Love Story Movie Review Rating Story Cast and Crew ‘లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘లవ్ స్టోరీ’ ‘లవ్ స్టోరీ’ Get information about Love Story Telugu Movie Review, Naga Chaitanya Love Story Movie Review, Love Story Movie Review and Rating, Love Story Review, Love Story Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 96060 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘లవ్ స్టోరీ’

 • బ్యానర్  :

  అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌

 • దర్శకుడు  :

  శేఖర్‌ కమ్ముల

 • నిర్మాత  :

  నారంగ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌రామ్‌ మోహనరావు

 • సంగీతం  :

  పవన్ కుమార్‌ సీహెచ్‌

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  విజయ్‌ సి. కుమార్‌

 • ఎడిటర్  :

  మార్తాండ్‌ కె.వెంకటేశ్‌

 • నటినటులు  :

  నాగచైతన్య, సాయిపల్లవి, దేవయాని, రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, ఉత్తేజ్ తదితరులు

Love Story Movie Review Sekhar Kammula Delivers A Heart Touching Ode To Love

విడుదల తేది :

2021-09-24

Cinema Story

కరోనా రెండవ దశ అన్ లాక్ తర్వాత తెరుచుకున్న థియేటర్లకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు నెమ్మెదిగా అలవాటు పడుతున్నారు. అలాంటి ప్రేక్షకులను కుటుంబ సమేతంగా థియేటర్లకు రప్పించేలా అకర్షిస్తున్న చిత్రం లవ్ స్టోరి. యువతను ఎక్కువగా ఆకర్షిచే ప్రేమకథా చిత్రాలకు ఫ్యామిలీ ఏమోషన్స్ ను కూడా కలగలపి.. గుండెల్లో గూడు కట్టుకునేలాంటి మాటలతో ఇది ప్రేమ కథ ఒక్కటే కాదు.. కుటుంబకథా చిత్రమని చాటిని శేఖర్ కమ్ముల కలం, దర్శకత్వం కలగలసిన చిత్రం. మజిలీ చిత్రంతో తనలోని నటుడిని నూటికి నూరుపాళ్లు ప్రదర్శింపజేసిన నాగచైతన్య.. ఫిదాతోనే అందరినీ అకట్టుకున్న సాయి పల్లవి.. జంట కాంబినేషన్ తోనే చిత్రానికి క్రేజ్ ఏర్పడింది. ఇక దీనికి తోడు శేఖర్ కమ్ముల డైరెక్షన్, ఎప్పుడో విడుదలైన పాటలు కూడా చిత్రంపై అంచనాలను బాగా పెంచేసాయి. మరి ఇంతలా చిత్రంపై అంచానాలు పెరిగిన నేపథ్యంలో చిత్రం ఎలా వుందా.? శేఖ‌ర్ క‌మ్ముల మేకింగ్‌పై ప్రేక్ష‌కుల్లో ఉన్న న‌మ్మ‌కం అది. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? ప్రేమికులుగా నాగచైతన్య, సాయిపల్లవి ఎలా మెప్పించారు? అసలు ఈ సినిమా కథేంటి? అంటే..

కథ

రేవంత్ (నాగ‌చైత‌న్య) జీరో నుంచి జీవితాన్ని మొద‌లు పెట్టిన ఓ మ‌ధ్య త‌ర‌గతి కుర్రాడు. హైద‌రాబాద్ లో జుంబా సెంట‌ర్ న‌డుపుతుంటాడు. చిన్న‌ప్ప‌టి నుంచి ఊళ్లో వివ‌క్ష చూపించ‌డంతో,  బాగా స్థిర‌ప‌డి ఉన్న‌తంగా బ‌త‌కాల‌నేది త‌న క‌ల‌.  మౌనిక (సాయిప‌ల్ల‌వి) బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగ వేట‌లో హైద‌రాబాద్ కి చేరుకుంటుంది. కానీ, ఎంత ప్ర‌య‌త్నించినా ఉద్యోగం దొర‌క‌దు. దాంతో రేవంత్ జుంబా సెంట‌ర్ లో డ్యాన్స‌ర్ గా చేరుతుంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

రేవంత్ ఒక దళిత వర్గానికి చెందిన క్రిస్టియన్. మరోవైపు మౌనిక ఒక పటేల్.. గ్రామంలో ఓ పెద్దింటి అమ్మాయి. ఇద్దరు వేరే వేరే కులాలు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ససేమిరా ఒప్పుకోలేదు. అదే సమయంలో గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. చివరికి ఏమైంది? వారిద్దరూ తమ కలలు నెరవేర్చుకున్నారా? ఆ క్ర‌మంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? మౌనిక‌కి త‌న ఇంట్లోనే ఓ పెద్ద స‌మ‌స్య ఉంటుంది. అదేంటి? దాన్ని ఎలా ప‌రిష్క‌రించారు.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

cinima-reviews
‘లవ్ స్టోరీ’

విశ్లేషణ

సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్‌ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్‌ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా సహజంగా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్‌ బాగా ఎలివేట్‌ చేశారు.

