Funny Stories
మీ లెక్కప్రకారం ఎలా వుండాలి బాబా!

ఒకరోజు ఒక బాబా తన ఆశ్రమం బయట కూర్చొని తన దగ్గరకు వచ్చిన భక్తుల దు:ఖాలను వింటూ.. వాటి పరిష్కారాల కోసం సలహాలు ఇస్తున్నాడు.

ఇంతలోనే ఆ ఆశ్రమంవైపుగా వచ్చిన ఒక భక్తుడు తన పెళ్లి విషయం గురించి అడుగుదామని నిశ్చయించుకుని బాబా దగ్గరికి వెళతాడు.

భక్తుడు : జై హో బాబా.. జై హో! బాబా నాకు 35 ఏళ్లు. నాకు ఇంతవరకు పెళ్లి జరగలేదు. తొందరగా నాకు పెళ్లి అవడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి.

బాబా : ఇంతకు నువ్వు ఏం చేస్తావ్..?

భక్తుడు : పెళ్లి చేసుకోవడానికి నేను ఏ పని మొదలుపెడితే బాగుంటుందంటారు?

బాబా : నువ్వు ఏదైనా ఒక మిఠాయి షాపు నడుపుకుంటే మంచిది.

భక్తుడు : అలా అయితే మా నాన్నగారు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మిఠాయి షాపునే నేను ఇప్పటివరకు నడుపుతున్నాను.

బాబా : ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు నీ మిఠాయి షాపును ఓపెన్ చేసుకో.

భక్తుడు : నా మిఠాయి షాపు శని మందిరం పక్కనే వుంది. ఇంకా నేను షాపును కూడా శనివారం రోజు 11 గంటలకు తెరుస్తాను.

బాబా : నల్లరంగులో వున్న కుక్కలకు ప్రతిరోజు స్వీట్లు తినిపించు.

భక్తుడు : నా ఇంట్లో నల్లరంగులో వున్న రెండు కుక్కలున్నాయి. వాటిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వీట్లు తినిపిస్తాను.

బాబా : ప్రతి సోమవారం ఏదైనా ఒక మందిరాన్ని దర్శించుకో.

భక్తుడు : నేను కేవలం సోమవారమే కాదు.. ప్రతిరోజు మందిరానికి వెళ్తుంటాను. దర్శనం చేసుకోకుండా నేనస్సలు షాప్ ఓపెన్ చేయను.

బాబా : ఎంతమంది అన్నలు, చెల్లెలు వున్నారు?

భక్తుడు : మీ లెక్కప్రకారం నాకు పెళ్లిజరగాలంటే ఎంతమంది అన్నలు, చెల్లెళ్లు వుండాలి?

బాబా : ఇద్దరు అన్నలు, ఒక చెల్లి వుండాలి.

భక్తుడు : అరె బాబాగారు.. నాకు నిజంగానే ఇద్దరు అన్నలు, ఒక చెల్లి వుంది.

బాబా : ఇతరులకు దానం చేస్తూ వుండు.

భక్తుడు : బాబా నేను ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నాను. ప్రతిరోజు దానం కూడా చేస్తాను.

బాబా : ఒకసారి ఏదైనా ఒక తీర్థస్థానాన్ని దర్శించుకో.

భక్తుడు : బాబా.. మీ లెక్కప్రకారం నాకు పెళ్లి జరగాలంటే ఎన్నిసార్లు తీర్థస్థానాలకు వెళ్లాల్సి వుంటుంది?

బాబా : జీవితంలో ఒక్కసారైనా తీర్థస్థానానికి వెళ్లాలి.

భక్తుడు : అలా అయితే నేను మూడుసార్లు వెళ్లొచ్చాను.

బాబా : ప్రతిరోజు నీలం రంగులో వున్న దుస్తులను ధరించుకో!

భక్తుడు : బాబా నా దగ్గర కేవలం నీలం రంగులో వున్న దుస్తులే వున్నాయి. నిన్నటితో వాటిని కడగడానికి లాండ్రీకి ఇచ్చాను. అవి రాగానే కేవలం వాటినే ధరిస్తాను.

ఇక బాబా చేసేదేమి లేక నిశ్శబ్దంగా ధ్యానంలోకి వెళ్లిపోయాడు. భక్తుడు తనలో తాను నవ్వుకుని ఇలా అంటాడు.

భక్తుడు : బాబా.. నీకో మాట చెప్పాలనుకుంటున్నాను!

బాబా : తప్పకుండా చెప్పు భక్తుడా.. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిరభ్యరంతంగా చెప్పొచ్చు.


భక్తుడు : నేను ముందునుంచే వివాహితుడ్ని. నాకు పెళ్లయి 10 సంవత్సరాలు అయింది. ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే నువ్వు కనిపించావు. ఒక్కసారి నిన్ను కెలుకుదామని ఇక్కడికి వచ్చా! హాహాహాహా!

ఈ మాటలు వినగానే బాబా ధ్యానంలో నుంచి ఏకంగా కోమాలోకి వెళ్లిపోయాడు.