రాజారాం (శర్వానంద్) నేటి యంగ్ జనరేషన్ కుర్రాడిలాగా కాకుండా.. నేషనల్ లెవల్లో రన్నింగ్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో వుంటాడు. అందుకోసం నితంతరం ప్రాక్టీస్ చేస్తుంటాడు. అయితే.. ఇదే సమయంలో తన చదువుకుంటున్న కాలేజ్’లోనే చేరిన ముస్లీం అమ్మాయి నజీర (నిత్యామీనన్) కళ్లు చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె మొహాన్ని చూడడం కోసం పరితపిస్తుంటాడు. కానీ నజీర మాత్రం తన మొహం చూపించకుండా అతడిని ఆటపట్టిస్తూ, తన ప్రేమను తెలియజేస్తుంది.
అలాగే.. అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో రాజారాం తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాగే ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న నజీర మోహాన్ని చూస్తాడు. ఇక అంతే... ట్విస్ట్ మొదలు. దీంతో వీరిద్దరూ విడిపోతారు. అసలు నజీర మోహం చూసిన తర్వాత ఏం జరిగింది? వీరు ఎందుకు విడిపోతారు? దీనికి గల కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే.. థియేటర్’కెళ్లి చూడాల్సిందే!
సెలక్టివ్ మూవీలను మాత్రమే ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ గుర్తింపు పొందిన శర్వానంద్.. ఇటీవలే ‘రన్ రాజా రన్’ వంటి కొత్త కథనంతో కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఈ హీరో మలయాళ కుట్టి నిత్యా మీనన్’తో కలిసి లవ్ ఎంటర్టైనర్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు ‘ఓనమాలు’ మూవీని తెరకెక్కించిన క్రాంత్ మాధవ్ దర్శకత్వం వహించాడు. పూర్తి ప్రేమకథాచిత్రంతో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దామా...
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నిత్యామీనన్, శర్వానంద్. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కాలేజ్ కుర్రాడిగా శర్వా అద్భుతంగా నటించాడు. ఇతని నటన, డైలాగ్ డెలివరీ సూపర్బ్. ఇక నిత్యామీనన్ ముస్లిం యువతి పాత్రలో సింప్లి సూపర్బ్. కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ ఎపిసోడ్స్ సీన్లలో ప్రేక్షకులకు ఓ బ్యూటీఫుల్ ఫీల్ ను కలుగజేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక మరో భామలు పునర్నవి, తేజస్వీలు తమ పాత్రలకు తగిన న్యాయం చేసారు. వీరు సినిమాకు మంచి హెల్ప్ అయ్యారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్:
ఇందులో పెద్దగా చెప్పుకోవల్సినంతగా మైనస్ పాయింట్స్ ఏమి లేవు. అయితే సింపుల్ లవ్ స్టోరిని మరింత కాస్త అందంగా చూపించడానికి ప్రయత్నించారు. సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. స్టోరీని బాగా స్లోగా నెరేట్ చెయ్యడం వల్ల అక్కడక్కడ జనాలు బోర్ ఫీల్ అవుతారు.
సాంకేతిక వర్గ పనితీరు:
సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ప్రతీ విజువల్ చాలా అందంగా.. కథకు తగ్గట్లుగా చూపించాడు. ఇందుకు తగ్గట్లుగా గోపి సుందర్ వినసొంపైన పాటలతోపాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందించాడు. ఇక సాయి మాధవ్ బుర్రా రాసిన ప్రతి డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు సెకండ్ హాఫ్ లో మరింత ఎడిటింగ్ చేసి వుంటే బాగుండేది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బాగా లెంగ్త్ ఎక్కువయినట్లుగా అనిపిస్తోంది.
ఇక కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం విభాగాలను ఒక్కడే చూసుకున్న క్రాంతి మాధవ్ చాలా బాగా డీల్ చేసాడు. కథ పాతదే అయినప్పటికీ కాస్త కొత్తగా చూపించి, ఆ లవ్ లో వుండే ఫీల్ ను అందరూ పొందేలా ప్రయత్నం చేశాడు. అయితే స్ర్కీన్ ప్లే లో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్స్ అన్ని కూడా గ్రాండ్ గా వున్నాయి.
చివరగా:
మళ్లీ మళ్లీ ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమకథ రాదు!