ఓ సందర్భంలో అనుకోకుండా ముగ్గురు యువకులు కలుసుకుంటారు. వారిలో మొదటి వాడు జై(ఆదర్ష్ బాలకృష్ణ) - టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కుమారుడైన జై.. అతని చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్ని బాధ్యతలు మరిచి డ్రగ్స్ కి అలవాటుపడతాడు. రెండో వాడు నందు(నందు) - తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి తనకు హ్యాండ్ ఇవ్వడంతో ఆమెనే ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశయంతో వుంటాడు. మూడో వాడు భూపాల్(భూపాల్) – డైరెక్టర్ ఆవుదాం అని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోకుండా ఓ సమస్య వచ్చిపడుతుంది. దాంతో ఈ ముగ్గరు ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి బయటపడాలంటే.. వీరికి 50 లక్షల డబ్బు కావాలి.
ఎలాగైనా రూ.50 లక్షలు సంపాదించాలనే వీరు ముగ్గురు ఆలోచనల్లో పడిపోతారు. అప్పుడే జైకి ఓ ఐడియా తడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుని కిడ్నాప్ చేసి.. తన నాన్ననే డబ్బు ఇమ్మని అడుగుదామని జై తన మిత్రులిద్దరికీ చెబుతాడు. ఆ ఐడియాని వారిద్దరు ఒప్పుకుంటారు. ఇక అక్కడి నుంచి అసలు కథ షురూ. కిడ్నాప్ కోసం ముగ్గురు హీరోలు వేసిన స్కెచ్ ఏంటి.? ఎంతో కష్టపడి కిడ్నాప్ చేసిన తర్వాత వచ్చిన ట్విస్ట్ ఏంటి.? ఆ కిడ్నాప్ వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి.? చివరికి వీరికి రూ.50 లక్షలు దొరుకుతాయా? లేదా.? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా వెండితెర మీద చూడాల్సిందే!
నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. ఎ. సత్తిరెడ్డి సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మించిన ఈ చిత్రానికి ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సాయి కార్తీక్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాన్ని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మేజర్ ప్లాయింట్.. మహేష్ బాబు ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ అనే పేరుని టైటిల్ గా పెట్టుకోవడం. ఇక ఈ ఇందులో అతిథి పాత్రలు చేసిన మంచు మనోజ్, అల్లరి నరేష్, నాని, తనీష్ వల్ల సినిమాకి పెద్ద బూస్టప్ అయ్యింది. సినిమా మొదట్లో పాత్రలని పరిచయం చేసిన విధానం కూడా బాగుంటుంది. ఇంటర్వల్ బ్లాక్ లో మహేష్ బాబుని కిడ్నాప్ చేయాలనుకునే బ్లాక్ ఆసక్తికరంగా సాగుతుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ లు మంచి నటనని కనబరిచారు. ఓ లవర్ బాయ్ గా నందు.. ఓ టాప్ సినీ నిర్మాత కొడుకుగా, డ్రగ్ అడిక్ట్ పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ.. తెలంగాణ కుర్రాడిగా భూపాల్.. ఓవరాల్ గా ఈ ముగ్గురు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక అందాల భామ శ్రద్ధదాస్ లేడీ డాన్ గా బాగా సెట్ అయ్యింది. నెగటివ్ షెడ్ ని పర్ఫెక్ట్ గా చూపించింది. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ ఉన్నంతసేపూ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. పూనం కౌర్ ఓ పాట, కొన్ని సీన్స్ లో టోటల్ మోడ్రన్ లుక్ లో అందాలను ఆరబోసి ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే.. రొటీన్ క్రైమ్ కామెడీ కథ. ఈ మధ్య కాలంలో ఈ తరహాలోనే చాలా సినిమాలు వచ్చాయి. కాబట్టి.. కథ పరంగా కిక్ ఏమీ ఉండదు. కథనం విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సెకండాఫ్ కాస్త బోర్ కొడుతుంది. మధ్యలో జోడించిన యానిమేషన్ చేజ్ ఎపిసోడ్ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. కథనం విషయంలో డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫ్లేవర్ ని సెకండాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఓవరాల్ గా సినిమా నేరేషన్ మొదటి నుంచి చాలా స్లోగా ఉంటుంది.
ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ని సరిగా రాసుకోలేదు. అనవసరమైన సీన్స్ జోడించేశారు. దాంతో కామన్ ఆడియన్ కోరుకునే కామెడీ కాస్త మిస్ అయ్యింది. పాటల ప్లేస్ మెంట్ సరిగా లేదు. శ్రద్ధ దాస్, పోసాని లాంటి వారికి స్ట్రాంగ్ పాత్రలని రాసుకోలేకపోవడంతో ఆ పాత్రలకి పెద్దగా ఉపయోగమే లేదనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కిడ్నాప్ బ్లాక్, ఆ తర్వాత చేజింగ్ బ్లాక్ ఎపిసోడ్స్ చాలా బాగా చూపించాడు. లో బడ్జెట్ లో గ్రాండ్ విజువల్స్ ఇచ్చాడు. సాయి కార్తీక్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్ర్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా హెల్ప్ అయ్యింది. మధు జి రెడ్డి ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. ఇంకాస్త షార్ట్ అండ్ స్పీడ్ గా ఎడిట్ చేసి ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.
ఇక కథ–కథనం– దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన సుశాంత్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. కథ పాతదే ఎంచుకున్నప్పటికీ.. కథని ట్రీట్ చేసిన విధానం బాగుంది. కథనం – కథనంలో ఎక్కువ ట్విస్ట్ లు లేకుండా రాసుకున్నాడు. ఉన్న ఒక ట్విస్ట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కథనం మీద ఇంకాస్త వర్కౌట్ చెయ్యాల్సింది. ఇక డైరెక్టర్ గా జస్ట్ పరవాలేదనిపించాడు.. నిర్మాత చందు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
సూపర్ స్టార్ కిడ్నాప్ : అంతగా ట్విస్ట్ లేని ‘కిడ్నాప్’ కథ!