చిన్నప్పటి నుండి పోలీసు ఆఫీసర్ కావాలనే తపన వేణు (రామాచారి ) కి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి పోలీస్ ఆఫర్ కాలేక పోతాడు. కానీ ఏదో విధంగా పోలీసులకు సహాయ పడాలనే ఉద్దేశ్యంతో గూఢాచారిగా మారి వారికి సహాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఒకసారి ముఖ్యమంత్రిని చంపడానికి ప్లాన్ వేశారన్న సమాచారం తెలుసుకొని, ఎలాగైనా సీఎం ని కాపాడాలని అనుకుంటాడు ? మరి సీఎం ని కాపాడటానికి ఆయన ఏం చేస్తాడు ? చివరికి ముఖ్యమంత్రిని కాపాడగలిగాడా లేదా అన్నది తెర పై చూడాల్సిందే.
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు వస్తుంటారు. అందులో హీరో వేణు ఒకడు. ‘స్వయం వరం ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ‘చిరునవ్వు ’ తో అలరించిన ఈ టాలెంటెడ్ పర్సన్ మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయాడు. అప్పుడప్పుడు అడపా దడపా సినిమాలు, గెస్టురోల్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న వేణు తాజాగా ‘రామాచారి ’ అనే సినిమాతో చాలా కాలం తరువాత మన ముందుకు వచ్చాడు. మరి ఈ ‘రామాచారి ’ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించాడో చూద్దాం.
నటనలో మంచి టాలెంట్ ఉన్న వేణు చాలా కాలం తరువాత ప్రేక్షకుల వచ్చినా, కథ ఎంపిక విషయంలో ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి పాత కథనే కొత్తగా తీద్దానుకొని విఫలం అయ్యాడు. అవసరానికి మించి పాత్రల్ని పెట్టి బాగా సాగదీశాడు. టాలెంటు ఉన్న నటులను పెట్టి వారికే విసుగు వచ్చే పాత్రల్ని పెట్టాడు. హీరోయిన్ ని సినిమాలో పెద్దగా ఇన్ వాల్వ్ చేయలేదు. టెర్రరిస్టుల్ని, బాంబులతో ప్రేక్షకుల్ని విసిగించాడు. అనుభవం ఉన్న దర్శకుడిగా చెప్పుకుంటున్న ఈశ్వర్ రెడ్డి సినిమాను పూర్తి స్థాయిలో నడిపించడంలో విఫలం అయ్యాడు.
ఈ సినిమా లో హీరో వేణు రామాచారి పాత్రను బాగా పోషించాడు. చాలా కాలం తరువాత తెర పైకి వచ్చినా ఆయన ఫెర్ఫాన్స్ లో మాత్రం ఎనర్జీ తగ్గలేదు. రామాచారి పాత్రలో వేణు ఒదిగిపోయాడు. ఇక వేణు సరసన నటించిన కమలిని ముఖర్జీ మరీ డల్ గా కనిపించింది. బ్రహ్మానందం, ఆలీ కొన్ని కామెడీ సన్నివేశాల్లో అలరించినా అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఎల్ బి. శ్రీరామ్ ఫర్వాలేదనిపించాడు. ముఖ్యమంత్రి పాత్రలో బాలయ్య బాగా నటించాడు. మిగతా నటులు వారి వారి పాత్రల మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక విభాగం : ఈ సినిమాకు మ్యూజిక్ మణిశర్మ అందించినా స్వరాలు ఆకట్టుకునే విధంగా లేకుండా ఫర్వాలేదనిపించాయి. కానీ సమయం సందర్భం లేకుండా వస్తూ ప్రేక్షకుల్ని ఇరిటేట్ చేస్తాయి. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉంది. సినిమాటోగ్రఫీ అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. ముఖ్యంగా ఈ సినిమాకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ఈ సినిమాలో కథకు మూలం అయిన ముఖ్యమంత్రి కి సంబంధించిన విషయాలు గూడాచారి తెలుసుకునే విధానం చాలా సిల్లీగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అర్థ వంతంగా ఉన్నా, వేళపాళ లేని సమయంలో వచ్చి కాస్త విసుగును తెప్పిస్తాయి. వేణు, కమలిని ముఖర్జీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అస్సలు బాగోలేవు. ఈ సినిమాలోని కామెడీ చాలా పాతది, అలాగే చాలా చీప్ గా అనిపిస్తుంది. సినిమాని చూస్తుంటే చాలా సేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ అంత బాగోలేకపోవడమే కాకుండా ముందుకు వెనక్కి ఊగి ఊగి వేలుతున్నట్టుగా ఉంది. డైలాగులు బాగోలేవు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈశ్వర్ రెడ్డి కథ ఎంచుకున్న విధానంలో కొత్తదనం లేకపోగా దాన్ని తీయడంలో కూడా సక్సెస్ కాలేక పోయాడు.
వేణు సినిమా కదా నవ్వులు ఉంటాయని అనుకొని వెళితే నిరాశ తప్పదు.