పెద్దగా చదువుకోని దాసు (రాజశేఖర్).. రాజేష్, అచ్చులతో కలిసి ఒక కిడ్నాప్ గ్యాంగ్ నడుపుతుంటాడు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ.. కిడ్నాపులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే.. వీళ్లు చేసేది క్రైమ్ అయినా.. నిబంధనలను తగ్గట్టు నడుచుకుంటారు. అంతా సవ్యంగానే జరుగుతున్న సమయంలో.. వీళ్లు ఓ మినిష్టర్ కొడుకుని కిడ్నాప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు.
ఇందుకోసం వాళ్లు ప్లానింగ్ వేసుకుంటారు. దాని ప్రకారమే అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ముందుగా అందులో ఫేలయినా.. తర్వాత ఎలాగోలా సక్సెస్ అయి అతడ్ని కిడ్నాప్ చేస్తారు. కానీ.. డబ్బు లావాదేవీలతో ఈ గడ్డం గ్యాంగ్ ఇబ్బందుల్లో పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే వీరిని పట్టుకునేందుకు గబ్బర్ సింగ్ అనే ఓ పోలీసాఫీసర్ దిగుతాడు. ఇక ఇతడు వాళ్ల వెంటపడటం, వాళ్లు ఇతని నుంచి తప్పించుకోవడం.. అనే కోవలో కథ నడుస్తుంది.
ఆమధ్య వరుస పరాజయాలతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన డాక్టర్ రాజశేఖర్.. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చారు. అనంతరం మళ్లీ తన సినీ కెరీర్’ని పరీక్షించుకునేందుకు ఆయన ప్రేక్షకులముందుకు తన ‘గడ్డం గ్యాంగ్’ని తీసుకొచ్చారు. తమిళంలో హిట్టైన ‘సూదుకవ్వం’ చిత్రానికి రీమేక్ అయిన ఈ మూవీపై రాజశేఖర్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో గత పదేళ్లుగా అతను ఎదుర్కొంటున్న పరాభావాలను ఈ మూవీ తీర్చేస్తుందన్న ఆశాభావంతో ఆయన, కుటుంబసభ్యులు వున్నారు. తన సొంత బ్యానర్ ‘శివాణీ, శివాత్మిక మూవీస్’పై నిర్మించిన ఈ మూవీని రాజశేఖర్ సొంతంగా విడుదల చేసుకున్నారు కూడా! మరి.. ఈ మూవీ ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందామా...
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో లీడ్ రోల్’లో నటించిన రాజశేఖర గురించి చెప్పుకుంటే.. తనకు కామెడీ అలవాటు లేకపోయినా.. తనవరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని సీన్లలో అవసరమైన మోతాదులో చేశాడు. ఐదుపదుల వయస్సు దాటినా.. యంగ్ గా కనిపించేందుకు బాగానే ట్రై చేశాడు. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన షీనా సహబది తన గ్లామర్’ను ఒలకబోయడంతోపాటు నటనలోనూ బాగానే రాణించింది. ఈమె గ్లామర్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్’గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు.. తన పాత్రకు బాగానే న్యాయం చేశాడు. సరైన సమయాల్లో కామెడీ పంచ్’లు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్’తో నవ్వించాడు. ఈ రకంగానే రాజేష్ కూడా తన ప్రెజెన్స్ తెలియజేశాడు. ఇతర పాత్రల్లో నటించిన వారిలో సీత పాత్ర ఆడియెన్స్’ను బాగా అలరిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ పంచులు బాగానే పేలాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రానికి డైరెక్టరే మైనస్ పాయింట్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. తమిళంలో తెరకెక్కిన విధానానికి ఇతను కాస్త భిన్నంగా తెలుగులో గందరగోళంగా తెరకెక్కించాడు. అక్కడక్కడ కామెడీ పంచ్’లు పండలేదు. కొన్ని సన్నివేశాలైతే అస్సలు కావు. ఈ మూవీలో క్రైమ్, కామెడీని సరిగ్గా డీల్ చేయడంలో డైరెక్టర్ డీలా పడిపోయాడు. కొన్ని సీన్లు తారుమారుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. చిత్రంలో వినోదం అక్కడక్కడా బాగానే పండింది కానీ.. కొన్ని సీన్లు మాత్రం బోరింగ్’గా అనిపిస్తాయి. టెక్నికల్ అంశాలపరంగా రాణించాడు కానీ సరిగ్గా సమకూర్చలేకపోయాడు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు సంతోష్ పీటర్ ఒరిజినల్ కంటెంట్’ని తెలుగులో జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. ఇక సినిమాటోగ్రఫి కొద్దిమేర బాగానే వుంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదుకానీ.. సెకండాఫ్ లో కాస్త కత్తెర వేసి వుంటే బాగుండేది. అచ్చు అందించిన సంగీతం సినిమాకే ఓకే అన్నట్లుగా వున్నాయి. నేపథ్యం సంగీతం అందరినీ ఆకట్టుకుంది. నిర్మాణ పరంగా రాజశేఖర్ బాగానే ఖర్చు చేశారు. కొన్ని లొకేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి.
చివరగా.. ఈ ‘గడ్డంగ్యాంగ్’ ఇరకాటంలో పడింది.