సినిమా బ్రిటీష్ కాలంతో మొదలవుతుంది. సింగనూర్ అనే గ్రామంలో రాజ లింగేశ్వరం (రజినీకాంత్) అనే గొప్ప వ్యక్తి ఉంటాడు. మధురై కలెక్టర్ గా పనిచేసే రాజ లింగేశ్వరం ప్రజలకు మంచి చేసేందుకు కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. గ్రామ ప్రజలంతా ఈయన్ను దేవుడిగా భావించి గౌరవిస్తారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో స్థానికంగా ఓ రిజర్వాయర్ నిర్మించాలని లింగేశ్వరం భావిస్తాడు. అయితే నాటి బ్రిటీష్ పాలకులు ఈయన ప్రయత్నాన్ని అడ్డుకుని ఊరి నుంచి బయటకు పంపించేస్తారు.
ఇక ప్రస్తుత కథలోకి వస్తే.., జైలులో ఉన్న లింగా (రజినీకాంత్) అతని స్నేహితులను (సంతానం తదితరులు) లక్ష్మి (అనుష్క) అనే టీవీ రిపోర్టర్ విడుదల చేయిస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా సింగనూరులో తన తాత రాజ లింగేశ్వరం కట్టించిన దేవాలయం ప్రారంభించాలని కోరుతుంది. అయితే కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టిన లింగేశ్వరం చేసిన పనులకు తన మద్దతు ఉండదని లింగా బెట్టు చేస్తాడు. బలవంతంపై లింగాను ఊరికి తీసుకెళ్లి గుడి తెరిపిస్తుంది. అలా గ్రామంలోకి వచ్చిన లింగాకు ఎవరెవరు పరిచయం అయ్యారు..? ఊరిలో తనకు తెలిసిన నిజాలు ఏమిటి...? తాత గురించి రహస్యాలు తెలుసుకుని లింగా ఏం చేస్తాడు అనేది సినిమా థియేటర్ కు వెళ్ళి చూడండి.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ అంచనాల మద్య తెరకెక్కిన ‘లింగా’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. రజినీ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీలో అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా నటించారు. సూపర్ స్టార్ తో గతంలో పలు హిట్ సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న కే.ఎస్.రవికుమార్ చాలా కాలం తర్వాత మళ్ళీ రజినితో చేసిన సినిమా ఇదే. రాక్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను నిర్మించారు. కథ కాపి కొట్టారంటూ చివరి వరకు కోర్టు కేసులు ఎదుర్కుని ఆంక్షల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీ పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘లింగా’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ రజినీ. రెండున్నర గంటల పాటు ఆయన అద్బుతంగా నటించాడు. వయస్సు ప్రభావం ఎక్కడా కన్పించకుండా రజినీ చక్కటి పర్ఫార్మెన్స్ కనబర్చాడు. ఫైట్స్, యాక్షన్, డాన్స్ అన్నీ హైలైట్స్. ఇక రజినీ స్టైల్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అనుష్క తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. గ్లామర్ రోల్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అటు తొలి సౌత్ సినిమా చేసిన సోనాక్షి కూడా పల్లెటూరి పిల్లగా బాగా నటించింది. జగపతిబాబు కూడా ఉత్తమ నటన కనబర్చాడు. కమెడియన్లు, ఇతర పాత్రధారులు కూడా తమ వంతు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఫస్ట్ ఆఫ్ అవసరం లేని సీన్లతో కాస్త సాగదీసినట్లుగా ఉంటుంది. రజినీలో ఫ్యాన్స్ ఆశించినంత కొత్త స్టైల్స్ ఈ సినిమాలో చూపించలేదు. ఇక అనుష్కతో రొమాన్స్ సీన్లు కూడా సరిగా చూపించలేదు. జగపతి బాబు పాత్రను కాస్త కన్ఫ్యూజ్ గా రాసుకున్నారు. సంతానం, బ్రహ్మానందం వంటి ప్రధాన కమెడియన్లు ఉన్నప్పటికీ ఈ మూవీలో కామెడి కాస్త తక్కువయింది.
కళాకారుల పనితీరు :
రజినీతో సక్సెస్ కాంబినేషన్ కొనసాగించి కేఎస్ రవికుమార్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే కథతో పాటు, ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయటంతో, అక్కడక్కడా క్లారిటీ మిస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ రత్నవేలు బాగా పనిచేశాడు. ప్రతి సీన్ ను నీట్ గా కవర్ చేశాడు. ముఖ్యంగా స్వాతంత్ర్యానికి పూర్వం కాలం పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు. పాటలు కూడా గ్రాండ్ లుక్ తో కవర్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహిత ఎ.ఆర్. రెహ్మాన్ ట్యూన్లు బాగున్నాయి. సంజిత్ ఎడిటింగ్ పర్వలేదు. డైలాగులు, యాక్షన్ సీన్లు పర్వాలేదు కానీ కొత్తదనం ఏమి లేదు. రాక్ లైన్ సంస్థ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
చివరగా : రజినీ శాసించాడు.., రవికుమార్ హిట్ ఇచ్చాడు.