చందు (ఆది) అనే అనాధకు ప్రేమపై చాలా నమ్మకం. తనలాంటి మనోభావాలే ఉన్న నందిని (రకుల్ ప్రీత్)ను చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయం నందు కంటే ముందుగా ఆమె అన్నయ్య సిధార్ధ్ (శ్రీహరి)కి చెప్తాడు. అయితే పబ్లిక్ లో మంచి పేరు ఉన్న సిద్ధార్ధ ఒక అనాధ తన చెల్లిని కోరుకోవటంపై జీర్ణించుకోలేకపోతాడు. ఇద్దరిని విడగొట్టేందుకు చాలా ప్లాన్లు వేస్తాడు. అయితే వీటిని తెలివిగా తప్పించుకునే చందు, నందిని తనను ప్రేమించేలా చేస్తాడు. ఇంతకీ ఇద్దర్నీ విడగొట్టేందుకు సిద్ధు ఏం చేశాడు. ఈ ప్లాన్ల నుంచి ఆది ఎలా తప్పించుకున్నాడు. చివరకు వీరి ప్రేమ కథ ఏమయింది.., అనే స్టోరీ వెండి తెరపై చూడండి.
లవర్ బాయ్ ఆది, లేటెస్ట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘రఫ్’ మూవీ రిలీజ్ అయింది. సుబ్బారెడ్డి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాకు అభిలాష్ నిర్మాతగా వ్యవహరించాడు. మణిశర్మ తొలిసారి ఆది మూవీకి సంగీతం అందించాడు. ఇంతకాలం నార్మల్ బాడీ మెయిన్ టైన్ చేసిన ఆది ‘రఫ్’ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేశాడు. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న ఆదికి బ్యాచిలర్ గా ఇదే చివరి సినిమా. రొటీన్ కు పూర్తి భిన్నంగా వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ప్లస్ పాయింట్లు :
ఈ సినిమా కోసం ఆది పడిన కష్టం ఫలించింది. ఆది అంటే లవర్ బాయ్ మాత్రమే కాదు.., మాస్ ఎనర్జీ కూడా ఉంటుంది అని నిరూపించుకున్నాడు. ఇక మాస్ స్టెప్పులు, ఫైట్ స్టంట్లు కూడా చాలా బాగా చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీ క్లైమాక్స్ లో బాగా ఉపయోగపడింది. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు న్యాయం చేసింది. రకుల్ కు ఇండస్ర్టీ పరంగా ఇదే తొలి సినిమా కాని... నాల్గవ సినిమాగా విడుదల అయింది. తొలి సినిమాలో నటన బాగుంది. తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవల్సింది రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి గురించి. ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శ్రీహరి-ఆది మద్య సన్నివేశాలు కూడా బాగుంటాయి. శ్రీహరికి డబ్బింగ్ చెప్పిన వ్యక్తి కూడా వాయిస్ మాడ్యులేషన్ సూట్ అయ్యేలా చెప్పాడు.
మైనస్ పాయింట్లు :
ఈ సినిమా మైనస్ పాయింట్లపై ఒక లిస్ట్ రాయవచ్చు. ముందుగా సినిమా కథ బాగాలేదు. కమర్షియల్ అనే కాన్సెప్టులో పడి డైరెక్టర్ కన్ఫ్యూజ్ కావటంతో ఔట్ పుట్ బాగా రాలేదు. డైరెక్టర్ చెప్పాలనుకుంది ముందే చెప్పేశాడు. ఆ తర్వాత కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సంబంధం లేని సీన్లు పెట్టాడు. ఫలితంగా కథ ఒకటి అనుకుంటే అది మరోలా వచ్చింది. ఇక స్క్రీన్ ప్లే కూడా సరిగా లేదు. ట్విస్ట్ సీన్లు ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు స్టోరీలో సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లు ఉన్నా వాటిని సరిగా చూపించలేకపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఎలాగూ భరించే ప్రేక్షకులు ఇంటర్వెల్ తర్వాత సెకండ్ ఆఫ్ లో ఇబ్బంది పడతారు. మాస్ సినిమా అని చెప్పుకోవటం వరకే.. ఆ ఎలిమెంట్స్ కన్పించలేదు.
తొలి సినిమా కావటంతో డైరెక్టర్ సుబ్బారెడ్డి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక మిగతా కళాకారులు సీనియర్లు అయినా వారు కూడా బాగా చేయలేదు. ముందుగా సినిమాటోగ్రఫీ తీసుకుంటే.., సెంథిల్ కుమార్ - అరుణ కుమార్ సంయుక్తంగా పనిచేసినా చెప్పుకోదగ్గట్టుగా సీన్లు రాలేదు. సీజీ వర్క్ కూడా బాలేదు. అదేవిధంగా మణిశర్మ సంగీతం సినిమాకు సహాయ పడలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథకు సూట్ కాలేదు. మాటల రచయితగా మరుధూరి రాజకు ఉన్న మంచి పేరు ఈ సినిమాతో పోతుంది. పంచ్, రైమింగ్ వాడాడు కానీ అవి టైమింగ్ చూసి వేయలేదు. దీంతో పేలని పటాసుల్లా మిగిలాయి. ఇక ఎడిటింగ్ చేసిన వెంకటేష్ అభిమానుల కోణంలో కాస్త లోతుగా ఆలోచించి పాటలు తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
చివరగా : ఆది ‘రఫ్’ ఆడించలేకపోయాడు