుకలు ఏర్పడతాయి.

జుట్టును ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు ఎందరో. ఎన్నో సూచనలు, సలహాలను పాటిస్తే గానీ ఒత్తైన జుట్టు రాదనే చెబుతుంటారు. కానీ, వాటిలో ఎంతవరకు పనిచేస్తాయన్నది అనుమానమే. కాలుష్యం, పోషకాహార లోపం, వంశపారంపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల ఔషధాలు తదితర కారణాలు జుట్టు ఊడిపోవడానికి, తెల్లబడడానికి కారణాలు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అందమైన, ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది.

జుట్టు వేగం...

సాధారణంగా తలపై వెంట్రుకలు ఏడాదికి 6 అంగుళాలు (15 సెంటీ మీటర్లు) పెరుగుతాయని అంచనా. దీనిని కచ్చితంగా చెప్పలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. మనలోని జన్యువుల నుంచి వాతావరణం, మనం తీసుకునే ఆహారం, కాలుష్యానికి లోనవడం, జుట్టు సంరక్షణ కోసం తీసుకునే చర్యలు వంటివి జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతాయి.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆసియన్లలో జుట్టు పెరుగుదల రేటు అందరికన్నా ఎక్కువగా ఏడాదికి 6 అంగుళాల వరకు ఉంటే.. ఆఫ్రికన్లలో చాలా తక్కువగా నాలుగు అంగుళాల వరకే ఉంటుంది.

ఇప్పుడు అందరికీ సమస్యలే...

వెంట్రుకలు రాలిపోవడం, తెల్లబడడం, బట్టతల, చుండ్రు వంటి సమస్యలతో ఇటీవలి కాలంలో ఆసుపత్రులు, బ్యూటీ క్లినిక్ ల చుట్టూ తిరిగే వారి సంఖ్య చాలా పెరిగింది. ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లలో కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు కేవలం 20 ఏళ్ల వయసు యువతలోనూ కనిపిస్తున్నాయి.

కొత్త హెయిర్ స్టైల్ తోనూ సమస్యే!

మనం కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడూ కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ ను ప్రయత్నిస్తుంటాం. ఇందుకోసం హెయిర్ రోలర్లు, స్ట్రెయిటెనర్లు, డైలు, బ్లీచ్ లు వంటి పలు రకాల రసాయన పదార్థాలను వినియోగిస్తుంటాం. వీటి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని.. వెంట్రుకలు రాలిపోయే సమస్య ఉత్పన్నమవుతుంది. ఒక్కోసారి కుదుళ్లు బాగా దెబ్బతిని ఆ ప్రాంతాల్లో తిరిగి వెంట్రుకలు తిరిగి పెరగని పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల కొత్త హెయిర్ స్టైల్ లను ప్రయత్నించేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల వద్ద మాత్రమే ప్రయత్నించాలి.
అప్పటికే జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నవారు కొత్త కొత్త హెయిర్ స్టైల్ లను ప్రయత్నించకపోవడం మేలు. రసాయనాలు, హెయిర్ రోలర్లు, స్ట్రెయిటెనర్లు ఉపయోగించకపోవడం మంచిది.
జుట్టును రబ్బరు బ్యాండ్లతో బిగించడం వల్ల వెంట్రుకల మూలంపై ఒత్తిడి పడుతుంది. దాంతో కుదుళ్లు వదులవుతాయి.
జుట్టును విపరీతంగా దువ్వడం వల్ల వెంట్రుకలు తెగి రాలిపోతుంటాయి. అందువల్ల దూరం దూరంగా పళ్లుండే దువ్వెనను ఉపయోగించాలి.
జుట్టు తడిగా ఉన్నప్పుడే కొంత దృఢంగా ఉంటుంది. అందువల్ల తల స్నానం చేసినప్పుడు జుట్టు ఆరకముందే దువ్వుకోవడం మంచిది.
రోజూ షాంపూను ఉపయోగించడం మంచిదికాదు. షాంపూ పెట్టినప్పుడల్లా కండిషనర్ ను కూడా తప్పనిసరిగా ఉపయోగిస్తే జుట్టు తెగిపోవడం తగ్గుతుంది.
తడి జుట్టును ఆరబెట్టుకోవడం కోసం టవల్ లాంటి దానితో గట్టిగా రుద్దడం మంచిదికాదు.

