arjun suravaram Movie Review Rating Story Cast and Crew ‘అర్జున్‌ సురవరం’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘అర్జున్‌ సురవరం’ ‘అర్జున్‌ సురవరం’ Get information about Arjun Suravaram Telugu Movie Review, Nikhil Siddarth Arjun Suravaram Movie Review, Arjun Suravaram Movie Review and Rating, Arjun Suravaram Review, Arjun Suravaram Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 91756 3.00 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘అర్జున్‌ సురవరం’

  • బ్యానర్  :

    మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పీ

  • దర్శకుడు  :

    టీఎన్‌ సంతోష్‌

  • నిర్మాత  :

    రాజ్‌కుమార్‌ ఆకెళ్ల

  • సంగీతం  :

    సామ్‌ సీ.ఎస్‌

  • సినిమా రేటింగ్  :

    3.003.003.00  3.00

  • ఛాయాగ్రహణం  :

    సూర్య

  • ఎడిటర్  :

    నవీన్ నూలి

  • నటినటులు  :

    నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్‌ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌, తదితరులు

Arjun Suravaram Movie Review

విడుదల తేది :

2019-11-29

Cinema Story

తమిళంలో విజయవంతమైన కణితన్ చిత్రం తెలుగులో రిమేక్ చేసి విడుదల చేశారు. ఆ చిత్రమే అర్జున్ సురవరం. కొన్ని కారణల వల్ల చిత్ర విడుదల ఆలస్యమైనా.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లతో ఒక హైప్ క్రియేట్ చేయడంతో పాటు ప్రిరీలీజ్ ఫంక్షన్ కు ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి రాకతో అంచనాలు పెరిగాయి. ఇక చిత్ర కథలోకి ఎంటరైతే.. అర్జున్ సురవరం (నిఖిల్) ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు.

తను మీడియాలో పనిచేయడం తండ్రి చంద్రశేఖర్ (నాగినీడు)కి ఇష్టంలేకపోవడం వలన, ఆయన దగ్గర ఈ విషయాన్ని దాస్తాడు. బీబీసీలో రిపోర్టర్ గా చేయాలనేది అర్జున్ ఆశయం. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే, 'కావ్య'(లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడుతుంది. కావ్య కూడా రిపోర్టర్ కావడంతో వాళ్ల మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అర్జున్ ని పోలీసులు అరెస్టు చేస్తారు.

నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బ్యాంకును మోసం చేశాడని అతనిపై కేసు నమోదు అవుతోంది. అతనితో పాటే ఆయా ప్రాంతాల్లోని కొంతమంది విద్యార్థులు అరెస్టు అవుతారు. దాంతో ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తెలుసుకోవడం కోసం అర్జున్ రంగంలోకి దిగుతాడు. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో చీకటి కోణాన్ని బయటపెట్టేందుకు నడుం బిగిస్తాడు. పర్యవసానంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అవి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి? అనేది మిగతా కథ.

cinima-reviews
‘అర్జున్‌ సురవరం’

విశ్లేషణ

ప‌రిశోధ‌నతో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్ కథను దర్శకుడు సంతోష్ పకడ్బంధీగా తయారు చేసుకన్న తీరు, కథనాన్ని నడిపించిన విధానం ఆస‌క్తి రేకెత్తిస్తూ.. ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తాయి. తీగ లాగడం, డొంక క‌ద‌ల‌డం, ఆ వెన‌క న‌మ్మలేని నిజాలు బ‌య‌టికి రావ‌డం.. ఇలా ప్రతి ద‌శ కూడా త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌ని రేకెత్తించేదే. ఈ సినిమాని కూడా ద‌ర్శకుడు అదే త‌ర‌హాలో తీర్చిదిద్దారు. తొలి స‌న్నివేశ‌మే ఆస‌క్తిని రేకెత్తించేలా చేశాడు. ముఖ్యంగా కథకు ప్రాణం పోసింది దర్శకుడు కథను బ్యాలెన్సింగ్ గా తీసుకువచ్చే విధానమే.

క‌థానాయ‌కుడు న‌కిలీ స‌ర్టిఫికెట్ల కుంభ కోణంలో నిందితుడుగా క‌నిపిస్తాడు. అదెలాగో చెప్పే క్రమంలో మొద‌ల‌య్యే ఫ్లాష్‌బ్యాక్‌తో అస‌లు క‌థ ప్రారభమవుతుంది. పాత్రికేయుడిగా క‌థానాయ‌కుడు చేసే స్టింగ్ ఆప‌రేష‌న్లు, ఆ క్రమంలోనే క‌థానాయిక ప‌రిచ‌యం కావడం, వాళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌, అంత‌లోనే అనుకోని మ‌లుపు.. ఇలా ప్రేక్షకుడిని క‌థ‌లో చ‌క్కగా నిమ‌గ్నం చేశాడు ద‌ర్శకుడు. న‌కిలీ స‌ర్టిఫికెట్ల మాఫియా కోసం క‌థానాయ‌కుడు రంగంలోకి దిగ‌డం, దాని వెన‌క వ్యక్తుల్ని బ‌య‌టికి తీసుకొచ్చేందుకు వేసే ఎత్తుగ‌డ‌ల‌తో క‌థ మ‌రింత ఆస‌క్తిగా మారుతుంది.

ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు పున‌రావృతం అవుతున్నట్టు అనిపించినా.. భావోద్వేగాల్ని రాబ‌ట్టడంలో ద‌ర్శకుడు మంచి ప‌నితీరు ప్రద‌ర్శించారు. న‌కిలీ స‌ర్టిఫికెట్ల వ‌ల్ల జ‌రిగే ప‌రిణామాల్ని చెబుతూ.. స్కూలు కూలిపోయే స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయ‌కుడు బ‌య‌ట పెట్టిన న‌కిలీ స‌ర్టిఫికెట్లని ఎలా అస‌లువిగా మార్చారు? న‌కిలీ స‌ర్టిఫికెట్లని ఎలా చేస్తారో చూపించే స‌న్నివేశాలు కాస్త గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. అయినా.. లవ్ ..యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని తగిన పాళ్లలో కలుపుతూ ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టేయడంలో సక్సెస్ అయ్యాడు.

నటీనటుల విషాయానికి వస్తే..

అర్జున్ పాత్రలో నిఖిల్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఎక్కడ కూడా ఆయన తన పాత్రలో నుంచి బయటికి రాలేదు. తనపై మోపబడిన నేరం నిజం కాదని నిరూపించడం కోసం .. తనలాగే మిగతా విద్యార్థులు మోసపోకూడదనే ఉద్దేశంతో మాఫియాతో తలపడే రిపోర్టర్ పాత్రకి ఆయన న్యాయం చేశాడు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. ఇక కావ్యగా లావణ్య త్రిపాఠి పాత్ర పరిధిలో నటించింది.

ప్రతినాయకుడి పాత్రలో తరుణ్ అరోరా గొప్పగా చేశాడు. నిబ్బరంగా కనిపిస్తూ .. నిర్భయంగా తను అనుకున్నది చేస్తూ వెళ్లే మాఫియా డాన్ గా ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. హీరోకి తండ్రి పాత్రలో నాగినీడు ఎమోషనల్ సీన్స్ బలాన్ని పెంచాడు. పోలీస్ ఆఫీసర్ గా పోసాని .. లాయర్ గా వెన్నెల కిషోర్ తండ్రీకొడుకులుగా తమ పాత్రలకు జీవం పోశారు. ఇక రాజారవీంద్ర .. ప్రగతి .. సత్య .. విద్యుల్లేఖ ఓకే అనిపించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ సూర్య మిశ్రా కెమెరా పనితనంతో సత్తాచాటాడు. పనితనానికి నూటికి నూరు మార్కులు ఇవచ్చు. యాక్షన్.. ఎమోషన్.. ఛేజింగ్ దృశ్యాలను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఫస్టాఫ్ లోని రెండవ సాంగులో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ ను చూపించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ చిత్రానికి అందరికంటే ఎక్కువ కష్టపడింది ఈయనే.

నవీన్ నూలి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ అనవసరమైన సీన్స్ గానీ .. సాగతీత సీన్స్ గాని కనిపించవు. 'ఈ కోపం నువ్వు నిజం చెప్పనందుకు కాదు.. నువ్వే నిజం కానందుకు' అనే లావణ్య త్రిపాఠి డైలాగ్.. 'ఇంగ్లిష్ లాగ్వేజ్ మాత్రమే సార్.. నాలెడ్జ్ కాదు' అనే డైలాగ్స్ సందర్భోచితంగా పేలాయి. సామ్ సీఎస్ సంగీతం.. రీ రికార్డింగ్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్ ఏ సన్నివేశం నుంచి కూడా ప్రేక్షకుడు జారిపోకుండా చేసింది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. వెంకట్ ఫైట్స్ బాగున్నాయి. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా ఇంట్రెస్టింగా ప్లాన్ చేసుకుని, యాక్షన్ - ఎమోషన్ పాళ్లను కరెక్టుగా కలుపుకుని పెర్ఫెక్ట్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుంచాడు. ఈ నేపథ్యంలో రొమాన్స్ పాళ్లు తగ్గినా, ఆ వెలితి ఎంతమాత్రం తెలియదు. ఇది ఎలా సాధ్యమైంది అన్న లాజిక్ విషయాల జోలికి వెళ్లి రంద్రాన్వేషణ చేయకపోతే.. సగటు ప్రేక్షకుడు చిత్రాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసే అన్ని ఎలిమెంట్స్ వున్నాయి.

తీర్పు..

‘అర్జున్ సురవరం‘ అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకునే కథ, కథనంతో అవిష్కరించిన పరిశోనాత్మక చిత్రం..

చివరగా... విజయవంతమైన మరో పరిశోధక చిత్రం.!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh