అల్లరి చిల్లరిగా తిరిగే సరదా కుర్రోడు సందీప్. అనుకోకుండా ఓ పనిమీద బయటికి వెళ్తూ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోతాడు. ఆ సమయంలో నిత్యామీనన్ ను చూడగానే ప్రేమలో పడితాడు. నిత్యాను ప్రేమలో పడేసేందుకు నానా తంటాలు పడతాడు. నిత్యా ప్రేమలో పడే సమయంలో విలన్ నుంచి సందీప్ కు ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఫ్లై ఓవర్ పై బాంబ్ వుందని చెబుతాడు. అదే సమయంలో కొందరు రౌడీలు సందీప్ వెంటపడతారు. ఈ రెండిటి మధ్య సందీప్ నలిగిపోతుంటాడు. అసలు ఆ విలన్ ఎవరు? ఇంతకీ ఆ బాంబ్ ఎక్కడుంది? ఈ రౌడీలు ఎవరు? నిత్యా తన ప్రేమను స్వీకరించిందా లేదా? ఆ బాంబ్ ను సందీప్ కనిపెట్టగలిగాడా లేదా? అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూడాల్సిందే.
సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బోగాధి అంజిరెడ్డి నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్లు, వీడియోలు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఛోటా.కె.నాయుడు ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించాడు. లవ్, యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాకు హీరోహీరోయిన్లు ఇద్దరు హైలెట్స్ గా చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. లుక్స్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా కొత్తదనం కనిపించింది. ఫైట్స్, యాక్షన్ సీన్లలో ఇరగొట్టేసాడు. ఇక నిత్యామీనన్ తన పాత్రలో ఒదిగిపోయింది. సందీప్-నిత్యామీనన్ ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కుర్రకారుకు తెగ నచ్చేస్తాయి. ఇక సప్తగిరి తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.
ఇక ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా, లవ్, ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ సినిమాను సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్తుంది.
మైనస్ పాయింట్స్:
ఇలాంటి సినిమాలకు వేగం చాలా ఇంపర్టెంట్. ఒకే స్థలంలో సినిమా అంతా నడుస్తే చూసే జనాలకు చిరాకేస్తుంది. అందువల్ల సినిమాలో వేగం వుంటే బాగుండేది. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లో నెరేషన్ తో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక పలు సీన్లకు లాజిక్స్ మిస్సయ్యాయి.
సాంకేతికవర్గం పనితీరు:
‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ అయినప్పటికీ.. కథనం పరంగా బాగుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో మరింత బాగా డిజైన్ చేసుకొని వుంటే బాగుండేది. దర్శకుడిగా రాజసింహ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించారు. మిక్కి.జే.మేయర్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో మరింత కట్ చేసుంటే బాగుండేది. ఓ 10 నిమిషాలు ఎడిట్ చేసిన సినిమా వేగం పెరిగేది. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘ఒక్క అమ్మాయి తప్ప’: ఒక్కసారి చూడవచ్చు!