తెల్లజుట్టు.. రాలిపోవటానికి కారణం:

వయసు పైబడుతున్న కొద్దీ వెంట్రుకల మూలాలు కుచించుకుపోతాయి. కొత్త వెంట్రుకల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. దాంతో బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది వంశపారంపర్యంగా కొందరిలో ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఉంటుంది.
వెంట్రుకలు రాలిపోవడానికి మరో ప్రధానమైన కారణం సరైన, సమతుల ఆహారం అందకపోవడమేనని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి ఎక్కువ శాతం మందిలో జుట్టు రాలిపోడానికి ఇదే కారణం.
థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అధికంగా లేక తక్కువగా విడుదల కావడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.
మహిళలు పిల్లలకు జన్మనిచ్చాక రెండు మూడు నెలలకు జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది. గర్భం దాల్చినపుడు వారి శరీరంలో ఎక్కువ మోతాదులో విడుదలైన హార్మోన్ల కారణంగానే ఈ సమస్య తలెత్తుతుంది.
ఇక అధిక రక్తపోటు, గుండె, నాడీ సమస్యలకు వాడే మందులు, కేన్సర్ వ్యాధి చికిత్సలో వాడే మందులు, కీమో థెరపీ వంటివి జుట్టుపై తీవ్ర ప్రభావం చూపి, రాలిపోవడానికి కారణమవుతాయి. అధిక మొత్తంలో విటమిన్-ఏ తీసుకోవడం వల్ల, గర్భనిరోధక మాత్రలు, యాంటీడిప్రెసెంట్ మందుల కారణంగా కూడా జుట్టు రాలవచ్చు.
చుండ్రు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వెంట్రుకలు రాలే అవకాశం ఎక్కువ.
మానసిక, శారీరక ఒత్తిడులు, ఐరన్ లోపం జుట్టు ఊడిపోవడానికి కారణమవుతాయి.
వాహనాల కాలుష్యం, కలుషిత నీరు వంటి వాటి వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది.
ఇక జుట్టు రాలిపోవడం, బట్టతల వంశపారపర్యంగా సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ.
పేల సమస్య కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది.
మధుమేహం వ్యాధిని నిర్ధారించేందుకు చేసే పరీక్షలు, పూర్తి స్థాయి రక్త పరీక్షలు, థైరాయిడ్ హార్మోన్ల శాతాన్ని నిర్ధారించే పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి టెస్టులు జుట్టు రాలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.
హెయిర్ డ్రయ్యర్ మరింత సమస్య
జుట్టు ఆరబెట్టుకోవడానికి వినియోగించే హెయిర్ డ్రయ్యర్లతో వెంట్రుకలు దెబ్బతిని.. రాలిపోవడం, సన్నబడడం, తెగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అప్పటికే జుట్టు రాలే సమస్య ఉన్నవారు హెయిర్ డ్రయర్ ను వినియోగిస్తే అది మరింతగా పెరుగుతుంది. సాధారణంగా వెంట్రుకలు ట్యూబ్ వంటి నిర్మాణాలు. వాటి లోపల మెలనిన్ తో పాటు స్వల్పంగా నీరు కూడా ఉంటుంది. హెయిర్ డ్రయ్యర్ తో జుట్టు ఆరబెడితే.. దాని నుంచి వచ్చే వేడి గాలికి వెంట్రుకల్లోని నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది. దీనివల్ల వెంట్రుకల్లో బుడగల్లా ఏర్పడుతుంది. దీన్నే ‘బబుల్ హెయిర్’ పరిస్థితి అంటారు. ఇది వెంట్రుకలు బలహీనం కావడానికి, గరుకుగా మారడానికి, చిక్కులు పడడానికి కారణమవుతుంది. ఇలాంటప్పుడు జుట్టు దువ్వుకుంటే.. బుడగలు ఏర్పడిన చోట వెంట్రుకలు తెగి, రాలిపోతాయి.
జుట్టు దెబ్బతినకూడదంటే వీలైనంత వరకూ హెయిర్ డ్రయర్ వాడకపోవడమే మంచిది. వాడితే తక్కువ వేడి ఉండే సెట్టింగ్ చేసుకుని, తక్కువ సమయం పాటు మాత్రమే వాడాలి. లేదా వీలైతే ఫ్యాన్ కింద, బాగా గాలి వీచే చోట ఆరబెట్టుకోవడం బెటర్.
సమస్యను గుర్తించి, నిర్ధారించేది ఇలా..
వెంట్రుకలు రాలిపోవడానికి కారణాలేమిటనేది తేల్చేందుకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు మీ మానసిక పరిస్థితిని, గత కొద్ది కాలంగా మీరు వినియోగించిన ఔషధాల వివరాలను అడిగి పరిశీలిస్తారు. సాధారణ వైద్య పరీక్షలు, ఇతర వివరాలేవీ జుట్టు రాలడాన్ని సమర్థించేలా లేనప్పుడు.. తలపై వెంట్రుకలతో కూడిన కొంత చర్మాన్ని సేకరించి (బయాప్సీ) పూర్తిస్థాయి వైద్య పరీక్షలకు పంపుతారు. తద్వారా ఆటో ఇమ్యూన్ వ్యాధులేమైనా ఉన్నాయా, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షనా అన్నది పరిశీలిస్తారు.