బ‌య‌టికి చెప్ప‌డానికి, మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని లైంగిక దాడుల గురించి ఓ ప్రేమ‌క‌థ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌రిణామం. శేఖ‌ర్ క‌మ్ముల‌లాంటి ద‌ర్శ‌కుడు ఈ త‌ర‌హా అంశాల్ని  తెర‌పై చూపిస్తే మ‌రింత మంది ప్రేక్ష‌కులకు చేరువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. సున్నిత‌మైన ఈ అంశాన్ని వెండితెర‌పై అంతే సున్నితంగా ఆవిష్క‌రించారు. క‌థానాయ‌కుడి జీవితాన్ని ప‌రిచ‌యం చేస్తూ నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడి క‌ష్టాలు... త‌న క‌ల‌ల్ని తెర‌పై చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అదే స‌మయంలో క‌థానాయిక త‌న క‌లల్ని సాకారం చేసుకోవ‌డానికి హైద‌రాబాద్ చేరుకుని చేసే ప్ర‌య‌త్నాలు, ఆ క్ర‌మంలో ఆమెకి ఎదుర‌య్యే ఇబ్బందులు హ‌త్తుకుంటాయి.

ద్వితీయార్ధంలో ప్రేమికులకు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మొద‌ల‌వుతుంది. రేవంత్‌, మౌనిక ప్రేమకి ఎదుర‌య్యే స‌వాళ్లు, ఊళ్లో ప‌రిస్థితులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. క‌థ చివ‌రి ద‌శ‌కు చేరుకునే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌న‌సుకు భారంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మౌనికకి త‌న ఇంట్లోనే ఎదురైన స‌మ‌స్య గురించి చెప్పే స‌న్నివేశాలు మింగుడు ప‌డ‌నిరీతిలో సాగినా... అవి ఆలోచ‌న రేకెత్తిస్తాయి. స‌మాజానికి ఓ మంచి సందేశాన్నిస్తాయి.  ప‌తాక స‌న్నివేశాలు ప‌రువు - ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమాల్నే గుర్తు చేస్తాయి. సెకండాఫ్‌ వచ్చేసరికి ఎమోషన్స్‌ కట్టిపడేసేలా వున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

రేవంత్ పాత్రలో నాగచైతన్య చాలా బాగా నటించారు. సినిమా మొత్తాన్ని తన నటన తో ముందుకు తీసుకు వెళ్లారు. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో డాన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించారు నాగచైతన్య. సాయి పల్లవి ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. వీరిద్ద‌రూ రేవంత్‌, మౌనిక పాత్రల్లో ఒదిగిపోయారు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడిగా క‌నిపిస్తూ నాగ‌చైత‌న్య ప‌లికించిన భావోద్వేగాలు, ఆయ‌న ప‌లికిన తెలంగాణ యాస పాత్ర‌కి జీవం పోసింది.

ఏదో స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తిగా, ఏదైనా సాధించాల‌నే త‌ప‌న ఉన్న నేటిత‌రం అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. జుంబా నేప‌థ్యంతో కూడిన ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి చేసిన డ్యాన్సులు కూడా ఆకట్టుకుంటాయి. ఈశ్వరి రావు, దేవయాని తమ తల్లి పాత్రలలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. రాజీవ్ కనకాల కూడా ఈ సినిమాలో మంచి నటనను కనబరిచారు. ఉత్తేజ్ పాత్ర చిన్నదే అయినప్పటికీ తన నటనతో ఆ పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా చిత్రం ఉన్నత నిర్మాణ విలువలతో రూపోందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఒక క్లిష్టమైన కథని ఎంచుకున్నప్పటికి దానిని ఆయన అనుకున్నట్లుగానే తెరపై రూపోందించి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రెండు సామాజిక సమస్యలను చూపించారు. కులాలు అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల బోల్డ్ వే లో చాలా బాగా హ్యాండిల్ చేశారు.

ఇక ఈ చిత్రానికి జీవాన్ని తీసుకువచ్చిన మరో ప్రధాన అంశం సిహెచ్ పవన్ కుమార్ సంగీతం. ఏవేవో కలలే, విన్నర్ విన్నర్ బ్రో, పాటలు చాలా బాగున్నాయి. ఇక నీ చిత్రం చూసి, సారంగదరియా పాటలు ఇప్పటికే హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. విజ‌య్ సి.కుమార్ కెమెరా ప్ర‌తీ స‌న్నివేశాన్నీ తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రించింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా కి చాలా బాగా ప్లస్ అయ్యాయి.

తీర్పు: గ్రామీణభారతంలో ఇప్పటికీ నెలకొన్న చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘‘లవ్ స్టోరీ’’

చివరగా.. హృదయాలను స్పృశించే ‘లవ్ స్టోరీ’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh