Padmaavat Movie Review and Rating | పద్మావత్ రివ్యూ : విజువల్ ట్రీట్ ఫర్ ఆడియన్స్.. కానీ...

Teluguwishesh పద్మావత్ పద్మావత్ Padmaavat Telugu Movie Review and Rating. Padmaavat Full Cast and Crew, Story and Synopsis of Sanjay Leela Bhansali Historical Drama. Product #: 86617 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పద్మావత్

  • బ్యానర్  :

    వయాకమ్ 18 మోషన్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    సంజయ్ లీలా భన్సాలీ

  • నిర్మాత  :

    సంజయ్ లీలా భన్సాలీ, సుధాంశు వాట్స్, అజిత్ అంధారే

  • సంగీతం  :

    సంజయ్ లీలా భన్సాలీ, సంచిత్ భల్ హరా

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    సుదీప్ ఛటర్జీ

  • నటినటులు  :

    దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్, అదితి రావు హైదరి తదితరులు

Padmaavat Movie Review

విడుదల తేది :

2018-01-25

Cinema Story

చిత్తోడ్ ప్రాంతాన్ని పాలించే రాజ్ పుత్ వంశీకుడు రాజా రతన్ సింగ్ రావల్ (షాహిద్ కపూర్). ఓసారి వేటకు వెళ్లి అక్కడ రాజ పుత్రిక పద్మావతి (దీపికా పదుకొనే) చేతిలో గాయపడి, ఆమె నుంచి సేవలు పొందుతాడు. సౌందర్య రాశి అయిన ఆమెను చూసి ముగ్దుడైపోయి ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో.. అల్లావుద్దీన్ ఖిల్జీ (రణ్ వీర్ సింగ్) కళ్లు ఆ రాజ్యంపై పడుతుంది. పద్మావతి గురించి తాను విన్న మాటలతో ఆమెను దక్కించుకోవడం కోసమే ఖిల్జీ చిత్తోడ్ ప్రాంతంపై దండయాత్రకు దిగుతాడు. మరి పద్మావతిని దక్కించుకోవాలన్న అతని ప్రయత్నం ఫలించిందా? అన్నదే కథ.

cinima-reviews
పద్మావత్

సంజయ్ లీలా భన్సాలీ పిరీయాడిక్ డ్రామా పద్మావత్ వివాదాలతోనే వార్తల్లో నిలిచింది. 16వ శతాబ్దనికి చెందిన మాలిక్ మహ్మద్ జయాసీ రచన పేరిట పద్మావత్ బాగా ప్రచారం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్లీ-చిత్తోర్ గఢ్ దండయాత్ర నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే రాజ్ పుత్ కర్ణిసేన అభ్యంతరాల నడుమ ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమై ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:

సంజయ్ లీలా భన్సాలీ ఎంచుకునే కథలు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిని అంతే క్లిష్టంగా ఆయన తెరకెక్కిస్తుంటాడు కూడా. ఎక్కడా రాజీ పడకుండా గ్రాండియర్ గా సినిమాలు తీయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే కళాత్మక చిత్రాలకు ఓ పరిధి వరకే తీయగలనని బాజీ రావు మస్తానీ తో నిరూపించుకున్న భన్సాలీ.. ఇప్పుడు అదే ప్రయత్నం చేశాడు.

పద్మావత్ లో పెద్ద పెద్ద సెట్స్ ఉంటాయి.. గ్రాఫిక్స్ ఉంటాయి.. కానీ, యుద్ధ సన్నివేశాల్లోనే ఆ గ్రాండియర్ లోపించింది. పద్మావత్ పెద్ద కథేం కూడా కాదు. కానీ, చారిత్రకారులకు సైతం ప్రశ్నార్థకంగా మారిన గాథను సినిమాగా తెరకెక్కించి పెద్ద సాహసమే చేశాడు. ఎమోషనల్ కంటెంట్ తో కేవలం ప్రధాన పాత్రల మధ్యే వచ్చే సన్నివేశాలతో రెండున్నర గంటల సినిమా తెరకెక్కించటం మాములు విషయం కాదు. ఈ క్రమంలో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగింది.

అయితే పతాక స్థాయి సన్నివేశాలను మాత్రం ఆసక్తికరంగా తెరెకెక్కించటంలో భన్సాలీ పనితనం కనిపిస్తుంది. ఇక ప్రధాన సమస్య రాజ్ పుత్ లు లేవనెత్తిన సమస్య. ఈ విషయంలో భన్సాలీ రాజీ పడ్డాడేమో అనిపించకమానదు. ఎందుకంటే కొన్నిచోట్ల వారిని హైలెట్ చేస్తూ కొన్ని సన్నివేశాలు అసహజంగా తెరకెక్కించాడు కాబట్టి. మొత్తానికి కళాత్మక హృదయం ఉన్న వారికి పద్మావత్ నచ్చుతుంది. భారీ యాక్షన్ ఘట్టాలు.. ఫాంటసీలు.. బాహుబలి తరహా యుద్ధ సన్నివేశాలు కోరుకుంటే మాత్రం కష్టమే.

 

నటీనటుల విషయానికొస్తే... సినిమాకు ప్రధాన ఆకర్షణ రణ్ వీర్ సింగ్ అనే చెప్పుకోవాలి. క్రూరుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తంలో మోస్ట్ ఎంటర్ టైనింగ్ పాత్ర ఇదేనని చెప్పుకోవాలి. ఇక తర్వాతి పాత్ర పద్మావతి. దీపిక ఈ పాత్రలో జీవించిందనే అనుకోవాలి. అందం, అభినయం రెండింట్లోనూ ఆమె మార్కులు కొట్టేసింది. దీపిక కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. షాహిద్ కపూర్ సైతం పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. అదితి రావు హైదరి కూడా ఖిల్జీ భార్య పాత్రలో చాలా బాగా చేసింది.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే... బన్సాలీ సంగీత దర్శకుడిగానూ మెప్పించాడు. సంచిత్ భల్ హరాతో కలిసి అందించిన నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. సుదీప్ ఛటర్జీ కెమెరా పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతీదాంట్లోనూ అవుట్ పుట్ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. అయితే యుద్ధ సన్నివేశాల విషయం.. కథనం నెమ్మదించటం కాస్త విసుగు పుట్టిస్తాయి.


తీర్పు... ఓ సినిమాను కమర్షియల్ ఫార్మట్ లో తెరకెక్కించటం అనే అంశం కన్నా.. తాను ఏ విధంగా అనుకుంటున్నానో అదే రీతిలో సినిమా తీయటం భన్సాలీ ప్రత్యేకత. పద్మావత్ విషయంలో కూడా అదే మరోసారి రుజువు చేశాడు. ఐతే ఈ ప్రయత్నంలో కథనం బిగువుతో.. వేగంగా ఉండేలా చూసుకుంటే సామాన్య ప్రేక్షకుడు కూడా సంతృప్తి చెందేవాడేమో.

పద్మావత్.. భన్సాలీ టెక్నికల్ బ్రిలియన్స్