చికిత్సా మార్గాలు ఎన్నో?

వెంట్రుకలు రాలిపోవడం, తెల్లబడడం వంటి సమస్యలకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బాధితుల పరిస్థితి, అవసరాన్ని బట్టి ఏ చికిత్సలను చేపట్టాలనేది వైద్యులు నిర్ధారిస్తారు.
కొన్ని రకాల మందులు, ఔషధాలు జుట్టు పెరుగుదలను కొంత వరకు సరిదిద్దగలవు. ఇవి క్రీములు, లోషన్లు, మాత్రల రూపంలో కూడా లభిస్తాయి. వారసత్వంగా వచ్చే జుట్టు రాలే సమస్య ఉన్నవారికి ఈ తరహా మందులు కొంత వరకు ప్రయోజనం కలిగిస్తాయి. వీటిని కనీసం ఐదారు నెలల పాటు కచ్చితంగా ఉపయోగించి చూసినప్పుడు మాత్రమే ఫలితాలు ఎంత వరకు వస్తున్నాయో నిర్ధారించగలం.
కొన్ని రకాల ప్రత్యేకమైన స్టెరాయిడ్లు జుట్టు పెరుగుదల, దెబ్బతిన్న వెంట్రుకల మూలాలను సరిదిద్దగలగడం చేయగలవు. కానీ ఇది చాలా ఖరీదైనది. సైడ్ ఎఫెక్టులు కూడా ఎక్కువే ఉంటాయి. నిపుణుడైన వైద్యులు మాత్రమే పూర్తి పర్యవేక్షణలో ఈ స్టెరాయిడ్లను ఇస్తారు.
వెంట్రుకలు రాలిపోయి బట్టతలగా మారిన ప్రాంతంలో చర్మాన్ని తొలగించి.. శరీరంలోని ఇతర ప్రాంతాల్లోంచి చర్మాన్ని తెచ్చి అతికించే శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీనిని స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇందులో తలపై వెంట్రుకలు ఉన్న చర్మాన్నే సాగదీసి.. వెంట్రుకలు లేని చర్మానికి బదులుగా అమర్చే విధానం కూడా ఉంది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్నది. పూర్తి స్థాయిలో జుట్టు వచ్చేందుకు అవకాశం తక్కువ.
వెంట్రుకల కుదుళ్లను లేజర్ కిరణాలతో ఉత్తేజపరిచి వెంట్రుకలు పెరిగేలా చేసే శస్త్రచికిత్స కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా ఖరీదైన పద్ధతి.
ఇక ఆయుర్వేద, హోమియో విధానాల్లో కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొందరిలో వాటి వల్ల వెంట్రుకల పెరుగుదల బాగా మెరుగుపడుతుంది కూడా.
పూర్తిగా బట్టతలగా మారిపోయినవారు, కేన్సర్ చికిత్స కారణంగా తాత్కాలికంగా వెంట్రుకలు మొత్తం రాలిపోయినవారు చివరికి విగ్గులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. చికిత్సల కోసం పెద్దగా ఖర్చుపెట్టలేనివారు కూడా తాత్కాలికంగా విగ్గులతో తమ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
‘విటమిన్ హెచ్’ వాడండి
శరీరంలో వెంట్రుకలు, గోళ్లు సరిగా పెరగడానికి విటమిన్ బీ7 (బయోటిన్) తోడ్పడుతుంది. అందువల్లే దానిని హెయిర్ విటమిన్ లేదా విటమిన్ హెచ్ అని పిలుస్తుంటారు. కాలేయం, కాలిఫ్లవర్, క్యారెట్లు, అరటి, యీస్ట్, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, చికెన్ లో బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది. బయోటిన్ తగిన స్థాయిలో అందితే వెంట్రుకలు దృఢంగా, పొడవుగా పెరుగుతాయని.. సరిగా అందకపోతే సన్నబడి, సులువుగా తెగిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఉంగరాల జుట్టుకు రీజన్...

