‘అవును’ సినిమా ఏ షాట్ దగ్గర ఎండ్ అయ్యిందో.. అక్కడి నుంచే ‘అవును2’ సినిమా ప్రారంభం అవుతుంది. కెప్టెన్ రాజు ఆత్మ తమను వదిలివెళ్లిపోయిందని రాణా అనుకొంటారు. దీంతో తమ ఫ్లాట్ ను వదిలేసుకొని కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్ కు మారతారు. అక్కడ మళ్లీ వీరికి ఆ ఆత్మ తిరిగొచ్చి వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆత్మ నుంచి వీరు ఎలా తప్పించుకున్నారు? అసలు కెప్టెన్ రాజు అంతరించాడా లేదా? అనే అంశాలు వెండితెర మీద చూడాల్సిందే.
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. దీంతో రవి ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అవును 2’ని తెరకెక్కించాడు. హర్షవర్ధన్ రాణే, పూర్ణ ప్రధాన పాత్రలలో నటించిన ‘అవును2’ చిత్రాన్ని ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఏప్రిల్ 3వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా కథలో కొత్తదనం ఏమి లేకపోయినా... కథనం మాత్రం చాలా సూపర్బ్ గా వుంది. కాశీలో ఓ అఘోరా పూర్ణకు ఒక యంత్రం ఇవ్వడంతోనే సినిమాలో అసలైన థ్రిల్లింగ్, సస్పెన్స్ మూమెంట్స్ స్టార్ అవుతుంది. ఆ యంత్రంతోనే సినిమాకు మరింత సస్పెన్స్ జోడించి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ‘అవును’లో పూర్ణ నటనకు ఎంత ప్రశంసలు వచ్చాయో... ఈ సినిమాలో కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు వస్తాయని చెప్పుకోవచ్చు. నటన, గ్లామర్ తో అదరగొట్టింది. ఇక హర్షవర్షన్ రాణే కూడా తన పాత్రకు మంచి న్యాయం చేసాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్:
‘అవును’కు కొనసాగింపు కాబట్టి... కథలో కొత్తదనం లేదు. కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తప్ప! సినిమా ప్రారంభమైన పావుగంటకే కథలోని అసలు పాయింట్ తెలిసిపోతుంది. ఇక నిఖిత పాత్ర అంతగా పట్టించుకోనట్లుగా అనిపించింది.
సాంకేతికవర్గ పనితీరు:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా సినిమాటోగ్రాఫర్ అని చెప్పుకోవచ్చు. హర్రర్, థ్రిల్లింగ్ సీన్స్ ను అద్భుతంగా చూపించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్, రీరికార్డింగ్ పర్వాలేదు. మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. రవిబాబు కథ పరంగా కొత్తదనం ఏం లేకపోయినా... కొన్ని సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ మాత్రం చాలా చక్కగా తీసారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి క్వాలిటీ చిత్రం తీసారు.
చివరగా:
అవును2: కొత్త ఇంట్లో పాత దెయ్యం!