కొందరి జుట్టు చక్కగా నిటారుగా ఉంటుంది. మరి కొందరిలో మాత్రం గింగిరాలు తిరిగే ఉంగరాల జుట్టు ఉంటుంది. వెంట్రుకలు నిటారుగా ఉండడం సాధారణమే. కానీ ఉంగరాల జుట్టుకు మాత్రం కొన్ని జన్యువులు కారణం. అలాంటి జన్యువులు ఉన్నవారిలో వెంట్రుకల కుదుళ్ల (ఫొలికిల్) ఆకారం, వెంట్రుకలు చర్మంపైకి పొడుచుకు వచ్చే కోణం కొంత విభిన్నంగా ఉంటాయి. దాంతో ఉంగరాల జుట్టు ఏర్పడుతుంది. వెంట్రుకలు నిటారుగా ఉన్నవారితో పోల్చితే ఉంగరాల జుట్టు ఎక్కువ పొడిగా ఉంటుంది. సులువుగా తెగిపోయే లక్షణం ఉంటుంది. అందువల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.


రాలిపోవడం సాధారణమే..
మన తలపై సుమారు లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. అందులో సాధారణంగానే రోజుకు సుమారు 100 వరకు వెంట్రుకలు రాలిపోతూనే ఉంటాయి. చర్మ కణాలు, వెంట్రుకల పెరుగుదల క్రమంలో ఇది నిత్యం జరుగుతూ ఉండేదే. అయితే పరిమితికి మించితేనే జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. 100 వరకు వెంట్రుకలు అంటే మనం పెద్దగా గుర్తించలేం. కానీ ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతున్నాయంటే మాత్రం కచ్చితంగా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇలా జుట్టు రాలిపోవడాన్ని ‘అలోపెసియా’ అంటారు. ఇది మెల్లమెల్లగా పూర్తి బట్టతల పరిస్థితికి దారితీస్తుంది.

వెంట్రుకల జీవితకాలం తెలుసా?

మన తలపై ఉండే వెంట్రుకల సగటు జీవితకాలం నాలుగున్నరేళ్లు మాత్రమేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వెంట్రుక పుట్టాక నాలుగు, నాలుగున్నరేళ్ల తర్వాత కుదుళ్లతో సహా పూర్తిగా రాలిపోతుంది. మరో ఆరు నెలల్లోపే ఆ స్థానంలో కొత్త వెంట్రుక పుట్టుకు వస్తుంది. తగిన పోషకాహారం తీసుకోకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని సార్లు కొత్త వెంట్రుకలు పుట్టడం ఆగిపోతుంది. అది చివరికి బట్టతలకు దారితీస్తుంది.


గుండు ఓ అపోహ మాత్రమే...

గుండు చేసుకోవడం వల్ల వెంట్రుకలు మెరుగుపడతాయని, బాగా పెరుగుతాయనడం ఒక అపోహ మాత్రమే. అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అలాగే గడ్డం, ఇతర శరీర భాగాల్లో షేవింగ్ చేసుకోవడం వల్ల వెంట్రుకలు లావవుతాయనేది కూడా అవాస్తవమేనని స్పష్టం చేస్తున్నారు. గుండు చేసుకున్న తర్వాత వెంట్రుకలు చిన్నగా ఉండి, షాంపూ వినియోగం, హెయిరాయిల్ వినియోగం సమర్థవంతంగా ఉంటుందని.. దాంతో వెంట్రుకలు కాస్త మెరుగుపడతాయని చెబుతున్నారు.
ఇక వెంట్రుకలు కుదుళ్ల భాగంలో లావుగా, గరుకుగా ఉండి.. కొసల వరకు సన్నగా, సున్నితంగా అవుతుంటాయి. షేవింగ్ చేసుకున్నప్పుడు వెంట్రుకల కుదుళ్ల వరకు కత్తిరించడంతో.. అక్కడి వెంట్రుకల భాగం లావుగా ఉండి.. మనం తాకినప్పుడు గరుకుగా తగులుతాయి. దాంతో వెంట్రుకలు లావవుతున్నాయనే భావన కలుగుతుంది.
టోపీలు పెట్టుకుంటే వెంట్రుకలు సరిగా పెరగవని, బట్టతల వస్తుందనే అపోహ కూడా ఉంది. కానీ అది సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తలపై టోపీలను బిగుతుగా పెట్టుకోవడం, తీసేటప్పుడు ఒక్కసారిగా లాగడం వల్ల వెంట్రుకలను బలంగా లాగినట్లు అవుతుందని.. అందువల్ల కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయని అంటున్నారు.


ఇలా దీర్ఘకాలం జరగడం, జుట్టు సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తలపై వెంట్రుకలు తగ్గపోతాయని స్పష్టం చేస్తున్నారు. జుట్టును కూడా శరీరంలో ఓ కీలక భాగంగా గుర్తించి తగిన శ్రద్ధ తీసుకోవడం చేస్తే సమస్యేమీ ఉండదని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Healthy Hair  Beauty Tip  Tip of The Day  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more